1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

13, డిసెంబర్ 2009, ఆదివారం

గొల్లపూడి మారుతీరావు గారితో ఇంటర్వ్యూ


మారుతీరావు గారి గురించి పరిచయం అనవసరం కదూ? అడగ్గానే ఈ ఈమెయిల్ ఇంటర్వ్యూకు ఒప్పుకుని, జావాబులు ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలతో – సౌమ్య, పూర్ణిమ.
***********************************
మీకు పుస్తకాలు చదవడం ఎలా అలవాటైంది? (పుస్తక పఠనాసక్తి మీకు కలగడానికి ప్రేరేపించిన వాతావరణం, పరిచయాలు గురించి చెప్పండి..)
నేను నా పద్నాలుగోయేటనుంచీ రాస్తున్నాను. అప్పటికే ఏదో చదివేవాడిని. మెల్లగా కూడబలుక్కుని ఇంగ్లీషు కథలు చదివిన గుర్తు. నా మొదటి కథకూడా ఏదో ఇంగ్లీషు కథ పట్ల అవగాహనతో రాసిందనుకుంటాను. మా అమ్మగారు భారత రామాయణాలు శ్రావ్యంగా చదివేవారు. చిన్నతనంలో ఆ స్పూర్తి కొంత ఉపకరించిందని ఇప్పుడు అనిపిస్తుంది. ఏమైనా ఇది ప్రశ్నని బట్టి మెదడులో వెదుకులాటే!
పుస్తకాల ఎంపిక విషయంలో మీ పద్ధతి ఏమిటి?
మొదట్లో ఎంపిక చేయాలనే ధ్యాస లేదు. మన అభిరుచి మేరకి దొరికిన పుస్తకాన్ని చదివే దశ అది. తర్వాత తర్వాత క్రమంగా మన అవసరాలు, ప్రత్యేకమైన విభాగాలు నిర్ణయమై ఆయా పుస్తకాల వెదుకులాట సాగింది. తొలి రోజుల్లో విశాఖపట్నం హిందూ రీడింగ్ రూంలో గ్రంధాలయం, టౌన్ హాల్ రోడ్ లో జిల్లా గ్రంధాలయం అప్పటి నా దేవాలయాలు. ఎప్పుడు తీరిక దొరికినా- నిజానికి ప్రతి దినం అక్కడే వుండేవాడిని.
మీకు ఇష్టమైన రచయితలు ఎవరు?
ఇష్టాయిష్టాలు ఏర్పడే ముందు- ఆయా ప్రక్రియలకు సంబంధించిన అందరూ యిష్టమైనవారే. ఉదాహరణకి- తొలి రోజుల్లో- కొవ్వలి నవలలు- దాదాపు అన్నీ, జంపన నవలలునండూరి రామమోహనరావుగారి అనువాదాలు- టామ్ సాయర్, హాకల్ బెరీఫిన్, మద్దిపట్ల సూరి రెండు మహానగరాలు, కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో నన్ను చాలా సంవత్సరాలు haunt చేసింది. పాంచకడీదేవు అపరాధ పరిశోధక నవలలు, మధిర సుబ్బన్న దేక్షితుల కాశీ మజిలీ కధలు, వేగుచుక్క గ్రంధమాల ప్రచురణలు- ఒకటేమిటి? చేతికందినవన్నీ చదివేవాడిని.
నా పద్నాలుగోయేట వేసవి సలవలకి శ్రీకాకుళంలో పనిచేసే మా చిన్నాయనగారింటికి వెళ్ళాను (ఆయన ఇటీవలే తన 96 వ యేట బెంగుళూరులో కన్నుమూశారు). అక్కడ వున్న రెండు గ్రంధాలయాలకు తలుపులు తెరిచే దగ్గర్నుంచి, “మూసేస్తున్నాం బాబూ!” అనేదాకా కూర్చుని చదివేవాడిని. రెండు నెలల తర్వాత కాలేజీలో చేరితే నాకు క్లాసులో బోర్డు కనిపించలేదు. అప్పుడు అవసరమైన కళ్ళద్దాలు ఈ 57 సంవత్సరాలూ ఉన్నాయి.
మీ పై అత్యధికంగా ప్రభావం చూపిన పుస్తకాలు ఏవి? ఎలాంటివి?
ఈ ప్రభావాన్ని దశలవారీగా చెప్పాలి. తొలినాటి పుస్తకాలు చదువుకొనే ఆసక్తిని పెంచాయి. అవి పైన చెప్పినవి. క్రమంగా రచనకు స్పూర్తిని యిచ్చినవి- ఆ నాటివే. తరువాత శరత్ సాహిత్యాన్ని ఆపోశన పట్టాను. కొన్ని పుస్తకాలు ఎన్ని సార్లు చదివానో! మా ఆవిడ పేరు శివకామ సుందరి. పెళ్ళయిన తొలి రోజుల్లోనే ఆవిడ “శివానీ”అయింది. (శేషప్రశ్న). ఆ రోజుల్లో ఏ ప్రక్రియ అయినా అయస్కాంతం లాగ ఆకర్షించేది. పద్య సాహిత్యం- దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి ఊర్వశి, కృష్ణపక్షము, ప్రవాసము, ముద్దుకృష్ణ గారి “వైతాళికులు” సంకలనం దాదాపు కంఠతా పట్టినంత చదివాను. ఆ రోజుల్లో పుష్కలంగా కవిత్వం రాసాను. దరిమిలాను పూనకంలాగ చదివిన మరొక రచయిత చెలం. తొలి రోజుల్లో శరత్ ప్రభావం, మలి రోజుల్లో చెలం ప్రభావం నా రచనల మీద ఉంది. తర్వాత నన్ను ప్రభావితం చేసిన నవల బుచ్చిబాబు “చివరకు మిగిలేది’. దాని ప్రభావం నా తొలి నవల “చీకటిలో చీలికలు” మీద వుంది.
ఇక ఇంగ్లీషు సాహిత్యానికి వస్తే టాగూర్ కథలు, గీతాంజలి muse, ఆయన Stray Birds, Leo Tolstoy “The Prisoner of Caucasus”, Jules Verne “Round the world in 80 days” తెలుగులో అనువదించాను. అలాగే చాలా టాగూర్ కధలు. ఇక సోమర్సెట్ మామ్ Cakes and Ale, Moon and Six Pence ఆ దశలో నన్ను ఆకర్షించిన రచనలు.
యూనివర్సిటీకి వచ్చాక నా కాలమంతా ఇంగ్లీషు విభాగంలో గడిచింది. పాత తెలుగు పత్రికల బైండ్లు అప్పటి లైబ్రరీ ఇన్ చార్జ్, ప్రముఖ కవి అబ్బూరి రామకృష్ణారావుగారు ఉంచారు. వాటిలో రచనలు-ఎందరో మహానుభావులవి- నన్ను ప్రభావితం చేశాయి. అక్కడే Preistly, John Galworthy, Eugene O’neill,Somerset Maugham, W.W.Jacobs-ఇలా ఎందరినో చదువుకున్నాను. వెరసి- మీ ప్రశ్నకి సమాధానాన్ని కొన్ని పుస్తకాలకు పరిమితం చెయ్యలేను. అది ఓ రచయిత formative phase. ఎందరో రచయితల filtered consciousness- నాది అయింది అనుకుంటాను.
తర్వాతి కాలంలో Bertolt Brecht, Jean Paul Sartre, Samuel Beckett, Stanislavsky,Christopher Fry నాటకాలు, Bernard Shaw, ముఖ్యంగా Oscar Wilde యొక్క wit, aphorisms నన్ను చాలా ప్రభావితం చేశాయి. మరో రచయిత ఫ్రెంచి నాటక రచయిత Jean Anouillh (అతి ప్రముఖమైన నాటకం Beckett- సినీమాగా కూడా వచ్చింది.)
ఓ దశలో ఓ ఇంగ్లీషు అమ్మాయిని నా రచనలతో ఆకర్షించడానికి కొన్ని నెలలపాటు- బహుశ సంవత్సరం పాటు అసిధారా వ్రతంలాగ ఆంగ్ల పద్యసాహిత్యాన్ని చదివాను. వందల పద్యాలు రాశాను. ఆ దశలో Dylon Thomas, Emile Dickinson, Archbald Macleish, W.B.Yates,Ezra Pound,Edna St.Vincent Millay- ఇలా చదివాను. పద్య సాహిత్యంలో పరిణతి సాధించానని చెప్పను. ఆ museని వంటబట్టించుకున్నాను.
సుదీర్ఘ సాహితీ ప్రస్థానంలో ఆయా దశల్లో ఎందరో ఈ హృదయం తలుపు తట్టారు.
నా ఆత్మ కథ రచనకు మనస్సులో ఆలోచన వచ్చినప్పటినుంచీ కొన్ని వందల ఆత్మకథలు చదివాను. Charles Chaplin “My Autobiography” ఎన్ని సార్లు చదివానో లెక్కలేదు. అలా లెక్కలేనన్ని సార్లు చదివిన తెలుగు ఆత్మకధ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి “అనుభవాలు-జ్ఞాపకాలూను”. కొన్ని సంవత్సరాలు నన్ను haunt చేసిన మరో ఆత్మకధ ప్రముఖ హాలీవుడ్ నటీమణి Hedy Lamarr “Ecstacy and Me’. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదే పెద్ద వ్యాసమవుతుంది. (నిజానికి ఈ విషయమై ప్రత్యేకంగా వ్యాసాన్ని రాశాను.)
ఈ దేశపు ఆధ్యాత్మిక వైభవం మీదా, అవధూతలు, మహానుభావుల అతీంద్రియ శక్తుల మీదా నాకు విశ్వాసం. స్వానుభవంతో కొన్నిటిని తెలుసుకోగలిగాను. నేను నమ్ముతాను. ఆ కారణంగా- లేదా ఈ పుస్తకాల వల్ల నా విశ్వాసం మరింత బలపడింది. అవి- నడిచే దేవుడు- పరమాచార్య గురించి నీలంరాజు వెంకట శేషయ్యగారు రాసింది. సాధన గ్రంధ మండలి ప్రచురణ “శ్రీ కామకోటి దర్శన మహిమలు. Autobiography of a Yogi by Paramahamsa Yogananda, Living with Himalayan Masters by Swami Rama, At The Eleventh Hour(The biography of Swami Rama) by Pandit Rajamani Tigunait లాంటివి నా మనస్సుని చాలా ప్రభావం చేసిన పుస్తకాలు.
సినిమాలు విపరీతంగా ఇష్టపడే వాళ్ళు టికెట్లు సంపాదించిన వీరగాథలను చెప్పుకొస్తుంటారు కదా! అలా మీరు ఏదేని రచనను సంపాదించడం కోసం పడ్డపాట్లు అంటూ ఉన్నాయా?
పైన పేర్కొన్న హెడ్డీ లామర్ ఆత్మకధకోసం చాలా సంవత్సరాలు వెదికాను- మళ్ళీ చదవాలని. అయితే ఆ పుస్తకం పేరు “Tears and Smiles” అని గుర్తు పెట్టుకున్నాను. ఎంత వెదికినా దొరకలేదు. రెండేళ్ళ కిందట హూస్టన్ లో ఒక సభలో ఈ పుస్తకం గురించి చెప్పాను. మరో 15 రోజుల తర్వాత ఆనాటి సభలో ఉన్న ఒకావిడ “Ecstacy and Me’ అన్న ఆత్మకధ కాపీ పంపింది. శీర్షికని తప్పుగా గుర్తు పెట్టుకున్నానని అప్పుడు తెలిసింది. తప్పిపోయిన మనిషి దొరికినట్టు ఆవురావురుమని మళ్ళీ చదివాను.
ఆలిండియా రేడియోలో పని చేసే రోజుల్లో నాతో పని చేస్తున్న ఒకావిడ Paul Brunton రాసిన A Search into Secret India అనే పుస్తకాన్ని ఇచ్చింది. భారతదేశంలో మహిమాన్వితులైన యోగిపుంగవుల్ని కలిసిన ఓ ఫ్రెంచి దేశస్థుని అనుభవాల సంపుటి అది. నన్నెంతో ఆకర్షించింది. ఈ దేశపు అతీంద్రియ శక్తుల మీదా, ఆయా వక్తుల ఔన్నత్యం మీదా విశ్వాసం, అంతకంటే ఎక్కువ ఆసక్తి ఉన్నవాడిని. ఎందరికో అందులో విశేషాలు చెప్తూ వచ్చాను. తర్వాత మరోసారి చదవాలంటే ఆ పుస్తకం దొరకలేదు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత కాశీలో ఆ పుస్తకం దొరికింది!
పుస్తకాలు అస్సలంటే అస్సలు ఇష్టపడని మనుషులతో మీ అనుభవాలు ఏవైనా ఉన్నాయా?
తక్కువ. చదవడానికి తీసుకెళ్ళి మనకి వాటిమీద ఉన్న శ్రద్ధని చూపని వ్యక్తులు తెలుసు.
ఇష్టపడని వారు కాదుగాని, బొత్తిగా చదవలేని వారూ, రెండు వాక్యాలు చదవగానే కళ్ళు మూతలు పడతాయని చెప్పినవారూ ఉన్నారు.
ఎలాంటి పుస్తకాలు ఇష్టపడతాం అన్న ప్రశ్నకు జవాబు మన వయసుతో మారుతూ వస్తుందంటారా? మీ వ్యక్తిగత అనుభవం ఏమిటి?
నిస్సందేహంగా, మారే మన అభిరుచులు, జీవితం చూపే ప్రభావం, ఆలోచనల పరిణతి, దృక్పథం, వయస్సు- ఇవన్నీ నిస్సందేహంగా ప్రభావాన్ని చూపుతాయి. చిన్నతనంలో అభూత కల్పనలు- చందమామ కధలు, కాశీ మజిలీ కధలు ఆకర్షిస్తాయి. తర్వాత వాస్తవిక రచనలు నచ్చుతాయి. క్రమంగా సామాజిక స్పృహ, ఆబ్యుదయం,తిరుగుబాటు, పరివర్తన- వంటి సమస్యలు ఆకర్షిస్తాయి. కొన్నాళ్ళకి చరిత్రలు, ఆత్మకధలు- మర్కొన్నాళ్ళకి భగవద్గీత, ఆధ్యాత్మిక రచనలు,- జీవన యాత్రకీ జిజ్ఞాసి అయిన రచయిత choices కీ దగ్గర సంబంధం వుంది.
పుస్తకాలకి చాలా దూరం అయ్యిపోయానే అని వాపోయిన సందర్భాలు ఉన్నాయా?
లేదు. చదువు కాస్త పలచబడిన సందర్భం నా సినీ నట జీవితం. కాని పుస్తకాలకు దూరమయిన దుర్దశ ఏనాడూ రాలేదు.
ఇన్నేళ్ళ సాంగత్యం తర్వాత “పుస్తకం” మీ జీవితాన్ని ఎలా పెనవేసుకుపోయిందో చెప్పమంటే…. ఏం చెప్తారు?
నాదొక జోక్ ఉంది. నా చేతికి రైల్వే టైం టేబిల్ ఇచ్చి జైల్లో పెడితే ఆరు నెలలు చదువుకొంటా గడపగలను- అంటూంటాను. చదువు నా వ్యసనం. ఇంతకంటే ఈ ప్రశ్నకు సమాధానం అవసరం లేదనుకుంటాను

మీరు తరుచుగా వెళ్ళిన / వెళ్ళే పుస్తకాల షాపులు గురించి చెప్పండి..
నేను రచనలు ప్రారంభించిన తొలి రోజుల్లో దాదాపు ప్రతీరోజూ వెళ్ళి కూర్చున్న పుస్తకాల షాపు విశాఖపట్నంలో హిందూ రీడింగ్ రూంకి ఎదురుగా వుండే గుప్తా బ్రదర్స్. దాని ప్రొప్రయిటర్ జగన్నాధ గుప్తా గారు స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వ్యక్తి. వారబ్బాయి రామం నాకు మిత్రులు. షాపులో పుస్తకం ఇంటికి తీసుకువెళ్ళి చదువుకునే అవకాశం రామంగారు నాకు ఇచ్చేవారు. ఇక్కడే శ్రీశ్రీన్, పురిపండా అప్పలస్వామినీ. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, పన్యాల రంగనాధ రావు వంటి సాహితీ మిత్రుల్ని కలిశాను. చదువు పూర్తయి మొదటి ఉద్యోగానికి(ఆంధ్ర ప్రభ లో) విజయవాడ వచ్చినప్పుడు అప్పటి నవోదయా పభ్లిషర్స్, తర్వాత పి.ఎస్.ప్రకాసరావుగారి నవభారత్ బుక్ హౌస్ నాకు నిరంతరం చేరే గమ్యం. పరపతిని సాధించిన తర్వాత- ఇప్పుడిప్పుడు నాకు ఎందరో రచయితలు తమ పుస్తకాలు పంపుతారు. ఏ సభకి వెళ్ళినా అయిదారు పుస్తకాలతో ఇల్లు చేరుతాను. అప్పుడప్పుడు మద్రాసులో Land Mark కి వెళ్ళి పుస్తకాలు కొనుక్కుంటాను. ఎప్పుడేనా హైదరాబాదు వెళ్ళినప్పుడు కాచిగుడా దగ్గర నవోదయా బుక్ హౌస్ నన్ను ఆకర్షిస్తుంది.
గ్రంధాలయాల గురించి?
పైన సమాధానం చెప్పాను. నాటకరంగానికి సంబందించిన గ్రంధాలకి, విమర్శక గ్రంధాలకి తరుచుగా మద్రాసులో అమెరికన్ కల్చరల్ సెంటర్ కి వెళ్తాను. నాటక రంగం ప్రసక్తి వచ్చింది కనుక నన్ను చాలా ఆకర్షించిన పుస్తకం ప్రముఖ అమెరికన్ నాటక విమర్శకుడు Walter Kerr “How Not to Write A Play”. ఆత్మకధల విషయంలో “Telling Lives”
పుస్తకాలు చదివే వాళ్ళని “అంత సమయం ఎలా ఉంటుందండీ బాబూ” అని అడిగేస్తూ ఉంటారు జనాలు. అదే మాట మిమల్ని అడిగితే, మీ జవాబు.
వాళ్ళని చూసి జాలిపడతాను. కాని సుళువుగా క్షమిస్తాను.
ఇప్పుడంటే, పుస్తకాల కొట్లు, ఆన్లైన్ షాపింగ్, ఈబుక్స్ ఇలా ఎన్నోమార్గాలున్నాయి. మీ చిన్నతనంలో ప్రధానంగా పుస్తకాలు ఎలా తెచ్చుకునేవారు? గ్రంథాలయాల్లో మనం అడిగిన పుస్తకాలు తెప్పించుకునే సౌకర్యాలు ఉండేవా?
ఈ ప్రశ్నకీ పైన సమాధానం చెప్పాను.
అనుభవం కలిగే కొద్దీ, ఓ పుస్తకాన్ని గానీ, రచయితని గానీ – కొంతవరకూ అంచనా వేయగలమంటారా? (ఆ రచన/రచయితది మనం ఇదివరకు ఏదీ చదవకున్నా కూడా). ఎందుకడుగుతున్నాను అంటే – ఇప్పుడేదన్నా పుస్తకాల కొట్టుకు వెళ్తే, వందల వేల కొద్దీ పుస్తకాలుంటాయి. ఒక్కోసారి మనకసలు ఊరూ పేరూ తెలీని రచయితల పుస్తకాలు చూసి కూడా – ఏ కవర్ పేజీ చూసో, టైటిల్ చూసో ఆకర్షితులమై, అట్టవెనుక కథ చూసి కొనాలి అనుకోవచ్చు. తీరా కొన్నాక అది చెత్త అని తేలొచ్చు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలని (జేబుకి చిల్లు కనుక అవాంఛనీయమే! :) ) చదువరిగా అనుభవం పెరిగే కొద్దీ అరికట్టగలమంటారా?
నిర్డుష్టంగా అంచనా వేయవచ్చు. నన్నడిగితే ఆ వ్యక్తి శీలాన్ని (profile) బేరెజు వేయవచ్చు. మళ్ళీ చెప్తున్నాను. వయస్సుని బట్టి, అభిరుచిని బట్టి. మన సంస్కారాన్ని బట్టి, మన అవగాహన స్థాయిన్ బట్టి మనం చదివే పుస్తకం వుంటుంది. మరోలా చెప్తాను. మన చేతిలో ఉన్న పుస్తకం మన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. ఈ వాక్యం రాయగానే గుర్తొచ్చిన విషయం- హత్య కాక ముందు చెర్లపల్లి జైల్లోంచి మొద్దు శీను నా “సాయంకాలమైంది’ నవల చదివి నన్ను గురువుగా భావిస్తున్నానంటూ సుదీర్ఘమైన ఉత్తరం రాశారు. ఆయన వ్యక్తిత్వానికి ఇది అద్దమా? లేక నా generalisationకి ఇది విపర్యయమా!
మీకు ఫలాని చోట ఫలాని పుస్తకం తప్పక దొరుకుతుంది – వంటి సమాచారం ఎలా దొరికేది, పాతరోజుల్లో?
ఆ ప్రసక్తి లేదు. దొరికే చోటే నేను ఉండేవాడిని కనుక.
మీకు పుస్తకాల ఎంపిక చదవడం మొదలుపెట్టిన తొలిరోజుల్లో ఎలా జరిగేది? ఎవరన్నా మీకు ఇవి చదువు..అని తెచ్చి ఇచ్చేవారా? లేక, దొరికినవన్నీ చదువుతూ మీరే మీకంటూ ఓ అభిరుచిని ఏర్పర్చుకున్నారా?
తొలి రోజుల్లో ఆకలితో వున్న వ్యక్తి వంట గదిలోకి దూకిన సందర్భం లాంటిది. చేతికి దొరికిందల్లా చదివాను. చదివిందానిలో ఏ కొత్తయినా మనస్సుని అయస్కాంతంలాగ ఆకర్షించేది.
మిత్రులు చదవమని సూచించిన సందర్భాలు తర్వాతి దశ.
మీరు రచయిత కూడా కదా – మీరు ఫలానా తరహా విషయంపై రాస్తున్నప్పుడు అదే విధమైన వస్తువులపై పుస్తకాలు చదివితే, వాటి ప్రభావం నా రచనపై పడుతుంది అని అనిపించి, చదవడం ఆపేసిన సందర్భాలున్నాయా?
లేదు. లేదు. నిజానికి ఆ విషయానికి సంబంధించిన చదవడమే ఎక్కువ. వాటి ప్రభావం పడడం కన్న ఆ విషయం మరింత focus లోకి రావడం ముఖ్యం కదా?
మీరు విద్యార్థిగా ఉన్నప్పుడు కళాశాలల్లో రీడింగ్ క్లబ్స్ వంటివి ఉండేవా? ఒకరు చదువుతున్న పుస్తకం గురించి ఇంకోళ్ళతో చర్చించడం – ఇలాంటివి ఏ విధంగా జరిగేవి?
కళాశాలల్లో రీడింగ్ క్లబ్స్ లేవు. కాని విశాఖలో విశాఖ సాహితి సమావేశాలలో రాసిన రచనలు చదువుకొని చర్చించే సంప్రదాయం వుండేది. అలాగే విజయవాడలో మహీధర రామమోహన రావుగారు కొన్ని సమావేశాలు జరిపేవారు. అక్కడ రచనలు చదివి చర్చించుకునే సంప్రదాయం ఉండేది. నేను డిల్లీలో ఉండగా (1959) పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు ఇలాంటి అవకాశాన్ని నాకు కల్పించారు. కపిలకాశీపతి, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, పన్యాల, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు, శెట్టి ఈశ్వరరావ్ వంటి వారలు సమావేశమయి- నా “చీకటిలో చీలికలు’ నవలలో కొన్ని భాగాలు, “రాగరాగిణ్’ నాటకం విని చర్చించారు.
పుస్తకాలు ఎంచుకోడం విషయంలో మీరు ఏమన్నా సలహాలు ఇవ్వగలరా? ఇందాక అన్నానే – టైటిల్/కవర్పేజీ వంటివి చూసి మోసపోవడం గురించి – అలాంటివి జరక్కుండా ఉండేందుకు.
చదవడానికి ఏ పుస్తకమూ అనర్హం కాదు. కాగా, మీ అభిరుచే మీ పుస్తకాల ఎంపికన్ నిర్ణయిస్తుంది. టైటిల్ చూసి మోసపోయినా తప్పులేదు. కొన్ని శీర్షికలతో పాఠకుడిని ఎలా మభ్య పెట్టవచ్చో తెలియడమూ విద్యే!
అన్నట్లు, బుక్ ఫెయిర్ల సంస్కృతి మీరు యువకులుగా ఉన్నప్పుడు కూడా ఉండేదా?
ఆ అదృష్టం మాకు లేదు.
నాకు ఎప్పుడూ కలిగే సందేహాన్ని మళ్ళీ మీ ముందుంచుతున్నాను – ఇప్పుడంటే ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రపంచంలోని ఏమూల సంగతినన్నా తెలుసుకుంటున్నాము. అంతకుముందు ప్రపంచంలోని వివిధ దేశాల సాహిత్యం గురించి ఇక్కడున్న తెలుగువారికి ఎలా తెలిసేది? “ఎంత” తెలిసేది అన్నది పెరుగుతూ వచ్చిందంటారా అప్పటితో పోలిస్తే ఇప్పుడు?
మంచి ప్రశ్న. నా సమాధానం జాగ్రత్తగా చదవండి. ఇంగ్లీషు పాలన వల్ల మనదేశానికి జరిగిన అనర్ఢం మాట పక్కన పెడితే- ఈ దేశానికి దక్కిన అదృష్టం- ఇంగ్లీషు. ప్రపంచ భాషలలో- ఒక్క ఇంగ్లీషు భాషే- ఎటువంటి స్పర్ద లేకుండా ప్రపంచంలోని అంత గొప్పతనాన్నీ తెచ్చుకుంది. మనకి సంస్కృతం రాకపోయినా వేదాల్ని, భగవద్గీతని, మహా భారతాన్ని, శిలాప్పదికరం ని, త్యాగరాజు సంగీతాన్ని, తమిళ పాశురాల్ని, జయదేవుని అష్టపదుల్ని- దేన్నయినా చదువుకోవచ్చు. ప్రపంచ సాహిత్యంలో- సాహిత్యం అన్నమాటేమిటి? అన్ని రంగాల ప్రాశస్త్యాన్ని తమ భాషలోకి తెచ్చుకున్నారు ఇంగ్లీషువారు. నా అదృష్టం- ఏమీ prejudice లేకుండా ఆ భాషని నేర్చుకున్నాను. నేను ఏమీ నష్టపోలేదని తెలుసుకున్నాను.

కామెంట్‌లు లేవు: