1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

1, జూన్ 2009, సోమవారం

విద్య యొసగు వినయంబు

నేటి మన దేశప్రజలు నైతికంగా,ఆర్థికంగా,మానవత్వపరంగా మరియు సంప్రదాయపరంగా ఎంత దిగజారిపోయున్నారో మనకు తెలియంది కాదు.దీనికి కారణాలు చాలా ఉన్నాయి.
మొదట మనము చెప్పుకోవాల్సింది మన విద్యావ్యవస్థ గురించి.ఇక్కడ మెకాలే అనో లేక మరోటి అనో మనం చెప్పుకోవడం లేదు.విద్యావ్యవస్థ లోని మూల(basic) సమస్యను గురించి చెప్పుకోవాలి."మొక్కై వంగనిది మానై వంగునా" అన్నది మన పెద్దలు చెప్పిన సత్యము.

విద్య యొక్క మొదటి లక్ష్యము పిల్లల యొక్క ఆత్మవిశ్వాసం పెంపొందించడము.తర్వాత నైతికముగా అభివృద్ధి చెందేలా చేయడము అనగా సంస్కారవంతులుగా తీర్చిదిద్దడము మొదలగునవి వస్తాయి.
ఇక్కడ ఒక నిజముగా జరుగుతున్న విషయాన్ని గురించి చూద్దాము.
"ఒక సారి ఒక మంత్రిగారు మన దేశం నుండి జపాన్ కు పర్యటించడానికి వెళ్ళారు.వారి సాంకేతిక ప్రతిభ మొదలగునవి చూసి ఆశ్చర్యపడి అక్కడి ఒక మంత్రి గారితో "ఏమండీ!పురాణ కాలం నుండీ మన రెండు దేశాలు మంచి మిత్రులు.మీ ప్రజలకున్న తెలివితేటలే భారత ప్రజలకు కూడా ఉన్నాయి కదా.మరి అభివృద్ధి విషయంలో ఇంత తేడా ఎందుకున్నదో చెప్పగలరా?" అన్నారు. అప్పుడు ఆ జపాన్ మంత్రిగారు "మీరన్నది నిజమే.మనము మంచి మిత్రులమే.ఇంకా చెప్పాలంటే భారతీయులకు మేము ఎంతో ఋణపడి ఉన్నాము.చాలా వైజ్ఞానిక విషయాలకు మీరే మాకు మార్గదర్శకులు.కాని ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటంటే మా దేశంలో 10 కోట్లమంది "పౌరులు" ఉన్నారు.మీ దేశంలో 100 కోట్లమంది "వ్యక్తులు" ఉన్నారు."అని సమాధానం ఇచ్చారు. ఇక్కడ మనం "పౌరులు" మరియు "వ్యక్తులు" మధ్య తేడా గమనించవచ్చు.

జపాన్ వారి విధ్యా విధానంలో విశేషం ఏమిటంటే వారి పిల్లలకు చిన్నపటి నుండే తమ దేశపు గొప్పతనం గురించి వారి సంస్కృతి గొప్పతనం గురించి భోధిస్తారు.వారి దేశపు ప్రఖ్యాత వ్యక్తుల గురించి చెపుతారు.ముఖ్యముగా తమ దేశము భగవంతుని దృష్టిలో ఎంతో ఉన్నతమైనదని అందుకే ప్రపంచములో మొట్టమొదట సూర్యుడు తమ దేశములోనే ఉదయిస్తాడని నూరిపోస్తారు.తద్వారా తమ దేశముపైన అపార గౌరవ విశ్వాసాలు పెంపొందేలా చేస్తారు. తమపైన తమకు విశ్వాసం పెంపొందేలా చేస్తారు.తము మహోన్నత వ్యక్తుల వారసులము అన్న భావన పెంపొందించుకొనేలా చేస్తారు.తర్వాతే మిగతా విషయాలు అనగా సైన్సు,లెక్కలు మొదలగునవి వస్తాయి.
ఇప్పుడు అందరికీ అర్థం అయ్యే ఉంటుంది.జపాన్ వారు అంతగా ఎందుకు అభివృద్ధి చెందారో. కొన్ని విషయాలలో వారూ వెనుకబడి ఉండవచ్చు అన్న విషయం కాని ఇక్కడ ఆ విషయం అప్రస్తుతం అని భావిస్తాను.

మన దేశంలో ఇలాంటి విద్యా విధానాన్ని మనం కలలోనైనా ఊహించగలమా? మన సంస్కృతీసంప్రదాయాలు ఎంత ఉన్నతమైనవో అందరికీ తెలుసు. అవి మాత్రం అసలు చెప్పరు. "విద్య యొసగు వినయంబు" అన్న పెద్దలమాట ఎంత వృధాగా పోతోందో మనకు తెలుసు.మన ఇప్పటి విద్యావిధానం పిల్లలను మార్కులు తెచ్చుకొనే యంత్రాలుగా ,ర్యాంకులే పరమావధిగా మారుస్తోంది.ఇక నైతిక,సంస్కార విలువలు ఎలా నేర్పుతాయి?
కనీసం మన పిల్లల నుండి ఐనా మనము మార్పును తీసుకురాలేమా?

కామెంట్‌లు లేవు: