16 సెప్టెంబర్ 2009 సుబ్బులక్ష్మి గారి పుట్టినరోజు. కేవలం ప్రతిభ ద్వారానే మనుషులు గొప్పవారు కాలేరు. అహంకారానికి లోనుకాకుండా మానవత్వం కలిగిఉండేవారే అచంద్రతారార్కం నిలిచిఉంటారనే దానికి సుబ్బులక్ష్మి గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన.
బాగాపేరువచ్చి ప్రపంచప్రఖ్యాతి పొందిన తర్వాత ఒకసారి సుబ్బులక్ష్మిగారు ఒక కచేరి చేసారు. కచేరి ముగిసిన తర్వాత తన గదిలోనికి వెళ్ళిపోయారు. గేటు బయట ఒక ముసలావిడ సుబ్బులక్ష్మిగారిని చూడాలని బయటివారితో ఘర్షణ పడుతోంది. కాని వారు ఆమెను లోనికి అనుమతించడం లేదు. బయటి ఈ హడావుడి విన్న సుబ్బులక్ష్మిగారు విషయం తెలుసుకొని ఆ ముసలావిడను లోనికి అనుమతించమన్నారు.
ముసలావిడ లోనికి వచ్చిన తర్వాత ఆమెను విషయం అడిగారు. అప్పుడు ముసలావిడ సుబ్బులక్ష్మిగారితో " మీ కచేరి చూద్దామని 10మైళ్ళ నుండి నడుకొనివచ్చాను.నా దురదృష్టం కొద్దీ మీ కచేరీ అయిపోయింది. కనీసం మిమ్మల్ని చూద్దామంటే వారు లోనికి అనుమతించలేదు" అంది. సుబ్బులక్ష్మిగారు ఎంతో బాధపడి ఆ ముసలావిడకు ఆహారం పెట్టారు. తర్వాత ఎవరూ ఊహించని విధముగా సుబ్బులక్ష్మిగారు ఆ ముసలావిడ ఒక్కదానికోసం మళ్ళీ కచేరి చేసారు. అక్కడున్న అందరూ ఆమె మానవత్వానికి, జాలిగుండెకు చలించిపోయారు.
"ఏ మూర్ఖుడైనా తనదైన రోజున ఘనకార్యం చేసి గొప్పవాడని పేరు తెచ్చుకోవచ్చు. కాబట్టి గొప్పతనం అనేది ఒకరు చేసిన ఘనకార్యాలపై ఆధారపడి అంచనా వేయకూడదు. వారు చేసే చిన్నచిన్నపనులలో వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది వారి గొప్పతనం అంచనా వేయాలి" అన్న వివేకానందుని వాక్కులకు సుబ్బులక్ష్మి గారి జీవితమే ఒక ఉదాహరణ.
మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న,చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులోపొందుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి