సూర్యకిరణాలు పరచుకున్న జీవన మైదానంలో పనిలోనో / పరధ్యానంలోనో నిమగ్నమయ్యిపోయిన జీవి మీద మెల్లిగా కమ్ముకుంటున్న నీడను ఎవరన్నా గ్రహించేలోపే, అనువైన శరీర భాగాన్ని తన రెండు కాళ్ళ మధ్యన పట్టు బిగించి తన్నుకుపోయే పెద్ద గద్ద మృత్యువు. ఎప్పుడెక్కడెలా ఈ గద్ద వస్తుందో తెలీదు. ఎటు పోతుందో తెలీదు. వస్తుందని తెల్సు. పోతుందని తెల్సు. దాన్ని తప్పించుకోలేమని తెల్సీ ప్రయత్నించటం, ఓడిపోవటం, ఏడవటం – దేవుడు hire చేసుకొన్న స్క్రిప్ట్ రైటర్ ఎవరో కానీ, జీవితాలన్నింటిలో కొన్ని లైన్లు కాపీ పేస్ట్ చేసేశాడు!
పండగ పూట ఈ చావు గోల ఏంటీ? అని విసుక్కునేలోపు, అసలు సంగతి మొదలెడతా!
మా అమ్మ చిన్నప్పుడు, సంక్రాంతి నెల అంటే ముగ్గులూ, భోగి మంటలూ, పంట ఇంటికి రావడాలూ వంటివన్నీ! మా అమ్మ పెళ్లి అయ్యాక సంక్రాంతి అంటే వారం ముందే అన్ని కొత్త సినిమాలకి వరుస షోలకి అడ్వాన్సు బుకింగ్ చేసుకొని ఆర్టీసీ క్రాస్‍రోడ్స్ లోనే “పండగ” చేసుకోవడం. ఇప్పుడేమో అందరూ ఇంటిపట్టునుండి, చేసిన వంటలేవో “జెమిని పెట్టు”, “తేజలో ఏం సినిమా వేశాడో?!”, “ఈ వాడు పాత సినిమాలేస్తాడు..”, “మా లో ఏమొస్తుందో!” అన్న చర్చల మధ్య నలుగురూ కల్సి తినడం.
“మా సినిమా చూడండో.. చూడండో” అన్న దండోర ప్రతీ పండక్కి ఉన్నదే అయినా, సంక్రాంతి పూట ఒక స్పెషల్ – అదే జంధ్యాల గారి జయంతి.
పోయిన ఆదివారం, ఇంకా నిద్ర వదలని కళ్ళతో టేబుల్ మీద పరిచి ఉన్న పేజీని చూసీ చూడంగానే రెండు చేతులూ జోడించి నమస్కరించాను. నిద్ర మత్తు వదిలించుకొని, సాక్షి ఫామిలీ పేజిలో సగం వరకూ నిండున్న “జంధ్యాల” గారి ఫోటో అలానే చూస్తుండిపోయాను. కొందరి ప్రముఖుల అభిప్రాయాలు వేసి, “అతి త్వరలో.. మరెన్నో!” అంటూ ముగించాడు.
సచిన్ ఇరవై ఏళ్ల బట్టీ ప్రతీ ఇంటర్వ్యూలోనూ ఒకటే మాట: “ఐ ఎంజాయ్ మై క్రికెట్!” అని. నేను సచిన్‍కి వీరాభిమానిని! అయినా సచిన్ ఇంటర్వ్యూ చూస్తున్నా, చదువుతున్నా “ఐ ఎంజాయ్ మై క్రికెట్” అంటూ mock చేస్తుంటాను, “అదే నీవు.. అదే మాట!” అని పాట కూడా అందుకుంటాను.
నేను జంధ్యాల అభిమానిని కాను. “బాబూ.. చిట్టీ” అన్న డైలాగులో “బ” వినిపించగానే జంధ్యాల మార్కు డైలాగని గుర్తించగలగాలట! నాకు మొత్తం డైలాగు చెప్పినా గుర్తురాదు. ఆయన రాసిన డైలాగులు ఎవరన్నా వినిపిస్తే, ఏ సినిమాలో ఏ సన్నివేశంలో అది వస్తుందో చెప్పటం నా వల్ల కాదు, అప్పటికే ఆ సినిమా ఒక పది పదిహేను సార్లు చూసున్నా! ఆయన ఎన్ని సినిమాలు తీసారంటే చెప్పలేను. ఆయన సినిమాలని సమగ్రంగా విశ్లేషించలేను
.
నాకు నాలుగైదేళ్ళు ఉన్నప్పుడు అనుకుంటా, నన్ను “వివాహభోజనంబు” అన్న సినిమా తీసుకెళ్లారు మా వాళ్లు. ఆ సినిమా చివర్లో మాయాబజార్‍లో “వివాహభోజనంబు” పాట వస్తుందనీ, అంతకు ముందు నేను చాలా నవ్వుకున్నాననీ నాకు ఇప్పటికీ గుర్తు. ఓ రెండు దశాబ్దాలు గడిచినా జంధ్యాల సినిమాలంటే నాకదే జ్ఞాపకం – బోలెడన్ని నవ్వులు! మహా ఇష్టంగా తిన్న పదార్థం రుచి మాత్రమే గుర్తుండి, ఆ పదార్థం పేరు గానీ, ఆకారం గానీ, మరే వివరాలు గానీ గుర్తులేనట్టుగా ఉంటుంది జంధ్యాల గారి సినిమాలతో నా జ్ఞాపకం, ఇన్నేళ్ల బట్టి ఎన్ని సినిమాలు మళ్లీ మళ్లీ చూస్తున్నా!
మరిప్పుడు నేనెందుకు ఇదంతా రాయడం?!
జంధ్యాల గారి పుట్టిన రోజుకీ, వర్థంతికీ ఎంతో మంది ఎన్నో విధాలుగా ఆయన్ని వేనోళ్ళ కొనియాడుతారు. ఎన్నెన్నో కబుర్లు చెప్తారు, ఆయన గురించి. తెలుగు సినిమాలో హాస్యం లాస్యం ఆయన వల్లనేనని! ఆయన ఎందరికో అన్నం పెట్టారని. ఆయన బహుముఖప్రజ్ఞాశాలని. ఆయన అది అనీ.. ఇది అనీ..
కానీ నాకెప్పుడూ ఆయన గురించి చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య గుర్తు వస్తూ ఉంటుంది. ఆయన చనిపోయిన కొత్తల్లో ఓ సంతాప సభలో కళాతపస్వి విశ్వనాథ్ గారి మాటలు:
(టివిలో చూసానప్పట్లో, నా జ్ఞాపకాల్లో ఊరిన ఆయన మాటలు)
“జంధ్యాల బతికున్నంత కాలం మా ఇద్దరి మధ్యా ఎలాంటి అసూయ గానీ, పోటీ గానీ లేవు. కానీ నాకిప్పుడు జంధ్యాలని చూస్తుంటే నాకు మహా అసూయగా ఉంది. తాను మరణించినా, ఆయన కోసం ఇంత మంది ఇలా కల్సి గుర్తుచేసుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను చనిపోయాక ఇలా చేస్తారా? అన్న ఆలోచన వస్తుంది..”
ఈ మాటల్లో అంతరార్థం ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తుంటుంది.
మొన్నేదో కథను రాసే ప్రయత్నంలో భాగంగా: “చావు టూ వీలర్ మీదే వస్తుంది. దానికి కావాల్సిన మనిషిని ఎక్కించుకొని పోతుంది. ఆ మనిషికి సంబంధించిన మనుషులని కానీ, బాగేజీలని కానీ ఏది వెంట తీసుకెళ్ళనివ్వదు. చుక్కలన్నీ కలిపి అందంగా వేసుకొన్న ముగ్గులో తనక్కావాల్సిన పువ్వునో, తుమ్మెదనో తనతో తీసుకుపోతుంది. చెరిగిన ముగ్గులా మిలిగిపోతాయి మిగితా జీవితాలు. చావుతో ఒక్క చావు కాదనుకో!” అన్న లైన్లు రాసుకున్నాను.
జంధ్యాల గారి గురించి ఈ పూట ఆలోచిస్తుంటే అనిపిస్తుంది, ఆయన మృత్యువుని కూడా నవ్వులతో ఓడింఛేశారని. నవ్వుల చక్రవర్తి ముందు మరణం కూడా దాసోహం అందని. నవ్విస్తూ, నవ్వుతూ కాలం గడిపేసిన ఆయన పోయాక కూడా మన కోసం బోలెడు నవ్వుల్ని మన దగ్గరే వదిలి వెళ్లటమే కాక, విపరీత పరిస్థితుల్లో మనల్ని మనం నవ్వించుకోవటం ఎలానో నేర్పారు. “చేపలు తెచ్చి పెడితే ఆకలి తీర్చిన వారమవుతాం. చేపలు పట్టడం నేర్పితే బతుకుతెరువు చూపించిన వారమవుతాం” అన్న ఆంగ్ల సామెతలా ఆయన్ని మనకి చీకట్లో నవ్వుల బాణాసంచా కాల్చడం నేర్పారు. ఆయన సినిమాలు చూడకుండా మనం పెరిగుంటే, అందులో ఎన్ని నవ్వులు మైనస్ అయ్యేవో! మనవి ఇంకెంత ఏడుపుగొట్టు జీవితాలయ్యేవో!
మృత్యువు తర్వాత కూడా జీవితం ఉంటుంది. ఆ జీవితంలో మనం భౌతికంగా తప్పించి మరన్ని విధాలుగానూ జీవిస్తూనే ఉండచ్చు. ఎప్పటికీ భౌతికంగా ఉండడం కన్నా, పదుగురి నోట నానుతూ, ఆనందాన్ని పంచుతూ ఉండడమే అమరత్వం. అప్పుడు చావుకూడా, స్టేజి మీద నుండి ఓ కీలక పాత్రను తొలిగించడానికి దేవుడి స్క్రిప్ట్ లో ఉన్న inefficiently misplaced extra character గా మిగిలిపోతుంది.
కళ ద్వారా అమరత్వాన్ని సంపాదించిన అతి కొద్ది మందిలో జంధ్యాల గారు చిరస్మరణీయులు! కష్టాల్.. నష్టాల్.. దుఃఖాల్.. అన్నీ శ్రీశ్రీ కవిత్వమంత ఘాటుగా, తీవ్రంగా, సూటిగా వచ్చినా మన దగ్గరున్న తారకమంత్రం “జంధ్యాల”.
ఆయనకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు!
రాసిన వారు: పూర్ణిమ
మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న,చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులోపొందుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి