1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

27, ఆగస్టు 2010, శుక్రవారం

ప్రేమగానం




ప్రేమ... తెలుగు పలుకులోని తియ్యందనమంతా తనలోనే ఒదిగినట్లుగా ఉన్న ఎంత ఒద్దికైన పదం! రెండేరెండు అక్షరాల్లో వేనవేల నక్షత్రకాంతుల్ని వెదజల్లే ఆ చిన్ని పదం పరిధి ఏ కొలతలకూ అందనిదే. అది- ఆకాశంలా అనంతం... సముద్రంలా అగాధం... ఆ అనంతపు అంచుల్లో విహరించాలని, ఆ అగాధపు కొసల్ని అందుకోవాలని మానవాళి తపించడం, తహతహలాడటం- ప్రేమపదంలోని మహత్తు. ఓ కవితలో ఆరుద్ర అన్నట్లు- ప్రేమ అనే రెండు అక్షరాలను కలిపి చదివితే జీవితమని అర్థం. జీవిత ప్రస్థానంలో మనిషి నడవడికకు దారి చూపించే దివ్యదీపం, మనిషిని నడిపించే జీవన మంత్రాక్షరం ప్రేమ. 'జ్వాలయే దీపమునకు సర్వస్వమైనట్లు/ ప్రణయమే జీవనమున సర్వస్వమయ్యె'నంటూ గాలిబ్‌- ప్రేమతత్వంలోని ఔన్నత్యాన్ని గొంతెత్తిచాటాడు. అమ్మ చల్లని చూపు, నాన్నారి ఆత్మీయస్పర్శ, తోడబుట్టినవారి వాత్సల్య లాలన, నేస్తాల స్నేహానురాగాలు సర్వం ప్రేమమయమే. సత్యం శివం సుందరం అని పెద్దల వాక్కు. సత్యమే దేవుడు, సర్వవ్యాపి... ఆ భగవంతుడే సౌందర్యమని దాని అర్థం. ప్రేమే దైవమనీ వారు ప్రబోధించారు. సత్య సౌందర్యాల సమ్మేళనమైన దైవస్వరూపమే ప్రేమ, అది సర్వాంతర్యామి అనడానికి ఇంతకన్నా రుజువు ఇంకేముంటుంది? మానవ సంబంధాలన్నింటిలోనూ మహోత్కృష్టమైన స్నేహం, మానవీయ భావనల్లో తలమానికమైన ఆత్మీయతలే శ్రుతిలయలుగా జీవన మహతిపై మనిషి మీటే ప్రేమగానమూ సర్వవ్యాప్తమవుతుంది.

ప్రేమ బహు దొడ్డది. చాలా గడుసుది కూడా. దాని చిన్నెలెన్నో. అది- పిడికెడు పిచ్చిగుండెలో వెన్నెల జలపాతాల్నీ కురిపిస్తుంది, పెను తుపానుల్నీ రేకెత్తిస్తుంది. మధురోహలతోనూ ముంచెత్తుతుంది, మధుకీలల్నీ రగిలిస్తుంది. అలాగని- ప్రేమను అనుభూతించనివారంటూ ఉంటారా ఈ లోకంలో? 'చెలి శిరోజపుటుచ్చులో పడనట్టి హృదయము ఉన్నదా? ఉచ్చులో పడి మరల బయటికి వచ్చు హృదయము సున్నరా' అని ఏనాడో తేల్చి చెప్పాడు దాశరథి. ఏదో ఒక దశలో, ఎప్పుడో ఒకప్పుడు ప్రతిమనిషీ ప్రేమలో పడకా తప్పదు. నా నిదుర దోచిన ప్రేయసీ, నీపేరే రాక్షసి అని ముదుముద్దుగా పలవరిస్తూనే- 'పీడవొ, పిశాచమవొ, దుర్విధివొ గాని / నీవు నా దానవైతివేని అదే చాలు'నన్నంతగా ఆమెపట్ల తన అనురాగాన్ని చాటుకొనకా తప్పదు. పెళ్లి విషయంలో ఏమోకానీ, ప్రేమ దగ్గరకొచ్చేసరికి మాత్రం ఆడపిల్ల ఇంటివారిదే పైచేయి! కోటనేలే రాజయినా, తోటమాలి రాముడైనా- ప్రేమను సాధించుకోవాలంటే నానాపాట్లు పడాల్సిందే. సాక్షాత్తు పరమేశ్వరుడికే తప్పలేదు ఆ అవస్థ. తాను వలచిన గంగను మనువాడాలని ఉబలాటపడ్డాడు మహేశ్వరుడు. గంగ ఇంటికి మారువేషంలో వెళ్లిన ఆయన- ఆమె తల్లి మాటలకు నొచ్చుకుని వెనుదిరిగాడు. ఇదంతా తండ్రికి చెప్పి, ఈశ్వరుడికే తనను అర్పించమని వేడుకొంది గంగ. శివుడు మారువేషంలో ఎందుకు వచ్చినట్లు అంటూ గంగ తండ్రి- 'తాను రాకుంటేను తగు పెద్దలను పంపి/ అబలనర్పించమని అడిగించరాదా?/ ... నాకు నమ్మకముగా నాగకంకణధరుడు/ నిజరూపుగా వస్తె నిను పెండ్లి సేతు'నని కుమార్తెను బుజ్జగించాడు. ఆ తరవాత ఆయన- మగపెళ్లివారి పెద్దలుగా మునుల్ని తనవద్దకు పంపిన శివయ్యకు కూతురునిచ్చి పెళ్లి చేయడం... తెలుగు జానపదుల శివానందలహరి!

పిడికిలి మించని హృదయంలో కొండంత ప్రేమ ఏ క్షణాన, ఎందుకు, ఎలా తిష్ఠ వేసుకు కూర్చుంటుందన్నది- ఎవ్వరూ పూరించలేని ప్రహేళిక. ఏదో అధికారం ఉందన్నట్లుగా, ఏ అనుమతీ అక్కర్లేదన్నట్లుగా ఉన్నట్టుండి వచ్చి కవ్వించే దాని దర్జాయే వేరు. అది, ఆత్రేయ కవిత్వీకరించినట్లు- 'తొలి పొద్దు వెలుగల్లే కనిపించి, తొలి జన్మరుణమేదో అనిపించి...' అప్పటివరకు తెరవని తలుపుల్ని తెరిపిస్తుంది. మైమరపించే చిరు అలికిడితో గుండెను అలరిస్తుంది. చెప్పాపెట్టకుండా బంధాన్ని తెంచుకుని అంతే హఠాత్తుగా నిష్క్రమిస్తుంది. ఎదలో పెనుమంటల్ని రేపి కలల బూడిదరాసుల్ని మిగిలిస్తుంది. అయితేనేం! సఫలమైనా, విఫలమైనా ప్రేమ నిత్యనూతనమైనదే. అజరామరమైనదే. మనసు దక్కకపోవచ్చు. మనసైన మనిషీ దూరం కావచ్చు. అయినా- రక్తంలో కలగలిసిపోయిన ఒక రూపం అనునిత్యం కళ్లలో మెదులుతూనే ఉంటుంది. నరాల్ని మీటిన ఓ చిరునవ్వు గుండెకింద ప్రతిక్షణం వినపడుతూనే ఉంటుంది. కళ్లతోనే చెప్పుకొన్న వూసులు మౌనంగా ఎప్పటికీ పలకరిస్తూనే ఉంటాయి. ప్రేమ శాశ్వతత్వాన్ని చాటుతూనే ఉంటాయి. ప్రేమది మౌనభాష. 'గుండెల్లో గూడు కట్టుకున్న ప్రేమను చీటికీ మాటికీ బయటకు చెప్పుకొంటామా అమ్ముకుట్టీ...!' అన్నది ఓ పాత్ర నోట ముళ్లపూడి పలికించిన మాట. జర్మనీ వాసులు అలా అనుకోకపోవడం- ఓ విషాదానికి దారితీసింది. ఆ దేశంలో ఒక సంస్థవారు 'లవ్‌ పెరేడ్‌' (ప్రేమవేడుక) పేరిట ఇటీవలో ఉత్సవం నిర్వహించారు. మైదానంలో ఒకవైపు- ప్రేమ జంటలు సంబరాల్లో మునిగి తేలుతున్న సమయంలో, మరోవైపు- ఆ మైదానానికి దారితీసే సొరంగమార్గం వద్ద జరిగిన తొక్కిసలాటలో 19మంది చనిపోయారు. వారందరూ పందొమ్మిది, నలభైఏళ్ల మధ్య వయసులోనివారే. ప్రేమికుల కోసం నిర్వహించిన సంగీతోత్సవంలో- ప్రేమగానం రవళించాల్సిన చోట మృత్యుఘోష వినబడటం గుండెల్ని కలచివేసేదే!
(ఈనాడు, సంపాదకీయం, ౦౧:౦౮:౨౦౧౦)
___________________________

కామెంట్‌లు లేవు: