1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

1, నవంబర్ 2009, ఆదివారం

వేదాలలో- ఇంద్రుని ప్రాముఖ్యత

వేదాలతో పరిచయం ఉన్నవారికెవరికైనా వేదాలలో ఇంద్రునికి ఉన్న ప్రాముఖ్యత తెలుస్తుంది. మొదటి వేదమైన ఋగ్వేదములో మొట్టమొదట వర్ణించబడినవాడు ఇంద్రుడే. మరి మన పురాణాల ప్రకారం ఇంద్రుడు మానవసహజ స్వభావాలన్నీ కలిగిఉంటాడు. అలాంటప్పుడు పరమోత్కృష్టమైన వేదాలలో అలాంటి ఇంద్రుడికి అంత ప్రాముఖ్యత ఎందుకిచ్చారు? అన్న సందేహం చాలామందికి ఉంది.
ఆ అనుమానం నివృత్తి చేయడానికి ఈ టపా దోహదం చేస్తుందని భావిస్తున్నాను.

మొదట మనం ఇక్కడ తెలుసుకోవలసింది పురాణాలు ఉదహరించిన ఇంద్రుడు ఒక దేవత లేక దేవతలరాజు,స్వర్గలోకాధిపతి. ఈ పురాణాల ఇంద్రుడు ఇంద్రియాలకు అధిపతి.కాబట్టి ఈ ఇంద్రునికి మానవస్వభావాలన్నీ(కామ,క్రోధ,లోభాది గుణాలు)అంటగట్టబడ్డాయి.

ఇక వేదాలలో ప్రస్తుతింపబడ్డ లేక పూజింపబడిన ఇంద్రుని విషయానికి వద్దాం.
అసలు విషయం ఏమిటంటే వేదాలలో ఇంద్రునిగా భావించి పూజించినది ఇంద్రుడు అనే దేవతను కాదు, "ఇంద్ర" అనే శబ్దాన్నిలేక ఆ శబ్దానికి అర్హులైనవారిని.

ఈ "ఇంద్ర" అనే శబ్దానికి అర్థం ఏమిటి? ఎందుకని పూజించారు?. అన్న ప్రశ్నలకు ఋగ్వేదములోని ఐతరేయోపనిషత్తు సమాధానం చెబుతుంది. ఇందులోని 1వ అధ్యాయం, 3వ అనువాకంలోని 13,14 శ్లోకాలు అర్థం

13.మనుష్యరూపమున ఉత్పన్నమైన జీవుడు ఈ విచిత్ర జగత్తును చూచి దీని కర్త, ధర్త(ధరించువాడు) మరియొకరు ఉండవలెనని భావించి తన హృదయమందు అంతర్యామి రూపమున విరాజిల్లు పరమాత్మ సాక్షాత్కారము పొందెను. పరమాత్మయే ఈ విచిత్ర జగత్తుకు కర్త,ధర్త(ధరించువాడు)యని, ఆయన శక్తి యందు పూర్ణ విశ్వాసముకలిగి, ఆయనను పొంద ఉత్సుకతతో ప్రయత్నించిన ఆయనను పొందగలడు, మనుష్య శరీరము ద్వారానే ఆయనను పొందవచ్చును. కావున మనుష్యుడు తన అమూల్య సమయమును వృధాచేయక పరమాత్మ ప్రాప్తికి సాధన చేయవలెను.

14.మనుష్య శరీర రూపమున ఉత్పన్నమైన జీవుడు పై చెప్పిన విధమున పరమాత్మను సాక్షాత్కరింప జేసుకొనుటచే పరమాత్మను ఇదం+ద్ర= ఇదంద్ర. అంటే "నేను చూచితిని" అను పేరుతో చే పిలుతురు. అదియే పరోక్షరూపమున అంటే వ్యావహారిక రూపమున "ఇంద్ర" అనే పేరుతో వ్యవహరింతురు.

కాబట్టి వేదాల ప్రకారం ఇంద్రుడు అంటే కేవలం ఒక్కరే కాదు. ఎవరెవరు భగవంతుని చూసారో లేక ప్రత్యక్షం చేసుకొన్నారో వారందరూ ఇంద్రులే.
అటువంటి ఇంద్రులను లేక ఇంద్ర శబ్దాన్ని పొందినవారినే వేదాలలో పూజించారు. అంతేకాని ఒకే ఇంద్రున్ని లేక ఇంద్రుడనే వ్యక్తిని అని కాని కాదు.

కామెంట్‌లు లేవు: