డా.వైదేహీ శశిధర్ గారితోనూ, వారి కవితలతో నాకు చాలా కొద్దిపాటి పరిచయం...తిలక్ గళంలో ఆయన కవిత పోస్ట్ పెట్టినప్పుడు పరిచయమయ్యారు. రెండు మూడు వాక్యాలు రాసినా వాటిల్లో ఎంతో ఆత్మీయత, అభిమానం దాగిఉంటాయి. కొన్ని పరిచయాలు ఇచ్చే మనోబలం మాటల్లో చెప్పలేనిది.
కవిత్వాన్ని విశ్లేషించేంత భాష నాకు రాదు కానీ వైదేహిగారి కవితలు చదివినప్పుడల్లా అవి నా మనసుని తాకుతాయి, వాటిల్లోని దగ్గరితనం మనసు మూలల్లో దాగున్న ఎన్నో భావాలను తట్టిలేపుతాయి.వైదేహిగారు కవితా సంకలనం "నిద్రిత నగరం" గురించి ఇక్కడ చూడవచ్చు.
కౌముది ఆగష్టు సంచిక లో ప్రచురితమైన వైదేహిగారి కవిత "మిత్రచ్ఛేదం" నాకు బాగా నచ్చింది. వారి అనుమతితో అది ఇక్కడ రాస్తున్నాను..
"మిత్రచ్ఛేదం"
పూర్తిగా ఆలపించకుండానే
అర్ధంతరంగా ఆపేసిన రాగాలు
కొన్ని పరిచయాలు. అభిమానంతోనో అతిశయంతోనో
ఎప్పటికీ పూర్తి చేయని
జుగల్బందీలు కొన్ని స్నేహాలు.
అసహనంతోనో అపనమ్మకంతోనో
మధ్యలోనే ముగించిన రహదారి ప్రయాణాలు
మరికొన్ని పరిచయాలు.
మొత్తంగా రేకులు విడవకముందే
తన పరిమళంతో
జ్ఞాపకాలను వెలుగించే స్నేహపుష్పాలని
అహాల పోరాటం వల్లో అమాయకమైన అజ్ఞానంతోటో
కొనగోటితో చటుక్కున త్రుంచేసే
వేన వేల హస్తాలు !! ***
వైదేహిగారి కవితల్లో నాకు నచ్చిన మరో కవిత "నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య "
వైదేహిగారు రాసిన మరిన్ని కవితలు ఇక్కడ చూడవచ్చు.
అనుమతినిచ్చిన వైదేహిగారికి ధన్యవాదాలతో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి