1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

9, అక్టోబర్ 2010, శనివారం

చిన్ని చిన్ని కన్నయ్యా..

ఏడు పదుల జీవితం.. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో ముళ్ళు..మరెన్నో పూలు.. స్వర సామ్రాజ్యంలో అధిరోహించిన శిఖరాలు ఎన్నో ఎన్నెన్నో.. భక్తి గీతం ఆలపిస్తున్నప్పుడు ఆ స్వరంలో వినిపించే ఆర్తి, విషాద గీతానికి స్వరం అందించేటప్పుడు అలవోకగా తొణికిసలాడే భావోద్వేగం అనితర సాధ్యం. కట్టసేరి జోసెఫ్ ఏసుదాస్ అంటే చాలా మందికి తెలియక పోవచ్చేమో కానీ.. కేజే ఏసుదాస్ అన్నా, క్లుప్తంగా జేసుదాస్ అన్నా ఆ పేరు వినగానే మొదట గుర్తొచ్చేది ఓ హృద్యమైన స్వరం..




పాటల ప్రవాహం చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న క్షణాలివి. ఆ స్వరరాగ గంగా ప్రవాహంలో మునక వేయగలగడమూ ఒక అదృష్టమే. కె. బాలచందర్ అపూర్వ సృష్టి 'అంతులేని కథ' నాకు చేరువ చేసిన ఇద్దరిలో ఒకరు జేసుదాస్. 'దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..' పాట వస్తున్నప్పుడు తెరమీద కనిపిస్తున్న దృశ్యం లో కన్నా వినిపిస్తున్న గొంతులోని ఆర్ధ్రతే ముందుగా మనసుకి తాకింది. సినిమా పూర్తయినా ఆ గొంతు వెంటాడుతూనే ఉంది.. అది కేవలం ప్రారంభం.. ఆ తర్వాత ఎన్ని పాటలో..

రేడియోలో జేసుదాస్ పాట వస్తూ ఉంటే, ఎంత అర్జెంటు పని ఉన్నా పాట పూర్తయ్యేవరకూ కదలకపోవడం నిన్ననో మొన్ననో జరిగినట్టుగా ఉంది. గ్రామ ఫోన్ రికార్డు మీద గడ్డం తో ఉన్న జేసుదాస్ ఫోటో ఇంకా తడి ఆరని జ్ఞాపకం లాగా ఉంది. జేసుదాస్ పాటలు ఉన్న ఆడియో కేసెట్ల టేపులు తెగిపోవడం రాను రాను చాలా మామూలు అనుభవం అయిపోయింది.. మామూలు సందర్భాలలో కన్నా మనసు బాగోలేనప్పుడో, బరువెక్కినప్పుడో జేసుదాస్ పాటలు వినడం ఓ గొప్ప అనుభవం.. ఘనీభవించిన దిగులునంతటినీ ఓ చిన్ని కన్నీటి చుక్కగా మార్చి చెక్కిలి చివరి నుంచి జార్చేయగలగడం ఆ స్వరం చేసే మాయాజాలం.

యాభయ్యేళ్ళ కెరీర్ లో జేసుదాస్ పదిహేడు భాషల్లో నలభైవేల పాటలు పాడినా, నేను విన్నవి - కేవలం మూడు భాషల్లో - కొన్ని వందలు మాత్రమే. వాటిలో ఒక్కసారి మాత్రమే విన్నవి బహుశా లేవేమో. తను తెలుగు వాడు కాదు అన్న విషయం తెలిసింది అతి కొద్ది సందర్భాలలో మాత్రమే.. అదికూడా అతి చిన్న ఉచ్చారణా దోషాల వల్ల. భాష, భావం విషయంలో జేసుదాస్ తీసుకునే శ్రద్ధ పరభాషా గాయకులందరికీ ఆదర్శనీయం.

జేసుదాస్ పాటలు విని ఆనందిస్తూ, కేవలం తన పాటల కోసమే ఇష్టం లేకపోయినా కొన్ని సినిమాలు చూస్తున్న నాకు జేసుదాస్ కచేరీకి హాజరయ్యే అవకాశం వచ్చినప్పుడు అదృష్టం నా ఇంటి తలుపు తట్టినట్టు అనిపించింది. నిజానికి ఇప్పటివరకూ ఆ అదృష్టం రెండుసార్లు కలిగింది నాకు. మొదటిది శాస్త్రీయ సంగీత కచేరీ కాగా, రెండోది భక్తి సంగీత విభావరి. రవీంద్రభారతి స్టేజిపై డిం లైట్ల కాంతిలో శ్వేత వస్త్రధారియై "వాతాపి గణపతింభజే.." తో ప్రారంబించి దాదాపు రెండున్నర గంటలపాటు సాగించిన కచేరీ యావత్తు ప్రేక్షకుల్నీ ఏవేవో లోకాల్లో తిప్పి తీసుకొచ్చింది.

రెండోది ఓ ఆరుబయటి పందిరిలో జరిగిన అయ్యప్పభజన. భక్తి పూరిత వాతావరణం. "శరణమయ్యపా.." అంటూ జేసుదాస్ గళం విప్పగానే పరమ నాస్తికులు సైతం భక్తి పారవశ్యంలో మునిగిపోక తప్పదనిపించింది. వినాయకుడిని స్తుతించినా, అయ్యప్ప పాటలు పాడినా, సాయిబాబా లీలలు వర్ణించినా అవన్నీ జేసుదాస్ గొంతులో కొత్తగా వినిపిస్తాయి నాకు. ఆ గొంతులో వినిపించే ఆర్తి కట్టి పడేస్తుంది నన్ను. మంచు వర్షంలా కురుస్తున్న ఆ ధనుర్మాసపు రాత్రి, జేసుదాస్ భక్తిగాన వర్షంలో తడవడం ఓ జీవితకాల జ్ఞాపకం.

ఊహించని అదృష్టం ఎదురైనప్పటికీ ఇంకా ఏదో కావాలనుకోడం మానవ నైజం కదా.. అందుకేనేమో, ఓ కోరిక చిన్నగా మొలకెత్తి మెల్లగా మహా వృక్షమయ్యింది.. కొన్ని క్షణాలు..కనీసం అతి కొద్ది క్షణాలైనా జేసుదాస్ తో మాట్లాడాలని.. ఆయన అలవాట్లని గురించి తెలుసుకున్నప్పుడు ఇది సాధ్యమయ్యే పనిలా అనిపించలేదు.. కానీ ఏమో.. ఎవరికి తెలుసు? ఎప్పటికైనా సాధ్యమవుతుందేమో.. జేసుదాస్ శతాధిక జన్మదినాలు జరుపుకోవాలని, అత్యధికకాలం మధురమైన గొంతుతో పాటలు పాడిన గాయకుడిగా కొత్త రికార్డు స్థాపించాలనీ మనస్పూర్తిగా కోరుకుంటూ..

కామెంట్‌లు లేవు: