1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

14, మార్చి 2010, ఆదివారం

ఆడది - మగాడు


ఆడది - మగాడు 
ఆడదాన్ని నేను, 
జీవనదిని, 
నిరంతరం ప్రేమ వాహినిగా ప్రవహిస్తాను! 
మగాడివి నీవు, 
ఓ ఎండమావైనా కానరాని ఎడారివి! 
జీవనదికీ, ఎడారికీ 
పొసగునా ఎన్నడైనా!! 

గడియారపు ముల్లు 

గడియారపు ముల్లు 
గిరగిరా తిరుగుతుండడం 
మాత్రమే గమనించాను! 
కానీ దాని గమనం 
దివారాత్రాల సహజీవనమని, 
మరెన్నో వసంతాల వీడ్కోలు చిహ్నమని 
మరిచిపోయాను!! 
తరచి చూసిన వేళ, 
నాకు నేనే ఆ ముల్లులా తోచాను!! 
గమనం ఎందుకో తెలియకపోయినా, 
తెలీని ప్రయోజనమేదో ఉంటుందని, 
తలుస్తూ తృప్తిచెందాను!!

చిత్తరువు నవ్విన వేళ


చిత్తరువు నవ్విన వేళ 

చిన్ననాటి చిత్తరువుని 
ఇప్పటి ప్రతిబింబాన్ని 
పోల్చి చూసిన వేళ 
పోలిక వెతికిన వేళ, 
మారనివి 
కంటిలో మెరుపు, 
మనసులోని తలపు! 
నేను, నేనే అని తెలియచేస్తూ!! 

మారుతున్న కాలంతో పాటు, 
మారని నన్ను చూసి 
నా చిత్తరువు నవ్వింది, 
ప్రశంసయో, పరిహాసమో!!

మా అమ్మ


నా మోము చిన్నబోతే
తను చిన్నబుచ్చుకుంటుంది
నే ముభావంగా ఉంటే
భారమైన నిట్టూర్పవుతుంది
నా కంట నీరు చిందితే
తనో వర్షించే మేఘమౌతుంది

నే రావడం ఆలస్యమవుతే
వాకిట తలుపౌతుంది.
అర్థరాత్రి దాకా నా గదిలో దీపం వెలిగితే
దరిచేరిన నిద్రాదేవిని దూరంగా పొమ్మంటుంది
కలత మనసుతో నే కనిపిస్తే, కకావికలమవుతుంది

ఉద్యోగ భారంతో ఉసూరుమని ఇంటికొస్తే
ఉద్దీపించే ఓదార్పులా ఉంటుంది
బడలికతో బద్ధకిస్తే
బలవంతపు గోరుముద్దౌతుంది

అసలే మాత్రం తనకి నే సమయమివ్వకపోయినా
అహరహరం నాకై సతమతమౌతుంది
మౌనంగా నా పని నే చేసుకుంటున్నా
మనిషినైనా ఎదుట ఉన్నానని మురిసిపోతుంది

పుట్టి బుద్ధెరిగాక
పనిలో ఏ సాయమూ చేయకపోయినా
పదుగురికీ నా కూతురు
సాయపడుతోందని గొప్పలు పోతుంది

పదుగురి దగ్గర నటించిన ప్రశాంతత
చిరాకుగా తన ముందు ప్రదర్శిస్తే
చిట్టితల్లికి అంత కష్టమేమొచ్చిందా అని చింతపడుతుంది

అనంతమైన బాధతో అమావస్యలా నేనుంటే
చందనాలు చల్లే చందమామౌతుంది

పిచ్చి అమ్మవు నీవు
పిచ్చిగా ప్రేమించడం తప్ప ఏమీ తెలియదు
అని పరిహసిస్తే
తల్లివై నీ పిల్లల్ని పెంచి చూపించు
అని తెలివిగా తన కోరిక తెలియచేస్తుంది!!

ఓ విస్ఫోటనం-చిత్రమైన వ్యథ


తీరిన కోరిక
నేనూ ఓ మనిషినేనా!!
కంటి నుండి చుక్కైనా రాలడం లేదు,
విచిత్రమైన బాధ!
ఏమి తండ్రీ ఇది,
ఇంతగా బండబారిందా మది,
చిత్రమైన వ్యథ!!

ఇంతలో..
నాకూ, నా వేదికకకి
విలువలు లేవంటూ
ఓ విస్ఫోటనం!

విస్తుపోయి...
విలువలు అన్న మాటకి అర్థం తెలుసా
విపరీత పరిణామాల వెనుక
వివరాలు తెలుసుకోకుండా
విమర్శించడం సబబా..
అని వెర్రితనంతో విచారిస్తే..
విద్యావంతుడనని,
విశదీకరించనవసరం లేదని,
వికృత వ్యాఖ్యానం!
ఈ విలయాన్విత వ్యక్తీకరణలో
విలువలకై వెతుక్కుంటూ
విచలితనయ్యాను!!

అంతే...
వెక్కి వెక్కి ఉబికొచ్చాయి
వేచి చూసిన కన్నీళ్ళు!!

బాధ ఓపలేక,
బాంధవుడి వంక ఓరగా చూసానా...
ఓ చిలిపి నవ్వు....
తీరిన కోర్కెలోని తీపి
రుచి చూడమంటూ!!

విచిత్రం...
అలవోకగా బుగ్గలు సొట్టాలు పడ్డాయి
తెరలు తెరలుగా విచ్చుకున్న పెదాలకి
పొట్ట చెక్కలే చేసింది!
బరువెక్కిన హృదయం బడలిక వదిలింది!!