1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

27, జూన్ 2009, శనివారం

పూర్వ వైభవంతో నవ ప్రాభవం

పూర్వ వైభవంతో నవ ప్రాభవం!

ఎందరో మహానుభావులు... అందరూ విజయసారథులే!

డాక్టర్‌ యు.ఎ.నరసింహమూర్తి

(రచయిత విజయనగరం మహారాజ కళాశాల (విశ్రాంత)
తెలుగు శాఖాధ్యక్షులు)


'ఇది విభాత మహోత్సవమ్మేమొ! ఇదియు
నూత్న కల్యాణ తూర్య మనోజ్ఞ గాన
నృత్య కోలాహలమ్మొకో! ఇది సువర్ణ
మంగళాక్షతా శీర్వర్ష మగునొ, కాదొ!'

అన్న కృష్ణశాస్త్రి పద్యం స్మరణకు వస్తోంది. తెలుగు భాషకు కాలం కలిసి వచ్చింది. తోటి భాషల సరసన తలఎత్తుకుని నిలవగలిగింది. ప్రజల కోరిక, ఉద్యమకారుల కృషి, ప్రభుత్వం ఒత్తిడి, ఎన్నికలవేళ, రాజకీయాల్లో మార్పులు- ఇలా ఇన్ని కారణాలు ఒక్క ఉదుటున ముసురుకుని వచ్చిన కారణంగా తెలుగు భాషకు ప్రాచీన భాషా ప్రతిపత్తి దక్కింది. ఇది తెలుగు ప్రజల సమష్టి విజయం. ఏ ఒక్కరి దయాధర్మభిక్షగా లభించిన వరం కాదు. ఇంతకాలం మనం పోగొట్టుకున్న ప్రతిష్ఠను తిరిగి మనమే నిలుపుకొన్నాం. ఈ తరుణంలో తెలుగు భాషా సాహిత్య సంస్కృతుల ప్రాచీన ప్రాభవం ఏమిటో, తెలుగువారి చరిత్ర ఏమిటో తేటతెల్లం చేసి మనకు అందించిన మహానుభావులెందరికో మనం కృతజ్ఞతలను ప్రకటించుకోవలసి ఉంది.

నిస్వార్థ పరిశోధనల ఫలం
మన జాతి- బ్రాహ్మణాలు, పురాణాలు, ఇతిహాసాలు ఉన్నకాలం నుంచీ ఉంది. మన భాష మూడువేల ఏళ్లనుంచి కనిపిస్తూంది. మన సాహిత్యం నన్నయకు ముందు కాలంనుంచి ఉంది. మన చరిత్ర శాతవాహనుల కాలం నుంచి స్ఫుటంగా కనిపిస్తుంది- ఇలా ఇన్ని విషయాలు మనకు ఎలా తెలుస్తాయి? నూటయాభై ఏళ్లకు ముందు తెలుగు ప్రజలకు ఈ విషయాలన్నీ ఇంత వివరంగా తెలియవు. అప్పుడు దొరికేవన్నీ తాటాకుల పుస్తకాలు, రాళ్లమీద, రాగిరేకుల మీద చెక్కిన శాసనాలు మాత్రమే. అవన్నీ ఎక్కడెక్కడో చీకటి కొట్లలో నిద్రిస్తూ ఉండేవి. తాటాకుల పుస్తకాల్లోని లిపిని అర్థం చేసుకోవడం అందరికీ తెలిసేది కాదు. ఆ రాసే విధానం వేరు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కవిధంగా ఉండేది. తెలుగే అయినా లిపిలో ఎన్నో తేడాలుండేవి. అన్నమయ్య రాసిన 32వేల కీర్తనలు చెక్కిన రాగిరేకులు తిరుపతి దేవాలయంలోని ఒక చీకటి కొట్లో పడిఉన్న సంగతి 70 ఏళ్లకు పూర్వం ఎవరికీ తెలియదు. ఇవన్నీ ఆ దశలోనే ఉండిపోతే ఈ భాష ప్రాభవం ఇప్పటివాళ్లకు తెలిసేది కాదు. మన చరిత్ర, సంస్కృతి మనకు అందేవికావు.

'యావద్భారత వర్షమున- దేశ భాషలలో నగ్రగణ్యమై, లోకోత్తరమైన సంస్కృతభాషతో సమాన ప్రతిపత్తి గడించి అతి విస్తృతమై, అపారమై, బహుముఖ సాహిత్య ప్రక్రియలతో భారత జాతీయ భాషగా రూపొందదగిన తెలుగు భాషా విశిష్టత, వ్యక్తిత్వము వెలుగులోనికి వచ్చుట లేదు. మౌలిక పరిశోధనయనగా అముద్రితములైన తాళపత్ర గ్రంథ పరిశోధన. వాఞ్మయ చరిత్రకు ప్రాచీన కవుల కృతులే ప్రాతిపదికలు, ప్రధానాధారములు. తెలుగు భాషలో పూర్వకవి కృతులన్నియు తాళపత్ర గ్రంథములలో నిక్షిప్తములై యున్నవి. అందువలన తెలుగు వాఞ్మయ చరిత్ర అముద్రితములైన తాళపత్ర గ్రంథములపైనే పూర్తిగా ఆధారపడి యున్నదనుట నిర్వివాదాంశము' అని నిడుదవోలు వేంకటరావు అన్నారు. ఆ మౌలిక పరిశోధన 19వ శతాబ్ది చివరి పాదం నుంచి మొదలైంది. ఆనాటి పరిశోధకులకు నేటి పరిశోధకులకుండే వనరులేవీ ఉండేవి కావు. ఎందరెందరో మహానుభావులు ఎన్నో చిక్కులను ఎదుర్కొని, స్వార్థం లేకుండా, బతుకు ఈడ్వడానికి చాలిన జీతాలు లేకపోయినా తొట్టతొలి పరిశోధనలను పట్టుదలతో కొనసాగించారు. వారిలో మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకరశాస్త్రి, కందుకూరి వీరేశలింగం, జయంతి రామయ్య, వేదం వెంకటరాయశాస్త్రి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, కొమర్రాజు లక్ష్మణరావు, నేలటూరి వెంకటరమణయ్య, చిలుకూరి వీరభద్రరావు, సురవరం ప్రతాపరెడ్డి, ఖండవల్లి లక్ష్మీరంజనం, నిడుదవోలు వేంకటరావు, తిరుమల రామచంద్ర వంటివారు ప్రముఖులు. వీరందరి కంటే ముందుగా బ్రౌన్‌దొర మాట చెప్పుకోవాలి. వీరందరూ కొనసాగించిన పరిశోధనలు, పరిష్కరణల కారణంగా వెలుగుచూడని ఎన్నో గ్రంథాలు ముద్రణ భాగ్యానికి నోచుకొని ఈ అమూల్య వారసత్వం మనకు దక్కింది. ఇప్పుడు వారందరినీ మనం గుర్తుకు తెచ్చుకోవాలి. వారి సేవలను మననం చేసుకోవాలి. వారిని ఆరాధించాలి. 1850-1950 మధ్యకాలంలో ఇంతటి కృషి జరిగి ఉండకపోతే మనకు గతం లేదు, భవిష్యత్తు లేదు.

ఒకపక్క అన్ని రంగాల్లోను తెలుగు ప్రాచీనతను వెల్లడించి దాన్ని ఎప్పటికీ నష్టపోకుండా కాపాడుకోవాలి. ఇంకొకపక్క తెలుగువారు అన్ని రంగాల్లోను ఆధునిక ప్రపంచంలో పోటీకి దిగాలి. భాష- సాహిత్యం- కళలు- విజ్ఞానం- సంస్కృతి- ఇలా అన్ని విషయాల్లోను ఈ పరిస్థితి ఉంది. మన తెలుగు పెద్దలు ఈ సవాలును సమర్థంగా ఎదుర్కొన్నారు. పండితులు, పరిశోధకులు, పరిష్కర్తలు, చరిత్ర పరిశోధకులు ఇందులో మొదటి భాగంకోసం ఆకలి, నిద్ర అని చూడకుండా; సంసారం- స్వార్థం పట్టించుకోకుండా, విసుగూ విరామం లేకుండా కృషిచేశారు. మన భాషను, సాహిత్యాన్ని ఆధునికం చేయడానికి గిడుగు, గురజాడల మార్గాన్ని అనుసరించి ఎందరో పాటుపడ్డారు. రచయితలు అటు సంప్రదాయ మార్గంలోను, ఇటు ఆధునిక మార్గంలోను ఆకుల మీద ఒకరు నడిస్తే చిగుళ్లమీద ఇంకొకరు నడిచి ఒకరు గనులను తవ్వి రత్నాలు రాసులుపోస్తే ఇంకొకరు మెట్ట-పల్లం ఏకం చేసి రాజనాలు పండించారు. వీరందరి కృషిని వ్యాప్తి చేయడానికి ప్రజలందరూ తెలుగు భాషా సాహిత్య సంస్కృతుల మీద ఆసక్తి, అభిమానం, గౌరవం పెంచుకోవడానికి పత్రికలు మరువలేని కృషిచేశాయి. సరస్వతి, చింతామణి, ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక, అముద్రిత గ్రంథ చింతామణి, గృహలక్ష్మి, రెడ్డిరాణి, భారతి, త్రిలిజ్ఞ, తెలుగు జనానా, కల్పలత, ఆంధ్రభారతి, సువర్ణలేఖ, కృష్ణాపత్రిక, సాహితి, గోల్కొండ పత్రిక, ప్రబుద్ధాంద్ర- వంటి పత్రికలెన్నో లేకపోతే మన ప్రాచీన, ఆధునిక భాషా సాహిత్యాలు ఇంతగా అభివృద్ధి పొంది ఉండేవికావు. ఈ తరం వారికి ఆ పత్రికల పేర్లు తెలియవు. రూపురేఖలు తెలియవు. అవి నడిచిన తీరుతెన్నులు తెలియవు. కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణారావు (పోలవరం జమీందారు), వీరేశలింగం, గిడుగు, అక్కిరాజు ఉమాకాన్తమ్‌, ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ, కాశీనాథుని నాగేశ్వరరావు, ఆండ్ర శేషగిరిరావు, ముట్నూరు కృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి వంటి ఎందరో ప్రముఖ పత్రికా వ్యవస్థాపకులు, సంపాదకుల గురించి ఈతరం వారికి బాగా తెలియదు. తెలుగు విశ్వవిద్యాలయం వారుగాని, తెలుగు అకాడమీ వారుగాని ఆ కాలంలోని పత్రికల ముఖపత్రాలను దొరికిన మేరకు సేకరించి ఆ పత్రికల చరిత్రను- చేసిన సేవను గురించి సంగ్రహ వ్యాసాలు రాయించి నేటితరానికి అందిస్తే బాగుంటుంది. తెలుగు భాష ప్రాచీనతను సంరక్షించి మనకు తెలియజేసి ఆధునికతకు మార్గం వేసిన పత్రికలకు, పత్రికాధిపతులకు, సంపాదకులకు ఈ సమయంలో సముచితమైన కృతజ్ఞతలను తెలుపుకోవడానికి ఇదొక మార్గం.

కొంతకాలంగా మనమంతా ఎదురుచూస్తున్న ప్రాచీనతా ప్రతిపత్తి మన భాషకు వచ్చింది. ఇందువల్ల కొత్తగా కలిగిన మేలు ఏమిటి? పాఠశాలల నుంచి ఆధ్యాత్మిక ప్రవచనాల దాకా, వరుణయాగం నుంచి వ్యాపార జగత్తుదాకా తెలుగును గురించి ఏమి చెప్పవలసి వచ్చినా ఆంగ్లమాధ్యమంలో చెప్పుకోవలసిన దుర్దశలో ఉన్నాం మనం. ప్రస్తుతం అలా కాదనుకోవడం ఆత్మవంచన తప్ప ఇంకొకటి కాదు. ఈ ప్రాచీనతా ప్రతిపత్తి మనకెలాంటి సంతోషాన్ని కలిగించబోతోంది? ఇంక ఉత్సవాలు జరుగుతాయి. ఊరేగింపులు జరుగుతాయి. కొందరి మీద ప్రశంసల వర్షం కురుస్తుంది. మరికొందరికి పురస్కారాలు, పారితోషికాలు లభిస్తాయి. అంతటితో ఆ వేడి చల్లారిపోతుంది. ఆ తరవాత ఏం చెయ్యాలి? మనకు లభించిన ఈ అవకాశాన్ని, గౌరవాన్ని ప్రయోజనకరంగా, తెలుగు ప్రగతికి మార్గంగా మలచుకోవడానికి మనమేమి చేయాలి? మేధావులు ఆలోచించవలసిన విషయమిది. నిర్మాణాత్మకమైన కృషి ఆరంభం కావలసిన సమయమిది.

నిరంతరం భాషకు నీరాజనం
ప్రాచీన భాషా ప్రతిపత్తి వచ్చినందువల్ల మనకు అదనపు నిధులు వస్తాయి. వాటిని మనం ఉపయోగించుకోవడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలు కూడా ఉంటాయి. అందులో ప్రధానమైనది ప్రాచీనతను సంరక్షించుకోవడం. దీని ప్రయోజనం ఏమిటి? ఆధునిక, వైజ్ఞానిక ప్రపంచపు సవాళ్లను ఎదుర్కోవడానికి తగిన సామర్థ్యంగల భాషగా తెలుగును ఆధునికంగా తీర్చిదిద్దుకోవడమే దీని ప్రయోజనంగా మనం ఎంచుకోవాలి. ప్రాచీన విజ్ఞానం ఆధునిక వికాసానికి మూలం కావాలి. ప్రాచీన భాషా ప్రతిపత్తి వచ్చినందువల్ల కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోను, విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లోను తెలుగు భాషాధ్యయన కేంద్రాలు నడుపవచ్చు. ఇది మన ప్రతిష్ఠ పెరిగే మార్గమే. ఇప్పుడు చాలామందికి తెలుగు పరిశోధక పట్టభద్రులకు కూడా పట్టుమని పది పద్యాలు నోటికి రావు. వాడుక భాషలో తప్పులు లేకుండా పది వాక్యాలు రాయలేరు. వేదికనెక్కి తడుముకోకుండా పది నిమిషాలు మాట్లాడలేరు. ఈ పరిస్థితి తొలగిపోవాలంటే ముందు ఇల్లు సవరించుకోవాలి. మండలస్థాయి నుంచి తెలుగు భాషా కుటీరాలు ఏర్పడాలి. స్వచ్ఛంద సంస్థల సహాయంతో తెలుగు వారందరూ తప్పులులేకుండా రాయడం చదవడం నేర్చుకునేలా చేయాలి. ముందుగా ప్రజలకు తెలుగు మీద అభిమానం పెరిగేలా చేయాలి. ఇందుకు తెలుగులో గొప్ప రచనలు రావాలి. మనకిప్పుడు కావలసినది గతవైభవం కాదు, భవిష్యత్తులో పొందగల ప్రాభవం. తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, సాంస్కృతిక మండలి, అధికార భాషాసంఘం వంటి సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేయాలి. విశ్వవిద్యాలయాల పాఠ్యప్రణాళికలు, పరిశోధనలు భాషను ఆధునికంగా తీర్చిదిద్దే కృషిని చేపట్టాలి. ప్రాచీనతా సంరక్షణకు ఆధునికతా వికాసానికి తమ జీవితాలను ధారపోసిన మహామహుల జయంతులను, వర్ధంతులను క్రమం తప్పకుండా నిర్వహించి యువకుల్లో భాషాభిమానం నింపాలి. ప్రవాసాంధ్రుల సేవలను గుర్తించాలి. వారి సహకారాన్ని అందుకోవాలి. ప్రవాసాంధ్ర సంఘాలనన్నింటినీ ఏకతాటిమీదకుతెచ్చి వారి కృషిని వ్యాపార వాణిజ్యాల మీద, రాజకీయాల మీద కంటే భాషా సాహిత్య సాంస్కృతిక రంగాలమీద ఎక్కువగా కేంద్రీకృతమయ్యేలా ప్రయత్నాలు చేయాలి.

మన భాషను ఆధునిక ప్రపంచ అవసరాలను తీర్చే భాషగా మార్చడంలో ఇప్పటివరకు సాధించిన ప్రగతి చాలా తక్కువ. మనకు కొత్తగా వచ్చిన ఈ అవకాశాన్ని అందుకు ఎక్కువగా ఉపయోగించుకోవాలి. మన భాషలో మహారచయితలు పుట్టే అవకాశాలను మనమే కల్పించుకోవాలి. అప్పుడే తెలుగుభాష ప్రాచీనతా ప్రతిపత్తి అర్థవంతమవుతుంది. ప్రాచీనతా ప్రతిపత్తిగల గొప్ప ఇతర భాషలు కొన్ని ఉన్నాయి. ఆసక్తి కలవారు అవి ఇప్పుడు ఎటువంటి దశలో ఉన్నాయో తెలుసుకోవాలి. మనకు లభించిన ఈ ప్రాచీన భాషా ప్రతిపత్తి ఆ దశలో మిగిలిపోకుండా జాగ్రత్తపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. స్వతంత్రం కోసం మనవాళ్లు ఎలా పోరాడారో అందరకూ తెలుసు. చివరకు మనకు స్వతంత్రం వచ్చింది. అప్పుడొక కవి 'మన స్వతంత్రం ఒక మేడిపండు- దరిద్రం మన రాచపుండు' అన్నాడు. తెలుగుకు ప్రాచీన భాషా ప్రతిపత్తి లభించిన ఈ శుభతరుణంలో తిరిగి ఇటువంటి వ్యాఖ్యలు తలెత్తకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ప్రభుత్వంమీద, మేధావుల మీద, ప్రజల మీద ఉంది.
(Eenadu, 02:11:2008)

కామెంట్‌లు లేవు: