చిత్రం:శుభోదయం
పాడిన వారు:యస్.పీ.బాలు,పీ.సుశీల
దర్శకత్వము:కే.విశ్వనాథ్
సంగీతము: కే.వీ.మహదేవ
నటనం ఆడేనే భవ తిమిరహంసుడా
ఆ పరమశివుడు నటకావతంశుడై
తకధిమి తక యని !!
!! నటనం ఆడేనే
ఎనిమిది దిక్కులు ఒక్కటైనటుల
ఎండ వెన్నెలై వెల్లువైనటుల
నిటాలాక్షుడే తుషారద్రి విడి విశాలాక్షితో తాళ లయగతుల
!! నటనం ఆడేనే
శివగంగ శివమేత్తి పొంగగా
నెలవంక సిగపువ్వు నవ్వగా
హరిహరాత్మకమగుచు అఖిలా ప్రపంచమ్ము
గరుడా నాదానంద కావ్యమై వరలగా
!! నటనం ఆడేనే
వసుధ వసంతాలు ఆలపించగా
సురలు సుధను ధరలో కురిపించగా
రతీ మన్మధులు కుమార సంభవ
శుభోదయానికి నాంది పలుకగా
ఓ శంకరా!అభవుడవై ఈ ప్రపంచానికి అస్థిత్వమై నిలిచావు నీవు.భవుడవై ఈ జగత్తు మనుగడకు కారణభూతుడవైనావు.స్వామీ !అలాంటి నువ్వు ప్రాపంచిక వ్యామోహమనెడి చీకటిని సంహరించే పరమశివుడవు.మహాదేవా! నీవు నర్తించడం వలన నాట్యానికి ప్రత్యేక గౌరవం,పవిత్రత లభించినా కరుణా సముద్రుడవు కనుక నటకావతంశుడు (నాట్యానికి ఆభరణము)అని అనిపించుకున్నావు.అలాంటి నువ్వు నేడు ఆనందస్వరూపుడివై తకధిమి తకధై అంటూ ఆనంద తాండవం చేస్తున్నావు.నీవీనాడు ఎందుకింత ఆనందంగా వున్నావో నాకు తెలిసిందిలే…అమ్మలను గన్న అమ్మ,ముజ్జగాలకే మూలపుటమ్మ మా అమ్మ పార్వతీ దేవిని పరిణయమాడి నీవు ఉమారమణుడవు అనిపించికున్నావు.అంతేనా నీ దేహంలో సగ భాగమిచ్చి అమ్మపై నీకు గల అనురాగం లోకాలన్నింటికి చూపించి పాఠం నేర్పావు.
ప్రభూ! మీ గౌరీశంకరుల కళ్యాణం జగత్కళ్యామే కదా! ఈ అనందం మీకే కదు మా అందరికి కూడా.జగదానంద కారకులైన మిమ్ములను చూసి ఎనిమిది దిక్కులన్నీ ఒక్కటై పోయినట్లు,సూర్యుడే చంద్రుడై ఎండకు బదులు వెన్నెల కురిపిస్తున్నట్లు మాకు అనిపిస్తున్న వేళ ,మూడు కన్నులున్న నీవు కైలాసాన్ని వీడి విశాలమైన కన్నులున్న మా అమ్మ గిరిరాజపుత్రితో ఆనందంగా లయ,తాళములను తప్పకుండా నాట్యము చేస్తూ వుంటే,రాగ,తాళ,లయ,శృతులకు,మా అందరికీ మీరే గతి అని మాకు ఈనాడు బోధ పడింది.
పరమశివా! పార్వతీపరమేశ్వరులైన మీ ఇద్దరి నాట్యము చూసి నీ జటాజూటంలో కొలువై ఉన్న గంగమ్మ తల్లికూడా ఆనందాముతొ ఉప్పొంగిపోతోంది…అలాగే నీ శిగలో కుసుమంలా అలరారుతున్న నెలవంక చిరునవ్వులు చిందిస్తూ మరింతగా శోభిస్తున్నాడు.హర హర మహాదేవా! నీ కళ్యాణ మహోత్సవ సందర్భంగా హరిహరాత్మకమగు ఈ ప్రపంచమంతటా గరుడనాదానంద కావ్యమై ప్రకాశిస్తున్నది.సర్వ జగత్తుకూ మంగళాన్నీ,ఙానాన్ని ప్రసాదించే శంకరా!శివ కేశవులు అభేధమని ఈ జగమంతటికీ చాటుతూనే వున్నావు కదా!నీ హృదయాన్ని కవి అర్ధం చేసుకున్నరు కనుకనే హరిహరాత్మకమైన ఈ ప్రపంచమును,వేదములను తన నాదముగా జేసుకున్న గరుత్మంతుని స్మరిస్తూ విష్ణు స్తుతి చేసారు ఇక్కడ.
మహేశా!విశ్వమంతా పార్వతీపరమేశ్వరుల కళ్యాణం ఎప్పుడు జరుగుతుందా?కుమారస్వామి ఎప్పుడు ఉదయించి తారాకాసురుణ్ణి సంహరిస్తాడా అని ఎదురుచూస్తున్నదయ్యా! సతీ దేవి హైమవతిగా జన్మించి మళ్ళీ నిన్ను చేరుకున్నది.భూదేవి వసంత రాగాలను ఆలాపిస్తున్నది.దేవతలు అమృతాన్ని వర్షిస్తున్నారు.రతీ మన్మధులు ఈ జగమంతటికీ శుభోదయాన్ని ప్రసాదించే కుమార స్వామి సంభావానికి నాంది పలుకుచున్నారు.విశ్వనాథా! నువ్వు మా అమ్మ పార్వతీ దేవి కలిసి తారకాసురుడనే అఙ్జానాంధకారమును పారద్రోలే ఙాన స్వరూపుడైన కుమార స్వామిని మాకు ప్రసాదించండీ…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి