వ్యసనంతో సహగమనం

పొద్దున్నే ఆరుబయట చల్లని వాతావరణంలో కూర్చుని వేడికాఫీ తాగడం చాలామందికి అలవాటు. ఆ అలవాటువల్ల మనిషికి సంతృప్తి లభిస్తుంది. అలా సంతృప్తి లభించేంతకాలం అది కేవలం అలవాటేనని చెప్పుకోవాలి. ఒకవేళ కాఫీ దొరక్కపోతే, కాలకృత్యాలు మొదలు కాని స్థితి వస్తే మాత్రం- అది వ్యసనంగా ముదిరందని గ్రహించాలి. యువకులు తమలోని ఆత్మన్యూనతా భావాన్ని, లేదా అభద్రతాభావాన్ని పోగొట్టుకోవడంకోసం వ్యసనాలకు లోబడతారని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. 'ఇంతవరకూ సిగరెట్ ముట్టించలేదా! బీరు రుచి చూడలేదా!' అని స్నేహితులు వెక్కిరిస్తారని, వెర్రివెంగళప్పగా జమకడతారన్న భావనతో కొందరు కుర్రవాళ్లు వ్యసనాలకు అలవడతారు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మానేయగలమనీ అనుకుంటారు. 'నేనంత తేలిగ్గా లొంగను... మానేయమంటావా చెప్పు' అని మిత్రులతో పంతాలకు పోయి, కొన్నాళ్లు నిజంగానే మానేస్తారు కూడా! చాలామందిలో ఆ దృఢచిత్తం త్వరలోనే నీరుగారిపోతుంది. మళ్లీ వ్యసనం మొదలవుతుంది. 'సిగరెట్లు మానేయడం చాలా తేలిక... నేను చాలాసార్లు మానేశాను తెలుసా' అని చమత్కారాలకు పోతారు. లేదా, సిగరెట్లకేసి ఆరాధనగా చూస్తూ 'భయంకరమైన నా ఒంటరి జీవితంలో బాసటగా నిలిచింది ఇదే బ్రదర్' అని బరువుగా నిట్టూరుస్తూ ఆత్మవంచనకు పాల్పడతారు. 'ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ పొగతాగడంపట్ల ఎందుకింత మక్కువ చూపిస్తారో నాకైతే అర్థంకాదు. రైళ్లలో పొగతాగేవారివల్ల మిగిలినవారికి శ్వాసపీల్చడమూ కష్టతరమవడం నాకు తెలుసు' అని గాంధీజీ అనేవారట. అదివిని ఒకాయన 'బీడీ సిగరెట్ వంటివాటిని ఘాటుగా విమర్శిస్తూ, వాటిని నిషేధించాలని ఉద్యమం మీరు ఎందుకు చేపట్టరాదు?' అని అడిగారు. 'ఆ పని చేస్తే నన్ను 'మహాత్మ' అనడం మానేస్తారు... ఆ ధూమపాన సాధనాలు నాకంటే చాలా గొప్పవి... నిజం!' అన్నారు గాంధీజీ.
గాంధీగారికి వచ్చినట్లే- సిగరెట్లు ఎందుకు కాలుస్తారన్న సందేహం ఒక ఇల్లాలికీ వచ్చింది. మెల్లగా భర్త దగ్గరచేరి 'అసలు నాకు తెలియక అడుగుతా, అంత ఇదిగా కాలుస్తారే... ఆ సిగరెట్‌లో ఏముందీ?' అని అడిగింది. వెంటనే 'పొగాకు' అనేసి లేచి చక్కా పోయాడా పతిదేవుడు! తరవాత ఏం అడగాలో తెలియక నిలబడిపోయిందావిడ. 'భర్తను అలా వదిలేస్తే మీకే పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది తెలుసుకోండి' అంటున్నారు పరిశోధకులు. 'ఇంట్లో పొగతాగే భర్త ఉంటే భార్యకు పక్షవాతం ముప్పు పొంచి ఉన్నట్లే' అని హెచ్చరిస్తున్నారు డాక్టర్ మరియా గ్లెయిమోర్. డాక్టర్ మరియా నేతృత్వంలోని 'హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్' బృందం- సుమారు పదహారువేల మందిని పరిశీలించిన తరవాత ఈ చేదునిజాన్ని నిర్ధారించింది. 'వెలుగుతున్న సిగరెట్‌కు రెండో చివర ఒక మూర్ఖుడు ఉంటాడు' అన్నాడొక ఆంగ్ల రచయిత. 'మూర్ఖుడు అవునో, కాదో గానీ తనకీ, తన ఇంట్లో వారికే కాదు, బయట ఎందరికో చాలా ప్రమాదకారి మాత్రం అవును' అని డాక్టర్ మరియా అధ్యయనం స్పష్టం చేస్తోంది. వ్యక్తిగతంగా ఆ మనిషిలో తలెత్తే తీవ్ర ఆరోగ్య సమస్యలు, భార్యకు పొంచిఉన్న పక్షవాతం ముప్పూ కాక, పరోక్షంగా ఒకరు పీల్చి విడిచిన పొగద్వారా గాల్లోకి వ్యాపించిన క్యాన్సర కారక విషపదార్థాలు ఎంతోమంది ఆరోగ్యానికి చాలా హానికరంగా పరిణమిస్తాయని అమెరికా సర్జన్ జనరల్ నివేదిక సైతం తేల్చిచెప్పింది. పొగ రహిత వాతావరణంలో జీవించే భాగ్యవంతులకన్నా ధూమపానం అలముకున్న వాతావరణంలో కాలంగడిపే అభాగ్యులకు వూపిరితిత్తుల క్యాన్సర్, శ్వాసకోశ రుగ్మతలు, గుండెజబ్బులు రెండురెట్లు ఎక్కువగా సంక్రమిస్తాయని అధ్యయనాలు వెల్లడించాయి. అందుకే 'మీరు మీ భార్యను నిజంగా ప్రేమిస్తున్నారా, అయితే ధూమపానం జోలికి పోనేవద్దు' అని వారంతా గట్టిగా హెచ్చరిస్తున్నారు. 'సొంత వ్యసనం అంతమైతే, పొరుగువాడికి మేలు కలుగును' అని బోధిస్తున్నారు.

(ఈనాడు, సంపాదకీయం, 24:08:2008)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి