1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

14, జులై 2009, మంగళవారం

అద్భుత భావగీతం

అద్భుత భావగీతం

సంగీతం అంటే ఒక ధ్వని, నాదం మాత్రమేనా. ఒక పాట మన మనసు లోతులను కదిలించి స్పందించేలా చేస్తుంది అంటే దానికి కారణం ఆ పాట సంగీతం, అందులోని సాహిత్యం. గాయకుడి గానామృతం. మన సినిమా పాటలలో నాకు నచ్చినవి మనసుకు హత్తుకునే తక్కువే . ఎన్నో సార్లు ఆలోచించాను. నాకు ఈ కారణాల చేత ఇవి నన్ను ఇంతగా కదిలించాయి అని. ఖచ్చితంగా అది సంగీతం, ఆ పాటలోని పదాల అల్లిక, అలాగే గాయకుడి స్వర మాధుర్యం. ఈ క్రమంలో నటీనటులు గురించి ప్రస్తావన రాదు. నా విషయానికొస్తే పాటలు చూడడం కంటే వినడమే ఇష్టపడతాను. ఒక్కోసారి కొన్ని పాటలు మనలోని బాధను చల్లపరిచి ఆహ్లాదానిస్తాయి. ఆ పాటలలోని అందమైన పదాల అమరిక మనలో ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తుంది. ఎన్నో సందేహాలను పరిష్కరిస్తుంది. ఒక్కోసారి ఔరా అనిపిస్తుంది కూడా. అలాంటి ఒక పాట సిరివెన్నెల చిత్రంలోని విరించినై .. ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. అలా అని నేను సిరివెన్నెల గారి అభిమానిని అనలేను. ఆ పాట రాసింది, పాడింది ఎవరైనా సరే. ఎంతో కాలంగా ప్రయత్నించి ఇప్పటికి ఆ పాట అర్ధాన్ని తెలుసుకోగలిగాను.
ఆ విశేషాలు నా బ్లాగులో దాచుకుని , మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

విరించినై విరచించితిని ఈ గీతం
చిత్రం : సిరివెన్నెల
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం :



విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
ఓం!
ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం
ఓం!
కనుల కొలనులో ప్రతిబిం బించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం

సర సస్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన
పలికిన కిల కిల స్వనముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా
విశ్వ కావ్యమునకిది భాష్యముగా

విరించినై

జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునే

విరించినై

నా వుచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సర సస్వర సుర ఝరీగమనమౌ

విధాత = బ్రహ్మ, సృష్టికర్త యొక్క


తలపున = ఊహలో


ప్రభవించినది = మెరిసినది


అనాది = మొదలు లేని


జీవన వేదం = సృష్టికి మూలమైన వేదం (సృష్టే వేదం, వేదమే సృష్టి)


ప్రాణ నాడులకు = మనలో ప్రాణానికి మూలమైన నాడుల్లో


స్పందన నొసగిన = ప్రాణాన్ని తట్టి లేపిన


ఆది ప్రణవ నాదం = తొలి ఓంకారము


కనుల కొలనులో = కళ్ళే కొలనులు అయితే


ప్రతిబింబించిన = కొలనులో ప్రతిబింబించిన


విశ్వరూప విన్యాసం = సృష్టి యొక్క రూప ఆవిష్కరణ


ఎద కనుమలలో = గుండె అనే పర్వత శ్రేణిలో


ప్రతిధ్వనించిన = మారుమ్రోగిన


విరించి = బ్రహ్మ యొక్క


విపంచి = వీణ


గానం = సంగీతం


సరస = రసముతో కూడిన( నవరసాల రసం )


స్వర = సంగీత స్వరం (, రి )


సురఝరీ = దేవనది, గంగ


గమనమౌ = ప్రవాహము ఐనట్టి


సామవేద సారమిది = సామవేదం యొక్క సారాంశం ఇది


నే పాడిన జీవన గీతం గీతం = నే పాడిన ఈ పాట జీవిత గీతం


విరించినై = నేనే బ్రహ్మని


విరచించితిని = రచించితిని


ఈ కవనం = ఈ కవిత్వం


విపంచినై = వీణనై


వినిపించితిని = వినిపిస్తున్నా


ఈ గీతం - ఈ పాట


విరించినై...



ప్రాగ్దిశ వీణియ పైన = తూర్పు దిక్కు అనే వీణ మీద


దినకర మయూఖ తంత్రుల పైన = సూర్యకిరణాలనే తీగలు మీటుతూ


జాగృత విహంగ తతులే += నిద్రలేచిన పక్షి గుంపులు


వినీల గగనపు వేదిక పైన = నీలాకాశం అనే స్టేజి మీద


పలికిన కిలకిల స్వనముల = పలికిన కిల కిల ధ్వనులు


స్వరజతి = స్వరముల అమరిక, కృతి కీర్తన జావళి లాగా ఇది కూడా ఒక లాంటి పాట


జగతికి = ప్రపంచానికి , విశ్వానికి


శ్రీకారము కాగా = మొదలు కాగా


విశ్వకావ్యమునకి = విశ్వమనే కావ్యానికి


ఇది భాష్యముగా = వివరణగా



విరించినై...


జనించు = పుట్టిన


ప్రతి శిశు గళమున పలికిన = ప్రతి శిశువు గొంతున పలికిన


జీవన నాద తరంగం = జీవితమనే ధ్వనికెరటం, అల


చేతన = చైతన్యం, అచ్తివషన్


స్పందన = reverberation, రేసోనన్స్


ధ్వనించు = శబ్దం


హృదయ మృదంగ ధ్వానం - హృదయం మృదంగం వలె ధ్వనిస్తుంది.


అనాది = మొదలు లేని, చాలా పాతదైన, ఎప్పణ్ణించో ఉన్న


ఆది తాళం = ఆది తాళం


అనంత జీవన వాహినిగా = అంతం లేని జీవితమనే నదిలా


సాగిన సృష్టి విలాసమునే = సాగిపోయిన సృష్టి క్రీడ, ఆట, నాట్యం



విరించినై...



నా ఉచ్చ్వాసం = పీల్చే ఊపిరి, గాలి
కవనం = కవిత్వం
నా నిశ్వాసం = వదిలే ఊపిరి,గాలి
గానం = పాట


ఎంత అద్భుతమైన భావం కలిగిన పాట ఇది.

కామెంట్‌లు లేవు: