1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

14, జులై 2009, మంగళవారం

ఎక్కడ ఈ అందాలు

ఎక్కడ ఈ అందాలు???


తిన్నామా.... పడుకున్నామా... తెల్లారిందా...

ఈనాడు ఇదే దినచర్య ఐపోయింది చాలామందికి. అది పల్లె అయినా, పట్టణమైనా... ఎక్కడ చూసినా బిజీ , బిజీ.. మూడేళ్ళ పిల్లాడికి కూడా పొద్దున్నే లేచి ఉరుకులు పరుగులతో తయారయ్యే గ్రహచారం పట్టింది. హాయిగా ఒక్కపనీ చేసుకోవడానికి లేదు. తినడం, పాడుకోవడం అన్నీ యాంత్రికమైపోతున్నాయి.. మరి పల్లెలలో ఎలా ఉందో??

తెల్లా వారక ముందే పల్లే లేచిందీ..
తన వారినందరినీ తట్టి లేపిందీ..
ఆదమరచి నిద్ర పోతున్న తొలికోడి..
అదిరి పడి మేల్కొంది అదే పనిగ కూసింది..



తెల్లా వారక ముందే



వెలుగు దుస్తులేసుకునీ సూరీడూ..
తూర్పు తలుపు తోసుకుని వచ్చాడు
పాడు చీకటికెంత భయమేసిందో..
పక్క దులుపు కుని ఒకే పరుగు తీసిందీ..
అది చూసీ.. లతలన్నీ.. ఫక్కున నవ్వాయి..
ఆ నవ్వులే ఇంటింటా పువ్వులైనాయి..



తెల్లా వారక ముందే



పాలావెల్లి లాంటి మనుషులు...
పండూ వెన్నెల వంటీ మనసులు
మల్లె పూల రాశి వంటి మమతలూ..
పల్లె సీమలో కోకొల్లలూ..
అనురాగం.. అభిమానం...
అనురాగం అభిమానం కవల పిల్లలూ..
ఆ పిల్లలకూ పల్లెటూళ్ళు కన్న తల్లులూ..



తెల్లా వారక ముందే


ఇక్కడ వినండి.

మామూలుగా ఏదైనా పాట వింటే , సంగీతమో, సాహిత్యమో, లేదా ఆ పాట పాడినవారి స్వర మాధుర్యం మనను ఆకట్టుకుంటుంది. ఓహో అనుకుంటాము.. కాని కొన్ని పాటలు అందంగా ఉంటాయి. చాలా సులభమైన తెలుగు పదాలతో ఉంటాయి. ఆ పాట వింటుంటే ఒక అందమైన దృశ్యం మన కళ్లు ముందు కదలాడుతూ ఉంటుంది. అలాంటిదే ఈ పాట. ముత్యాల పల్లకి చిత్రంలో సుశీల పాడిన మల్లెమాల గీతం. నిజంగా ఈ పాట వింటుంటే ఒక అద్భుత దృశ్యం రూపకల్పన చేసుకుంటుంది. వ్యవసాయపు పనులకోసం సూర్యుడికంటే ముందే లేచి పొలాల వైపు అడుగులేస్తారు రైతన్నలు. సూరీడు తూరుపు తలుపు తీసుకుని కాక తోసుకుని వచ్చాడంట. మరి రోజూ చేసే పని తప్పదు కదా.. ఉద్యోగాలు, స్కూళ్ళు ఇలా మనం కూడా అన్ని పనులు టైం ప్రకారం తప్పనిసరై చేయాల్సి వస్తుంది కదా. నింపాదిగా చేస్తే ఎలా కుదురుతుంది. ప్రతి రోజు అలారం పెట్టుకుని అమ్మ లేచి , పిల్లలను లేపుతుంటే పిల్లలకు చిరాకు, స్కూలు బస్సు వెళ్ళిపోతుందని భయమేసి లేస్తారు .. మామూలుగా కాకుండా వెలుగు దుస్తులేసుకుని వచ్చిన సూరీడుని చూసి పాడు చీకటికి కూడా భయమేసి పక్క దులుపుకుని పరుగుతీసిందంట..

కొన్నేళ్ళ క్రిందట పల్లెటూళ్ళలో కుటుంబ సభ్యుల మధ్యే కాక ఊరంతా కూడా అభిమానంగా కలిసి మెలిసి ఉండేవారు. ఎవరింట్లో శుభకార్యమైనా ఊరంతా చుట్టాలే.. అనురాగం అభిమానం కవల పిల్లలూ.. .. ఎంత మంచి ఊహ కదా.. కాని నిజమైతే బాగుండు అనిపించక మానదు ఎవరికైనా..

కామెంట్‌లు లేవు: