1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

4, ఆగస్టు 2009, మంగళవారం

మట్టి వాసన

మట్టి వాసన


పసిపిల్లలకు అభం సుభం తెలియవు అంటుంది లోకం. 'భం' అంటే తార లేదా నక్షత్రం అని అర్థం. మంచి గుణాన్ని 'సు'గుణం అన్నట్లే, మంచి నక్షత్రాన్ని 'సు'భం అంటారు. సంపత్తార, మిత్రతార, క్షేమతార... వగైరాలు కలిసొచ్చే నక్షత్రాలు. సుభాలు. సుభానికి విరుద్ధమైనది 'అభం'. విపత్తార వంటి కీడు తెచ్చే నక్షత్రాలు అభాలు. ఈ తేడాలు, వివరాలు అంతగా తెలియవు కాబట్టి పసిపిల్లలను అభం సుభం ఎరుగనివాళ్ళని అనడం లోకంలో పరిపాటి. అభము సుభమ్ములం దెలియక ఆర్చెడి దేబెలు మాకు లెక్కయే?... అన్న తిరుపతి వేంకటకవుల ప్రయోగం ఈ అర్థంలోదే! అభం సుభం తెలియకపోవడమే బాల్యానికి అలంకారం. 'నా హృదయంలో నిదురించే చెలీ, పాటలో 'నీ వెచ్చని నీడ' అని ప్రయోగించారు కదా... నీడ ఎక్కడైనా వెచ్చగా ఉంటుందా?' అని శ్రీశ్రీని ఒక కుర్రవాడు ప్రశ్నించాడు. శ్రీశ్రీ అతణ్ని తేరిపార చూసి 'అభం సుభం తెలియని పసివాడివి... పెద్దయ్యాక నీకే తెలుస్తుందిలే' అని బదులిచ్చారు. పెద్దయ్యాక కన్యాశుల్కంలో గిరీశంలా తయారయ్యే అవకాశవాదులు సైతం బాల్యంలో అభం సుభం తెలియని పసివాళ్ళే కావడం ఈ సృష్టిలోని విశేషం. కల్లాకపటం ఎరుగని వయసు, కల్మషం తెలియని మనసు బాల్యానికి సహజసిద్ధమైన కవచకుండలాలు. తేడాలు పాటించకపోవడం అనేది బాల్యంలోనే సాధ్యం. ఒకే కంచం, ఒకే మంచం అనే మాట ఒక్క బాల్యానికే సరిగ్గా నప్పుతుంది. పక్కవాడి కంచంలోని వూరగాయను గబుక్కున తినేసి 'కావాలంటే నా నోరు చూడు' అని అడ్డంగా బుకాయించే బాల్యాన్ని భాగవతంలో అద్భుతంగా వర్ణించాడు బమ్మెర పోతన. అలాంటి నిష్కల్మషమైన పనులు పెద్దయ్యాక సాధ్యంకావు. అందుకే బాల్యం అమూల్యం! బాల్యంలో అనుభవాలు మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తాయని మనస్తత్వ నిపుణులు చెబుతారు. గాఢమైన చేదు అనుభవాలు ఆ వయసును గాయపరిస్తే- పెద్దయ్యాక ఆ వ్యక్తి సంఘ వ్యతిరేక శక్తిగా మారే అవకాశం బాగా ఎక్కువ.

చెరువుల్లో ఈతలు, నదీతీరాల్లో ఇసుక గూళ్ళు, జామచెట్లపై కోతి కొమ్మచ్చులు, మైదానాల్లో గాలిపటాలు, వర్షం నీటిలో కాగితం పడవలు, లేగదూడలతో సయ్యాటలు, తూనీగలతో సరాగాలు, పక్షులతో పరాచకాలు... ఇవీ మన సంప్రదాయ క్రీడావినోదాలు! కేవలం బాల్య వినోదాలే కావు- మనిషిలో కలివిడితనానికీ ఇవే పునాదులు. నేలతో నెయ్యం, నింగితో స్నేహం, నీటితో సావాసం, పంచభూతాలతో జట్టుకట్టడం, ప్రపంచంతో ప్రకృతితో కలిసికట్టుగా జీవించడం... ఇవే సిసలైన బాల్యానికి గీటురాళ్లు. మనిషితనానికి ఆనవాళ్ళు. నిజానికి లోకజ్ఞానం అక్కడినుంచే అలవడుతుంది. వికాసం అప్పుడే మొదలవుతుంది. బొమ్మల కొలువులు, వామన గుంటలు, గవ్వలాటలు, చెమ్మచెక్కలు, కాకి ఎంగిలి మామిడి ముక్కలపై ఉప్పూ, కారం అద్దుకు తినడం... వంటివి లేకపోతే బాల్యానికి అందమూ లేదు, అర్థమూ లేదు. అద్దాల మేడల్లో అబ్బురంగా పెరిగే అసూర్యంపశ్యలకు ఆ బాపతు బాల్యంతోను, కమ్మని మట్టివాసనతోను పరిచయం ఉండదు. ఒంటరిగా కూర్చుని నిత్యం యంత్రాలతో సావాసం చేసే పిల్లల శరీరాలు ఎదుగుతాయేగాని, మనసులు ఎదగవు. వెనకటికో ముని సుఖంగా తపస్సు చేసుకుంటుంటే హంతకుడొకడు వచ్చి తన పిడిబాకును దాచిపెట్టమని అడిగాడు. నిత్యం దాన్ని పరిశీలించడం, దాని గురించి ఆలోచించడం అలవాటై ముని స్వభావంలో క్రమంగా నేర ప్రవృత్తి అంకురించిన కథ మనకు తెలుసు. బాల్యంలో బొమ్మ పిస్తోళ్ళ ఆటలతోనే తప్ప సజీవమైన పిట్టల పాటలతో పరిచయం లేని పిల్లల విషయంలోనూ అదే జరుగుతుంది. మట్టిలో తెగ ఆడి ఒళ్ళంతా దుమ్ముకొట్టుకుపోయిన బాలకృష్ణుణ్ని చూస్తే- కైలాసంలో ఒంటినిండా విభూది పూసుకున్న శివుడు గుర్తొచ్చాడు పోతన్నకు! బయట నుంచి వచ్చినప్పుడల్లా రకరకాల కాలుష్యాలు పులుముకుని వస్తున్న పిల్లలను చూస్తుంటే దెయ్యాలు గుర్తొస్తున్నాయి మనకు!

ఇసుకతో గుడి కడతారు... తీరిగ్గా అలంకారాలు అద్దుతారు... తోచినంతసేపూ హాయిగా ఆడుకుంటారు... పొద్దుపోయేసరికి కట్టడాలను చులాగ్గా కూలగొట్టి పిల్లలు నిశ్చింతగా ఇంటిదారి పడతారు. బెంగలూ దుఃఖాలూ ఏమీ ఉండవు. సృజనాత్మకత అనే కాదు, మనిషిలో తాత్విక స్వభావానికీ అంకురారోపణ జరిగే సన్నివేశమది. నిర్జీవమైన యంత్రాలతో ఆట నైరాశ్యాన్ని నింపుతుంది. సజీవమైన పశువులతో, పక్షులతో ఆడుకునే పిల్లల హృదయాల్లో మానవీయ విలువలు స్థిరపడతాయి. అందుకే మన పెద్దలు సాహిత్యంలో సైతం విరివిగా జంతువులను సృష్టించారు. పశువూపక్షీ పిల్లామేకా పెట్టాపుంజూ చెట్టూచేమా- అన్నీ మనిషికి తోబుట్టువులేనన్న భావాన్ని మనసుల్లోకి చొప్పించారు. అవీ మానవ పరివారంలో భాగమేనని బోధించారు. పెంపకంలోనూ, సాహిత్యం ద్వారానూ ప్రకృతితో మనిషి బంధాన్ని పటిష్ఠం చేశారు. అలాగే జంతువుల బొమ్మలను ఆట వస్తువులుగా అందించారు. ఈ రకమైన సంప్రదాయ క్రీడావిధానాలు, ఆట వస్తువుల మూలంగా మనిషి వికాసానికి ఎంతో మేలు జరుగుతోందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన బాల్య వికాస నిపుణుడు, మనస్తత్వవేత్త డాక్టర్‌ జాన్‌ జురైదిని పరిశోధనలో తరతరాల సంప్రదాయ ఆటపాటలు మనిషిలో సృజనాత్మకతకు, వికాసానికి, చలాకీతనానికి కారణం అవుతున్నాయని తేలింది. ఎలక్ట్రానిక్‌ ఆట వస్తువులు, కంప్యూటర్‌ క్రీడలు- పిల్లల్లోని భావుకతకు, ఊహాశాలితకు హానిచేస్తున్నాయనీ రుజువైంది. పిల్లల్లో నేరప్రవృత్తికి అవి దోహదపడుతున్నాయని డాక్టర్‌ జాన్‌ ప్రకటించారు. మరో శాస్త్రవేత్త కారెన్‌ స్టాగ్నిటి సంప్రదాయ క్రీడారీతులు, ఆటపాటలు, వస్తువులు- పిల్లలకు సహజత్వాన్ని నేర్పుతున్నాయన్నారు. సామాజిక జీవన కౌశలం, భాషాపటిమ, సమగ్రవికాసం వంటివాటికి అవే పునాదులుగా చెబుతున్నారు. ఎంతసేపూ పిల్లలను మేధావులుగా తీర్చిదిద్దాలని తపించే తల్లిదండ్రులు ఇకపై వారిని సమర్థులుగా రూపొందించే ప్రయత్నాలు చెయ్యాలన్నది వారందరి హెచ్చరిక!

కామెంట్‌లు లేవు: