'రెండు నిమిషాల్లో తయారై వచ్చేస్తాను' అని చెప్పి గదిలోకి దూరిన భార్యకోసం అరగంట నుంచి ఎదురుచూస్తున్నాడు పతిదేవుడు. 'ఇరవై నిమిషాలు ఆలస్యంగా నడుచుచున్నది' అని ప్రకటించిన రైలుకోసం గంటకు పైగా కాచుకుని ఉన్నారు ప్రయాణికులు. ఇలాంటి సందర్భాల్లో నిమిషం నిడివి మారుతూ ఉంటుంది. సమయానికి ప్రత్యేకంగా కొలత అంటూ ఉండదు. గంటలో అరవయ్యో భాగం నిమిషమని మన లెక్క. నిమిషంలో అరవయ్యో భాగం సెకండు అంటాం.
మన పెద్దలైతే ఇలాంటి లెక్కల్లో చాలా సూక్ష్మదృష్టి ప్రదర్శించారు. చీకటిగా ఉన్న గదిలోకి ఏ మూలనుంచో ఒక సూర్యకిరణం చొరబడిందనుకోండి- పొడుగాటి ఆ వెలుగుచారలో మనకు ఎన్నోకోట్ల దుమ్ముకణాలు కనబడతాయి. వాటిలోంచి ఒకేఒక్క ధూళి రేణువును పట్టుకుని తూచగలిగితే దాని బరువును 'త్రస' అంటారు. దాని కొలతను ముప్ఫై పరమాణువులుగా లెక్కించారు. సూక్ష్మమైన 'త్రసరేణుభారం' మొదలుగా ఎన్నోవేల రెట్ల తూకాలను మనవాళ్ళు లెక్కలుకట్టారు. వివిధ విభాగాలతో కూడిన సైనిక బలాన్ని ఎలా లెక్కించాలో మహాభారతం వివరించింది. ఒక రథం, ఓ ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు సైనికులు మొత్తం పదిమంది బృందాన్ని 'పత్తి' అంటారు. పత్తికి మూడురెట్లు సేనాముఖం. దానికి మూడు రెట్లు అయితే అది గుల్మం. మూడు గుల్మాలు కలిస్తే ఒక గణం. మూడు గణాలు కలిసి వాహిని. దానికి మూడింతలు పృతన. దాన్ని మూడుతో గుణిస్తే ఒక చమూ. మూడు చమూలు ఒక అనీకినీ. దానికి పదిరెట్లు అక్షౌహిణి. కురుక్షేత్రంలో మొత్తం సైన్యం పద్దెనిమిది అక్షౌహిణులు.
ఇక సంఖ్యామానానికి వస్తే ఒకట్లు, పదులు, వందలూ... అంటూ లెక్క వెయ్యికోట్లు దాటాక- ఒక్కో సున్న చొప్పున చేర్చుకుంటూ పోతే అర్బుదం, ఖర్వం, పద్మం, క్షోణి, శంఖం, క్షితి, క్షోభం, నిధి, పరతం, పరార్థం, అనంతం, సాగరం, అమృతం, అచింత్యం, భూరి, మహాభూరి... దాకా ఆ లెక్క విస్తరిస్తుంది. ఒకటి పక్కన ముప్ఫై అయిదు సున్నాలు చేరిన సంఖ్య మహాభూరి అవుతుంది.
సీతా స్వయంవరం ఆరంభమైంది. శ్రీరామచంద్రుడు శివకార్ముకాన్ని పట్టి ఎక్కుపెట్టబోయాడు. ఉన్నట్టుండి విల్లు ఫెళ్ళున విరిగిపోయింది. 'ఆ ఒక్క 'నిమేషం'బునందె నయము జయమును భయము విస్మయము గదుర' అంటూ కరుణశ్రీ వర్ణించారు. రాయబారానికి వచ్చిన శ్రీకృష్ణుణ్ని పట్టి బంధించబోయారు కౌరవులు. కృష్ణుడు కుపితుడయ్యాడు. 'మీ అందరను చంప ఒక్క 'నిమేష' మాత్రము చాలు నాకు... అయినను విధాత మీ నొసట వేరుగ లిఖించె' అని తమాయించుకున్నాడు. పై రెండు సందర్భాల్లోను నిమేషమంటే అరవై సెకండ్ల సుదీర్ఘ వ్యవధి కాదు. దాని నిడివి మహా అయితే ఒక్కక్షణం! జీవి పుట్టిన నిమేషంనుంచి ఆయువు లెక్క ఆరంభమవుతుందన్నది శివపురాణం. శివపురాణం లెక్కలో పదిహేను నిమేషాలు ఒక 'కాష్ఠ'. ముప్ఫై కాష్ఠలు ఒక కళ. ముప్ఫై కళలైతే అది ముహూర్తం. ముప్ఫై ముహూర్తాలు కలిసి ఒక అహోరాత్రం లేదా ఒక రోజు!
మహాభారతం శాంతిపర్వం సైతం ఇంచుమించు ఇదే కొలతను చెప్పింది.
తైత్తిరీయ ఉపనిషత్తు ప్రకారం పద్దెనిమిది నిమేషాలు ఒక కాష్ఠ. ముప్ఫై కాష్ఠలు ఒక కళ. ముప్ఫై కళలు ఒక క్షణం. ముప్ఫైఆరు క్షణాలను ఒక ముహూర్తంగా తైత్తిరీయం పేర్కొంది.
ఇవి కాక మన పెద్దలు లిప్త, లవం, త్రుటి వంటి మరీ సూక్ష్మమైన కొలతలను పాటించారు. లిప్త అంటే కనురెప్పపాటు. జనకుడికి పూర్వం మిథిలను పాలించిన 'నిమి' చక్రవర్తి పేరుమీద ఈ రెప్పపాటు వ్యవధికి 'నిమిషం'గా పేరొచ్చింది (రెప్పపాటు లేనివారు కనుక దేవతలు అనిమిషులయ్యారు).
వ్యాకరణ పరంగా చెబితే ఇది 'మాత్ర'. తామర రేకులను బొత్తుగా పెట్టి పదునైన సూదితో కసుక్కున పొడిస్తే ఒక రేకునుంచి మరో రేకుకు పట్టే సూదిమొన ప్రయాణ కాలాన్ని 'లవం' అన్నారు. అలాంటి లవాలు ముప్ఫై కలిస్తే అది త్రుటి. పత్రికల్లో 'త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం' అని రాస్తుంటారు. ఆ త్రుటి కొలత అది.
'ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు?' అని ప్రశ్నించాడొక సినీకవి. అక్కడ నిమిషం కొలత అనంతం. భవిష్యత్తులో ఏనాడో ఏదో సంఘటన జరిగే నిమిషానికే అది వర్తిస్తుంది. ఆ ప్రత్యేక నిమిషానికే విలువ. పోగొట్టుకొనే పక్షంలో అది మరీ పెరిగిపోతుంది. గుండెనొప్పి ప్రారంభమైనప్పటినుంచీ వైద్య సహాయం అందేదాకా ప్రతినిమిషం చాలా విలువైనది. ప్రతి నిమిషం గంటలా తోస్తుంది. చేజారిపోతున్న ఒక్కో క్షణం అప్పుడు విలువైనదే. అందుకే ఎంతో అమూల్యమైనదనే మాట పోగొట్టుకొనే కాలానికి మరీ వర్తిస్తుందన్నాడు ఒక పాశ్చాత్య తత్వవేత్త. 'పోగొట్టుకోబట్టే దానికా విలువ' అనీ అన్నాడాయన. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించబోమన్న అధికారుల పట్టుదలతో ఇటీవల చాలామందికి నిమిషం విలువ బాగా తెలిసొచ్చింది. కాకపోతే ఈ విషయంలో ఒకపేచీ ఉంది. అభ్యర్థి ఆలస్యమయ్యాడని నిర్ణయించడం ఏ గడియారం ప్రకారం సబబు? ఏ గడియారం ఈ విషయంలో ప్రామాణికం? 'లగ్నానికి ఇక మూడే నిమిషాలుంది' అని పురోహితుణ్ని హెచ్చరించాడు పెళ్ళిపెద్ద. 'నాది రేడియో టైం' అన్నాడాయన ధీమాగా! అప్పట్లో అది ప్రామాణికం. ఇప్పుడు టీవీ ఛానళ్లు, సెల్‌ఫోన్లు సమయాన్ని చూపిస్తున్నాయి. అయితే, తమ స్వయంప్రతిపత్తిని ప్రకటించడానికా అన్నట్లు అవి తలోసమయం చూపిస్తాయి. దేన్నిబట్టి అభ్యర్థి ఆలస్యమయ్యాడని నిర్ణయించగలం? 'పరీక్ష ఒత్తిడికన్నా సమయపాలనకు సంబంధించిన ఒత్తిడి మరీ తలనొప్పిగా ఉంది' అంటున్నారు తల్లిదండ్రులు. దానివల్ల ప్రశాంతంగా పరీక్ష రాసే అవకాశాన్ని తమ పిల్లలు కోల్పోతున్నారన్నది వారి బాధ. పరీక్షకు అనుమతి దొరకనివారి పరిస్థితి 'నీవు ఎక్కబోయే రైలు జీవితకాలం లేటు' అని ఆరుద్ర చెప్పినట్లయింది. 'ఇంకా నయం... ఆ అధికారులకు లిప్త, త్రుటి వంటివి తోచలేదు' అని ఒకాయన నిట్టూర్చడం దీనికి కొసమెరుపు!
(ఈనాడు, సంపాదకీయం, ౦౭:౦౬:౨౦౦౯)
______________________________
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి