1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

2, డిసెంబర్ 2010, గురువారం

దీక్షా నియమాలు







దీక్షా నియమాలు

దీక్షలో పాటించవలసిన నియమాలు :

  • దీక్షా కాలమందు బ్రహ్మచర్యము పాటించవలెను.
  • ప్రతి దినము ఉదయము సూర్యోదయమునకు ముందు సాయంకాలము సూర్యుడు అస్తమించిన తర్వాత చన్నీటి స్నానము ఆచరించవలెను.
  • శుభ, అశుభ కార్యములందు పాల్గొనరాదు.
  • గురుస్వామి ఆజ్ఞలను పాటించవలెను.
  • శాఖాహారము మాత్రమే భుజించవలెను.
  • శవము ఎదురైన వెంటనే తలస్నానము చేయవలెను.
  • మత్తు పానీయములు సేవించరాదు.
  • నల్ల దుస్తులు మాత్రమే అయ్యప్పలకు శ్రేష్టము.
  • కుల, మత బేధములు పాటించరాదు.
  • ధూమపానము తాంబూలములు సేవించరాదు.
  • ఇరుముడి కట్టుకొనుటకు 41 రోజుల దీక్ష పూర్తి చేసి ఉండవలెను.
  • దీక్షా కాలములో విధమైన అనుమానము వచ్చినను గురుస్వామివారిని అడిగి తెలుసుకొనవలెను.
  • దీక్షలో ఉన్న అయ్యప్పలు తమ శక్తి కొలది తోటి అయ్యప్పలకు ఇంటి యందు భిక్ష పెట్టవలెను.
  • అహంకారము, ఆడంబరములు వదలి మామూలు జీవితము గడుపవలెను.
  • ఉదయం, సాయంకాలము తప్పక శరణుఘోష చేయవలెను.
  • ప్రతి అయ్యప్ప రాత్రివేళల్లో అయ్యప్పకు పవళింపుసేవ చెయ్యాలి.
  • ఎన్నిసార్లు అయ్యప్పను దర్శించిన వారైనా తోటి అయ్యప్పలను గౌరవించవలెను.
  • స్త్రీలలో బాలికలు 10 సం. లోపు పెద్దలకు 50 సం.లు పైబడి వయస్సు ఉన్నవారు మాత్రమే మాలాధారనకు అర్హులు.
  • బహిష్టు అయిన స్త్రీని చూడడము, వారి మాటలు వినడము చేయరాదు. అటుల చూచిన వెంటనే స్నానము చేసి శరణుఘోష పలుకవలెను.
  • 41 రోజుల వ్రత దీక్షలో పూర్తిగా ఆధ్యాత్మిక చింతన అలవరుచుకొనవలెను.
  • గోళ్ళు తీయుట, వెంట్రుకలు కత్తిరించుట చేయరాదు.
  • ఆహారం సేవించునపుడు సాధ్యమైనంత వరకు ఉప్పు, కారం తగ్గించవలెను.
  • భోజనము ఒక పూట మాత్రమే ( మధ్యాహ్నం ) చేయవలెను.
  • ప్రతివారిని " స్వామి " అని మాత్రమే సంభోదించవలెను. పిల్లలను " మణికంఠ " అని సంభోదించవలెను.
  • బాలికలను, స్త్రీలను 'మాత' అని, భార్యను 'మాలికాపురత్తమ్మ' అని సంభోదించవలెను.
  • రాత్రి అల్పాహారం లేదా పాలు పండ్లు మాత్రమే తీసుకొనవలెను.
  • పాదరక్షలు ధరించరాదు. చిరుతిళ్ళు తినరాదు. విధమైన చెడుఅలవాట్లు ఉండరాదు.
  • పడుకునేటప్పుడు పరుపు, దిండ్లు ఉపయోగించరాదు. చాపమీద మాత్రమే పడుకొనవలెను.
  • దీక్షలో వారు వారి ఇంటిలో ఎవరైనా మరణించిన వారి వద్దకు వెళ్ళరాదు. అటుల వెళ్ళవలసి వచ్చిన, మాలను గురుస్వామితో తీయించి స్వామి ఫొటోకి వేయవలెను. సంవత్సరము అతను శబరిమల యాత్ర చేయరాదు.
  • స్వామి దీక్షలో ఉన్నప్పుడు పగలు ఎంత మాత్రము నిద్రించరాదు.
  • నిరంతరం శరణుఘోష జపించవలెను. "స్వామియే శరణం అయ్యప్ప" అను వేదమంత్రోచ్ఛారణ నిరంతరము జపించవలెను.
  • తాను చేయు ప్రతికార్యమును , ప్రతి జీవిలోను అయ్యప్ప భగవానుని దర్శించుచుండవలెను.
  • ప్రతి స్త్రీ (భార్యసైతము) దేవి స్వరూపమే.
  • అయ్యప్ప ఎల్లపుడు విభూది, చందనం, కుంకుమ బొట్టులతో విలసిల్లుచూ, అస్కలిత బ్రహ్మచర్యము అవలంభించవలెను.
  • ఎదుటివారిని తన యొక్క మాటల, చేతల వలన గాని నొప్పించక ఎల్లపుడూ దయ, శాంతమును కలిగి యుండవలెను.
  • 'మానవ సేవయే మాధవ సేవ' అన్న సూక్తిని మరువక తోటివారికి సాధ్యమైనంత వరకు సహాయ పడుట అయ్యప్ప కర్తవ్యము.
  • నియమములను క్రమం తప్పకుండా ఆచరించు భక్తులను శబరిమల సన్నిధానమందు పదునెట్టాంబడి నెక్కు అర్హత కలుగును. భగవత్ సాక్షాత్కారము లభించును. శబరి యాత్ర ఫలితమును పొందగలరు.

కన్నెస్వాములకు కొన్ని ముఖ్య సూచనలు :

    • అయ్యప్పలు వ్యర్థ ప్రసంగములు చేయరాదు.
    • అయ్యప్పలు చెప్పినట్లు యాత్రలో అనుసరించవలెను. కాని బృందాన్ని వదలి ముందుకు నడవరాదు. భక్త సమూహంలో తప్పిపోయిన గుర్తు పట్టడం చాలా కష్టమౌతుంది.
    • ఇరుముడి నెత్తిపై పెట్టుకున్న తరువాత వెనక్కి తిరిగి చూడకూడదు. వస్తానని కాని, వెళుతున్నాని కాని, కుటుంబసభ్యులకు కాని మరెవ్వరికి చెప్పరాదు.
    • ఇరుముడిని శిరస్సుపై వుంచుకుని చిరుతిళ్ళు తినుట వంటివి చేయరాదు.
    • ఇరుముడిని కన్నె అయ్యప్పలు ఎట్టి పరిస్థితులలోను దించుకొనరాదు. అవసరమైతే బృందంలోని అయ్యప్పలే ఇరుముడిని క్రిందకు దించుతారు. బృదంలోని వారు కాక యాత్ర చేసే వేరే అయ్యప్పలెవరైనా సాయం చేయవచ్చును.
    • కన్నె అయ్యప్పలలో భక్తితో మహత్తర శక్తి నిబిడీకృతమై వుండుట వలన ఉత్సాహముతో ఉరకలు వేయడానికి మనసు ఆరాటపడుతుంది. కాని ఎట్టి పరిస్థితులలోనూ బృందాన్ని విడిచి వెళ్ళకూడదు.
    • యాత్రలో తినిబండారాలను అందరికీ పంచి పెట్టి తినాలి..
    • స్వామి శరణుఘోషను చెప్పుకుంటూ నడకను సాగించాలి.
    • యాత్రలో మనసును అయ్యప్పస్వామి పైనే లగ్నము చేయాలి.
    • యాత్రలో ఆలయములు, పుణ్యక్షేత్రములు దర్శించేటప్పుడు అందరితో కలసి దర్శించవలెను. కాని వేరుగా పూజలు జరపించరాదు. అందరితో కలసి వెళ్ళాలి. ఎవరిదారిన వారు వెళ్ళకూడదు.
    • స్నానము చేయునపుడు విలువైన వస్తువులు, డబ్బు మిగిలినవన్నీ అందరితో బాగా పరిచయము ఉన్న అయ్యప్పలకు ఇచ్చి వెళ్ళాలి.
    • కన్నె అయ్యప్పస్వాములు బృదంతో కాకుండా ఎప్పుడూ యాత్ర చేయరాదు. ఒంటరిగా కూడా వెళ్ళకూడదు.
    • సాటి అయ్యప్ప కనిపించనప్పుడు " స్వామిశరణం " అని చెప్పాలి. ఎవరినీ కూడా పేరుతో పిలవకూడదు. వారి వారి పేరు చివర 'అయ్యప్ప' అని కానీ 'స్వామి' అని కాని పిలవవలెను.
    • విద్యార్థులు, ఉద్యోగస్థులు, వ్యాపారస్థులు విధి నిర్వహణలో అశ్రద్ధ చేయరాదు. పూజలకు, భజనలకు అవకాశము లేని యెడల చింతించక, వారి వారి విధులు నిర్వహిస్తూనే శరణు ఘోష మనసులో తలచుకున్నా చాలు.
    • పూజా, భజన సమయాలలో ఒంటి మీద చొక్కా ఉంచుకోకూడదు. తువ్వాలును మాత్రం నడుముకు చుట్టుకోవాలి.
    • అయ్యప్పలు లుంగీ పంచను పైకి మడచి కట్టుకోరాదు. ఒక వేళ విధి నిర్వహణలో అడ్డుగా ఉంటే పైకి కట్టుకొనవచ్చును.
    • మాలవేసినపుడు, భజన పూజ నిర్వహించునపుడు ఇరుముడి కట్టినపుడు , మాల తీయునపుడు, గురుస్వామికి అయ్యప్పలు వారి శక్తి కొలది దక్షిణ చెల్లించవలెను.
    • అయ్యప్పలు సాటి అయ్యప్పలకు ,గురుస్వాములకు, తల్లిదండ్రులకు పాదనమస్కారములు చేయవలెను.
    • అయ్యప్పలు గుడిలోనికి వెళ్ళగానే ఒంటిపై చొక్కావిప్పి స్వామివారిని దర్శించాలి.

మాలాధారణ మంత్రము :

మాలను ఇతరులకు వేయునపుడు గురుస్వాములు మంత్రమును చెప్పవలెను.

జ్ఞానముద్రాం శాస్తృముద్రాం గురుముద్రాం నమామ్యహం |
వనముద్రాం శుద్దముద్రాం రుద్రముద్రాం నమామ్యహం |
శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం |
గురుదక్షిణయాపూర్వం తస్యానుగ్రహకారిణే |
శరణాగత ముద్రాఖ్యం త్వన్ముద్రాం ధారయామ్యహం |
చిన్ముద్రాం ఖేచరీముద్రాం భద్రముద్రాం నమామ్యహం |
శబర్యాచల ముద్రాయై నమస్తుభ్యం నమోనమః |
అష్టాదశం మహాసారం శాస్త్రుదర్శనకారణం |
విదితం శుద్దముత్కృష్టం సన్నిధానం నమామ్యహం |
ఊరుజం వాపురం చైవ భైఅరవద్వన్న సేవితం |
విష్ణుమాయాన్వితం శాస్తృ పరివారం నమామ్యహం ||
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ||

మాల విసర్జన మంత్రం :

మాల ధరించుటకు మంత్రమున్నట్లే మాలా విసర్జనమునకు మంత్రము గలదు. శబరిమల నుండి తిరిగి రాగానే ఇంటి ముంగిట కొబ్బరికాయ కొట్టి లోనికి ప్రవేశించి పూజా మందిరం లేక శ్రీవారి మండపం ముంగిట కర్పూరం వెలిగించి శరణుఘోషలు చెప్పి గురుస్వామికి దక్షిణ తాంబూలాదులు యొసంగి మాల విసర్జన మంత్రమును చెప్పి గురుస్వామి గారిచే మాల తీయించుకొనవలెను.
అపూర్వ మచలా రోగా ద్దివ్య దర్శన కారన |
శాస్తృ ముద్రాద్మహాదేవ దేహిమే వ్రతమోచనం ||

దీక్షాపరులకు గమనిక

అయ్యప్ప దీక్షాపరులు పూజవిధానము మెదట గణపతిని పూజించి అనంతరము బ్రహ్మణ్యస్వామి ని అయ్యప్పస్వామిని విధిగా పూజిచవలెను. శరణుఘోష, శ్రీ అయ్యప్ప నినాదాలు, మరియు శ్రీ అయ్యప్ప స్వామి పంచరత్నములు విశేషాంశములలో పొందుపరిచినాము గమనింపగలరు.

కామెంట్‌లు లేవు: