'"నేను కొంచెం బాగా రాయగలిగినవి పజ్యాలు
అవే చేస్తున్నాను మిత్రులకు నైవేధ్యాలు
సమర్పిస్తున్నాను హోలు మొత్తం
స్వీకరిస్తారో కరుస్తారో మీ చిత్తం " అంటూ మొదలవుతాయి , 'ఆరుద్ర అమెరికా ఇంటింటి పజ్యాలు '
ఆర్నొక్కరాగంలో అమెరికాంధ్రుల ఇంటిగుట్టును తెలుగునాట రట్టుచేసెయ్యాలని ఆరుద్ర ఆత్రం
ఏదేశమేగినా .....వదులుకోజాలని అలవాట్లు , అందుమూలంగా వచ్చే అగచాట్లూ, అక్కడ మనవారి ఆచారాలూ, ఆడంబరాలూ .....ఆడక తప్పని 'తానా ' తందనాలు . ఒకటేవిటి, అంతా తల్లకిందులైన దేశంలో 'అమెరికన్ టెలుగూస్ ' గా చలామణీ అవుతున్న 'తెలుగుజీవుల ' జీవన చిత్రాన్ని కాస్తంత చంత్కారంగా మన కళ్ళముందుంచారు ఆరుద్ర . ఆయన ఇవి రాసేనాటికి సాఫ్ట్వేరు , హైటెక్కు.....మన గడప తొక్కివుండవు . అందుకే ఆయన అంతలా ఆశ్చర్యపోయాడేమో. ఇప్పుడైతే అమెరికాకి, హైదరాబాదుకీ ఒకటే తేడా అక్కడ రాత్రయితే ఇక్కడ పగలు ......మిగతా అంతా ఒకటే నకలు
పైపెచ్చు.....చూడగానే 'కిసుక్కు ' మనిపించే బాపు చిత్రాలు ( కార్టూన్లే...) ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ .
"అమెరికా యాత్ర చేసాను రెండుమారులు
అప్పుడు పరిశీలించాను అక్కడివాళ్ళ తీరులు
నేను చూసింది తెల్లవాళ్ళకన్నా ఎక్కువ తెలుగువాళ్ళను
కాబట్టీ తెరుస్తున్నాను అమెరికాంద్రుల పోకిళ్ళ వాకిళ్ళను " అంటూ ఆహ్వానిస్తారు ఆరుద్ర
'అమెరికన్ టెలుగూస్' మీద ఆరుద్ర గారికున్న అభిమానం ప్రతీ పేజీలోనూ కనిపించి వినిపిస్తుంది.
పుస్తకం కొని చదువుతామనే షరతుమీద మచ్చుకు కొన్ని.......కొన్నంటే కొన్నేమరి.
*******************
అమెరికాలో కాపురానికొచ్చిన ప్రతిముద్దరాలూ
అరణ్యవాసంలో సీతమ్మతో సమానురాలు
పంచవటిలో కనీసం పనులు చెయ్యటానికుంటాడు సౌమిత్రి
ఇక్కడ తనకు తానే కూలీ ; తనకు తానే మేస్తీ
**********************
భారతదేశంలో ఒక్కడే ఒక్కడు వడ్డీకాసుల వాడు
బాలాజీగా ప్రసిద్దుడైన తిరుపతి వెంకన్న అతగాడు
అమెరికాలో అడుగడుగునా వడ్డీకాసుల వాళ్ళే
ఆ మహానుభావులు అప్పులిచ్చే బ్యాంకుల వాళ్ళే
క్రెడిట్ కార్డు వుంటే ప్రతి చోటా దొరుకుతుంది అరువు
తడిసి మోపెడు వడ్డీలు కట్టడమే బ్రతుకు తెరువు
*****************
శని ఆదివాలు సెలవన్న మాటేగానీ చేయాలప్పుడు ఇంటిచాకిరీ
షాపింగూ, క్లీనింగు, మాపింగూ, స్టిచ్చింగు, వాషింగు ఇస్త్రీ
అమెరికాలో ఆంద్రులు అనుభవిస్తున్నారు భోగ భాగ్యాలు
అనుకుంటారు ఇండియాలో - ఇవీ వాళ్ళార్జించే సౌఖ్యాలు
****************
అమెరికాలో తెలుగు వంట
తెచ్చిపెడుతుంది కొత్త తంటా
ఏసీ కిచెన్లో వేయిస్తే ఆంధ్రా పోపు
ఇల్లంతా ఘాటు కమ్మి లేస్తుంది టాపు
***************
అమెరికాంధ్రుల ఆశించే తెలుగుదనం
అబ్బే కనిపించ నీయదే వాళ్ళ నామ క్రమం
ఇంటిపేరు మొదటా వ్యక్తి పేరు చివరా చెప్పటం
ఇక్ష్వాకుల కాలం నుండి తెలుగువాళ్ళ మప్పితం
అమెరికాకు వెళ్ళాకా ఆ తీరు
అంతా చేసేసారు తరుమారు
సర్నేములు లేని పెన్నేములు
ససేమిరా ఇక్కడ చెల్లని మోములు
************
వండుకొన్నమ్మ చేసే విందులకన్నా
దండుకొన్నమ్మ పెట్టే విందులు మిన్న
అమెరికాలో పాట్ లక్ డిన్నర్ల భోజనం
అచ్చంగా దండుకొన్నమ్మ వడ్డనకు సమానం
***************
అక్కటా! కోక్, పెప్సి, సెవన్ అప్ , ఏదైనా సోడా
అంటారే అమెరికన్లు వీళ్ళకి తెలియదా తేడా
అసలు సిసలు సోడా ఒక్క ఆంధ్రా సోడా
అందులోనూ ప్రశస్తమైనది గోలీసోడా
సోడా కాయను కొట్టినపుడు చిన్నసైజు భూకంప ద్వని
వాడవాడలా వినిపొంచాలి అప్పుడే అనాలి దాన్ని సోడా అని
*************
అమెరికాలో బుక్కా ఫకీరు
అమాంతంగా కాగలడు పక్కా అమీరు
ఏరెండు డాలర్లకో ఒక లాటరీ టికెట్టు కొంటే
ఎన్నెన్నో మిలియన్లు కొట్టుకురావచ్చు అదృష్టముంటే
కొండకు కాస్తా కట్టిచూడు వెంట్రుక ముక్క
కొట్టుకొచ్చిందా సిరిగిరి పోతే ఒక భాష్పం చుక్క
అప్పుడపుడూ మాత్రమే అలా తలనీలం కడుతూ వుండు
అదేపనిగా కడుతూ వచ్చావో తలపూర్తిగా గుండు
************
ఇది సమీక్ష కాదు , కేవలం నాకు నచ్చిన ఒక మంచి పుస్తకాన్ని మీకు పరిచయం చెయ్యాలన్న ప్రయత్నం
ఆరుద్ర అమెరికా ఇంటింటి పజ్యాలు
విశాలాంధ్రా పబ్లిషర్స్
మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న,చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులోపొందుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి