మనిషి- మనసు
- డాక్టర్ డి.చంద్రకళ
మనిషి ఎంత ఎత్తు ఎదిగినా మనసు చేతిలో మాత్రం కీలుబొమ్మే. మనసు మనిషిని గొప్పవాడిగానూ చెయ్యగలదు, అధఃపాతాళానికి తోసెయ్యనూగలదు. బహు చంచలమైన మనసు మనిషిని ఇంద్రియ సుఖాలవైపు లాగి పతనావస్థకు చేరుస్తుంది. మనిషి తన వివేకంతో కోరికలనే గుర్రాలకు బుద్ధి అనే కళ్ళెం వేసి మంచి మార్గంవైపు నడిపించాలి.
'ఎవరు వివేకంతో తన మనసును తాను జయిస్తాడో ఆ గెలిచిన మనసు తనకు బంధువవుతుంది, ఓడిపోతే అదే తన అంతశ్శత్రువవుతుంది' అనేది శ్రీకృష్ణుని గీతావచనం.
ఒక రాజ్యంలో సేనాధిపతి హఠాత్తుగా మరణించాడు. ఇంకొకరిని నియమించడంకోసం పోటీ తలపెట్టారు. ఆ పోటీలో అన్ని పరీక్షలకు నిలబడి గెలిచినవారు ముగ్గురు. ఎవరిని నియమించాలా అని సందిగ్ధంలో పడ్డారు రాజుగారు. వారిని పిలిపించి 'మీ ముగ్గురూ పరీక్షల్లో నెగ్గారు. అయినా ఒక్కరే విజేతగా మిగలాలి... దానికి రేపే ఆఖరి పరీక్ష. ఈ రాత్రికి మీరు నా అతిథులు, మా విందును స్వీకరించాలి' అని పెద్దయెత్తున ఏర్పాట్లు చేశారు. రకరకాల మధుపానీయాలు, ఘుమఘుమలాడే వంటకాలు, నాట్యంకోసం నర్తకీమణులు- విందు, వినోదం జోరుగా సాగుతున్నాయి. ఇంతలో పదిమంది ముసుగు మనుషులు చొరబడి రాజును చుట్టుముట్టారు. పోటీకి నిలిచినవారిలో ఒక యువకుడు మత్తులో మునిగి ఉన్నాడు. మరొక యువకుడు నర్తకీమణులతో నాట్యంచేస్తూ తన్మయత్వంలో ఉన్నాడు. మూడో యువకుడు మాత్రం వెంటనే కార్యోన్ముఖుడై ముసుగు మనుషుల్ని ఎదుర్కొని వారు వెన్ను చూపేలా చేశాడు. రాజుగారు చప్పట్లు కొడుతూ 'శభాష్! నేను పెట్టిన ఆఖరి పరీక్షలో గెలిచింది నువ్వే. నిన్ను నా రాజ్యానికి సేనాధిపతిగా నియమిస్తున్నాను' అన్నాడు. మనిషి ఎంత వీరుడు, శూరుడు అయినా మనసు పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి అనేది ఈ కథలోని నీతి.
మనసు రెండు తలల పాములాంటిదంటారు పెద్దలు. ఒకటి ధర్మంవైపు నడిపిస్తుంది. మరొకటి అధర్మం వైపు లాగుతుంది. ఈ రెంటి మధ్య సంఘర్షణే మనిషిని ఆందోళనకు గురిచేస్తుంది. శరీరాన్ని బలహీనపరుస్తుంది. వీటిని సమన్వయపరచేదే వివేకం. ఇది మంచి చెడులను విశ్లేషించి బాధ్యతగల వ్యక్తిగా తయారుచేసి కుటుంబానికి, సంఘానికి ఉపయోగపడేలా చేస్తుంది.
(ఈనాడు, అంతర్యామి, ౨:౦౮:౨౦౦౯)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి