"ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకీ..అటో ఇటో ఎటోవైపు.."
ఈ వాక్యం వినడానికి ఎంతబావుందో కదా..! అందులో ఎంత వాస్తవం, ఎంత మార్గదర్శకం ఉందో కదా..!
ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది మనుషులు ఉన్నారు. అందరూ ఒక్కో విధమైన మనస్తత్వాలు, ఆలోచనలు కలిగిఉంటారు. ఒకరికి మంచి అనిపించేది మరొకరికి చెడు అనిపిస్తుంది, మరొకరికి పిచ్చితనం అనిపిస్తుంది. ఒక్కటే విషయం, చూసే మనిషి దృక్పథాన్ని బట్టి అభిప్రాయం మారుతూ ఉంటుంది.

ఈ ప్రపంచంలో ప్రతీ మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు.అవి మామూలే...సముద్రపు అలల్లా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ, కొంతమందికి జీవితమే ఒక సమస్య . వాళ్ళనే మనందరం అనాధలు అంటూ ఉంటాం. అనాధలు అంటే ఎవరూ లేనివారనేగా మన ఉద్దేశ్యం. ఎన్నో కారణాల వల్ల ఈ ప్రపంచంలో ఒంటరిగా వదలివేయబడ్డ పసిపాపలే అనాధలవుతారు. ఇంత మంది మనుషులున్న ఈ విశాల ప్రపంచంలో తమకి మాత్రమే ఎందుకు ఎవరూ లేరో వాళ్లకేప్పుడూ అర్ధం కాని విషయం. ఒకోసారి విధి వక్రీకరించి తనవాళ్ళని పోగొట్టుకోవడం వల్ల కూడా కొంతమంది పిల్లలు అనాధలవుతారు. అలాంటి దురదృష్టానికి గురి అవ్వని మన లాంటి అదృష్టవంతులైన మనుషులు అలాంటి పసిపాపల కోసం ఎంతో కొంత ఆలోచించాలి. ఏదో ఆకలితో ఉన్నారని ఒక పూట అన్నం పెట్టడమో, ఒక పది రూపాయలు ఇవ్వడమో చేసి ఊరుకుంటే సరిపోదనీ, అది సరి కాదని కూడా నా అభిప్రాయం. దాని వల్ల వారి జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. చేతనయితే వారి మీద జాలి, దయ చూపించకుండా ప్రేమ చూపించగలగాలి. మనం చేసే చిన్న పని ద్వారానయినా వాళ్ల జీవితంలో ఒక మార్పు రావాలి. వాళ్లు భవిష్యత్తులో మంచి మనసున్న మనుషులుగా ఎదగాలి. ప్రతీ మనిషి జీవితానికి కనీస అవసరాలయిన తిండి, నీడ, ఆరోగ్యం కాకుండా చదువు కూడా కావాలి. అప్పుడే వాళ్ల జీవితాన్ని వాళ్ళే నిర్మించుకోగలిగే విజ్ఞానం, శక్తి వస్తాయి.


ఈ విషయం గురించి ఈ రోజు ఇక్కడ చెప్పే ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే నాకు తెలిసిన దాన్ని చెప్పడం వల్ల ఇది చదివగానే ఆ మొదటి అడుగు వేయాలని ఎదురుచూస్తున్నవారెవరైనా ఉంటే కనీసం ఒక్కళ్ళయినా వెంటనే ముందడుగు వేస్తారని..
అలా మొదటి అడుగుగా... నేను నా స్నేహితుడి ద్వారా ఒక ఆర్గనైజేషన్ గురించి తెలుసుకున్నాను. అది ప్రపంచం మొత్తం అనాధ పిల్లలకోసం నడుపుతున్న ఒక సంస్థ. మన ఇండియా లో కూడా ఉంది. వాళ్ళేం చేస్తారంటే, ఇలాంటి పిల్లలను వెళ్లి వెతికి తీసుకొచ్చి వాళ్ల సంస్థలో చేర్పించుకుంటారు. ఒకోసారి తల్లితండ్రులు ఉన్నా కూడా, బాగా పేదవాళ్లవడం చేత పిల్లలని సరిగ్గా చూసుకోలేని, చదువు చెప్పించలేని స్థితిలో ఉన్న పిల్లలని కూడా చేర్చుకుంటారు. అలాంటి పిల్లకి, మంచి తిండి, ఉండటానికి వసతి, ఆరోగ్యం, చదువుకునే అవకాశం కల్పిస్తారు. అయితే వీళ్ళు ఎవరి దగ్గరినుంచైనా విరాళాలు తీసుకుంటారు ఈ సంస్థ నడపడం కోసం. వీళ్ళు చేసే ఒక గొప్ప విషయం ఏంటంటే...మనం ఒక చిన్న విరాళం ఇచ్చినందుకు ప్రతిఫలంగా మనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తారు. అది ఎలా అంటే...వాళ్ల website లో చాలామంది పిల్లల photos ఉంటాయి పేరు, ఊరుతో సహా.. ఎవరో ఒకళ్ళని మనం సెలెక్ట్ చేసుకుని నెలకి 600Rs/- INR పంపిస్తే ఆ child కి కావలసిన అన్ని సౌకర్యాలనీ వాళ్లు అమరుస్తారు. మనమే కాకపోయినా ఎవరో ఒకళ్ళు ఆపని చేస్తారు.
ఈ రోజుల్లో 600 రూపాయలు చిన్న మొత్తమేనని నా అభిప్రాయం. ఎందుకంటే మనం ఒక జత బట్టలు కొనుక్కుందామన్నా అంతకంటే ఎక్కువే అవుతుంది. కాబట్టి ఆలోచించి చూడండి మీరు చేయగలేరేమో...!!
ఇంతకీ... మీకు ఆ website అడ్రస్ చెప్పలేదు కదూ...! చూడండి ఇదే ఆ site.
http://www.worldvisionindia.org/
ఇలాంటిది నాకు తెలిసింది ఇంకోటి కూడా ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి.
http://www.nice-india.org/
మరి ఒక మంచి పని కోసం మన మొదటి అడుగు ముందుకి వేద్దామా...??
http://ammasocialwelfareassociation.blogspot.com/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి