1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

11, డిసెంబర్ 2010, శనివారం

శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి

 

           

శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి

దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో "శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజును "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా పరిగణిస్తారు. స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాము!

పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న "తారకా సురుడు" అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి, వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం శెలవిచ్చారు.

అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న జగన్మాత పార్వతికి, శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు! దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు. మొత్తం మీద మన్మధుని పూలబాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురు అయినా! పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణ భూతుడవుతాడు. కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్ధనమేరకు పునర్జీవింపబడతాడు.

ఇలా ఉండగా! పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందసమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. తేజము సమయమందు నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. రుద్రతేజమును వారు భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అంత ఆరుతేజస్సులు కలసి ఆరుముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.

బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అనియు, సుబ్రహ్మణ్యస్వామి అనియు నామాలతో పిలువసాగిరి.

కారణజన్ముడైన స్వామి పార్వతి పరమేశ్వరులు, దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, వానిని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడ్నిచేసి, తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంత స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపందాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసి, భీకర యుద్ధము చేసి తారకాసురుని సంహరించి విజయుడైనాడు.

సర్వశక్తి స్వరూపుడైన స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపిన రోజును "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"గా పరిగణిస్తారని, సర్వులకు పూజ్యనీయులైన శ్రీ వేదవ్యాసులవారు దీని విశిష్టతను వివరిస్తారు.

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్కి గ్రామాలు, పట్టణాలు అనుబేధము లేకుండా దేశం నలుమూలలా దేవాలయాలు కలవు. రోజున "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు తీర్ధములు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు.

స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని; పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు, వెండి, పూలు పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.

ఇటువంటి పుణ్యప్రదమైన "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి" నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాము.

 

కామెంట్‌లు లేవు: