విలేకరుల సమావేశంలో ఆ వివరాలను ప్రకటిస్తున్నారు..
*************************************
శ్వేతసౌధం, అమెరికా:
ఫోన్ ఆపకుండా రింగ్ అవుతోంది.. కాల్ రిసీవ్ చేసుకున్న ఒబామా కి ఏమీ అర్ధం కాలేదు.. ఈ బ్రిటన్ ప్రధానమంత్రి కి ఏమైనా మతిపోయిందా.. అర్ధం పర్ధం లేకుండా మాట్లాడుతున్నాడేంటి అనుకుంటూ, టి.వి వైపు చూశాడు.. స్వీడిష్ నోబెల్ కమిటీ నోబెల్ శాంతి బహుమతి వివరాలను ప్రకటిస్తున్న సమావేశం.. అక్కడ స్క్రోలింగ్లో వస్తున్న తన పేరు చూసి కాసేపు అలా నిలబడిపోయాడు.. చివరికి ఎలాగో తేరుకుని, ఆ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపి పెట్టేశాడు..అలా పెట్టాడో లేదో, ఇంకో దేశాధ్యక్షుడు లైన్లోకి వచ్చారు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడే, ఇంకో గవర్నర్ కాల్ అంటూ పియ్యే వచ్చి నించున్నాడు...
అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ కాసేపు విరామం తీసుకుందామనుకుంటున్నంతలో మిఛెల్లీ సుడిగాలి లా అక్కడికి వచ్చింది.. మీకు నోబెల్ శాంతి బహుమతి వచ్చిందట.. I am so happy for you dear.. ఇలా అందరిదగ్గరి నుండి అభినందనల వర్షం ఒకవైపు కురుస్తుండగా, ఒబామా మనస్సులో కొంచెం ఆలోచన, కొంచెం ఆశ్చర్యం, కించిత్ గర్వం.. కొంచెం సిగ్గు.. కొంచెం ఉత్సాహం.. మరెంతో ఉల్లాసం.. ఇంకా ఎంతో ఆనందం అన్నీ కలగలిపి కలుగుతున్నాయి..
అలా పగలంతా అభిమానుల వర్షంలో తడిసిన ఒబామా, రాత్రికి పడుకోబోతుండగా ఒక ఆలోచన వచ్చింది.. ఇంతకీ ఈ బహుమతికి నన్నెందుకు ఎంపిక చేశారు... ఎంత ఆలోచించినా సమాధానం తట్టలేదు..అలా ఆలోచనలతో నిద్రలోకి జారుకున్నాడు...
*************************************
నోబెల్ అవార్డుల ప్రధానోత్సవం:
అంగరంగ వైభవం గా నోబెల్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోంది. అతిరధ మహారధులందరూ వచ్చారు.. ఎక్కడెక్కడి వారూ, ప్రతీ రంగంలో పేరెన్నికగన్నవారు, ఇలా ఒకరేమిటి, ఎందరో మహానుభావులు, ఒక్కో రంగం లో విశిష్ట సేవలు చేసిన వారందరినీ వరుసగా వేదిక మీదకు పిలిచి అవార్డులు ప్రధానం చేస్తున్నారు.. ఒబామా వంతు వచ్చింది.. ఒకలాంటి ఉద్వేగంతో స్టేజీ పైకి వెళ్ళి అవార్డ్ అందుకున్నాడు ఒబామా...
కార్యక్రమం ముగిసిన తరువాత అందరూ వెళ్ళిపోతున్నారు.. ఆ సమయంలో నోబెల్ కమిటీ అధ్యక్షుడి దగ్గరకి వచ్చి, మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు ఒబామా.. తప్పకుండా, ఇటు రండి అంటూ మీటింగ్ రూమ్ లోకి తీసుకు వెళ్ళాడు..
అధ్యక్షుడు: చెప్పండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు..
ఒబామా: మీరు శాంతి బహుమతికి నన్నే ఎందుకు ఎంచుకున్నారు..?
అధ్యక్షుడు: :) ఈ ప్రశ్న చాలా మంది దగ్గర నుండి వచ్చింది, కానీ మీ దగ్గర నుండి కూడా వస్తుందని ఊహించలేదు...
ఒబామా: మీరు బహుమతి ప్రకటించిన నాటి నుండి, సమాధానం కోసం వెతుకుతూ నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాను, కానీ కొంచెం కూడ తట్టలేదు.... అందుకే మీ నుండే తెలుసుకుందామని అడుగుతున్నాను.. అసలు నేను ఏం చేశాను అని మీరు నన్ను ఎంపిక చేశారు..?
అధ్యక్షుడు: హ్మ్.. అర్ధమైంది.. శాంతి బహుమతికి ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో నామినేషన్లు వచ్చాయి.. చాలా గట్టి పోటీ ఉంది.. నామినేట్ చేయబడిన వారందరూ వాళ్ళు చేసిన గొప్ప గొప్ప పనుల గురించి ప్రస్తావించారు..అసలు ప్రపంచంలో ఎవరైనా ఖాళీగా ఉన్నారా.. పాకిస్తాన్ ఎప్పుడు భారత్ మీద యుధ్ధం చేయాలా అని చూస్తూ ఉంటుంది.. చైనా టిబెట్ ని ఆక్రమించుకుంది, కుదిరితే భారత్ ని కూడా ఆక్రమించేయాలనే ఆలోచనే.. ఇటు ఇజ్రాయెల్ - పాలస్తీనా ఎప్పుడూ రావణకాష్ఠమ్లా రగులుతూనే ఉంటుంది.. పోనీ ఆస్ట్రేలియా వైపు చూస్తే, జాత్యహంకార ధోరణులతో కొట్టుమిట్టాడుతోంది.. ఫ్రాన్స్ ని పరికిస్తే, ఏ ఫ్యాషన్స్ బావుంటాయి, ఏ మోడల్ అందం గా ఉంది అని తప్పితే వేరే ఆలోచన లేదు..
ఇంతమంది, ఏదేదో చేయాలని, ఇంకేదో చేస్తూ, తమెంతో సాధించామని భ్రమ పడుతూ, నామినేట్ చేయబడ్డారు.. కానీ వారందరికీ మీకూ ఉన్న ఒకే ఒక్క తేడా -- అదే.. ఎంతో చేయగలిగి ఉండి కూడా, మీరు ఏమీ చేయలేదు..!!!
తలుచుకుంటే, పాకిస్తాన్ ని తన్ని కూర్చోపెట్టి భారత్ జోలికి వెళ్ళకుండా చేయచ్చు.. చైనా ఆగడాలని కంట్రోల్ చేయచ్చు.. జన్మతః నల్లవాడైనా మీకు జాత్యహంకారం గురించి తెలుసు, దాన్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన విషయాలని ఆస్ట్రేలియా వాళ్ళతో చర్చించి ఉండచ్చు.. పాలస్తీనా మీదకి రయ్యిమంటున్న ఇజ్రాయెల్ ని బెదిరించి, పాలస్తీనా తో సంధి ఒడంబడిక చేసి ఉండచ్చు.. ముసలివాడై కూడా, ఇంకా టిబెట్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న దలైలామా మీద ప్రేమతో చైనాని ఒప్పించి ఉండచ్చు.. ఇంకా ఎన్నో.. మరెన్నో.. చాలా చాలా చేసి ఉండచ్చు.. కానీ, మీరు .. మీరు.. అవేమీ చేయలేదు.. ఆ చేయకపోవడమే, మిమ్మల్ని అందరిలోనూ విభిన్నంగా నిలబెట్టింది.. నిజానికి మీరున్న పరిస్థితుల్లో ఏమైనా చేసి ఉండచ్చు, కానీ మీరు తొందరపడలేదు.. ఏమీ చేయలేదు.. కేవలం ఆ ఒక్క కారణంతో మిమ్మల్ని అవార్డ్ కి ఎంపిక చేయడం జరిగింది.. ఇప్పటికి మీ అనుమానం తీరిందా అని అడిగారు ఆయన నవ్వుతూ...
ఒబామా: ఆ వివరణంతా విన్న ఒబామా నిశ్చేష్టుడై అలానే ఉండిపోయాడు...
*************************************
మహేష్ బాబు ఇస్టైల్లో చెప్పాలంటే --
ఏం చేశామన్నది కాదన్నయ్యా, అవార్డ్ వచ్చిందా లేదా...
శ్రీశ్రీ గారి శైలిలో చెప్పాలంటే --
మాయావతి, వై.ఎస్.ఆర్, సోనియా, ఒబామా కారే అవార్డుకూ అనర్హం...!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి