1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

21, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఏం పంట పండించావు సుగుణమ్మా!

ఏం పంట పండించావు సుగుణమ్మా!

పెద్ద రైతులు ముక్కున వేలేసుకున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు అబ్బురపోయారు. ఇక్రిశాట్ అధికారులు ఇప్పటికీ ఆ రహస్యాన్ని కనిపెట్టలేకున్నారు. ఇంగ్లండు నుంచి ఓ సైంటిస్టు పరుగు పరుగున వచ్చి వాలిపోయాడు. అమెరికా వాళ్లయితే రండి రండంటూ ఇప్పటికే కబురుపెట్టేశారు. మన మంత్రులు సైతం సచివాలయానికి పిలిపించుకొని సన్మానంతో ముంచెత్తారు. ఈ ఘనతంతా దక్కింది ఎవరికో కాదు. అక్షరం ముక్కరాని దుద్దెడ సుగుణమ్మకు. వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కట్కూర్‌కు చెందిన ఈమె శ్రీ వరి సాగుతో ఎకరాకు 65 బస్తాలు పండించి సంచలనం సృష్టించింది..

"ఏమో సార్, నాకు ఇంత పేరొస్తదని తెల్వదు. క్రాప్ సంస్థ సార్లు వారం కిందట మా ఇంటికాడికి కారు తీసుకొచ్చిండ్రు. నేను బాయికాడున్నా. ఊర్లో వాళ్లు చెబితే ఇంటికొచ్చి కారెక్కిన. హైదరాబాద్‌కు వచ్చినంక మంత్రులు రఘువీరారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యల దగ్గరికి తీసుకొచ్చిండ్రు. మంచిగా సన్మానించిండ్రు. 'మహిళవై ఉండి ఎంత మంచి సేద్యం చేశావమ్మా! ఎకరాకు అన్ని బస్తాలు వరి పండించడం మాటలు కాదు.. నువ్వు రైతులందరికీ ఆదర్శం..' అని మంత్రులు, ఆఫీసర్లు నన్ను పొగిడిండ్రు. నాకు చానా సంతోషమేసింది.

ఇంతకు ముందు కూడా చుట్టుపక్కల ఊర్లోళ్లు మా పొలంకాడికి వస్తనే ఉండారు. రైతులు, శాస్త్రవేత్తలు, విదేశాలోళ్లు.. ఎవ్వరెవ్వరో వస్తుండ్రు. భూమిని నమ్ముకున్న నాకు ఇంత పేరొస్తదని ఊహించలే. ఎకరాకు 60 నుంచి 65 సంచులు (బస్తాలు) వరి పండించినందుకు అమెరికోళ్లు కూడా పిలిచిండ్రు. ఆడికెళ్లి నేను సేద్యం ఎలా చేశానో చెప్పమన్నరు. అక్టోబరులో అమెరికా పోతున్నా. కౌలుకు తీసుకొని..
మాది వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూర్. సొంతభూమి లేదు. తినేటందుకు సచ్చేటోళ్లం. కూలికిపోతేనే ఆ రోజు గడిచేది. ఇంట్లో నా మొగుడు, నేను గొడవలు పడుతుండేవాళ్లం. పేదరికమే మా ఇద్దరి మధ్యా తండ్లాట పెట్టేది. మా కష్టాలను చూసి నా కొడుకు మందుతాగి సచ్చిపోయిండు. ఏడేళ్ల కిందట జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ నన్ను మెలిపెడతానే ఉంది.

ఇప్పుడు ఇంట్లో ముగ్గురు పెళ్లికాని కూతుళ్లు ఉన్నారు. పదేను సంవత్సరాల నుంచి వ్యవసాయ కూలి పనులతోనే బతుకు నడిచింది. కూలితోనే బతకలేక కౌలుకు చేద్దామనుకున్నాను. మా ఊరాయన బండి మల్లారెడ్డి పొలాన్ని కౌలుకు తీసుకున్నాను. భూమోళ్లకు ఎకరాకు 12 వేలు ఇస్తున్నా. నా భర్త ఐలయ్యతో కలిసి నేను సేద్యం చేస్తున్నాను. క్రాప్ సంస్థ సాయంతో..
రెండెకరాల్లో వరి పంట పెట్టనీకి పెట్టుబడి కావాల. నా దగ్గరైతే పైస లేదు. కానీ, ధయిర్యం ఉంది. రెక్కలొంచి పనిచేస్తా. దుక్కిదున్నుత. కలుపుతీస్తా. కోతలు కోస్తా. ఏ టైముకు నీళ్లు పెట్టాలె, ఏ టైముకు ఎరువెయ్యాలె అన్నీ తెలుసుకున్నా. పొలమే మనకు అన్నీ నేర్పిస్తది. ధర్మంగా కష్టపడాల అంతే! ఊరోళ్లంతా.. "సుగుణమ్మ పొలంలో ఏమేసి పండిస్తదో ఏమో, అందరికంటే ఎక్కువ వరి పంట పండిస్తది..'' అంటనే ఉంటారు. అవేమీ నేను పట్టించుకోను. అప్పటికైతే ఎకరాకు 35 బస్తాలలోపు పండించేదాన్ని. ఒక రోజు బాయికాడికి పోతున్నా. ఊర్లోకి క్రాప్ స్వచ్ఛందసంస్థ ఆఫీసర్లు, సర్పంచు, పెద్ద రైతులు మీటింగు పెట్టిండ్రు. పంటల గురించే మాట్లాడుకుంటుండ్రు.

నాకేమీ అర్థం కాక బాయికాడికి వెళ్లిపోతిని. మరుసటిరోజు మీటింగుకు వెళ్లిన. అక్కడ శ్రీ వరి సాగు పద్ధతుల్ని చెబుతుండ్రు. నేను మెలకువగా అన్నీ మనసుపెట్టి విన్నాను. మా పొలంలో కూడా శ్రీ వరి సాగు చెయ్యాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. ఎలా సాగు చెయ్యాలో క్రాప్ సంస్థ వాళ్లు చెప్పారు.ఎకరాకు 65 బస్తాలు పండించిన విషయం అమెరికా వాళ్లకు ఎట్ల తెలిసిందో తెలిసింది. అందుకే రేపు నెలలో అక్కడ జరిగే అంతర్జాతీయ సదస్సుకు రమ్మన్నారు. పాస్‌పోర్టు, వీసా పనులన్నీ క్రాప్ సంస్థ వాళ్లే చూస్తున్నరు. అమెరికా ఎక్కడుందో నాకు తెల్వదు. ఎట్ల పోవళ్లనో కూడా తెల్వదు. ఆడికి పొయ్యినంక మా కట్కూరు పొలం గురించి చెబుతాను.

శ్రీ వరితో సిరులు..
మాకు కాడి ఆవులు, బర్రెగొడ్డు ఉన్నాయి. ఆవులతోనే నేను సేద్యం చేస్తున్నాను. సాధారణంగా ఎకరా వరి పంటకు 30 కిలోల విత్తనాలు కావాలి. ఆరు బస్త్తాల ఎరువులు, డబ్బాలకు డబ్బాలు మందులు చల్లాలి. శ్రీ వరి సాగులో అయితే ఎకరా వరిపంటకు 2 కిలోల విత్తనాలే సరిపోతయి. డీఏపీ, యూరియా, పొటాష్ మూడు సంచులైతే చాలు. నాలుగుసార్లు దుక్కిదున్ని, పశువుల ఎరువులు వేసి రెండెకరాలు నాట్లు వేసినాను. ఈ సాగులో కలుపు కూడా ఉండదు. కూలోళ్లు తక్కువ పడతారు. సాగునీళ్లు కూడా ఎక్కువ అవసరం లేదు. ఇన్ని అనుకూలాలు ఉన్నప్పుడు శ్రీవరి సాగు మేలని దీన్నే నమ్మినాను.

కొందరు రైతులు శ్రీ వరిసాగును ఇష్టపడకున్నాసరే, నేను మాత్రం ధైర్యంగా ఈ పద్ధతిలోనే సాగుచేస్తున్నా. బీపీటీ 64 రకం వరి వేస్తుంటాను. రసాయన మందులు పిచికారి చెయ్యను. వర్షాకాలంలో తెగుళ్లు వస్తే, వేప నూనె చల్లుతాం. లేదంటే, పాలకొడుసు ఆకు మెత్తగా దంచి పొలంలో వేస్తాం. పొద్దున లేస్తే రాత్రిదాక పొలంలోనే కష్టపడతా. మొన్న వరిపంట కోతలయ్యాక కొలిస్తే, ఎకరాకు 65 బస్తాలు అయ్యాయి. మా ఊరితోపాటు చుట్టుపక్కల ఊర్లోళ్లందరికీ ఈ విషయం తెలిసిపోయింది. అందరూ నా పొలం చూడనీకి రోజూ వస్తనే ఉండారు. పెద్ద పెద్ద రైతులు కూడా నేను పంట ఎలా పండించానో అడిగి తెలుసుకుంటుండ్రు. క్రాప్ సంస్థ ఆఫీసరు లింగయ్య, పరుశురాం నాకు మంచిగ సాయం చేసిండ్రు. ఇంగ్లండు శాస్త్రవేత్తలు వచ్చి..
మొన్న ఏప్రిల్‌లో ఇంగిలాండు (ఇంగ్లండు) శాస్త్రవేత్త మార్టిన్ కూడా మా పొలాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఎక్కువ మందులు వాడకుండా ఇంత పంట ఎలా తీశావ్? అని ఆయన ఇంగ్లిషులో అడిగితే, నేను తెలుగులో చెప్పిన. మధ్యలో ఉన్నవాళ్లు ఇంగ్లిషులో ఆయనకు నా మాటల్ని చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది.. 'ఎక్కడ సుగుణమ్మ, ఎక్కడ ఇంగిలాండు' అని.

నాకు అచ్చరం రాదు. అలాంటిది నా సేద్యం గురించి తెలుసుకొనేటందుకు మా ఊరు రావడం ఎంతో సంతోషమేసింది. నా సేద్యాన్ని చుట్టుపక్కల ఊర్లలోని రైతులకు చెప్పాలని క్రాప్‌సంస్థ వాళ్లు నన్ను జీపులు, కార్లల్లో తీస్కపోతుంటారు. ఇప్పటికి నాలుగు మండలాల్లోని ఊర్లన్నీ తిరిగినా. తక్కువ నీళ్లు, ఎరువులతోనే మంచి పంట ఎలా తీయాలో చెబుతున్నాను. రైతులందరూ బాగా వింటున్నరు. నన్ను చూసి చానామంది శ్రీ వరిసాగు మొదలుపెట్టిండ్రు. అప్పుడప్పుడు ఇక్రిశాటోళ్లు వచ్చి సలహాలు ఇచ్చేవాళ్లు. కట్కూరు నుంచి అమెరికాకు..
ఎకరాకు 65 బస్తాలు పండించిన విషయం అమెరికా వాళ్లకు కూడా ఎట్ల తెలిసిందో తెలిసింది. అందుకే రేపు నెలలో అక్కడ జరిగే అంతర్జాతీయ సదస్సుకు రమ్మన్నారు. పాస్‌పోర్టు, వీసా పనులన్నీ క్రాప్ సంస్థ వాళ్లే చూస్తున్నరు. అమెరికా ఎక్కడుందో నాకు తెల్వదు. ఎట్ల పోవల్లనో కూడా తెల్వదు. ఆడికి పొయ్యినంక మా కట్కూరు పొలం గురించి చెబుతాను. నేను ఎట్ల పంట తీస్తున్ననో వివరిస్తా.

అమెరికా వెళ్లేందుకు మంత్రి పొన్నాల లక్ష్మయ్య 50 వేలు ఇచ్చారు. "ఏం పంట పండించావ్ సుగుణమ్మా..!'' అని అందరూ మంచిగ అంటున్నరు సంతోషమే. కానీ, ఎవ్వరైనా నాకు కాసింత సొంత పొలం ఇప్పించి పుణ్యం కట్టుకోరాదూ. నేను అందరికీ ఎంత ఆదర్శ రైతునైనా ఇంట్లో ముగ్గురు ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చెయ్యాలిగా..!'' అని ముగించింది

కామెంట్‌లు లేవు: