1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

30, అక్టోబర్ 2009, శుక్రవారం

అమ్మ అలిగింది

అమ్మ అలిగింది !

నాముసలి తల్లి....

పసిపిల్ల చేష్టలా అలిగింది !

నాన్న_అమ్మ నానుకొని కూర్చున్నందుకు,

చిట్టి చెల్లి_అమ్మవడి జేరినందుకు,

తమ్ముడు_అమ్మ భుజాలెక్కినందుకు,

కుళ్ళి కుళ్ళి నేనలిగినప్పుడు ......



బుంగమూతి ముడిచి

బుజ్జి చేతులు ముఖమ్మీద వాల్చి

కన్నీరు మున్నీరయినప్పుడు

నన్నెత్తుకుని, గుండెలకి హత్తుకుని,

ప్రాణాలు తోడేస్తున్నంత

ప్రేమించి,లాలించిన అమ్మ....

ఇప్పుడు అలిగింది !



కడుపున కన్నవాళ్ళు

కసురుకున్నందుకు,

పేగు చించుకు పుట్టినవాళ్ళు

ప్రేమ భిక్షరాల్చనందుకు



ఎదిగిన బిడ్డలమద్య

ఏకాకి అయినందుకు

పసిపిల్ల చేష్టలా....అమ్మ అలిగింది !



అమ్మను లాలించడానికిప్పుడు

అమ్మకు "అమ్మ" లేదు !

అమ్మని బులిపించడానికిప్పుడు

అమ్మకి "నాన్న" లేడు

అమ్మ వేదనను పంచుకోడానికిప్పుడు

అమ్మకి "మా నాన్న" లేడు 1

బ్రతుకు యుద్ధం ముగించి,

అశాంతితో ఒంటరి యుద్ధంతో అలసి

భద్రత కోల్పోతున్నప్పటి పసిపాప చేష్టలా

అమ్మ అలిగితే ....నాకు

లాలించే తీరికెక్కడిది ?

ప్రాణం పోసి కన్న మా అమ్మను

పెంచి పోషించి _పొద్దు వాల్చేస్తున్న

మా అమ్మను _బుజ్జగించే

వ్యవధి ఎక్కడిది??

ముసలి వెతలు భరించే

ఓపికెక్కడిది??

బ్రతుకు వేగంలో...పరిగెట్టీ, పరిగెట్టి

కాల చక్రంలో కస్సున నలుగుతున్నవాణ్ణి

కడుపుకింత రాల్చి

కృతజ్ఞత చూపించానన్న

ఆత్మవంచన-నరనరాన

జీర్ణించుకున్నవాణ్ణి!

ముసలి అమ్మను .......తీరికెక్కడిది?!



ఈ కవిత స్త్రీవాద కవితా సంకలనం" నీలిమేఘాలు" లోనిది." రచయిత్రి "రావులపల్లి సునీత" gaaru

కాని ఈ కవితలో వున్నది వట్టి స్త్రీవాదం అని కొట్టేయగలరా.. ఇది 1988 లో వచ్చిన కవిత. అప్పటికీ ఇప్పటికీ "అమ్మ " పరిస్తితి ఏమన్నా మారిందా! దయచేసి కవిత బావుందని తేల్చి పారేయకండి . కవితలో భావం గూర్చి ఆలోచించండి .అమ్మ అలక తీర్చే ప్రయత్నం చేయండి . ప్రేమికుల రోజున



_ పుట్టగానే,చూపులతోనే ప్రేమజడి కురిపించి నుదిటిమీద చల్లని ముద్దు పెట్టి తొలి ప్రేమను రుచి చూపించిన అమ్మను ఒకసారి ప్రత్యేకంగా ప్రేమగా పలకరించండి .

దానికీ ఓ రోజుందిగా అంటారా.....అదిగో ఆ లెక్కలే వద్దనేది. అమ్మకి ప్రేమని పంచే ఏ అవకాసాన్ని వదులోకండి. అమ్మకు ,అలిగే అవసరం రానీయకండి . 

కామెంట్‌లు లేవు: