1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

28, నవంబర్ 2010, ఆదివారం

మనం మానవులమేనా?

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

 

 

 

నదులు, చెట్లు, కొండలు మన భూమికి సంపదలు. నదులు జీవజలంతో మనల్ని పోషిస్తున్నాయి. పంటలు పండిస్తున్నాయి. మనల్ని బ్రతికిస్తున్నాయి. చెట్లు మనకు ఆక్సిజన్ ఇచ్చి కాపాడుతున్నాయి. కళ్లకు ఇంపుగా చక్కటి వాతావరణాన్నిస్తున్నాయి. నీడనిస్తున్నాయి. పూలను కాయలను ఇస్తున్నాయి. వర్షాన్ని ఆకర్షిస్తున్నాయి. కొండలు పర్యావరణాన్ని రక్షిస్తున్నాయి. మేఘాల్ని అడ్డుకుని వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఇవన్నీ కలిసి మానవుని జీవనానికి సహాయపడుతున్నాయి.

మరి మనమేం చేస్తున్నాం? చెట్లను కొట్టేస్తున్నాం. జీవనదుల్ని పబ్లిక్ టాయిలెట్లుగా మారుస్తున్నాం. కొండలు లీజుకిచ్చి తవ్విస్తున్నాం. చివరికి ఇసుకను కూడా అమ్ముకుంటూ దానికోసం కొట్టుకుంటున్నాం. ధనదాహంతో, దురాశతో, కృతజ్ఞతాలేమితో మనల్ని తల్లిలాగా పోషిస్తున్న ప్రకృతిమాత పట్ల రాక్షసులలాగా ప్రవర్తిస్తున్నాం. ఇదీ మన నిర్వాకం.

జీవనదుల్ని సిగ్గులేకుండా పాడు చెయ్యటంలో ప్రపంచం మొత్తంమీద తెలుగువారికి ప్రధమ బహుమతి వస్తుంది. విజయవాడ దగ్గర కృష్ణానదిని ఉదయాన్నే గనక చూస్తే దానికంటే పబ్లిక్ టాయిలెట్ కాస్త మెరుగు అనిపిస్తుంది. దీనికంటే గోదావరి కాస్త నయం. గోదావరి తీర వాసులు కృష్ణా తీరవాసుల కంటే విషయంలో కాస్త మెరుగు.

అయ్యప్ప సీజన్ లో శబరిమల వద్ద పంపానదిని చూస్తే వాంతికొస్తుంది. అంత చండాలం చేస్తారు సోకాల్డ్ అయ్యప్ప భక్తులు. పూరీలు, పులిహోర, చపాతీలు, బజ్జీలు, దద్ధోజనం ఇంకా నానా అడ్డమైన తిండీ తెగతిన్న భక్తులు, ప్రపంచం నలుమూలల్నించీ అక్కడికిచేరి, ఎక్కడో కొండల్లో పవిత్రంగా పారుతున్న నది ఒడ్డునే మలమూత్ర విసర్జన చేసి. అడ్డమైన బట్టలూ అందులోనే ఉతికి, పంపానదిని పరమ దరిద్రంగా మారుస్తుంటారు. వీళ్ళు చేసివచ్చిన దరిద్రాన్ని వదిలించుకోటానికి ప్రకృతికి మళ్ళీ ఏడాది పడుతుంది.

పుణ్యక్షేత్రాలలో కూడా చండాలపు అలవాట్లు మనల్ని వదలవు. తిరుపతిలోని కపిల తీర్ధం పవిత్ర క్షేత్రం కదా. అందులో విడిచిన డ్రాయర్లను, పంచెలను, ఇతర గుడ్డల్ని సబ్బేసి ఉతుక్కుంటున్న ప్రబుద్దుల్ని చూసి నాకు ఏమనాలో తోచక నోరు మూసుకున్నాను. కనీసం పక్కనే అదే నీళ్ళలో ఇతరులు స్నానం చేస్తున్నారన్న జ్ఞానం కూడా వారికి ఉండదు. అదేం భక్తో నాకర్ధం కాదు.

మహానందిలోని స్నానగుండం స్పటికం లాంటి స్వచ్చమైన నీళ్ళతో ఎప్పుడూ పారుతుంటుంది. అక్కడా ఇదే తంతు. విడిచిన బట్టలు ఉతకటం, సబ్బులతో స్నానాలు చెయ్యటం, అందులోనే ఉమ్మెయ్యటం ఇలాటి దరిద్రపు పనులు భక్తులే చేస్తుంటారు.

నేను అలహాబాద్ లోని త్రివేణీ సంగమానికి వెళ్ళినపుడు నాతో పాటు పడవలో వచ్చిన కొందరు తెలుగువాళ్ళు సంగమస్థానంలో కిళ్లీ నములుతూ వెకిలి భాష మాట్లాడుకుంటూ అదే నీళ్లలో ఉమ్మెయ్యటం చూచి నాకు వాళ్ళను పడవలోంచి నదిలోకి తోసి చంపేద్దామన్నంత కసి పుట్టింది. చివరికి పడవ నడిపేవాడుకూడా వీళ్లని చూచి చీదరించుకున్నాడు.

ఇతర రాష్ట్రాల భారతీయులు మనకంటే ఇందులో ఎంతో మెరుగు. కేరళ రాష్ట్రంలో ప్రవహిస్తున్న "భారత్ పుళ" నది పొడుగూతా ఎక్కడ చూచినా మలమూత్ర విసర్జన కనిపించనే కనిపించదు. మనలాగా విడిచిన గుడ్డలు అందులో ఉతకటం కూడా కనిపించదు. ఇక ఉత్తరభారతంలో గంగా నదిని ఎంత పవిత్రంగా చూస్తారో మనకు తెలిసిందే. హరిద్వార్ ఋషీకేశ్ లలో ప్రతిరోజూ గంగానదికి వేలాదిమంది హారతి ఇస్తారు. పొరపాటున మనం "గంగా" అని సంబోధిస్తే అక్కడివారు వెంటనే, "గంగా నహీ, గంగామా బోలో" అని సరిదిద్దుతారు. నది అంటే అంతటి గౌరవం ఉంది వాళ్లకు.

నీటిలో ఉమ్మివేయటాన్ని మహా పాపంగా మనువు తన " మనుస్మృతి" లో పరిగణించాడు. ఇక జీవనదులలో మలమూత్ర విసర్జన చెయ్యటం ఎంతటి మహాపాపమో ఊహించలేము. రోజూ స్నాన సమయంలో "గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే్ సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు" అని సప్త నదులను స్మరించటం భారతీయులుగా మన కర్తవ్యం.

మనల్ని పోషిస్తున్న జీవనదులను భగవంతుని రూపాలుగా, మన తల్లులుగా, భావించి వాటిని జాగ్రత్తగా కాపాడుకోమని వేదం చెప్పింది. జలాధిదేవత అయిన వరుణుని "ఇమం మే వరుణ శృధీ......" అంటూ బ్రహ్మంగా భావించింది వేదం. వేదాలను అనుసరిస్తున్నాం అని చెప్పుకునే మనం జీవనదులకు నానా భ్రష్టత్వమూ పట్టిస్తున్నాం. మానవ వ్యర్ధాలనూ, ఫేక్టరీ వ్యర్ధాలనూ, సమస్త దుర్గంధాన్నీ వాటిలోకి వదిలి నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నాం. ఇంకో పక్కన దేవుళ్లకు దొంగ పూజలు చేస్తూనే ఉంటాం. కనీసం పుణ్య క్షేత్రాలలోనైనా శుచీ శుభ్రతా పాటించం. మనం అచ్చమైన హిందువులమని ఎలా చెప్పుకోగలం?

ప్రకృతి శక్తులను భగవంతుని రూపాలుగా చూచి వాటిని గౌరవంగా కృతజ్ఞతగా వాడుకోమని వేదం ఎన్నోచోట్ల చెప్పింది. అలా చేసినప్పుడే ప్రకృతిలో భాగమైన మనిషి కలకాలం చక్కగా మనుగడ సాగించగలడు. అలాకాక ఇష్టానుసారం వాటిని పాడు ఛేస్తుంటే చివరికి మన ఉనికికే ప్రమాదం ముంచుకొస్తుంది.

చాలామంది దారిన పోతూ చెట్ల ఆకుల్ని తెంపటం, కొమ్మలు విరవటం చేస్తుంటారు. పక్కనే ఉన్న తల్లిదండ్రులు, స్నేహితులు కనీసం మందలించడం కూడా చెయ్యరు. అదేం రాక్షసానందమో అర్ధం కాదు. ఇంకొందరు చెట్ల పైన పేర్లు చెక్కడం, పిచ్చి రాతలు రాయటం, వాటికి మేకులు కొట్టటం చేస్తుంటారు. తాను కూచున్న కొమ్మను తానే నరుక్కున్న కాళిదాసు కధలా ఉంది మన కధ. ఆయనకు జగన్మాత అనుగ్రహం కలిగింది. మనకు మాత్రం జగన్మాత ఆగ్రహం మిగులుతుంది.

విచక్షణా రహితంగా చెట్లను కొట్టేయటం, వాహనాల పొగ వదలటం వల్ల ఇప్పటికే సిటీలలో ఆస్మా మొదలైన ఊపిరితిత్తుల వ్యాధులు భయానకంగా విజృంభిస్తున్నాయి. సిటీలలోని రోగాలకు సగం కారణం అక్కడున్న మనుషులకు సరిపడా చెట్లు లేకపోవటమే. ఇక కొండల్ని కూడా వదలకుండా తవ్వేసి కంకరగా మార్చి అమ్ముకుంటూ ఆనందిస్తున్నాం గాని, దానివల్ల పర్యావరణానికి ఎంతటి చేటు వాటిల్లుతోందో మనం ఊహించడం లేదు.

నదుల్ని, చెట్లను, కొండల్ని మనం ఇలాగే నిర్లజ్జగా పాడుచేసుకుంటూ నాశనం చేసుకుంటూ పోతుంటే కొంతకాలానికి భయానకమైన పరిస్తితుల్ని ప్రకృతినుంచి ఎదుర్కొనక తప్పదు. ఇప్పటికే నీళ్ళుకొనుక్కుని తాగుతున్నాం. ముందుముందు ఇంకా ఎన్నున్నాయో? మనం ఎప్పటికి తెలివి తెచ్చుకుంటామో

 

 

 

Thanks & Regards

 

S. Sreenivasa Prasad Rao

<Protect Trees—Protect yourself>

 

ప్రతి మనిషి ఒక అబ్దుల్ కలాం, ఒక రెహ్మాన్, ఒక సచిన్ కాలేకపొవచ్చు.... కాని ప్రయత్నిస్తే ఒక మదర్ తెరిస్సా కాగలరు . ఇందుకు మేధస్సు,ప్రతిభ ,కృషి అవసరం లేదు, ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉన్నా, అవసరం లో ఆదుకునే మనసున్నా చాలు.

 

 

కామెంట్‌లు లేవు: