తేనె చినుకు తెలుగు పలుకు...
"తరిపి వెన్నెల ఆణిముత్యాల జిలుగు, పునుగు జవ్వాజి ఆమని పూల వలపు, మురళి రవళులు కస్తూరి పరిమళములు కలిసి యేర్పడె సుమ్ము మా తెలుగు బాస!" అంటూ తెలుగు భాష స్నిగ్ద సౌందర్యాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించి చెప్పారో కవి.మనదేశంలో ప్రాచుర్యంలో ఉన్న భాషలు ఎన్నో ఉన్నాయి. ఏ భాష గొప్పదనం, అందం ఆ భాషవే. ఐతే తెలుగు భాషకో ప్రత్యేకత ఉంది.ధేశ భాషలందు తెలుగు లెస్స- అంటూ తాను స్వయంగా కన్నడ ప్రభువు అయిఉండీ తెనుగును ప్రస్తుతించారు శ్రీకృష్ణదేవరాయలు. 'ఆముక్తమాల్యద' అనే అద్భుతమైన తెలుగు ప్రబంధాన్ని రాశారాయన. రాయలవారు నిర్వహించిన భువనవిజయపు కవితా గోష్టులను ఈనాటికీ స్మరించుకుంటూనే ఉన్నాం. ఆంధ్రభూమి సస్యశ్యామలమైంది. గోదవరి,కృష్ణ, పెన్న వంటి జీవనదుల విహార భూమి. నిండారు పారు అఖండ గోదావరీ తీరంలోనే ఆంద్ర మహాభారతం రూపుదిద్దుకొంది.కృష్ణాతీరంలో సంకల్పం చెప్పుకొనే భాగవత మహాకావ్యాన్ని ఒంటిచేత్తో పూర్తి చేసారు బమ్మెర పోతన కవి. తెలుగులో వచ్చిన రామాయణ కావ్యాలకు లెక్కేలేదు. తెలుగు భాషతోపాటు ఆంద్ర సాహిత్యానికి ఘనమైన పూర్వచరిత్రే ఉంది. "ప్రాకృత పదమంజరీ కంఠముల హాలుడమృత కావ్య ప్రసాడములు పంచె, భౌధ్ధ సూత్రార్థముల్ ప్రవచించి నాగార్జునుండహింసా ధర్మకాండ నిలిపె, కన్నడనుడికి వంకలు తీర్చి పంపడు తొలకరి రచనకు త్రోవదీసె-" అంటూ ఆంధ్ర భాష సాదించిన విజయాలను అక్షరబధ్ధం చేశారు రాయప్రోలువారు. తెలుగు పాటే తమిళులను మహాగాయకులుగా తీర్చిదిద్దిన వైనం చారిత్రకసత్యమే.హిందీ తరువాత మనడేశంలో అత్యధిక సంఖ్యకులు మాట్లేడిది తెలుగే ఐనా, 'ఇటాలిఅన్ ఆఫ్ ది ఈస్ట్' అంటూ మన భాష సౌందర్యాన్ని పాశ్చాత్య దేశాలవారు సైతం అభినందించినా తెలుగు గతిరీతులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగానే ఉన్నాయి. తమిళులకు కన్నడిగులకు తమ మాతృభాషపై ఉన్న గౌరవం తెలుగువారికి తమ భాషపై లేదు.పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెత ఒకటి తెలుగులో ఉంది. తెలుగులో ఇంకా ఎన్నో సామెతలున్నా తెలుగు వారికి మాత్రం ఈ సామెతంటేనే ఎక్కువ ఇష్టమేమో! పరాయి భాషలపై చూపే మోజును మనవాళ్ళు తెలుగుపై చూపరు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా సొంత భషను మరిచిపోకూడదన్న సూత్రాన్ని అసలు పట్టించుకోనిది తెలుగువారే. చెన్నైలో ఉండే తెలుగువారు తమిళులను మించి అరవంలో దడదడలాడిస్తారు. కోనసీమనుంచొచ్చినా హైదరాబాద్ లో అడుగుపెట్టేసరికి -క్యా భాయ్- అంటూ హిందీ షోకులు ఒలకపోస్తారు. పదిరోజుల విహార యాత్రకని కోల్ కతా వెళ్ళినవారు తిరిగి వచ్చేటప్పుడు బెంగాలీ యాసను ఒంటపట్టించుకొనే వస్తారు. ఇద్దరు తమిళులు కలుసుకొన్నప్పుడు- వణక్కం- అన్న పలకరింపుతో సంభాషణ ప్రారంభమౌతుంది.ఇద్దరు కన్నడిగులు కలుసుకొన్నప్పుడు- నమస్కార- అన్న మాటతోనే సంభాషణ సాగుతుంది. అదే ఇద్దరు తెలుగువాళ్ళు ఎదురైతే- గుడ్ మార్నింగ్ అనో గుడ్ ఈవినింగ్ అనో లేదా "హలో... హౌ ఆర్యూ" అనో సంభాషణ మొదలవుతుంది. తెలుగు ఇళ్ళల్లోను స్కూళ్ళల్లోను రాజ్యం చేస్తున్నది ఆంగ్లమే. పరాయిభాషలు నేర్చుకోవద్దని ఎవరూ అనరు. మాతృభాషను నిర్లక్ష్య్యం చేయకూడదు.
తమిళులు పట్టుబట్టి తమ భాషకు ప్రాచీన భాషగా గుర్తింపును సాధించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సంస్కృతం, తమిళ భాషలను గురించి వాటి అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగినా తెలుగుకు ఆ హోదా లభించలేదు. క్రీస్తుపూర్వం 500 సంవత్సరానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రసక్తి ఉంది. తెలుగు, తమిళ, కన్నడ భాషలు మూడింటిలోను ఒక శతాబ్ది అటూ ఇటూగా సాహిత్య ఆవిర్భవించిందని చెప్పటానికి తగిన చారిత్రకాధారాలున్నాయని పరిశోధకులు అంటున్నారు. తమిళ వాఙ్మయంలో అతి ప్రాచీన మైనదిగా భావించే 'అగత్తియం' అనే లాక్షణిక గ్రంథంలో "కొంగణం కన్నడం కొల్లం తెలుంగుం" అనే సూత్రం ఉంది. అమరావతి స్థూపంపైన ఒక రాతి పలక మీద చెక్కిఉన్న 'నాగబు' అనే పదమే తొలి తెలుగు పదమని భావిస్తున్నారు. అతి ప్రాచీనమైన అమరావతి స్థూప నిర్మాణం మూడు అంచెలుగా క్రీస్తుపూర్వం 200 మొదలుకొని క్రీస్తుశకం 200 మధ్య కాలంలో జరిగినట్లుగా పరిశోధకులు గుర్తించారు. క్రీస్తుశకం మూడవ శతాబ్ది నుంచి అప్పటి రాజులు వేయించిన శిలాశాసనాల్లో తెలుగు పదాలు అనేకం ఉన్నాయి. ఈ విశేషాలన్నీ ప్రాచీనత విషయంలో తమిళ, కన్నడ వంటి ఇతర ద్రావిడ భాషలకు తీసిపోదని ఋజువు చేసేవే. ఐతే భాషాభిమానం అధికంగా ఉన్న తమిళ నాయకులు పట్టుబట్టి తమ భాషకు ప్రాచీన భాషగా గుర్తింపును సాధించుకొన్నారు. ఇన్నాళ్ళూ ఈ విషయంపై దృష్టిని సారించని మన నాయకులు తమిళానికి ఆ హోదా లభించాకనే తెలుగుకూ అటువంటి హోదా కల్పించాలని హడావుడీ పడిపోతున్నారు. ఇకనైనా- ఇళ్ళల్లోను విద్యాసంస్థల్లోను తెలుగు భాషకు సముచిత స్థానం దక్కేలా జాగ్రత్తపడాలి. ఎంత ఆంగ్ల మాధ్యంలో చదువుకుంటున్నా మన పిల్లలు ఇంట్లో చక్కని తెలుగు మాట్లాడటం, తెలుగు పుస్తకాలు చదవటం, తెలుగు సాహిత్యం పట్ల అభిమానం పెంచుకోవడం అవసరం. 'తేనె చినుకు కులుకు తెలుగు పలుకు' అని మనవారు మనస్పూర్తిగా గ్రహించినప్పుడే తెలుగు భాష మూడు పువ్వులూ ఆరు కాయలుగా వికసిస్తుంది. ప్రాచీన భాష హోదాతోపాటు దేశ భాషలలో తగిన గౌరవాన్ని సంపాదించుకోగలుగుతుంది!
(The editorial in the EENAADU/26:03:2006)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి