1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

5, జూన్ 2020, శుక్రవారం

5 వసంతాలు పూర్తి

ఈ రోజుకి 5 వసంతాలు పూర్తి చేసుకున్నాం. మాది సేవా వివాహం అని తెలిసిందే కదా... అయినప్పటికీ మేము ఈనాటి సమాజంలో ఉన్న అమ్మాయి, అబ్బాయిలమే కదా..... ఆలోచన, అభిప్రాయభేధాలు, భిన్న లక్ష్యాలు మాములే...

కానీ....అలాంటి మమ్మల్ని ఒకరినొకరు బాగా అర్ధంచేసుకుంటూ, ఒకే లక్ష్యం వైపు, పరిస్థితులను, పరిసరాలను అర్ధంచేసుకుంటూ, ఓపిక, సహనంతో వుంటూ... సంబంధాలకు, అనుబంధాలకు విలువనిస్తూ, డబ్బే జీవితం కాదు అని గుర్తు చేస్తూ... జీవన పయనంలో నిరంతర సంతోషం కోసం ప్రయత్నించే విధంగా ముందుకి తీసుకెళ్తున్నది మాత్రం జీవన విద్య (Universal Human Values) అనే జ్ఞానం.

అలాగే ఇద్దరం కలిసిచేసే ప్రయాణంలో మాలో మేము, అలాగే కుటుంబంతో కలసి వున్నప్పుడు, మనుషులు ఒకరికొకరు అర్ధమయ్యేవరకు కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయి... అలాగని వాటిని భరించే సహనం, ఓర్పు లేకుండా మనుషులను దూరం చేసుకోవడం, వదిలెయ్యడం కాకుండా... ఎలా కలిసి, కలుపుకుపోవాలో కూడా నేర్పింది ఈ జీవన విద్యే...

మొత్తంమీద జీవన విద్య మా ఆనందమయ వైవాహిక జీవితానికి పునాది వేసింది, జ్ఞానాన్ని ఇస్తోంది.

*ఇలా ఉండాలనేది మా లక్ష్యం*

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

ఆశలు తీరని ఆవేశములో... ఆశయాలలో....ఆవేదనలో...
చీకటి మూసిన ఏకాంతములో.....
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు....నీ కోసమే కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

మీ అమ్మ శ్రీనివాస్
08.03.2020

మేము మారం-మేము మనీశులం- మాదంతా వినాశ కులం (మాలో చాలా మందిది మూర్ కులం కూడా)

*మేము మారం-మేము మనీశులం- మాదంతా వినాశ కులం (మాలో చాలా మందిది మూర్ కులం కూడా)*

ఏంది భయ్యా ఇంత నెగటివ్ గా ఉంది...  మనం ఎక్కువ మంది ఇలానే ఉన్నాం, ప్రకృతిని నాశనం చేసేస్తున్నాం... మన నిజ స్వరూపం మనకు తెలియంది కాదుగా... పైపైనే కవరింగ్ లు చేసేసుకుంటూ... గడిపేస్తున్నాం... కొన్ని వేల సంవత్సరాలుగా ఎన్నో జంతు, పక్షి జాతులు నాశనమైనా, మనం మటుకు శిలేసుకొని, మృత్యుంజయులమనే భావనతో పోతా...ఉన్నాం...  

వరదలకి మారామా...!
వడగండ్లకి మారామా...!
భూమి కంపిస్తే మారామా...!
ఉపద్రవాలకి మారామా...!
ప్రకృతి వైపరీత్యాలకి మారామా....!
సునామీకి మారామా...!
గ్లోబల్ వార్నింగ్ కి మారామా...!
సహజ వనరులు తగ్గితే మారామా...!
కాన్సర్, అల్సర్లకు మారామా...!
అప్పుడేప్పుడో కలరా కదిలించినా - 
ఇప్పుడు కరోనా వచ్చినా !
అబ్బే మేము మారుతామా...??? "మేము మారం"

కర్ఫ్యూ అన్నా, కరోనా అన్నా, ఎవరు ఏమన్నా మేము మటన్ షాప్ ల ముందు బారులు తీరుతాం... తిరిగి మేమే మార్చురీలలో మాంసం ముద్దలవుతాం... అయినా "మేము మారం"

మట్టిని, చెట్టుని, పిట్టని, చివరికి మనిషిని... నానావస్థలు పడి, ఎలాగైనా సరే ఆ... నాలుగు అవస్థలను అస్తవ్యస్థం చేస్తాం, సామరస్యాన్ని సమాధి చేస్తాం,  అస్థిరమైన మన అస్థిత్వాన్ని చాటుకొంటాం, చివరికి మా నోట్లో మేమే మన్ను కొట్టుకుంటాం.... ఎందుకంటే సృష్టి మొత్తం మేమే, మా కోసమే అన్న అహం...  అందుకే "మేము మారం"

పాత పద్ధతులు చేదంటాం, విజ్ఞానం లేదంటాం, అన్నిటినీ ప్రశ్నిస్తాము, దేనిని ఆచరించం, మంచి ఎక్కడో గ్రహించం, అన్నిటికి పెటెంట్ అంటాం, లేకపోతే గుడ్డిగా నమ్మమంటాం... జ్ఞానానికి, మతానికి, మనిషికి, మానవత్వానికి ఏవేవో లింకులెడతాం, మా వాదమే నిజమంటాం... చివరకి అటు ఇటు కానీ మనుషులం అవుతాం... తెలుసుగా "మేము మారం"

మనం మారకుండా, మనల్ని నియంత్రించు కోకుండా ఏదో విధంగా సమస్యకు ఒక (తాత్కాలిక) సమాధానం కనిపెడతాం, ప్రకృతితో పరాచకాలు ఆడుతాం, ఏవేవో అరాచకాలు చేస్తాం, బాధ్యత మరుస్తాం, తరచు ఇలా భయంతో వణికి చస్తాం......అయినా "మేము మారం"

మనల్ని, మన తోటి మనుషులను అర్ధం చేసుకొనే జ్ఞానమే మనకు లేదు... ఇక ప్రకృతిని, దాని నియమాలను, సృష్టి రహస్యాలను ఏమి అర్ధం చేసుకోగలం... కానీ... అన్నీ తెలుసనో, తెలుసుకోగలమనో అహంభావంతో ప్రపంచాన్ని పాలించాలంటామ్, తెలిసీ తెలియక తనువు చాలిస్తాం... ప్రకృతిని ప్రేమిస్తే, గౌరవిస్తే అన్నీ తెలుసుకోవచ్చు అనే చిన్న విషయాన్ని మరుస్తాం...ఎన్ని జరిగినా "మేము మారం"
 
మనుషుల మధ్య బంధాలను విస్మరిస్తాం, ఏదేదో గ్రహాల మధ్య దూరాలను విశ్లేషిస్తాం...ఇంటిలో మనుషుల మధ్య మొదలలై, దేశాల సరిహద్దుల దాకా జరిగే ఆధిపత్య పోరులో అశువులు భాస్తాం... ఇంతకీ ఎందుకు పుట్టాం, ఎందుకు చచ్చాం, ఎందుకు ఆరాటం, దేని కోసం పోరాటం...ఏమో ఎవరికి తెలుసు ? పాడే ఎక్కినా తెలీదు, ఎక్కిన వారిని చూసైనా అర్ధం చేసుకోము. పోనీ కాసేపటి స్మశాన వైరాగ్యమైనా కానరాదాయే.... తెలిసిన జ్ఞానులము కాదు, తెలుసుకోలేని గొర్రెలము కాము...తెలుసుకొనే సమయము, సహనము రెండు లేవాయే... వీటికితోడు ఎవరికి వారు తామే గురువు అనే భావన...

ప్రకృతితో ప్రేమగా జీవించే మార్పు మా DNA లో లేదంటామ్, రాదంటాం.... మా అలవాట్లను, పద్దతులను మార్చుకొకుండా పని జరగాలంటాం. కానీ ఇలా ప్రకృతి కన్నెర్ర చేస్తే... ఇంకేం చేస్తాం.... చెయ్యకపోతే కలిసి కట్టుగా చస్తాం... ఇంకెంతకాలం మారకుండా ఉంటాం.... 

*మనిషి నేనొక్కడినే అనే భావనలో కాకుండా...  ప్రకృతితోను, అందులోని అన్ని జీవరాసులతోనూ కలిసి, మమేకమై సామరస్యంతో  ఆనందంగా మనుగడ సాగించడమే మానవ జీవిత లక్ష్యం. దానిని తెలియచెప్పి, అర్ధంచేయించి (చదువు), ఆచరించేట్టు (సంస్కారం) చెయ్యడమే మన విద్య యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కాబట్టి పరిశ్రమలకు ఉద్యోగస్తులనే కాకుండా, మనిషిగా సామరస్యంతో  జీవించే మనుష్య జాతిని తీర్చిదిద్దడం ఈ విద్యకే సాధ్యం, ఈ మార్పుకు విద్యా రంగమే తొలి మెట్టు...* ఇదే నా ఆనంతరంగం... మీ అమ్మ శ్రీనివాస్...  2020/03/22 01:32  

21, మే 2019, మంగళవారం

మనం వెతికేది షార్ట్ కట్ కోసమే

*ఏమిటో నా అనంతరంగంలో ప్రతి క్షణం ఇవే ఆలోచనలు. ఏమి చెయ్యాలి చెప్మా.. అందుకే రాసి నాకు హితులు, స్నేహితులు అయిన మీ మీద వదులుతూ వుంటా, పాపం మీకు తప్పదుగా, చదువుకోండి...మీ అమ్మ శ్రీనివాస్*


సినిమాలలో హీరోలలాగానో (లేదా) నిజ జీవితంలో వ్యాపారవేత్తల లాగానో ఒక్క గంట లో సమాజాన్ని మార్చెయ్యడం, (లేదా) బాగా సంపాదించేసి భారీ ఎత్తున (ప్రపంచం అంతా గుర్తించేట్టు, అవాక్కయేట్టు) సాటి వారికి సాయం చెయ్యాలి *అనే ఆలోచన సమాజంలో చాలా బలంగా నాటుకుపోయిన మాన్యత.*

*చెయ్యాల్సిన, చెయ్యగలిగిన పనులు మానేసి ఎప్పుడో ప్రపంచాన్ని ఉద్దరించాలి అనే వాయిదా వేసుకొనే ఆలోచనలు ఎందుకు మాష్టారు.* ఈ ఆలోచన విధానమే తప్పు మహాప్రభో. *తెలిసిన, తెలియకపోయినా, నచ్చిన, నచ్చకపోయినా ప్రతి క్షణం మనకు అవసరమైన సాయం, సాటి వారిని నుంచి అప్పనంగా తీసుకోవడం / పొందడం ఎలా అయితే మన నరనరాల్లో జీర్ణించుకుపోయిందో, అలాగే.... మనకున్న దాంట్లో ప్రతి క్షణం సాయం చెయ్యడం (ఎందుకంటే తీసుకున్నది తిరిగి ఇవ్వడం) మన కనీస భాద్యతగా అలవాటుచేసుకోవాలి.* ఇది మన కల్చర్ లో నుంచి, మన DNA లో నుంచి క్రమేపి కనుమరుగైపోతోంది. రాబోయే  రోజుల్లో సాటి వారికి సాయం చేసే భాద్యత గల వారిని ప్రత్యేకంగా రీసెర్చ్ చేసి పుట్టించాల్సిన రోజులు దగ్గరపడ్డాయి. *ఇదెలా ఉంటుందంటే నిర్లక్ష్యం వలన తీర్చడం మానేసి పెరిగి పెద్దదైన (రోజు రోజు కి పెరిగిపోతున్న వడ్డీతో) అప్పుని తీర్చడం చేతకాక అప్పుడు, ఇప్పుడు అని వాయిదా వెయ్యడంలాగా. దీవాల తీయడం తప్ప, తిరిగి ఇవ్వడం వుండదు.* అసంతృప్తితో చనిపోతూ, ఈ మొత్తం అప్పుని కట్ట కట్టుకొని తీసుకుపోతావు. అప్పుని మాత్రమే కాదు సుమీ, దానిని సకాలంలో తీర్చకపోవడం వలన వచ్చే పరిణామాలను, ఫలితాలను కూడా.

*"ఎన్ని జరిగిన, జరుగుతున్నా, ఇప్పటికీ మనం వెతికేది షార్ట్ కట్ కోసమే. అది సంపాదన అయినా, సంతోషం అయినా".* మనం ఏమి చెయ్యనక్కరలేదు, చెయ్యగలిగిన చిన్న చిన్న పనులను (ఎదో సమాజాన్ని మనం ఉద్దరిస్తున్నామనే భావనతో కాకుండా) *నా ఋణాన్ని నేను ఖచ్చితంగా తీర్చుకోవాలి, తీర్చుకుంటున్నాను అనే కృతజ్ఞతా భావానికి ప్రాధాన్యత ఇస్తూ... నిబద్దతతో,  భాద్యతతో,8 ప్రేమతో, సంతృప్తితో చెయ్యాలి, అది చాలు.*

*చేయగలిగిన చిన్న చిన్న పనులను, తిరిగి ఇవ్వగలిగిన చిన్న చిన్న అవకాశాలను వెంటనే అందిపుచ్చుకోకుండా..చూసి చూడనట్టు, పట్టీ పట్టనట్టు, నిర్లక్ష్యంగా,(కొన్ని సంవత్సరాల తరువాత/ జీవితంలో బాగా స్థిరపడిన తరువాత/పెళ్ళైన తరువాత/వుద్యోగం రాగానే/చదువు అవగానే/ రిటైర్మెంట్ అవగానే/బాగా సంపాదించగానే ఎదో ఉద్దరిస్తాను లాంటి) వాయిదా వేసే ధోరణితో వ్యవహరించే (మన)అందరిలోనూ ఈ మార్పు రానంత కాలం..మారవ్.. మారవ్..రోజులు ఎప్పటికి మారవ్...* మీ తిట్లు, కామెంట్లు ఏమైనా ఉంటే కింద లింక్ లొనే రాసుకోండి...

మీకు ఇంకా తనివి తీరకపోతే, నా మరిన్ని రాతల కోసం సందర్శించండి http://ammasrinivas4u.blogspot.com/ *(కాకపోతే నా ఆశ, శ్వాస ఒకటే. కాబట్టి ఆలోచనలు, రాతలు కూడా వాటి మీదే)*


19, ఏప్రిల్ 2019, శుక్రవారం

మానవ లక్ష్యం సంతోషమేనా.... సందేహమే మరి.

ఏంది నాయనా... దేశంలో లేదా ప్రపంచంలో ఎటు చూసినా, ఎవ్వరిని కదిలించినా  దుఃఖం, అశాంతి, అసంతృప్తి, ఆరాటం, వ్యతిరేక భావం, యుద్ధం..... మనిషి జీవిత పరమార్థమైన లేదా లక్ష్యమైన *"ఆనందంగా/సంతోషంగా ఉండడం, ప్రేమను పంచడం"* అనే  విషయాన్ని తాకట్టు పెట్టైనా సరే, ప్రపంచాన్ని జయించాలని లేదా తరతరాలకు తరిగిపోని సంపదను కూడగట్టుకోవాలనే ఆశతో, వ్యామోహంతో...  తనలోనే దాగి ఉన్న సంపదను మర్చిపోయి... న్యాయం, ధర్మం, సత్యం మొదలగునవి గాలికి వదిలి... తన ప్రియం, లాభం కోసం ఏవేవో చేస్తూ... బంధాలను, అనుబంధాలను గుర్తించక, ఏవో ఉన్న కొన్నింటిని తెంచుకుంటూ... డబ్బు సంపాదన, ఇతరులతో పోలిక మొదలగు వాటి మోజులో పడి, నిరాశ నిస్పృహలతో, తీవ్రమైన ఒత్తిడితో, వంటరిగా జీవితాన్ని బలవంతంగా సాగదీస్తున్నారు (భూమిపై జరిగే అన్ని అనర్ధాలకు, అమానుషాలకు ఇదే కారణం). ఇంకా చెప్పాలంటే ఎక్కువ శాతం ఆనందానికి దూరంగా బతుకుజీవుడా అంటూ లైఫ్ ని  సాగదీస్తున్నాడు.

*పోనీ.. మనిషి ఆనందంగా, సంతోషంగా బ్రతకడానికి కావలసిన అవసరాలను తీర్చుకోవడానికి లేదా సదుపాయాలను సమకూర్చుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడులే అనుకొందామా అంటే, అదీ లేదు.* ఎందుకంటే మన చూపు, గురి ఎప్పుడో మన లక్ష్యం (*"ఆనందంగా/సంతోషంగా ఉండడం, ప్రేమను పంచడం"*) నుంచి విడి వడి, వడివడిగా ప్రాసెస్ మీద ఫోకస్ తో, ప్రోసెస్ లొనే ఇరుక్కుపోయి గజిబిజిగా, గందరగోళంలో నా పేరు బికారి, నా దారి ఎడారి అన్నట్టుగా భ్రమలో... ఎటో...కొట్టుకొని...పో...తా....వున్నాము.

జగమెరిగిన జంగమోడికి శంఖమెందుకు అన్నట్టు, ఇదంతా తెలిసిందేగా మళ్ళీ చెప్పడం ఎందుకు చెప్మా అంటే.....అక్కడికే వస్తున్నా....

పోనీ...మానవ లక్ష్యమైన *"నిరంతర సంతోషం"* దిశగా మనల్ని నడిపించే జ్ఞానం భారత దేశంలో  అందుబాటులో లేదా అనుకుంటే అదీ పొరపాటే. అద్భుతమైన ప్యాకేజీ రూపంలో ఉంది. మళ్ళీ ఇక్కడ ఇంకో సమస్య, అదేమిటంటే సగం తెలిసిన వారు దానిని వారికి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తూ ఉండడం, జనాలు ఏది నిజమో, ఏది అబద్దమో, దేనిని నమ్మలో, దేనిని నమ్మకూడదో తేల్చుకోలేని గందరగోళ స్థాయికి వచ్చేశారు. కాబట్టి ఎవరు ఏది నేర్చుకునే ప్రయత్నం చెయ్యరు.

*"సినిమాలు, షికార్లు, ఉద్యోగాలు, వ్యాపారాలు, టూర్లు, ఆటలు, పనికొచ్చేవి, పనికిరానివి ఇలా ఎన్నింటికో సమయం వెచ్చిస్తాం, ఫలితం వచ్చినా, రాకపోయినా ట్రైల్స్ వేస్తాం."* కానీ మనిషి నిరంతరం ఆనందంగా జీవించడానికి కావలసిన అతి ముఖ్యమైన జ్ఞానాన్ని సంపాదించడానికి మాత్రం సమయం మన దగ్గర ఉండదు. మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటాం.

*ఏమప్ప సిద్ధప్ప, ఎప్పుడూ హ్యాపీగా లేనప్పుడు, హ్యాపీగా ఎలా ఉండాలో తెలియనప్పుడు మనం ఎన్ని చేసినా ఏమి ఉపయోగం. సమయం లేక కాదు. ఖాళీగా, వృధాగా ఎంతో సమయం మనలో ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. దీని తీక్షణత గుర్తించిన వారు ఎలాగైనా సమయం తీస్తారు. ఎందుకంటే జీవితంలో సర్వప్రధమం మనం ప్రాధాన్యత ఇచ్చి నేర్చుకోవాల్సిన జ్ఞానం ఇదే కాబట్టి.*

దుఃఖాన్ని చంకలో ఎట్టుకొని ధునియా మొత్తం తిరుగుతాను అంటావ్ గానీ, సంతోషం పొందే మార్గం మటుకు వద్దంటావ్. అవునులే మనం అభివృద్ధి ముసుగులో, కెరీరే (డబ్బు, పేరు, ప్రతిష్ట సంపాదనే) జీవితంగా బ్రతుకుతున్న మనుషులం కదా....

ఏమిటో నా అనంతరంగం ఒకటే లొల్లి ఏదైనా రాయమని దీనిగురించి. మీ అమ్మ శ్రీనివాస్