మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న,చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులోపొందుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
4, ఆగస్టు 2009, మంగళవారం
'గెలుపు' పుస్తకాల జాతర!
'గెలుపు' పుస్తకాల జాతర!
ఒంటరితనంతో బాధపడిపోతుంటే 'స్నేహితుల్ని సంపాదించుకోవడం ఎలా' అనే పుస్తకం చదవండి. ఏకాంతాన్ని ఆస్వాదించడం ఎలా?' అనే పుస్తకాన్ని ముందేసుకోండి. ఆ పుస్తకాల దొంతర్లలో దేన్ని ఎంచుకోవాలో అర్థంకానప్పుడు, 'మంచి పుస్తకాన్ని ఎంచుకోవడం ఎలా?' ఉండనే ఉంది.
సాహిత్య స్వభావమే వికాసం.
ఎంత చిన్న పుస్తకమైనా, ఎంత చెత్త పుస్తకమైనా...అందులోంచి నేర్చుకోవాల్సిందీ తెలుసుకోవాల్సిందీ ఎంతోకొంత ఉంటుంది.
ఆ పరిజ్ఞానం వ్యక్తిత్వ నిర్మాణంలోనూ పనికొస్తుంది.
అలాంటప్పుడు...ప్రత్యేకంగా వ్యక్తిత్వ వికాస సాహిత్యమెందుకు?
సమాధానం సిద్ధంగానే ఉంది.
సముద్ర గర్భంలోని నిధినిక్షేపాల్ని వెలికితీయడానికి బలంగా వల విసిరినప్పుడు అందులో చేపలు పడొచ్చు, రాళ్లూరప్పలు పడొచ్చు, తిమింగలాలు పడొచ్చు, అదృష్టం బావుంటే ...బంగారవో వజ్రాలో పడొచ్చు. కానీ, అవకాశాలు అంతంతమాత్రమే.
అదే...పారాతట్టా పట్టుకుని ఏ వజ్రాల గనికో వెళ్తే?
తవ్వేకొద్దీ అమూల్య సంపదే!
వ్యక్తిత్వ వికాస గ్రంథాలకూ మిగతా సాహిత్యానికీ ఉన్న తేడా కూడా ఇలాంటిదే. వంద పేజీలో రెండొందల పేజీలో ఉన్న పుస్తకాన్ని ఆ చివర్నుంచి ఈ చివరిదాకా చదివితే, అందులో మనకు ఉపయోగపడే విషయం ఏ మూలో ఏ కొంతో ఉండొచ్చు. లేదంటే, రచయిత పైపైన చర్చించి వదిలేసి ఉండొచ్చు. ఆకలిమీదున్నవాడికి అరటిపండేం సరిపోతుంది? ఇష్టమైన రుచులన్నీ ముందుపెట్టాలి. అలాంటిపనే వ్యక్తిత్వ వికాస సాహిత్యం చేస్తుంది. ఇదోరకంగా బఫే టైపు భోజనం లాంటిది. మనం తినాలనుకున్న వంటకం దగ్గరికెళ్లి, కావలసినంతా పళ్లెంలో పెట్టేసుకోవడమే.
నోట్లో నాలుకలేదని తెగ బాధపడిపోతున్న వాళ్లంతా...నేరుగా 'అందర్నీ ఆకట్టుకునేలా మాట్లాడటం ఎలా?' పుస్తకాన్ని శ్రద్ధగా చదువుకోవచ్చు. వాగుడుకాయలు 'సెలెబ్రేటింగ్ సైలెన్స్'లోని ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. వూబకాయం ఆత్మవిశ్వాసాన్ని ఆబగా మింగేస్తుంటే, 'డోంట్ లూజ్ యువర్ మైండ్, లూజ్ యువర్ వెయిట్' ముందేసుకోవచ్చు. మధ్యతరగతి కష్టాలమీద చచ్చేంత కోపముంటే 'హౌ టు బికమ్ ఎ బిలియనీర్' తరహా పుస్తకాన్ని బట్టీపట్టొచ్చు. వీటిలో ఓ సౌలభ్యం ఉంది. సూటిగా సుత్తిలేకుండా... నేరుగా విషయంలోకే వెళ్లిపోవచ్చు. ప్రతి అక్షరం, ప్రతి పేజీ, ప్రతి అధ్యాయం...చివరి అట్టదాకా కట్టలకొద్దీ సమాచారం. 'ఒక చెట్టు నుంచి లక్ష అగ్గిపుల్లలు తయారుచేయెుచ్చు. కానీ లక్ష చెట్లను నాశనం చేయడానికి ఒక పుల్ల సరిపోతుంది. అలాగే, లక్ష మంచి ఆలోచనల్ని ఒక దురాలోచన నాశనం చేయగలదు. దాన్ని ఆపే శక్తి పుస్తకానికుంది' అంటారు వ్యక్తిత్వ వికాస నిపుణుడు వంగీపురం శ్రీనాథాచారి.
ఆ గుణమే... వ్యక్తిత్వ వికాస సాహిత్యాన్ని పాఠకులకు దగ్గర చేసింది. రచయితలు కూడా ఆషామాషీగానో మిడిమిడి జ్ఞానంతోనో రాయడం లేదు. ఏ విషయాన్ని పట్టుకున్నా అంతు చూసేదాకా వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా ఆ స్ఫూర్తిదాయక శైలి, ఉత్ప్రేరకాల్లాంటి వాక్యాలు, విజయకాంక్ష రగిలించే ఉదాహరణలు...పాఠకుడిలో ఏదో సాధించితీరాలన్న ఆలోచన రేకెత్తిస్తాయి. బలహీనతల్ని గెలవాలన్న పట్టుదల పెంచుతాయి. చివరి పేజీ తిరగేసేలోపు అంతిమ లక్ష్యం నిర్ణయమైపోతుంది. ఇక తడఅబాతుండాడు. తప్పటడుగులుండవు. రివ్వున దూసుకెళ్లిపోవడమే.
అనుభవసారం...
...అంత మహత్తు ఉంది కాబట్టే, ఇంత గిరాకీ. 'క్రాస్‌వర్డ్' పుస్తకాల దుకాణం 'బెస్ట్ సెల్లర్స్' జాబితాలో సగానికి పైగా వ్యక్తిత్వ వికాస గ్రంథాలే. అమ్ముడుపోతున్న పది పుస్తకాల్లో ఆరేడుదాకా 'సెల్ఫ్ హెల్ప్' గైడ్లే. అనువాదాలకైతే లెక్కేలేదు. దశాబ్దాల నాటి డేల్‌కార్నీ 'హౌటు...' తరహా పుస్తకాలు కూడా...ఇప్పుడే మార్కెట్లోకి వచ్చిన తాజాతాజా సరుకుతో పోటీపడుతున్నాయి.
అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ వాళ్లు ఈ పదేళ్ల కాలాన్ని వ్యక్తిత్వవికాస దశాబ్దమని ప్రకటించినా, నిజానికిది వ్యక్తిత్వ వికాస సాహిత్య దశాబ్దం.
ఒక్క స్టీఫెన్ కోవే 'సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్' పుస్తకమే ప్రపంచ వ్యాప్తంగా రెండుకోట్ల కాపీలు అమ్ముడుపోయింది. అనధికార ముద్రణలూ నకిలీలూ అంతకు నాలుగైదు రెట్లు. కోవే పుస్తకంతో పోల్చలేం కానీ, మిగతా వ్యక్తిత్వ వికాస పుస్తకాలూ బాగానే అమ్ముడుపోతున్నాయి. ఆ గొప్పదనమంతా పుస్తకాలకే ఆపాదించలేం. రచయితలకూ వాటా ఇవ్వాలి. వాళ్లేం కాలక్షేపానికి రాయడంలేదు. గాలి పోగేయడంలేదు. వూహల్నీ భ్రమల్నీ కలగాపులగం చేయడంలేదు. అనుభవించి రాస్తున్నారు. ఆ పుస్తకం రాయడానికే అనుభవిస్తున్నారు 'ఎ ఇయర్ టు లివ్' రచయిత స్టీఫెన్ లెవిన్ దంపతులు ఓ ఏడాది జనవరి ఒకటిన 'జీవితంలో ఇదే చివరి సంవత్సరం అనుకుని బతకాలి' అని తీర్మానించుకున్నారు. చివరి పుట్టిన రోజు, చివరి పెళ్లిరోజు, చివరి సినిమా, చివరి సూర్యోదయం, చివరి వెన్నెల...ఒక్కసారి వూహించుకోండి! ఏదైనా దూరమౌతున్నప్పుడే దగ్గరితనం అనుభవంలోకి వస్తుంది. మరణానికి మానసికంగా సిద్ధమవుతున్నప్పుడే జీవితంలోని అందం, ఆనందం అర్థమవుతుంది. ఒక్క ఏడాది కాలంలో తనలో వచ్చిన మార్పుల్ని విశ్లేషిస్తూ స్టీఫెన్ రాసిన 'ఎ ఇయర్ టు లివ్'... ప్రపంచ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించింది.
లాఫ్లే, రామ్‌చరణ్ ఏ ఫైవ్‌స్టార్ హోటల్లోనో సేదతీరుతూ 'ద గేమ్ ఛేంజర్' అల్లేయలేదు. 'ప్రోక్టర్ అండ్ గాంబిల్'ను తిరుగులేని సంస్థగా తీర్చిదిద్దిన అనుభవంతో రాశారు. 'మార్పు అనివార్యమైన గ్లోబల్ వాతావరణంలో...ఏ సంస్థనైనా ఏ వ్యక్తినైనా కొత్త ఆలోచనలొక్కటే కాపాడగలవు, సృజనే గెలిపించగలదు' అంటారీ రచయితలు. కంపెనీకి ఏ మేనేజింగ్ డైరెక్టరో అధినేత అనుకుంటే పొరపాటే, ఖాతాదారుడే అసలైన యజమాని... అన్నది వీళ్ల సిద్ధాంతం. కార్పొరేట్ ఆటతీరును మార్చే ఈ పుస్తకాన్ని రాయడానికి కొన్నేళ్లు పట్టింది. 'ఛేంజ్ యువర్ థాట్స్... ఛేంజ్ యువర్ లైఫ్' రచయిత... డయర్ తన మార్పు సిద్ధాంతాన్ని ఆవిష్కరించడానికి తపస్సులాంటిదే చేశారు. చైనా బౌద్ధ సిద్ధాంతాల ఆధారంగా రాసిన ఆ పుస్తకం కోసం...లావో ట్జూ అనే తాత్వికుడి రచనల్ని అధ్యయనం చేస్తూ సాధన చేస్తూ ఏడాదిపాటు ప్రపంచానికి దూరంగా ఉన్నారు. ఓ సర్వసంగ పరిత్యాగిలా వితాన్ని గడిపారు. 'ఎక్స్‌క్యూజెస్ బిగాన్' పేరుతో 'సాకులు
మా నేయడం ఎలా' తరహా చిట్కాల మీద ఆయన రాసిన సరికొత్త గ్రంథం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తోంది. కొన్ని వ్యక్తిత్వ వికాస గ్రంథాలు పన్లోపనిగా వ్యవస్థలోని లోపాల్నీ కడిగేస్తున్నాయి. 'ఇఫ్ యు వాంట్ టుబి రిచ్ అండ్ హ్యాపీ... డోంట్ గోటు స్కూల్' అని సలహా ఇస్తారు రాబర్ట్ టి. కియోసకీ. 'ఈ చదువులు జీవితాన్ని ఎదుర్కోవడం నేర్పించవు. సంక్షోభాల్ని తట్టుకోవడం నేర్పించవు. సంతోషంగా ఉండటమూ నేర్పించవు. అలాంటప్పుడు చదువులతో మనకేం పని' అన్నది ఆయన అభిప్రాయం. ఆ లోపాన్ని అధిగమించి ఆర్థికంగా భావోద్వేగపరంగా...ఎలా ఎదగొచ్చన్నదే కియోసకీ పుస్తక సారాంశం.
కొత్తకొత్తగా...
విషయాన్ని కొత్తగా తాజాగా చెప్పడంలో వ్యక్తిత్వ వికాస రచయితల తర్వాతే ఎవరైనా. 'కాన్వర్జేషన్స్ విత్ గాడ్' సంగతే తీసుకోండి. డోనాల్డ్ వాల్ష్‌కీ దేవుడికీ మధ్య జరిగిన సంభాషణ అది. జీవితం మీద విసిగి వేసారిపోయిన రచయిత...ఒకానొక సమయంలో దేవుణ్ని నిలదీస్తూ ఓ కాగితం మీద ఏవో కొన్ని ప్రశ్నలు రాస్తాడు. ఏదో అదృశ్య శక్తి అతని మనసుకు జవాబులిస్తుంది. ఇదే పద్ధతిలో దాదాపు డజను పుస్తకాలు రాశారు. అన్నీ విజయవంతం అయ్యాయి.
రెండేళ్ల క్రితం విడుదలైన రాండా బైర్న్ 'సీక్రెట్' వ్యక్తిత్వ వికాస సాహిత్య చరిత్రలోనే ఓ గొప్ప సంచలనం. నువ్వు సాధించాలనుకున్నదేదో సాధించాలంటే కష్టపడనక్కర్లేదు, శ్రమపడనక్కర్లేదు. ప్రగాఢంగా కోరుకుంటే చాలు. దానంతట అదే నీ ముందు వాలిపోతుంది...అంటారు రచయిత. 'మీరో అయస్కాంతం లాంటివారు. మీలో సానుకూల దృక్పథం ఉంటే, విశ్వంలోంచి పుట్టుకొచ్చే సానుకూల తరంగాలు ఆ ఆలోచనల్ని ఆకర్షించి... మన పనుల్ని సానుకూలంగానే చక్కబెడతాయి. వ్యతిరేక ఆలోచనలుంటే... వ్యతిరేక తరంగాలే వస్తాయి'... 'సీక్రెట్' వెుత్తం ఈ ఆలోచన చుట్టే తిరుగుతుంది. ఐదువందల రూపాయల విలువచేసే ఈ పుస్తకం భారత్‌లోనే దాదాపు లక్ష కాపీలు అమ్ముడుపోయింది. అమెరికాలో పదిహేను లక్షల కాపీలు హాట్‌కేకుల్లా ఖర్చయిపోయాయి. అదే స్థాయిలో విమర్శలూ వచ్చాయి. ఇలాంటి పుస్తకాలు మనిషిని బద్ధకస్తుణ్ని చేస్తాయంటూ హేతువాదులు విమర్శలకు దిగారు.
ఓ డెబ్భై ఏళ్ల క్రితం తొలితరం వ్యక్తిత్వ వికాస గ్రంథాలు పుట్టుకొస్తున్నప్పుడూ ఒకట్రెండు విమర్శలు వినిపించాయి. 'ఎదుటి మనిషిని మాటలతో బురిడీ కొట్టించడమెలా? పీకలోతు కోపమున్నా నవ్వుతూ మాట్లాడటం ఎలా? నలుగుర్లో గొప్పవాడు అనిపించుకోవడం ఎలా?...ఇలాంటి ఇతివృత్తాలతోనే పుస్తకాలొచ్చేవి. మనం ఎదగడం, మనం ఆలోచించడం కంటే...ఎదుటివాళ్లని ప్రభావితం చేయడం మీదే రచయితలు దృష్టిపెట్టేవారు. ఇది తొలి దశ. దీనికి పితామహుడు డేల్‌కార్నీ. రెండో దశలో... రచయితలందరూ భౌతిక విజయం మీదే దృష్టిపెట్టారు. అదే మనిషి గొప్పదనానికి కొలమానమైంది. అసలైన వ్యక్తిత్వ వికాస సాహిత్యం వెుదలైంది మూడో దశలోనే. గెలుపొక్కటే కాదు, ఎలా గెలిచామన్నదీ ముఖ్య విషయమైంది. ఎంత జీతమిస్తున్నావన్నది కాదు, ఉద్యోగుల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావన్నది కొలమానమైంది. ఎన్ని కోట్లు సంపాదించావన్నది కాదు, ఎంత నిజాయతీగా సంపాదించావన్నది చర్చనీయమైంది. బలహీనతల్ని కప్పిపుచ్చుకుని నలుగుర్లో వెలిగిపోవడం కాదు, ఆ బలహీనతల్ని జయించడమెలాగో చెప్పడం వెుదలుపెట్టారు. వ్యక్తిత్వ వికాస సాహిత్యంలోనూ చాలా మార్పులొచ్చాయి. అట్టడుగు స్థాయి నుంచి వచ్చి అద్భుతాలు సాధించిన బిల్‌గేట్స్, బఫెట్ లాంటి వాళ్ల జీవితాలు ఉదాహరణలై నిలిచాయి' అంటూ వికాస సాహిత్యంలోని వివిధ దశల్ని వివరిస్తారు రచయిత సి.నరసింహారావు. ఈ దశలోనే 'ఎదుగు-ఎదగనివ్వు' అన్న సిద్ధాంతాన్ని నమ్మిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, 'విప్రో' ప్రేమ్‌జీ లాంటి వాళ్లు అసలైన విజేతల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. వాళ్ల జీవితాలే విజయ సూత్రాలుగా పుస్తకాలొచ్చాయి. 'విన్నర్ నెవర్ ఛిట్స్' తరహాలో విలువలకు విలువ ఇచ్చే గ్రంథాలు చాలా పుట్టుకొచ్చాయి.
ఇప్పుడొస్తున్న సాహిత్యమంతా నైతిక విలువల చుట్టే తిరుగుతోంది. డబ్బు, పేరు ప్రఖ్యాతులు, అవార్డులు.. ఉప ఉత్పత్తులు మాత్రమే. వికాసమే గొప్ప విజయం అని చెబుతున్నాయి మూడోతరం రచనలు. చెమటోడ్చడంకంటే, సరికొత్తగా ఆలోచించడం ముఖ్యమంటున్నాయి. విజేతలు భిన్నమైన పనులు చేయరు, అందరూ చేసే పనుల్నే భిన్నంగా చేస్తారని తేల్చేశాయి. స్టీఫెన్ కోవే అయితే 'నీ అలవాట్లే నీ తలరాత' అంటూ కుండ బద్దలు కొట్టేశారు. వ్యక్తిగత స్థాయిలో బద్ధకం, పిరికితనం, సానుకూల దృక్పథం లేకపోవడంలాంటి సమస్యల్ని అధిగమించాలనుకునేవారి కోసమూ బోలెడు పుస్తకాలొచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఏ 'వాల్డెన్'కో, 'క్రాస్‌వర్డ్'కో వెళ్తే...ఇలాంటి పుస్తకాలకే ఒకట్రెండు అరలు ఎక్కువ ఉంటాయి. పాఠకులూ ఆ చుట్టుపక్కలే తచ్చాడుతుంటారు. ఈ అంతర్జాతీయ ధోరణిలో మనకీ వాటా ఉంది. రాబిన్‌శర్మ, శివ్‌ఖేరా, దీపక్‌చోప్రా లాంటివాళ్లు...రాస్తున్న పుస్తకాలు విదేశీ పాఠకుల్నీ ఆకట్టుకుంటున్నాయి. భారతీయ కర్మ సిద్ధాంతం, విలువలు, గీత...అంతర్జాతీయ ఆవోదాన్ని పొందుతున్నాయి. వ్యక్తిత్వ వికాసానికీ ఆధ్యాత్మికతకూ కొత్తచుట్టరికం కలిసింది. శివ్‌ఖేరా, అరిందమ్‌చౌదరి లాంటివారు కృష్ణుడినీ భీష్ముడినీ ఆంజనేయుడినీ...మేనేజ్‌మెంట్ పాఠాల్లో హీరోల్ని చేశారు. దీపక్‌చోప్రా రచనలకైతే భారతీయతే పునాది. సుఖబోధానంద, రవిశంకర్, జగ్గీవాసుదేవ్ వంటి ఆధ్యాత్మిక గురువుల రచనలు కూడా వ్యక్తిత్వ వికాస సాహిత్యంకోవలోకే వస్తున్నాయి. బౌద్ధ గురువు దలైలామా 'డిస్ట్రక్టివ్ ఎవోషన్స్' కూడా ఆ అరల్లోనే చోటు సంపాదించుకుంది.
మన వికాసం...
భారతీయులకు పాశ్చాత్య వికాస గ్రంథాల అవసరమే లేదని వాదించేవారూ ఉన్నారు. మన వేదాలు మనకున్నాయి. మన పురాణాలు మనకున్నాయి. మన ఉపనిషత్తులు మనకున్నాయి. మన గీత మనకుంది. ప్రపంచంలో ఏ వ్యక్తిత్వవికాస సాహిత్యంలోనూ లేనన్ని గొప్పగొప్ప విషయాలు అందులో ఉన్నాయి. 'అనోభద్రాః క్రతవోయస్తు సర్వతః' అంటుంది రుగ్వేదం. అంటే... అన్ని వైపుల నుంచి అన్నివిషయాల నుంచి మంగళకరమైన శుభప్రదమైన ఆలోచనలు మాకు కలగాలి అని!
ఆధునికులు కలవరిస్తున్న 'కొత్త ఆలోచనల్ని'...మనమెప్పుడో స్వాగతించాం! స్టీఫెన్ కోవె 'డిజైర్', 'నాలెడ్జ్', 'స్కిల్' అంటూ చర్చకుపెట్టిన విషయాల్ని లలితా సహస్రనామం 'ఇచ్ఛాశక్తి, 'జ్ఞానశక్తి', 'క్రియాశక్తి'...అని వేల ఏళ్లక్రితమే నిర్వచించింది.
చిన్నయసూరి నీతి చంద్రిక కథారూపంలో వ్యక్తిత్వ ప్రాధాన్యాన్ని వివరించే అద్భుత గ్రంథం. స్వామి వివేకానంద ఉపన్యాసాల్లోని స్ఫూర్తి ఏ విదేశీ గ్రంథాల్లోనూ లేదు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 'మార్గదర్శి'... 1928 ప్రాంతంలోనే వచ్చిన అద్భుత వ్యక్తిత్వ వికాస గ్రంథం. తువ్వాళ్లు, అంగవస్త్రాలు అమ్ముకునే కుర్రాడు...ఓ పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగే క్రమాన్ని స్ఫూర్తిదాయకంగా వివరించారాయన.
నిజమే, కుటుంబ విలువలు, సంప్రదాయాలు...మన స్వభావాల మీదా ప్రవర్తన మీదా ప్రభావం చూపుతున్నంత కాలం.. మనకు ప్రత్యేకంగా వ్యక్తిత్వ వికాస గ్రంథాల అవసరమే రాలేదు. అమ్మ ఏ వేమన పద్యాలతోనో విలువల వికాస పాఠాలు వెుదలుపెట్టేది. నాన్న చిటికెనవేలు పట్టుకుని నడిపిస్తూ... జీవన వికాస పాఠాలు చెప్పేవారు. పురాణ పఠనాలూ హరికథలూ...
నీతినీ లోకరీతినీ బోధించేవి. మన నడకనీ నడతనీ కనిపెట్టుకుని, మంచిచెడులు చెప్పడానికి పటాలమంత బంధుగణముండేది. రేపటి గురించి భయపడే పరిస్థితులు లేవు కాబట్టి, విజయాల కోసం ఉరుకుల్లేవు. సిరితావచ్చిన వచ్చును...అన్నట్టు సమర్థుడిని విజయమే వెతుక్కుంటూ వచ్చేది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయాక...మన జీవితాలకు మనమే బాధ్యులమైపోయాం. ప్రపంచికరణ పుణ్యమాని అభద్రతా ప్రవేశించింది. అదే సమయంలో ప్రాచిన సాహిత్యంలోని మంచిని గ్రహించి అన్వయించుకోగల ఓపికా తీరికా పాండిత్యం... కొత్తతరాలకు లేకుండా పోయింది. సరిగ్గా ఈ నేపథ్యంలో... మనదేశంలోనూ వ్యక్తిత్వ వికాస గ్రంథాలకు గిరాకీ పెరిగింది. రచనలు పెరిగాయి. దిగుమతులూ పెరిగాయి. దాంతోపాటే తాలు సరుకూ పెరిగింది.
'మన గోడలకి పగుళ్లు వచ్చాయనుకోండి. ఆ సమస్య నుంచి బయటపడటానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి...గోడలకు నల్లరంగు వేస్తే సరిపోతుంది. పగుళ్లు కనబడవు. ఎవరూ నవ్వుకోరు. తాత్కాలికంగా పరిష్కారమైనట్టే అనిపిస్తుంది. కానీ అసలు సమస్యంతా నిర్మాణంలో ఉంది. దాన్ని సరిచేసుకోవడమన్నది శాశ్వత పరిష్కారం. చాలా వ్యక్తిత్వ వికాస గ్రంథాలు...ఇంటికి నల్లరంగు వేసినట్టు, తాత్కాలిక పరిష్కారాలే సూచిస్తాయి' అంటారు మేనేజ్‌మెంట్ నిపుణులు సి.ఎల్.ఎన్.మూర్తి. నిజమే, మంచి పుస్తకాన్ని ఎంచుకోవడమూ ఓ కళే. ఒకట్రెండు చెత్త పుస్తకాలు చదివాక కానీ, ఆ కళ ఒంటబట్టదు. ఆ అనుభవమూ వ్యక్తిత్వ వికాసంలో భాగమే!
ఆల్కెమిస్ట్
నీలో బలంగా ఉంటే, దాన్ని నిజం చేయడానికి విశ్వం కుట్ర పన్నుతుంది. అందుకు అనువైన పరిస్థితుల్ని సృష్టిస్తుంది. ఆ దిశగా నిన్ను నడిపిస్తుంది. మనం చేయాల్సిందల్లా ఒకటే మనసు మాట వినడం, ఆ సంకేతాల్ని అర్థంచేసుకోవడం...ఇదీ క్లుప్తంగా పాలో కోయిలో 'ఆల్కెమిస్ట్' సారాంశం. ప్రపంచంలో లిపి ఉన్న ప్రతిభాషలోకీ ఈ పుస్తకాన్ని అనువదించుకున్నారు.
యు కెన్ విన్
విజేతలు భిన్నమైన పనులు చేయరు. ఏ పని చేసినా భిన్నంగా చేస్తారు. టాగ్‌లైనే అద్భుతంగా ఉంది కదూ! పుస్తకం ఇంకా అద్భుతంగా ఉంటుంది. శివ్‌ఖేరా తనదైన సహజ గంభీరశైలిలో రాశారీ పుస్తకాన్ని. విజేత పరిష్కారంలో భాగంగా ఉంటాడు. పరాజితుడు సమస్యల్లో ఒకడైపోతాడు. విజేత ఆ పని చేసితీరతానని చెబుతాడు. పరాజితుడు ఆ పని అయితే బావుండునని వెుక్కుకుంటాడు. పరాజితుడు విజేత కావడం ఎలాగో శివ్‌ఖేరా వివరించారు.
ద మాంక్ హూ సోల్డ్...
ఆనందం ఆడంబరంలో లేదు, నీ ఆలోచనల్లో ఉందని చెబుతారు రాబిన్ శర్మ. వూరంత బంగళా పడవంత కారూ లెక్కపెట్టలేనన్ని ఆస్తిపాస్తులూ ఉన్న ఓ న్యాయవాది ఎవరికీ చెప్పకుండా... భారతదేశానికొస్తాడు. గురు సాంగత్యంలో ఆధ్యాత్మికానందాన్ని పొందుతాడు. భౌతిక విజయాల్లోనే ఆనందముందనీ డబ్బులోనే సర్వస్వముందనీ భ్రమపడేవారంతా చదివితీరాల్సిన పుస్తకం.
సెవెన్ స్పిరిచ్యువల్ లాస్...
ఆధ్యాత్మికతకూ విజయానికీ ముడిపెట్టి రాశారు దీపక్‌చోప్రా. ఆయన మీద జిడ్డు కృష్ణమూర్తి ఉపన్యాసాల ప్రభావం కనిపిస్తుంది. వేదాంతాన్నీ భగవద్గీత శ్లోకాల్నీ తరచూ ప్రస్తావిస్తారు. మనం లక్ష్యాల్ని సాధించడానికి నిరంతరం శ్రమిస్తాం. సర్వశక్తులూ ధారపోస్తాం. అనుకున్నదేదో సాధించేసరికి నిస్సత్తువ ఆవరిస్తుంది. అలా కాకుండా ఉత్సాహంగా ఆనందంగా...లక్ష్యం దిశగా ప్రయాణం సాగించడం ఎలాగో ఈ పుస్తకంలో చెప్పారు.
సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్...
నీ అలవాట్లే నీ విధి రాతలంటూ స్టీఫెన్ కోవె రాసిన ఈ పుస్తకం వ్యక్తిత్వ వికాస సాహిత్య ప్రపంచంలో ఓ కుదుపు. ఒక్క పుస్తకంతో అతను కుబేరుడైపోయారు. కొనసాగింపుగా ఆరేడు పుస్తకాలు రాశారు. 'సెవెన్ హ్యాబిట్స్...'కు బోలెడు అనువాదాలూ అనుకరణలూ వచ్చాయి. పునర్ముద్రణలకైతే లెక్కేలేదు. కోవే చెప్పిన ఆ ఏడు సూత్రాల్నీ అలవాట్లుగా మార్చుకుంటే తిరుగే ఉండదని ప్రపంచమంతా ఆవోదించింది.
కౌంట్ యువర్ చికెన్స్...
కోడిపెట్ట బుట్టలోని గుడ్లని పొదగకముందే, కోడి పిల్లల్ని లెక్కబెట్టుకోమంటున్నారు అరిందమ్ చౌదరి. వ్యక్తిగత అనుభవాలు, విలువలు, విజయసూత్రాలూ కలగలిపి రాసిన పుస్తకమిది. 'నీ ఆలోచనలతో నువ్వు ప్రేమలో పడాలి. అదే సగం గెలుపు' అని సలహా ఇస్తారు రచయిత. మిగతా వికాస పుస్తకాలు ప్రస్తావించిన విషయాల్నే కాస్త వైవిధ్యంగా కాస్త సృజనాత్మకంగా చర్చించారు. సమస్యల్ని భారతీయ కోణంలోంచి భారతీయ వాతావరణంలో విశ్లేషించారు.
(ఈనాడు, Sunday Special, ౨౬:౦౭:౨౦౦౯)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
Superb.. Very nice inforamtion, Thanks for sharing such a good information.
కామెంట్‌ను పోస్ట్ చేయండి