1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

28, అక్టోబర్ 2009, బుధవారం

యామిని పిల్లలు-వెన్నెల కిరణాలు


ఈ చిత్రం గూగుల్ సౌజన్యం

ప్రమదావనం సహాయ కార్యక్రమంలో భాగంగా ఈ సారి యామిని ఫౌండేషన్ వారికి సహాయం అందించటం జరిగింది. యామిని ఫౌండేషన్ అన్నది మానసికంగా వెనుకపడ్డ పిల్లలకి సేవలు అందిస్తున్న ఓ స్వచ్చంద సంస్థ. ఈ సంస్థ గురించిన మరిన్ని వివరాలకు "సామాన్యులలో అసామాన్యులు" టపా చూడవచ్చు.

ముందుగా ప్రమదావనం గురించి ఓ రెండు మాటలు
స్థూలంగా చెప్పాలంటే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలనుండి వ్రాస్తున్న తెలుగు మహిళా బ్లాగర్లకు ఇది ఓ వేదిక లాంటిది. ఎక్కడెక్కడి మహిళా బ్లాగర్లు అప్పుడప్పుడు సరదాగా కలిసి కబుర్లు చెప్పుకోవటానికి, బ్లాగులకు సంబంధించిన మరియు ఇతరత్రా సాంకేతిక విషయాలకు సంబంధించిన సలహాలకి, సందేహాల నివృత్తికి, ఇంకా సభ్యులకి ఏవైనా సలహాలు కాని సంప్రదింపులు కాని అవసరమైతే ఇతోధికంగా సహాయ పడటానికి ఏర్పడ్డ ఓ వేదిక. ఓ రకంగా గూగుల్‍ తెలుగుబ్లాగు గుంపు లాగానే ఇది కూడా. మహిళా బ్లాగర్లు ఎవరైనా ఇందులో సభ్యులు కావచ్చు. దీనికి ప్రవేశ రుసుము లాంటివి ఏమీ లేవు. ఈ ప్రమదావనం గుంపుకు అనుబంధంగా ఒక చాట్ రూం కూడా ఏర్పాటు చేయబడి ఉంది.

అలా మొదలయిన ఈ ప్రమదావనం ప్రస్థానంలో సమాజంలో అవసరం ఉన్నవారికి చేతనయినంత సహాయం చేద్దామన్న తలంపుతో సహాయ కార్యక్రమాలకి కూడా అంకురార్పణ జరిగింది. ప్రమదావనం సభ్యుల నుండి కొంత మొత్తం సేకరించి ఈ కార్యక్రమాలకి వినియోగించటం జరుగుతుంది. ఇక్కడ నిర్భంధం ఏమీ వుండదు. ఇవ్వగలిగిన వారే ఇవ్వొచ్చు. ఎవరికి తోచినంత వారు ఇవ్వొచ్చు. ఎవరికి సహాయం చేయాలి, ఎలా చేయాలి అన్న విషయాలు ప్రమదావనంలో చర్చించి నిర్ణయాలు తీసుకోబడతాయి. మొదటిగా "అంకురం" అని ఆడపిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఓ స్వచ్చంద సంస్థకి సహాయం చేయటం ద్వారా ఈ సహాయ కార్యక్రమాలకి 2008 నవంబరులో అంకురార్పణ జరిగింది. అక్కడి పిల్లలకి కావలసిన స్టేషనరీ సామాను కొనివ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతిస్పందనగా మన తెలుగు బ్లాగులోకంలో నుండి కొంతమంది పురుషులు స్వచ్చందంగా ముందుకు వచ్చి వారు కూడా మా సహాయ కార్యక్రమాలకి ఇతోధిక తోడ్పాటు అందించటం మాకెంతో సంతోషంగా వుంది.

ఇంకొక్క మాట-తెలుగులో బ్లాగు వ్రాసే ప్రతి ఒక్క మహిళ ఇందులో బై డిఫాల్టు సభ్యులవటం జరగదు మరియు ప్రతి ఒక్క తెలుగు మహిళా బ్లాగరు ఇందులో సభ్యులు అయి ఉండాలన్న నియమం కూడా ఏమీ లేదు. ఆసక్తి ఉన్నవారు ఇందులో సభ్యులుగా చేరవచ్చు.

కిందటి శనివారం (21-02-09) ప్రమదావనం సభ్యులు యామిని స్కూలుకి అవసరమైన కొన్ని కుర్చీలు మరియు అక్కడి పిల్లలకి మధ్యాహ్న భోజనానికి అవసరమయిన సరుకులు కొనివ్వటం జరిగింది.

పై సరుకులు, కుర్చీలు వారికి అందచేసిన తరువాత అక్కడి పిల్లలతో కాసేపు గడిపాము. స్కూలు పక్కన కల పార్కులో ఆ పిల్లలతో కలిసి ఓ గంట పైగా గడపటం నిజంగా మర్చిపోలేని అనుభవం.
వాళ్లతో ఆడి పాడి కాసేపు మేము కూడా చిన్నపిల్లలం అయిపోయాం. కాలం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. అలా ఆడుకుంటుంటే వాళ్లలో ఎంత హుషారో! ఆటలలో పాటలలో మామూలు పిల్లలకి మేమేమీ తీసిపోమనిపించారు. వారి ముఖాలలోని ఆనందపు వెలుగులు చూసాక ఆర్థిక సహాయంతో పాటు ఇలా వారితో గడపటం కూడా వాళ్లకి అవసరమే అనిపించింది.
ఇక్కడి పిల్లలలో చాలామంది మనం చెప్పినవి అర్థం చేసుకుని ఆచరించగల మానసిక వయస్సు ఉన్నవారే అందువలన మాకు వారితో ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదు. ఒకరిద్దరు హైపర్ ఆక్టివ్ పిల్లలు ఉన్నా మాతోపాటు టీచర్సు కూడా ఉన్నారు కాబట్టి వారితో కూడా ఎలాంటి సమస్యా ఎదురవలేదు. అందులో కొంతమందికి మాటలు సరిగా రావు అయినా ఎంత ఉత్సాహంగా ఉన్నారో!

"అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే" అంటూ యామిని అన్న పాప చాలా చక్కగా ఓ పాట పాడి వినిపించింది. తనకి చాలా పాటలు వచ్చని చెప్పింది. ఈ సారి ఆ పాప పాటలు రికార్డు చేసి తేవాలి. ఈ పాపకి మానసిక వైకల్యంతో పాటు శారీరక వైకల్యం కూడా వుంది. రెండు కాళ్లూ పోలియో వల్ల దెబ్బతిన్నాయి. ఇలాంటి వారు ఇంకో ఇద్దరు ఉన్నారు. ఈ పిల్లల ఆత్మస్థైర్యాన్ని చూస్తుంటే చాలా ముచ్చటేసింది. చిన్నిచిన్ని కారణాలకే జీవితం మీద విరక్తి పెంచుకుని ఆత్మహత్యలకి పాల్పడేవారికి వీళ్లని ఒక్కసారి చూపించితే చాలు.
పిల్లలతో కాసేపు గడిపాక వారిని మరలా స్కూలులో వదిలిపెట్టి మేము సెలవు తీసుకున్నాము. నేనయితే అప్పుడప్పుడు వెళ్లి ఇలా వాళ్లతో గడిపి రావాలని నిర్ణయించుకున్నాను. స్కూలు వారు పిల్లలని ఇలా ప్రతి బుధవారం పార్కుకి తీసుకెళుతుంటారట. ఈ విషయం నాకు చాలా నచ్చింది. అంతే కాక అదే రోజు సాయంత్రం జూబిలీ హిల్సులో ఓ ఫోటొ స్టూడియోకి ఈ పిల్లలచేత ప్రారంభోత్సవం చేయించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆ పిల్లలలో మీరు కూడా మాలో ఒకరే అన్న భావం పెంపొందించిన వాళ్లమవుతాం కదా అని అనిపించింది!

ప్రస్తుతం ఈ స్కూలుని అద్దె భవనంలో నడపుతున్నారు. త్వరలో స్కూలుకి స్వంత భవనం ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాలనీ కమిటీ వారు కాలనీలో కొంత స్థలం ఇచ్చారు. స్థలంతో పాటు నిర్మాణ వ్యయంలో సగం భరిస్తామని ముందుకొచ్చారట. మిగతా సగం స్కూలు వారు పెట్టుకోవాలి. దీనికోసం స్కూలు వారు బయటవారి సహాయాన్ని ఏ రూపంలో ఇచ్చినా తీసుకుంటారు, అంటే ధనరూపేణానే కాకుండా ఇనుము, ఇటుకలు, సిమెంటు, ఇసుక, తలుపులు, కిటికీలు లాంటివి, ఇంకా భవన నిర్మాణానికి అవసరమైన సామగ్రి ఏమి ఇచ్చినా తీసుకుంటారు.

ఈ స్కూలుకి సహాయం చేద్దామనుకున్న వారు ఈ కింది అడ్రస్సులో వారిని సంప్రదించవచ్చు.
Yamini Educational Society
Plot No 5-80-C/2, Vivekanandanagar Colony, Kukatpally
Hyderabad-500072
Phone: 23061796
School founder: K. Sreenivasa Rao; Mobile: 98494 23055

కామెంట్‌లు లేవు: