గత రెండురోజులుగా ప్రసారమాధ్యమాలలో మైదుకూరు స్కూలులో తెలుగు మాట్లాడినందుకు ఇద్దరు పిల్లలకు ఉపాధ్యాయులు వేసిన శిక్ష ఓ పెద్ద చర్చాంశనీయమయింది. మన టి.వి చానళ్లకి మరో పండగ. ఈ రోజు ఉదయం నుండి ఏ చానలు తిప్పినా దీనిమీదే చర్చ. వీళ్లు ఇప్పుడే కళ్లు తెరిచారో లేక వేరే సంచలనాత్మక వార్తలు ఏమీ లేక దీనిమీద పడ్డారో అర్థం కావటం లేదు. అసలు పిల్లలు ఎలాంటి తప్పు చేసినా ఇలా మెడలో బోర్డులు వేలాడదీయటం తప్పు.....మనం స్పందించాల్సింది దానికి...మనం ముందుగా ఖండించాల్సింది ఇలాంటి శిక్షలని. ఆ పంతుళ్ల మెడలకి "ఇక ఇలాంటి పని చేయను" అన్న బోర్డు తగిలించి ఊరంతా తిప్పాలి.....అదే వారికి సరయిన శిక్ష..
నిజానికి స్కూలులో ఇంగ్లీషులోనే మాట్లాడాలని పిల్లలని నిర్భందించటం, మాట్లాడకపోతే శిక్షలు వేయటం కొత్త విషయం ఏం కాదు. గత 10-15 ఏళ్ల నుండీ హైదరాబాదులో ఇలాంటి ఆంక్షలు చాలా స్కూళ్లల్లో ఉన్నాయి. లేని స్కూళ్లని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అది ఇప్పుడు చిన్న చిన్న ఊర్లకి కూడా పాకింది. మేము చదువుకునే రోజులలో అంటే 30 ఏళ్ల క్రితం కూడా మిషనరీ స్కూల్సులో తెలుగులో మాట్లాడితే ఫైన్ ఉండేది. ఎండలో నిలబెట్టటం. బెంచీలు ఎక్కించటం, మోకాళ్లమీద కూర్చోపెట్టటం, కొండకచో కొట్టటం కూడా చేస్తుంటారు. తమ పిల్లలు తెలుగులో మాట్లడటం తక్కువతనమనుకునే తల్లిదండ్రులున్నంత కాలం మన తెలుగుకి....మన పిల్లలకి ఇలాంటి దుర్గతి తప్పదు. స్కూలులో తెలుగు ఎక్కువగా మాట్లాడుతున్నారని స్కూలులు మార్చే తల్లిదండ్రులున్నప్పుడు వాళ్ల దగ్గర డబ్బులు దండుకుంటున్న స్కూళ్ల యాజమాన్యాలు ఇలా చేయక మరి ఎలా చేస్తాయి? మార్పు రావల్సింది తల్లిదండ్రుల్లో.....ఇంగ్లీషు రాకపోతే తమ పిల్లలు జీవితంలో పైకి రాలేరు..వాళ్లకి భవిష్యత్తు లేదు అన్న భావన నుండి మనం బయటకు వచ్చినప్పుడే ఈ ఝాడ్యం వదిలేది.
మొన్న బజారులో ఓ తెలిసినామె కనపడితే కుశల ప్రశ్నలు అయ్యాక మీ బాబు ఇదివరకటి స్కూలేగా అన్నా! లేదండి పోయిన సంవత్సరం మార్చాం అంది. అదేంటండి ఆ స్కూలు బాగుంటుందన్నారు కదా, బాగా ఆటలు అవీ ఆడిస్తారు, పిల్లల మీద ఒత్తిడి ఉండదు కదండీ అంటే........ఆవిడ ప్రతిస్పందన........అన్నీ బాగానే ఉన్నాయి కానీండి.... అక్కడ క్లాసు బయట పిల్లలు తెలుగులో ఎక్కువగా మాట్లాడతారండి అందుకని మార్చాం అంది. అదీ ప్రస్తుత పరిస్థితి. మామూలుగా మన తెలుగువారం ఏదైనా బాధ కలిగినప్పుడో, దెబ్బ తగిలినపుడో అమ్మా అనో అబ్బా అనో అంటాం..అది అసంకల్పిత చర్య......కానీ ఇంగ్లీషు పిచ్చి ఉన్న మన ఆధునిక తల్లిదండ్రులు ఉన్నారే ......వాళ్లు పిల్లలు బాధ కూడా తెలుగులో పడకూడదనుకుంటారు..పడ్డప్పుడు అమ్మ బదులు మమ్మీ అనాలనుకుంటారు....అలా అంటేనే తమ పిల్లలకి ఇంగ్లీషు బాగా వచ్చినట్లన్నమాట! అమ్మలు బ్రతికున్న శవాలు అయిపోయారన్నమాట!
ఇంగ్లీషులో మాట్లాడితేనే పిల్లలు జీవితంలో పైకి వస్తారు అనుకునే మనస్తత్వం మనకున్నంత కాలం ఇలాంటివి మామూలే. ఓ రెండు రోజులు గోల చేస్తాం..చర్చలు..వాదనలు..ప్రతివాదనలు..ఆవేశాలు..రక్తం ఉడికిపోవటాలు ....మరిగిపోవటాలు....ఊకదంపుడు ఉపన్యాసాలు..అన్నీ మామూలే.......మూడో నాడు షరా మళ్లీ ఇంగ్లీషు మామూలే.. మళ్లీ ఈ ఊసే ఎవరూ ఎత్తరు. భాషా శాస్త్రవేత్తలు ఎప్పడో మొత్తుకున్నారు.....ముందు మాతృభాష సరిగ్గా వస్తే మిగతా భాషలు నేర్చుకోవటం చాలా సులువు అని......కానీ మనం ఇపుడు తెలుగు రాకపోతే మాత్రం ఏం ఇంగ్లీషు వస్తే చాలనుకుంటున్నాము. నర్సరీలో ఉన్న మన పిల్లకాయ..ముద్దుముద్దుగా ఏ ఫర్ ఆపిల్ అంటుంటే ...అబ్బో ఇంగ్లీషు ఎంత చక్కగా మాట్లాడుతుందో అని మురిసిపోతాం. చందమామ రావే ..జాబిల్లి రావే.. స్థానంలో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు వచ్చేసింది....చిట్టి చిలకమ్మని.... జానీ జానీ మింగేసాడు..మన అమ్మ భాష మనకి పరాయి అయిపోయింది!
టపటపా నాలుగు ఇంగ్లీషు ముక్కలు మాట్లాడనివాడు మన దృష్టిలో మనిషే కాదు..అలాంటి పిల్లలకు భవిష్యత్తే లేదు అని జాలిపడిపోతుంటాం. మన పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవాలనుకోవటం తప్పు కాదు, మంచి ఇంగ్లీషు మాట్లాడాలనుకోవటం తప్పు కాదు...కానీ ఇంగ్లీషే తాగాలి, ఇంగ్లీషే తినాలి, ఇంగ్లీషుతోనే బ్రతుకంతా ఉంది అనుకోవటమే తప్పు! తెలుగెందుకు ఇంగ్లీషులోనే అభివృద్ధి అంతా ఉంది అనుకోవటమే తప్పు. మన పక్కనున్న చైనా వాళ్లు ఏ ఇంగ్లీషు నేర్చుకుని ఇంతగా అభివృద్ధి చెందారు?
ఇక్కడ అసలు నవ్వొచ్చే (ఏడవలేకే లేండి) విషయమేమిటంటే ఈ ఇంగ్లీషు స్కూళ్లలో చదివే అధిక శాతం పిల్లలు మాట్లాడే ఇంగ్లీషు వింటే ఇంగ్లీషు సరిగ్గా రాని నేనే చాలా నయం అనిపిస్తుంది. ఓ గ్రామరు ఉండదు, ఓ వ్యాక్య నిర్మాణం సరిగ్గా ఉండదు..ఓ..యా..లే తప్ప అందులో భాషే ఉండదు. ఇలాంటి ఇంగ్లీషు వస్తే ఎంత రాకపోతే ఎంత? ఓ విషయం ఇచ్చి ఓ పది వ్యాక్యాలలో చిన్న వ్యాసం వ్రాయమనండి. స్పెల్లింగు తప్పులు లేకుండా ఒక్క వ్యాక్యం కూడా ఉండదు. అందరూ ఇంతే అనను కాని చాలావరకు ఇంతే. ఈ ఇంగ్లీషు మీద మరోసారి మాట్లాడుకుందాం.
మైదుకూరులో స్కూలు మూసేయించుతారంట..ఎన్ని స్కూళ్ళని అలా మూసేయించుతారు..తల్లిడండ్రులు ఇష్టపడే కదా తమ పిల్లలని ఇంగ్లీషు మీడియం స్కూళ్లకి పంపుతుంది. మన ఇళ్లల్లో ఎంతమందిమి పిల్లలకి చక్కటి తెలుగు నేర్పుతున్నామో, ఎంతమందిమి పిల్లలతో పూర్తిగా తెలుగులోనే మాట్లాడుతున్నామో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. మన పిల్లలు ఎంతమంది తెలుగు అక్షరాలు అన్నీ గుర్తుపట్టగలరు?..తప్పులు లేకుండా ఎన్ని గుణింతాలు వ్రాయగలరు? ఎన్ని అంకెలు చెప్పగలరు?..వారాలేంటో అవి ఎన్నో ఎంతమందికి తెలుసు? అసలు జనవరి.......ఫిబ్రవరే కాదు తెలుగు సంవత్సరాలు కూడా ఉన్నాయని ఎంతమంది పిల్లలకి తెలుసు??మారాల్సింది మనం.
తల్లిదండ్రులూ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి--తప్పెవరిది??
మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న,చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులోపొందుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి