1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

14, మార్చి 2010, ఆదివారం

మా అమ్మ


నా మోము చిన్నబోతే
తను చిన్నబుచ్చుకుంటుంది
నే ముభావంగా ఉంటే
భారమైన నిట్టూర్పవుతుంది
నా కంట నీరు చిందితే
తనో వర్షించే మేఘమౌతుంది

నే రావడం ఆలస్యమవుతే
వాకిట తలుపౌతుంది.
అర్థరాత్రి దాకా నా గదిలో దీపం వెలిగితే
దరిచేరిన నిద్రాదేవిని దూరంగా పొమ్మంటుంది
కలత మనసుతో నే కనిపిస్తే, కకావికలమవుతుంది

ఉద్యోగ భారంతో ఉసూరుమని ఇంటికొస్తే
ఉద్దీపించే ఓదార్పులా ఉంటుంది
బడలికతో బద్ధకిస్తే
బలవంతపు గోరుముద్దౌతుంది

అసలే మాత్రం తనకి నే సమయమివ్వకపోయినా
అహరహరం నాకై సతమతమౌతుంది
మౌనంగా నా పని నే చేసుకుంటున్నా
మనిషినైనా ఎదుట ఉన్నానని మురిసిపోతుంది

పుట్టి బుద్ధెరిగాక
పనిలో ఏ సాయమూ చేయకపోయినా
పదుగురికీ నా కూతురు
సాయపడుతోందని గొప్పలు పోతుంది

పదుగురి దగ్గర నటించిన ప్రశాంతత
చిరాకుగా తన ముందు ప్రదర్శిస్తే
చిట్టితల్లికి అంత కష్టమేమొచ్చిందా అని చింతపడుతుంది

అనంతమైన బాధతో అమావస్యలా నేనుంటే
చందనాలు చల్లే చందమామౌతుంది

పిచ్చి అమ్మవు నీవు
పిచ్చిగా ప్రేమించడం తప్ప ఏమీ తెలియదు
అని పరిహసిస్తే
తల్లివై నీ పిల్లల్ని పెంచి చూపించు
అని తెలివిగా తన కోరిక తెలియచేస్తుంది!!

కామెంట్‌లు లేవు: