శ్రీ శ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) గారి పేరు ఎరుగని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తి కాదు. రాజవీధుల్లోనూ, పండితుల చర్చాగోష్టుల్లోనూ, రాజ దర్బారుల్లోనూ మాత్రమే వెలుగుతున్న తెలుగు సాహితీ సౌరభాల్ని, సామాన్యుడి చెంతకూ, మట్టి వీధుల వరకూ.. తీసుకొచ్చిన మహాకవిగా శ్రీ శ్రీ పేరు తెలుగుభాష, తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో వెలుగుతూనే ఉంటుంది. తెలుగు సాహిత్యంలో సామాన్యుడి కష్టనష్టాల గురించీ, పేదసాదల జీవితాలని ప్రతిబింబించే కవిత్వాన్ని రాసిన మొదటి కవిగా ఆయన ఆంధ్రులందరికీ చిరస్మరణీయుడు. ఆయన రచనల్లో 1950 లో ప్రచురించబడిన 'మహాప్రస్థానం' అనే కవితాసంపుటి తెలుగు సాహితీ అభిమానుల మనసుల్లోనే కాకుండా.. సామాన్య ప్రజల గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. అంత గొప్ప కవితా సంపుటిలోంచి అప్పుడప్పుడూ కొన్నీటిని ఈ బ్లాగులో పెట్టడం ద్వారా అందరికీ ఒకసారి గుర్తు చేసినట్టు ఉంటుందని భావిస్తున్నాను. నేనే స్వయంగా టైపు చేసి పెడుతున్నాను. ఒక వేళ ఇలా పెట్టకూడదు అని ఏమైనా కాపీ రైట్ హక్కులు ఉంటే.. ఎవరైనా మిత్రులు తెలుపగలరు. అప్పుడు నేనే సదరు పోస్టులు తీసేస్తాను.
ఈ 'మహా ప్రస్థానం' పుస్తకంలోని చాలా కవితలను శ్రీ శ్రీ గారు 1930-40 మధ్య కాలంలో వ్రాసారట. ఈ మహాప్రస్థానాన్ని శ్రీ శ్రీ గారు ఆయన మిత్రుడు శ్రీ కొంపెల్ల జనార్ధనరావు గారికి అంకితం చేసారు. ఆ అంకిత వాక్యాలు కూడా కవితా రూపంలోనే స్వయంగా శ్రీ శ్రీ నే వ్రాశారు. ఈ పోస్టులో ఆ కవితను ఇస్తున్నాను. చూడండి మీరే.. వారి స్నేహ బంధాన్ని..!
నేస్తం దూరమైన బాధనీ.. తనతో మాట్లాడుతున్నట్టుగా.. ఎంత గొప్పగా చెప్పారో శ్రీశ్రీ గారో.. మీరే చూడండి.
"మహాప్రస్థానం" కొంపెల్ల జనార్ధన రావు కోసం..
తలవంచుకు వెళ్ళిపోయావా, నేస్తం!
సెలవంటూ ఈ లోకాన్ని వదిలి...
తలపోసినవేవీ కొనసాగకపోగా,
పరివేదన బరువు బరువు కాగా,
అటు చూస్తే, ఇటు చూస్తే ఎవరూ
చిరునవ్వు, చేయూతా ఇవ్వక...
మురికితనం కరుకుతనం నీ
సుకుమారపు హృదయానికి గాయం చేస్తే...
అటు పోతే, ఇటు పోతే అంతా
అనాదరణతో, అలక్ష్యంతో చూసి,
ఒక్కణ్ణి చేసి వేధించారని, బాధించారని
వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా, నేస్తం!
దొంగ లంజకొడుకు లసలే మెసలే ఈ
ధూర్తలోకంలో నిలబడజాలక
తలవంచుకునే వెళ్ళిపోయావా, నేస్తం!
చిరునవులనే పరిషేచన చేస్తూ...
అడుగడుగునా పొడచూసే
అనేకానేక శత్రువులతో,
పొంచి చీకట్లో కరవజూసే,
వంచకాల ఈ లోకంతో పొసగక
అచింతానంత శాంత సామ్రాజ్యం
దేన్ని వెతుక్కుంటూ వెళ్లావోయ్, నేస్తం!
ఎంత అన్యాయం చేశావోయ్, నేస్తం!
ఎన్ని ఆశలు నీ మీద పెట్టుకుని,
ఎన్ని కలలు నీ చుట్టూ పోగు చేసుకుని...
అన్నీ, తన్నివేశావా నేస్తం!
ఎంత దారుణం చేశావయ్యా, నేస్తం!
బరంపురంలో మనం ఇంకా
నిన్న గాక మొన్న మాట్లాడుతున్నట్టే ఉంది!
కాకినాడ నవ్య సాహిత్య పరిషత్తును
కలకలలాడించిన నీ నవ్వు
కనబడకుండా కరిగిపోయిందా ఇంతట్లోనే!
విశాఖపట్టణం వీధుల్లో మనం
"ఉదయిని" సంచికలు పట్టుకు తిరగడం
జ్ఞాపకం ఉందా?
చెన్న పట్టణపు సముద్రతీరంలో మనం
అన్నీ పిచిక గూళ్ళేనా కట్టింది?
సాహిత్యమే సమస్తమూ అనుకోని,
ఆకలీ నిద్రా లేక,
ఎక్కడున్నామో, ఎక్కడకు పోతామో తెలియని,
ఆవేశంతో,
చుక్కల్లో ఆదర్శాలను లెక్కిస్తూ,
ఎక్కడకో పోతూన్న మనల్ని
రెక్కపట్టి నిలబెట్టి లోకం
ఎన్నెన్ని దుస్సహదృశ్యాలు చూపించి,
ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు కల్పించి,
కలలకు పొగలనూ, కాటుకలనూ కప్పి,
శపించించో, శఠించిందో మనల్ని..
తుదకు నిన్ను విష నాగురలలోకి లాగి,
ఊపిరితిత్తులను కొలిమి తిత్తులుగా చేసి,
మా కళ్ళల్లో గంధక జాలలు,
గుండెల్లో గుగ్గిలపు ధూమం వేసి,
మా దారిలో ప్రశ్నార్ధం చిహ్నాల
బ్రహ్మ చెముడు డొంకలు కప్పి,
తలచుకున్నప్పుడల్లా
తనువులో అణువణువులో
సంవర్త భయంకర
ఝుంఝూ పవనం రేగిస్తూ
ఎక్కడకు విసిరిందయ్యా నిన్ను..
ఎంత మోగించిందయ్యా మమ్ము..
ఎవరు దుఃఖించారులే నేస్తం! నువ్వు చనిపోతే,
ఏదో నేనూ, ఆరుగురు స్నేహితులూ తప్ప...
ఆకాశం పడిపోకుండానే ఉంది..
ఆఫీసులకి సెలవు లేదు..
సారా దుకాణాల వ్యవహారం
సజావుగానే సాగింది..
సానుభూతుల సభలలో ఎవరూ
సాశ్రు నేత్రాలు ప్రదర్శించలేదులే నీకోసం...
ఎవరి పనులలో వాళ్లు..
ఎవరి తొందరలో వాళ్లు..
ఎవరికి కావాలి, నేస్తం! నువ్వు
కాగితం మీద ఒక మాటకు బలి అయితే,
కనబడని ఊహ నిన్ను కబళిస్తే,
అందని రెక్క నిన్ను మంత్రిస్తే, నియంత్రిస్తే..
ఎవరికి కావాలి నీ నేస్తం?
ఎమయిపోతేనేం నువ్వు?
మా బురద రోజూ హాజరు..
మా బురఖా మేము తగిలించుకున్నాం..
మా కాళ్ళకు డెక్కలు మొలిచాయి,
మా నెత్తికి కొమ్ములలాగే..
మమ్మల్ని నువ్వు పోల్చుకోలేవు..
లేదు నేస్తం! లేదు
నీ ప్రాభవం మమ్మల్ని వదలలేదు..
నిరుత్సాహాన్ని జయించడం
నీ వల్లనే నేర్చుకుంటున్నాము..
ప్రతికూల శక్తుల బలం మాకు తెలుసు..
భయం లేదులే అయినప్పటికీ..
నీ సాహసం ఒక ఉదాహరణ..
నీ జీవితమే ఒరవడి..
నిన్న వదలిన పోరాటం
నేడు అందుకొనక తప్పదు..
కావున ఈ నిరాశామయ లోకంలో
కదనశంఖం పూరిస్తున్నాను..
ఇక్కడ నిలబడి నిన్ను
ఇవాళ ఆవాహనం చేస్తున్నాను..
అందుకో ఈ చాచిన హస్తం..
ఆవేశించు నాలో..
ఇలా చూడు నీ కోసం..
ఇదే నా మహాప్రస్థానం..!
-- శ్రీ శ్రీ
* ఏమైనా అక్షర దోషాలు కనిపిస్తే సరిచేయగలరని మనవి.
మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న,చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులోపొందుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి