భారతంలోని అద్భుత పద్యాలు
తెలుగు సాహిత్యంలోని అందాన్ని ఆస్వాదించాలంటే పండితుడే కానక్కరలేదు . పురాణ గ్రంధాలైన రామాయణ , మహాభారత, భాగవతాలనుండి ఎన్నో పద్యాలు సామాన్య జన జీవనంలో విరివిగా వాడబడ్డాయి. ఆ మహాకావ్యాలలో ప్రస్తావించబడిన ఎన్నో పద్యాలు ఇప్పటికీ మన నిత్య జీవతంలో అన్వయించుకుంటాము కూడా. పోతన కవిత్వం మాధుర్యానికి పెట్టింది పేరు. భాగవతంలో ఎన్నో పద్యాలు తెలుగునాట ప్రతినోటా నానాయి. అలాంటి కొన్ని భాగవత పద్యాలు చూద్దాం. ఇందులో ఎన్నో పద్యాలు స్కూలులో చదివినవే .ఇవి చదువుతుంటే నా స్కూలు రోజులు గుర్తొచ్చాయి. ప్రతి పరీక్షలో ముందు రాయాల్సిన ప్రతిపదార్ధం . అది మొత్తం కరెక్టుగా రాస్తే వచ్చే ఫుల్ మార్కులు.. ఆ తెలుగు టీచర్. ఆవిడని విసిగించిన సంఘటనలు..
మన సారధి ,మన సచివుడు
మన వియ్యము, మన సఖుండు,మన బాంధవుఁడున్
మన విభుడు, గురువు, దేవర
మనలను దిగనాడి చనియె మనుజాధీశా.
తమ నేస్తం, సారధి, మంత్రి లా సలహాలు ఇచ్చినవాడు, వియ్యంకుడు, బందువు ఐన శ్రీకృష్ణుడు అస్తమించిన పిమ్మట అర్జునుడు సర్వం కోల్పోయినవాడై దిగులుగా అన్నతో చెప్పిన మాటలివి. మనకు బాగా కావలసిన వాడు, మిత్రుడు , బంధువు చనిపోయినప్పుడు ఇలాగే అనిపిస్తుంది కదా. మనకు సర్వస్వం ఐన వ్యక్తి దూరమైనపుడు సర్వం శూన్యంగా అనిపిస్తుంది.
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
యెవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్య లయు డెవ్వడు సర్వము తానెయైనవా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్
గజేంద్ర మోక్షంలోని ఈ పద్యం తెలుగువారికి చిరపరిచితమే. మొసలి నోట చిక్కిన గజేంద్రుడు ఆ సర్వేశ్వరుడిని శరణు వేడిన విధంబిది. అసలు భగవంతుడు ఎవ్వడు అనే ప్రశ్నకు సమాధానం ఈ పద్యంలో లభించవచ్చు. ఈ జగత్తు ఉద్భవించడానికి కారణం అతడే, జగం అతనిలో ఉంది. అతనితో ముగుస్తుంది. మొదలు, తుది ..సర్వమూ తానే ఐన ఆ భగవంతుడు తనంతట తానుగా జన్మించినవాడు. సృష్టికి మూలకారణము అని ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన నిజము. అప్పుడు కాని మనిషిలోని గర్వం అణిగి, తానే గొప్ప అని విర్రవీగడు
వారిజాక్షులందు, వైవాహికములందు
బ్రాణ విత్త మాన భంగములందుఁ
జకితగోకులా గ్రజన్మరక్షణమందు
బొంకవచ్చు, నఘము రాదధిప!
వామనావతార ఘట్టములో దానమడగడానికి వచ్చిన బాలుడు మహావిష్ణువు అని తెలుసుకున్న దానవ గురువు శుక్రాచార్యుడు బలి చక్రవర్తితో ఇలా అన్నాడంట. స్త్రీల విషయములో, వివాహ విషయములో, ప్రాణానికి , సంపదకు, మానమునకు హాని కలిగే సందర్భంలో, గోవులను, బ్రాహ్మణులను రక్షించు సమయములో అబద్ధము ఆడ వచ్చును.అందుకే బలిచక్రవర్తిని ఇచ్చిన మాటను వెనక్కి తీసుకొని తన ప్రాణాలు కాపాడుకోమని అద్భుతమైన సలహా ఇచ్చాడు ఆ గురువు. పైగా అది తప్పు కాదంట.. కాని ఇపుడు అవసరానికి అలవోకగా అబద్దాలాడేస్తుంటారు చాలా మంది.
ఊరక రారు మహాత్ములు
వా రధముల యిండ్ల కడకు వచ్చుట లెల్లం
గారణము మంగళములకు
నీ రాక శుభంబు మాకు . నిజము మహాత్మా !
శ్రీకృష్ణుడి కుశలము తెలుసుకుని రమ్మని వసుదేవుడు తన పూరోహితుడిని పంపిస్తాడు. అతనికి అతిథి సత్కారాలు చేసి నందుడన్న మాటలివి. ఇప్పటికీ మనం ఎవరైన గొప్పవాళ్లు మన ఇంటికి వస్తే ఊరకరారు మహాత్ములు. మాలాంటి సామాన్యులు, పేదవారింటికి మీలాంటి పెద్దలు రావడం శుభకరం అని అంటారు. ఇందులో అవతలి వ్యక్తి సంపూర్ణ గౌరవంతో అన్నాడా? , వెటకారంగా అన్నాడా అన్నది తెలియడం అవసరం. అది అతని ఉచ్చారణలో తెలిసిపోతుంది. ఏమంటారు.. నిజమేకదా..
ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధి పై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభా రాశి పై
నంతై చంద్రుని కంతయై ధ్రువుని పై నంతై మహర్వాటి పై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి యై !!
బలి చక్రవర్తి వద్ద మూడడుగులు దానంగా స్వీకరించాక పొట్టి వడుగు వామనుడు భూమిని, ఆకాశాన్ని,మబ్బులను, సూర్యచంద్రులను, ధృవుని, మహాలోకాలన్నింటినీ దాటిపోతూ పెరిగిపోయాడు. ఆ చిన్ని వడుగు ముల్లోకాలన్నీ ఆక్రమించేటంతగా ఎదిగిపోయాడు. "ఇంతింతై వటుడింతై" అనే పదం నానుడిగా మారిపోయింది. ఒక వ్యక్తి క్రమంగా ఎదుగుతూ వృద్ధి చెందినప్పుడు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగిపోయాడు అని అనడం సర్వ సాధారణం. చిన్ని బాలుడైనా కృషితో వామనుడిలా విశ్వరూపం దాల్చవచ్చు , ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు అని భావం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి