1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

19, అక్టోబర్ 2010, మంగళవారం

నీవు సేవ చేస్తున్నావు అనే విషయం మరచే వరకూ సేవ చేస్తూనే వుండు--మాస్టర్ ఇ.కె (Have to read)

మన చుట్టూ వున్న వారికై చేయు సేవయే దైవమునకు చేయు సేవ. ఆ బృందము కుటుంబము కావచ్చు, లేక మనమున్న సంఘము కావచ్చు. "జీవునకు చేయు సేవయే మాథవునకు చేయు సేవ" ఒక్కనిగా వున్న దైవ ధ్యానము నుండి మన చుట్టూ వున్న సంఘ ప్రజ్ఞగా దైవ ధ్యానమును పెంచుకొనవలెను. దైవమును ఒక్క గురువు యందే కాక సమస్తము నందు దర్శించవలేను. అప్పుడు దైవము విశ్వాత్మకుడై జగద్గురువై దర్శనమిచ్చును. అదే సమన్వయమునకు మూల సూత్రము. మానజాతి పరిణామమునకు సంకల్పించిన వరుణుడు (ఈ తత్వము యురేనస్ గ్రహము ద్వారా పనిచేస్తుంది) జీవులకు యజ్ఞార్థ జీవనాన్ని తప్పని సరి చేస్తాడు.

సేవను గూర్చి మనం అనేక చోట్ల చదువుతూ వుంటాం, వింటూ వుంటాం. ఎక్కువగా మాట్లాడే వాడు తక్కువగా పని చేస్తాడని గ్రహించాలి. ఎక్కువగా చెప్పటం వల్ల ఏమీ ఉపయోగం లేదు. తోటి వానికి సహాయమందించటానికి అనేక మార్గములున్నాయి. ఫలితమాసింపక ఇతరులకు సహాయ పడే వాడు ఉత్తమైన అభివృద్దిని పొందుతాడు. అభివృద్ది కోసం సేవ చేయరాదు. అందరికన్నా నేను ముందు, అందరికన్నా నాకే ఎక్కువ ఉండాలి అనే భావము యజ్ఞార్థ జీవనానికి పెద్ద అవరోథము. నిస్వార్థ సేవ ఎంత పెరిగిన అంత వెలుగు, అభివృద్ది సేవకునకు పెరుగును. దానికోసం ప్రాకులాడనవసరం లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా యజ్ఞార్థ జీవనానికి పెద్ద పీట వేసినాడు. దైవమును చేరు మార్గముగా చెప్పినాడు. మనలోని కర్మ ప్రక్షాళనకు అదియే సరియైన మార్గము.

ఇటువంటి జీవనమునకు కావలసినది గొప్ప సంకల్ప శక్తి మరియు సంసిద్దత. సేవ చేయవలసినది ఒక్క మానవులకే కాదు. తన చుట్టూ వున్న జంతువులకు, వృక్షములకు మరియు లోహములకు కూడా. అసలు మానవ జన్మ సేవ కొరకే. పరమ గురువులు ఈ 21వ శతాబ్దాన్ని "Century of Charity" అని నామకరణం చేసారు. ధనిక దేశాలన్నీ కూడా ఉన్నది పది మందితో పంచుకోనక పోతే మనుగడ వుండదు అని తెలుసుకుంటాయి. మనం సుఖంగా వుండాలంటే మన చుట్టూ వున్న వారుని కూడా చూచుకోవాలి కదా! తోటి జీవిని నిరాకరించిన వారికి ఉన్నత పరిజ్ఞానం కలుగుటకు అవకాశము లేదు.

ఆధ్యాత్మిక మార్గములో ఉన్నతిని ఆశించువారు చేయవలసినది యజ్ఞార్థ జీవనమే. అది నిస్వార్థమై వుండాలి. తన జీవితమునకు అవసరమైనంత వరకు మాత్రమే గ్రహించి తోటి జీవులకు సేవ చేస్తూ జీవనము కొనసాగించాలి.

భగవంతుడు కరుణామయుడు. ఆర్తితో ప్రార్థించిన వానిని అనుగ్రహిస్తాడు. సమస్తము తానై నడిపిస్తాడు. అందుకు సాథకుడు సంసిద్దుడై నిస్వార్థమైన యజ్ఞార్థ జీనము సాగిస్తూ తన చుట్టూ వున్న వారికై జీవించాలి. తన కర్తవ్యాన్ని ఎట్టి పరిస్థితులలోనూ వదల కూడదు. కర్తవ్యమే భాధ్యత. బంధం బందిస్తుంది. భాద్యత బంధ విముక్తుడ్ని చేస్తుంది. ఇటువంటి జీవనము వలన ప్రపంచము బృందావనమై వసుదైక కుటుంబమై వర్థిల్లుతుంది.



చుట్టూ వున్న వారికి సాధకుడు ఎంత సహాయకారిగా వున్నాడు అను దానిని బట్టి అతని సాధనలో ఎంత వరకు వచ్చాడో తెలుస్తుంది. అందరి కన్నా నేను వేరు అన్న భావన దాటని వాడు బృందముతో సరియైన సంబంధము కలిగి యుండలేడు. ఒక్క రోజులో ఆ భావన దాటటం సాధ్య పడదు. దానికి తనకు తాను నియమించుకున్న క్రమశిక్షణ ఎంతో అవసరం. తన అవసరముల కన్నా తన చుట్టూ వున్న వారి అవసరములు ముఖ్యము. వారి అవసరములకే ఎక్కువ ప్రాముఖ్యత ఉండవలెను. వారు ముందు తను తర్వాత.

ఒక మనిషితో ఇంకొకరికి పడకపోవటం సహజం కదా! ఎంత పడక పోవటం అంత జబ్బు. ఎంత కలుపుకొని అందరితోనూ హాయిగా వుండటం అంత ఆరోగ్యం. మనలో చైతన్యం కరుడుగట్టిన కొద్దీ మనకు ఎవరూ నచ్చరు. వాళ్ళు కలవరు, కలుద్దాం అనుకొనేవారికి కలుపుకోరు. అది ఒక దుస్థితి. అటువంటి వారు మనకు ఎవరూ లేరు అనే భావల్లో జీవిస్తూ వుంటారు.

ధనం అంటే ఎమిటి? నిజమైన ధనం అంగ బలం. మోసుకెళ్ళటానికి కనీసం నలుగురుండాలి అనే నానుడి వున్నది కదా! ఎప్పుడూ జీవితంలో ఒక వంద మంది ఉన్నారనుకోండి, అంతకన్నా సంపద ఏముంది. ఎంత ధనమున్నా ఒంటరి వాడికి సహాయమందదు. పది మందికి పనికొచ్చే జీవితమే జీవితం. కలిసుండే జీవితమే జీవితం. కలసిమెలసి జీవించి ఉండటమే మార్గం. ఈ యుగంలో మనుషులు కలసిమెలసి ఉంటే సుఖపడతారు అనే సందేశము ప్రథానంగా వరుణుడిచ్చే సందేశము. ఈ విథమైన జీవనం ఇంకా మన భారత దేశములో మిగిలివుంది. పాశ్చాత్య దేశములలో చాలా తక్కువ. వాళ్ళను చూసి మనం కూడా పాడై పోతున్నాం.

వేర్పాటుకే మనసొప్పుతుంది కాని, కలవడానికి మనసొప్పుకోదు. అంటే, కలి పనిచేస్తున్నాడని అర్థం. ఎంత కలవడానికి మనస్సు ఉఱ్ఱూతలూగుతుందో అంత కల్కి పని చేస్తున్నాడని అర్థం. కలిసి జీవించడం జరిగినప్పుడు వ్యక్తిగత చైతన్యం సామూహిక చైతన్యంలో మునుగుతుంది. ఎలాగంటే ఒంటరితనం బాగా అనిపించినపుడు అలా బయట (అంటే జన సమర్థం బాగా ఉన్న ప్రదేశాల్లో) తిరిగి నపుడు మనసు హాయిగా వుండి ఆనందం కలుగుతుంది. పెద్ద చైతన్యంలో చిన్న చైతన్యం మునిగి నపుడు హాయి, ఆనందం కలుగుతాయి.

ఒంటరి జీవనము ఈ కుంభ యుగములో ఒక శాపము. ఎందుకంటే బృంద జీవనము కుంభ యుగపు లక్షణము. కలసిమెలసి జీవించటములో శక్తి ప్రసారము బాగా వుంటుంది. దానివల్ల మనలోపల లోలోపల వున్న శక్తి ప్రసార అవరోధకములు తొలగింప బడతాయి. అందరికి దూరముగా ఒంటరిగా ఉండాలి అనేది కూడా ఒకరకమైన అవరోధము. ఎకాంతము అవసరము కాని, ధ్యానము కొరకు పర్వతముల పైకి, అరణ్యములలోనికి వెళ్ళటం వలన ఉపయోగము లేదు. ఎకాంతము వేరు, ఒంటరితనము వేరు. ఎకాంతము మానసికమైనది, ఒంటరితనము భౌతికమైనది. అందరితో సరియైన సంబంధములను ఏర్పరచుకొని స్వార్థము లేక అందరికొరకు జీవించుటయే యజ్ఞార్థ జీవనము. చిన్న, పెద్ద భేధము లేక అందరియందు సమ భావము కలిగి యుండవలెను. కనుకనే శ్రీకృష్ణుణ్ణి బృందావన విహారి అంటారు. ఎక్కడ చక్కని అన్యోన్యమైన బృంద జీవనము ఉంటుందో అక్కడ శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహము ఉంటుంది. అదియే ముక్తికి మార్గము--మాస్టర్ ఇ.కె


Thanks & Regards
Sreenivasa Prasad Rao Sarvaraju| Financials -TQC | ssarvaraju@capitaliq.com<mailto:ssarvaraju@capitaliq.com> |
________________________________
Capital IQ, Inc., a division of Standard and Poor's

కామెంట్‌లు లేవు: