Hi
M.N.R.R.V.Srikanth | 9000101177 | Help Lines | M.Manoj Kumar | 9948798072 |
T. Umasankar | 9000234852 | P. Naveen | 9849685946 | |
D. Ranganath | 9885613697 | R.Vijay Narasimha Reddy | 9550057775 |
మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న,చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులోపొందుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
M.N.R.R.V.Srikanth | 9000101177 | Help Lines | M.Manoj Kumar | 9948798072 |
T. Umasankar | 9000234852 | P. Naveen | 9849685946 | |
D. Ranganath | 9885613697 | R.Vijay Narasimha Reddy | 9550057775 |
మానవుని అంతర ప్రపంచం
ఏ మనిషికైనా అంతర ప్రపంచం మూడు స్థాయిలలో ఉంటుంది. అవి వరుసగా జీవేచ్ఛ-స్వభావం-సంకల్పం. జీవేచ్ఛ అంటే ఏమిటో మనం ఇంతకు ముందొక సారి చెప్పుకున్నాం. జీవుని యొక్క ప్రకృతే జీవేచ్ఛ రూపంలో వ్యక్తమౌతుంది. జీవేచ్ఛ అంటే ఒక మనిషి ఎందుకొరకు జీవిస్తున్నాడో, ఎందుకొరకు మనుగడ సాగిస్తున్నాడో, అతని వాస్తవ జీవిత లక్ష్యమేమిటో అదే అతని జీవేచ్ఛ. ఇది దోషరహితమైనది. ఇది జీవుని స్వస్వరూపం. ఇది సత్యస్వరూపం.
ఏ మానవుడికైనా జీవేచ్ఛలో దోషం ఉండదు. జీవేచ్ఛ ఎంత స్వచ్ఛమైనదైనా మనిషి దాన్ని వెంటనే ఆచరించలేడు. దానినే స్వభావంగా కలిగి ఉండాలి. తరువాత ఆ స్వభావాన్నే సంకల్పించాలి. సంకల్పంగా అది మార్పు చెందినపుడే అది ఆచరణలోకి వస్తుంది. అంటే జీవేచ్ఛ స్వభావంగా మారి, ఆ స్వభావం సంకల్పమైనపుడే అది ఆచరణలోకి వస్తుంది. అంటే ఆ మూడింటి మధ్యన సమన్వయం ఉండాలి.
కానీ ఈ ప్రక్రియలో జీవేచ్ఛనుండి స్వభావం విభేదిస్తే ఆ విభేదించిన స్వభావాన్నే ఆచరిస్తే జీవేచ్ఛ ఆచరణలోకి రాక దానితో విభేదించిన స్వభావం మాత్రమే ఆచరణలోకి వస్తుంది. కనుక ఆ మనిషి యొక్క వాస్తవ జీవన లక్ష్యం నెరవేరదు. మరో సందర్భంలోనైతే అలా విభేదించిన స్వభావాన్ని సైతం ఆచరించలేని అసమర్ధత కూడా కలిగి ఉండవచ్చు. అంటే స్వభావం ఒకటైతే సంకల్పం మరోటి అవుతుంది. అది ఇంకా హీనత్వానికి దారితీస్తుంది. అంటే జీవేచ్ఛననుసరించి స్వభావం ఉండదు. స్వభావాన్ననుసరించి సంకల్పం ఉండదు.
కోరికలు-సంకల్పాలు
జీవేచ్ఛ===కోరికలు===స్వభావం===సంకల్పాలు===సంకల్పం
'మనిషికి కోరికలు ఉండకూడదు. కోరికలే వినాశ హేతువులు, దుఃఖహేతువులు' అన్నపుడు దానర్ధం జీవేచ్ఛకు ఇతరమైన కోరికలు ఉండకూడదు అని అర్ధం. అంతేకానీ అసలే కోరికలు ఉండకూడదు అని కాదు. జీవేచ్ఛకు ఇతరంగా ఉండే కోరికలే ఇచ్చట కోరికలుగా చెప్పబడ్డాయి. జీవేచ్ఛ పరిధిలోకి వచ్చే కోరికలు నిరభ్యంతరంగా ఉండవచ్చు. జీవేచ్ఛకు ఇతరమైన కోరికలున్నపుడు జీవేచ్ఛకు, స్వభావానికి వైరుధ్యం ఏర్పడుతుంది. ఇది వాంఛనీయం కాదు. మనిషి యొక్క పారమార్ధిక భ్రష్టత్వానికి మరియు ప్రవృత్తి నివృత్తి చక్రానికి దారితీస్తుంది.
పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్గుణాన్ |
కారణం గుణసంగో స్య సదనద్యోని జన్మసు || (అ.13-శ్లో.22)
ప్రకృతిలో ఉండే పురుషుడు ప్రకృతివల్ల కలిగే గుణాలను అనుభవిస్తాడు. ఆ గుణాలపట్ల కల ఆసక్తిని బట్టే పురుషుడు ఉచ్ఛనీఛ జన్మలు పొందుతాడు.
జీవేచ్ఛకు ఇతరమైనటువంటి కోరికలేవీ లేనపుడు జీవేచ్ఛే స్వభావంగా ప్రతిబింబిస్తుంది. ఇది ఆదర్శస్థితి. జీవేచ్ఛకు ఇతరమైన కోరికలన్నీ అణగిపోవడానికి వైరాగ్యం ఒక్కటే మార్గం.
యదా వినియతం చిత్తం ఆత్మన్యేవా పతిష్ఠతే|
నిస్సృహస్సర్వ కామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా || (అ.6-శ్లో.18)
మనస్సును వశపరచుకుని ఆత్మమీదే నిశ్చలంగా నిలిపి, సర్వ వాంఛలూ విసర్జించినపుడు యోగసిద్ధి పొందాడని చెబుతారు.
ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్ధ! మనోగతాన్ |
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞ స్తదోచ్యతే|| (అ.2-శ్లో.55)
మనసులోని కోరికలన్నిటినీ విడిచిపెట్టి, ఎప్పుడూ ఆత్మానందమే అనుభవించేవాడు స్థితప్రజ్ఞుడు.
విహాయ కామాన్ య స్సర్వాన్ పుమాం శ్చరతి నిస్స్పృహః |
నిర్మమో నిరహంకారః స శాంతి మధిగచ్ఛతి || (అ.2-శ్లో.71)
కోరికలన్నిటినీ విడిచిపెట్టి ఆశ, అహంకారం, మమకారం లేకుండా మెలగేవాడు పరమశాంతి పొందుతాడు.
సంకల్పాలన్నీ అణగిపోవాలన్నపుడు అసలే సంకల్పాలూ చేయకూడదని కాదు. స్వభావానికి విరుద్ధమైన, స్వభావానికి ఇతరమైన సంకల్పాలు చేయకూడదని అర్ధం. ఎట్టి సంకల్పాలు లేనివాడూ, తానై దేనినీ సంకల్పించనివాడూ (సర్వారంభపరిత్యాగీ) ఆదర్శవంతుడుగా గీతలో చెప్పబడింది. ఇక్కడ స్వభావానికి ఇతరమైన సంకల్పమే చేయకూడని సంకల్పమని గీతాకారుడి ఆంతర్యం. స్వభావానుకూల సంకల్పాలను నిరభ్యంతరంగా చేయవచ్చు. స్వభావానికి ఇతరమైన సంకల్పాలు చేసినపుడు మనిషి లౌకిక కార్యకలాపాలలో అపజయం పాలౌతాడు. ఐహికంగా పతనమౌతాడు. యశస్సు, సంపద, విజయం, అధికారం, భోగం ఇత్యాదివి సాధించడంలో పరాజితుడౌతాడు. సంకల్పాలన్నీ అణగినపుడు స్వభావమే సంకల్పంగా ప్రతిబింబిస్తుంది. అభ్యాసం దీనికి మార్గం.
యదా హి చేన్దృయార్థేషు న కర్మ ష్వనుషజ్జ్యతే|
సర్వసఙ్కల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే|| (అ.6-శ్లో.4)
ఇంద్రియ విషయాలమీద కానీ, కర్మలమీద కానీ ఆసక్తి లేకుండా సంకల్పాలన్నీ విడిచిపెట్టినవాడిని యోగారూఢుడంటారు.
సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః|
మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః || (అ.6-శ్లో.24)
సంకల్పము వలన కలిగిన కోరికలన్నింటినీ నిశ్శేషముగా త్యజించి, ఇంద్రియసముదాయములను అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను.
సంకల్పాలను అణచడానికి కోరికలను అణచి ఉంచాలనే నియమమేమీ లేదు. అలానే కోరికలనణచినవాడు సంకల్పాలను కూడా అణచాలనే నియమమేమీలేదు. ఎలా అయినా జరగవచ్చు. ఐతే కోరికలు, సంకల్పాలు రెంటినీ అణచినవాడు ఈ లోకంలో ఆదర్శపురుషుడు. గీతలో తనకు ఇష్టుడుగా గీతాకారుడు పేర్కొన్నది అతనినే. ఇట్టి ఆదర్శపురుషుడిలో జీవేచ్ఛే స్వభావంగా, స్వభావమే సంకల్పంగా మారి అంటే ఈ మూడునూ ఎట్టి వైరుధ్యాలు లేక ఒకటే అయిన పరిస్థితి ఏర్పడుతుంది.
కోరికలను అణచటం పారమార్ధిక విజయానికి దారితీస్తుంది. వైరాగ్యం దీనికి మార్గం. సంకల్పాలను అణచటం ప్రాపంచిక విజయానికి దారితీస్తుంది. అభ్యాసం దీనికి మార్గం...(జ్ఞానయోగం సమాప్తం)
వీరిచే పోస్ట్ చెయ్యబడింది Saraswathi Kumar వద్ద 7:27 ఉ 0 వ్యాఖ్యలు ఈ పోస్ట్కు లింక్ చేస్తుంది
లేబుళ్లు: జ్ఞానయోగం
ఇప్పుడు మరో ముఖ్య విషయాన్ని పరిశీలిద్దాం. వివిధ రకాల ప్రకృతులను కలిగి ఉన్న జీవులు అందరూ సమానమేనా లేదంటే అసమానమా! ఒక వేళ అసమానమైన పక్షంలో వీరిలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ. అసలు ఈ జీవుల కన్నా సర్వోన్నతుడని భావించబడే భగవంతుడు ఎంత ఎక్కువ.
జీవులందరికన్నా భగవంతుడు గొప్ప. ఆయన పరిమాణంలో అనంతుడు. తన ప్రకృతితో కలసి కాకుండా విడిగానే ఉనికిని కలిగి ఉన్నవాడు. తన ప్రకృతిని వ్యక్తీకరించి, మరలా లయింపజేసుకునే సామర్ధ్యం కలిగినవాడు. ఘనతరమైన సృష్టి కార్యాన్ని నెరవేర్చేవాడు. ముల్లోకాలనూ, పదునాలుగు భువనాలనూ పాలించేవాడు. మాయకు లోబడని అతీతుడు, నిత్యయోగ స్వరూపుడు. ...ఇత్యాది లక్షణాలతో ఆయన జీవులందరికన్నా గొప్పవాడైపోయి ఈ సృష్టిలో తనకన్నా మరేదీ గొప్పదిలేని స్థితి కలిగినవాడై ఉండి ఎక్కువ తక్కువలకు అసలు ఆయనే నాంది పలికాడు.
మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ! (అ.7-శ్లో.7)
ధనంజయా! నా కంటే ఉత్కృష్టమైనదేదీ లేదు.
గతి ర్భర్తా ప్రభుస్సాక్షీ నివాస శ్శరణం సుహృత్ |
ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజ మవ్యయం || (అ.9-శ్లో.18)
ఈ జగత్తుకు గతి, పతి, ప్రభువు, సాక్షి, నివాస స్థానం, ఆశ్రయం, ఆప్తుడు, సృష్టికర్త, సంహారకుడు, ఆధారం, ప్రళయం, స్థానం, శాశ్వత బీజం నేనే.
స్వధర్మం
ఇక జీవులలో ఏ రెండు జీవుల ప్రకృతి ఒకటి కాదు. ఎవరి ప్రకృతి వారిదే. అటువంటప్పుడు ఈ జీవులన్నీ సమాన స్థాయివేనా? అంటే... కాదనే సమాధానమే వస్తుంది. ఈ జీవులన్నీ కొన్ని ఉన్నత స్థాయి ప్రకృతి కలిగి ఉన్నాయి. కొన్ని తక్కువ స్థాయి, కొన్ని ఇంకా తక్కువ స్థాయి ప్రకృతి కలిగి ఉన్నాయి. ఇవి ఎన్నో దశలలో ఉంటాయి. ఈ స్తరీకరణ ఎంతో విస్తారమైనది. అనంత ప్రకృతిలో ఎన్ని తేడాలున్నాయో అన్ని రకాల తేడాలు జీవులకు తమతమ ప్రకృతులవలన కలుగుతున్నాయి, అన్ని రకాల నిమ్నోన్నతాలు కలుగుతున్నాయి.
కానీ ఈ అసమానత అంతా భౌతిక దృష్టికే. ఏ జీవి ప్రకృతి ఆ జీవిలో 'జీవేచ్ఛ' రూపంలో వ్యక్తమౌతుంది. ఆ ఇచ్ఛ నెరవేర్చుకొనటమే, ఆ తన ప్రకృతిని కర్మరూపంలో వ్యక్తీకరించుకొని తన 'స్వస్వరూప సందర్శనం' చేసుకొనటమే ప్రతిజీవి కర్తవ్యం. ప్రతి జీవికి తన ప్రకృతి ఎటువంటిదైనా తన ప్రకృతే తనకు 'సత్యం'. దానిని తెలుసుకొనటమే, ఈ అనంత సృష్టిలో దాని ప్రతిబింబాన్ని దర్శించుకోవటమే ఆ జీవి యొక్క కర్తవ్యం. కనుక మిగతా జీవుల తో పోలిస్తే తన ప్రకృతి గొప్పదైనా తక్కువదైనా తన ప్రకృతిననుసరించటమే ఏ జీవికైనా విహిత కర్తవ్యం. అలా చేసినపుడే ఆ జీవి సత్యాన్ని చేరగలదు. తదాచరణే ఆ జీవికి స్వధర్మాచరణ. స్వధర్మమంటే ఇదే.
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః || (అ.3-శ్లో.35)
ఇతరుల ధర్మం చక్కగా ఆచరించడం కంటే లోటుపాటులతో అయినా తన ధర్మం పాటించడమే మేలు. పరధర్మం భయభరితం కావడం వలన స్వధర్మాచరణలో మరణమైనా మంచిదే.
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం || (అ.18-శ్లో.47)
బాగా ఆచరించబడ్డ ఇతరుల ధర్మం కంటే గుణం లేనిదిగా కనిపించినా తన ధర్మమే మంచిది. తన ధర్మాన్ని తాను నిర్వర్తించేవాడికి పాపం అంటదు.
యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం |
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విదంతి మానవః || (అ.18-శ్లో.46)
సమస్త ప్రాణుల పుట్టుకకూ, పోషణకూ కారణుడై విశ్వమంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను తనకు విధించబడ్డ కర్మలను ఆచరించడం ద్వారా అర్చించి మానవుడు పరమగతి పొందుతాడు.
సహజం కర్మ కౌంతేయ! సదోషమపి న త్యజేత్ |
సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః || (అ.18-శ్లో.48)
కౌంతేయా! నిప్పును కప్పుకున్న పొగలాగా కర్మలన్నిటినీ దోషం ఆవరించి ఉంటుంది. అందువల్ల ఏదైనా దోషమున్నా స్వభావసిద్ధమైన కర్మను విడిచిపెట్టకూడదు.
సమానత్వం
భగవంతుడితో సహా జీవులన్నింటినీ కలుపుకుని చూచినపుడు మనకు కనిపించే ఈ అసమానత కేవలం భౌతిక దృష్టికే. యోగపరంగా చూసినపుడు అంతా సమానమే. ఎందుకంటే యోగమనేది గొప్పతనానికి పరకాష్ట. యోగం తరువాత ఏమీ ఉండదు. యోగమే పరమావధి. యోగం భగవత్స్వరూపం. భగవంతునికన్నా గొప్పదేమీలేదు. యోగం వలన ప్రతి జీవుడు భగవంతునితో సమానమైన స్థితిని పొందుతాడు. జీవులన్నీ యోగాన్ని అవలంబించినపుడు వాటి ప్రకృతుల యొక్క ఎక్కువ తక్కువలతో సంబంధంలేకుండా అవన్నీ యోగస్వరూపుడైన ఆ భగవంతునితో సమమైన స్థితిని పొందుతాయి. ఈ విధంగా యోగం దృష్ట్యా భగవంతుడితో సహా అంతా సమానమే.
జీవులకు తమ తమ ప్రకృతుల వలన కలిగిన ఈ ఎక్కువ తక్కువల కెవ్వరూ బాధ్యులు కారు. అది అనాది సిద్ధం. యోగమే ప్రతి జీవి లక్ష్యం కనుక యోగదృష్టియే సరియైనది. యోగ దృష్ట్యా అంతా సమానమే. భగవంతుడు సైతం యోగాన్ని అవలంబిస్తున్న ఏ జీవికన్నా కూడా ఎక్కువ కాదు.
ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్య మాగతాః |
సర్గేపి నోపజాయన్తే ప్రలయే న వ్యథన్తి చ || (అ.14-శ్లో.2)
ఈ జ్ఞానము నాశ్రయించి, నాతో సమమగు స్థితిని పొందినవారు ప్రళయకాలమున నశింపరు. సృష్టిసమయమున మరలా జన్మింపరు.
...(మిగతా విషయం చివరి భాగంలో)
వీరిచే పోస్ట్ చెయ్యబడింది Saraswathi Kumar వద్ద 6:44 ఉ 5 వ్యాఖ్యలు ఈ పోస్ట్కు లింక్ చేస్తుంది
లేబుళ్లు: జ్ఞానయోగం
జీవుడు ఈ సృష్టి కార్యంలో, ఈ జగత్తులో తన ప్రకృతి యొక్క బింబాన్ని చూసుకోవాలంటే ముందుగా మానవ దేహధారణ చేయాలి. అంటే ఈ సృష్టిలో తను కూడా మనిషిగా జన్మించాలి. జన్మ వలన జీవునికి దేహం లభిస్తుంది. దేహం వలన జీవునికి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి మొదలైన సాధనాలు సమకూరతాయి.
అయితే జన్మించడంతోటే జీవుడు స్వస్వరూప సందర్శనం చేయటానికి పూనుకుంటాడని అనుకోవడం పొరపాటు. జన్మ అనేది, దేహధారణ అనేది స్వస్వరూప సందర్శనం కొరకు ఒక అవకాశం మాత్రమే. దేహధారణ చేసిన మానవుడు ఆ పరమ పురుషుడి మీద మనసు నిలిపి యజ్ఞం లేక నిష్కామ కర్మయోగం చేసి తద్వారా మాత్రమే తన జన్మ యొక్క పరమ ఉద్దేశ్యమైన స్వస్వరూప సందర్శనం నెరవేర్చుకుని ఈ లోకం నుండి నిష్క్రమిస్తాడు. కానీ ఎక్కువ సందర్భాలలో అలా జరగదు.
ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత! |
సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప! || (అ.7-శ్లో.27)
పరంతపా! సమస్త భూతాలూ పుట్టుకతోనే అనురాగ ద్వేషాల మూలంగా కలిగే సుఖదుఃఖాదులవల్ల మోహంలో మునిగి, అజ్ఞానంలో పడుతున్నాయి.
ప్రవృత్తి-నివృత్తి
దేహధారణ చేసిన మానవుడు ప్రకృతి యొక్క మాయలో చిక్కుకుంటాడు. ఆ ప్రకృతి యొక్క, త్రిగుణాల యొక్క కర్మల వ్యామోహంలో చిక్కుకుంటాడు. అందులో ఏదో ఒక గుణకర్మయొక్క ఆకర్షణకు లోనై, ఆకర్మనే అధికంగా చేస్తూ కర్మబంధాలలో చిక్కుకుని, ప్రవృత్తి నివృత్తికి లోనై వ్యర్ధంగా ఈ సంసార చక్రంలో పరిభ్రమిస్తుంటాడు. ప్రవృత్తి నివృత్తి అనేవి నేరము-శిక్ష వంటివి.
ప్రవృత్తిం చ నివృత్తించ జనా న విదురాసురాః |
న శౌచం నాపి చా చారో న సత్యం తేషు విద్యతే || (అ.16-శ్లో.7)
ఆసురీ సంపదలోనివారు ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము అను రెండు మార్గములున్నట్లే ఎరుగరు. వారియందు పారిశుద్ధ్యము గానీ. మంచినడవడి గానీ, సత్యము గానీ ఉండవు.
ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యా కార్యే భయాభయే|
బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి స్సా పార్ధ ! సాత్వికీ || (అ.18-శ్లో.30)
పార్ధా! ప్రవృత్తి నివృత్తి మార్గములను, కర్తవ్యాకర్తవ్యాలను (చేయదగినవి, చేయకూడనివి), భయనిర్భయములను, బంధ మోక్షములను తెలియు బుద్ధి సాత్వికము.
అంటే ఈ లోకం లోనికి ప్రవేశించిన మానవుడిని రెండు విషయాలు ఆకర్షిస్తాయి. ఒకటి నిశ్శబ్దంగా, సామగానంలా, మంద్రంగా ఉండే భగవదాకర్షణ. రెండవది అతి తీవ్రమైన సంచలనాలతో ఆకర్షణలతో ఉండే ప్రకృతి యొక్క ఆకర్షణ. మాయకు లోబడకుండా జ్ఞానాన్ని సాధించి భగవంతుడి మీద మనసు నిలిపి నిష్కామకర్మ ద్వారా తన జీవనలక్ష్యం నెరవేర్చుకున్న వారు ఈ లోకంలో ఆ సృష్టివరకు మరలా జన్మించరు. దానినే మోక్షం అంటారు. అలాకాక ప్రకృతి మాయలోపడి ప్రకృతి ఆకర్షణకు లోబడినవాడు గుణకర్మలు చేస్తూ సంసారచక్రంలో తిరుగుతూనే ఉంటాడు. అనేక బాధలు పడుతూనే ఉంటాడు.
యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం |
తే ద్వంద్వ మోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః || (అ.7-శ్లో.28)
పుణ్యకర్మలు చేసి సకల పాపాలనూ పోగొట్టుకున్న మహానుభావులు సుఖదుఃఖ రూపమైన మోహాల నుంచి విముక్తులై గట్టి పట్టుదలతో నన్ను భజిస్తారు.
జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే |
తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం || (అ.7-శ్లో.29)
ముసలితనం, మృత్యువుల నుంచి ముక్తి పొందడానికి నన్ను ఆశ్రయించి, ప్రయత్నించే వాళ్ళు పరబ్రహ్మతత్త్వాన్నీ, ఆత్మ స్వరూపాన్నీ, సమస్త కర్మలనూ గ్రహించగలరు.
భగవంతుడు మాయకు అతీతుడు. ఆయన మాయకు లోబడకపోగా ఆ మాయనే తన చెప్పుచేతలలో పెట్టుకుంటాడు. తన మాయను తన ఇష్టానుసారం వ్యక్తీకరిస్తాడు, లయిస్తాడు. ఆ మాయ కాకుండా కేవలం పురుషుడుగానే తన ఉనికిని కలిగి ఉన్నాడు.
జీవుడు అలాకాదు. మాయకు అతీతుడు కాదు. జీవుడు తన ప్రకృతిని తన నుండి విడదీయలేడు. ప్రకృతి కాకుండా విడిగా జీవునికి ఉనికి లేదు. అట్టి భావనే అసంగతం. కనుక జీవుడు ప్రకృతి లేక మాయకు అతీతుడు కాడు. కేవలం భగవంతుడి మీద మనసు నిలపటం వలన మాత్రమే ..ఆయన వలన మాత్రమే ఈ ప్రకృతి మాయను జీవుడు అతిక్రమిస్తాడు. అంటే నిష్కామకర్మ వలన మాత్రమే మానవుడు ప్రకృతి మాయను, ప్రకృతి కర్మబంధాలను అతిక్రమిస్తాడు. జ్ఞానం యెడల శ్రద్ధ, ధర్మం యెడల అనుతాపం, గుణకర్మల యెడల అనాసక్తి, భగవంతుని యెడల అనురక్తి ఇత్యాది గుణాల వలననే మానవుడు భగవంతుని సాయంతో ప్రకృతి మాయను అధిగమిస్తాడు.
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా |
మామేవ యే ప్రపద్యంతే మాయా మేతాం తరంతి తే || (అ.7-శ్లో.14)
త్రిగుణ స్వరూపమైన ఈ నా దైవ మాయను దాటడం సామాన్యులకు సాధ్యపడదు. అయితే నన్నే ఆశ్రయించినవాళ్ళు దానిని అతిక్రమిస్తారు
...(మిగతా విషయం తరువాతి భాగాలలో)
వీరిచే పోస్ట్ చెయ్యబడింది Saraswathi Kumar వద్ద 4:38 ఉ 0 వ్యాఖ్యలు ఈ పోస్ట్కు లింక్ చేస్తుంది
లేబుళ్లు: జ్ఞానయోగం
'జ్ఞానయోగం' పేరుకు తగినట్లుగానే జ్ఞాన సముపార్జనకు ఉద్దేశించబడినది. జ్ఞానయోగంలో భక్తికి తావులేదు. ఇది హేతువాద ప్రధానమైనది. భగవంతుణ్ణి సైతం హేతువాద దృష్టితో పరిశీలిస్తుంది. భగవంతుడంటే ఏమిటి? ఈ జగత్తు ఏమిటి? ఎక్కడ నుండి వచ్చినది? జీవుడంటే ఏమిటి? జీవస్వరూపం ఏమిటి? ఈ సృష్టిలో జన్మించిన అంటే దేహధారణ చేసిన జీవుని కార్యం ఏమిటి? ఇత్యాది విషయాలన్నింటినీ హేతువాద దృష్టితో చర్చించేది జ్ఞానయోగం.
జ్ఞానయోగానికి హేతువాదం, తార్కిక దృష్టి; రాజయోగానికి శాస్త్రీయ దృక్పథం, క్రమశిక్షణ, యుక్తి, చతురత, విజయకాంక్ష, ఔన్నత్య కాంక్ష; భక్తి యోగానికి విశ్వాసం, శరణాగతి నేపథ్యంగా ఉన్నాయని మనం గుర్తించాలి.
ప్రకృతి-పురుషుడు-జీవుడు
జ్ఞానయోగంలో ముందుగా ప్రకృతి, పురుషుల గురించి తెలుసుకోవాలి. ప్రకృతి, పురుషులు అనాదులు. అంటే ఆదిలేనివి. వీటినెవరూ సృష్టించలేదు. వీటికి మూలమైనది ఏదీ లేదు. ఇవి భూత, భవిష్యత్, వర్తమానకాలాలలో ఎల్లప్పుడూ ఉంటాయి. మహా ప్రళయం సంభవించి ఈ సృష్టి అంతా, ఈ జగత్తంతా లయించి పోయినా ఉంటాయి.
ఇందులో పురుషుడే భగవంతుడు. ఈ జగత్తుకు తండ్రి. చైతన్యానికి మూలం. ఫురుషుని పరిమాణం అనంతం. పురుషుడిని 'బ్రహ్మం' అని కూడా అంటారు. ఇది మార్పు లేనిది. ఇది ఎల్లప్పుడూ అవ్యక్త రూపంలోనే ఉంటుంది. ఇంద్రియాలకు గోచరించదు.
ప్రకృతి ఈ జగత్తుకు తల్లి. మహామాయ. భావానికి, పదార్ధానికి మూలం. పకృతి పరిమాణం కూడా అనంతమే. ప్రకృతిని 'మహత్తు ' అని కూడా అంటారు. ఇది అన్ని రకాల మార్పులకూ లోనౌతుంది, ఇది వ్యక్తంగానూ, అవ్యక్తంగానూ కూడా ఉంటుంది. వ్యక్తరూపంలో ఉండే ప్రకృతంతా ఇంద్రియాలకు గోచరిస్తుంది.
సృష్టికి ముందు అనంతమైన పురుషుడిలో అనంతమైన ప్రకృతి లయించిపోయి అవ్యక్తంగా ఉంటుంది. ఇలా లయించిన ప్రకృతిని బయటకు వ్యక్తీకరిస్తే అదే సృష్టికార్యం.
ప్రకృతిం పురుషం చైవ విద్ద్యనాదీ ఉభావపి | (అ.13-శ్లో.20)
ప్రకృతి, పురుషుడు- ఈ ఉభయులకీ ఆదిలేదని తెలుసుకో.
మరి జీవుని సంగతి ఏమిటి? గీతలో ప్రకృతి పురుషులు అనాదులని చెప్పాడు గీతాకారుడు. కానీ ఈ రెంటితోపాటు జీవుడిని పేర్కొనలేదు. అంటే జీవుడు అనాది కాదా? ..మరి అదే గీతలో జీవుని గురించి దేహీ నిత్యమవధ్యో అని పేర్కొనబడింది కదా!
దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత ! | (అ.2-శ్లో.30)
అన్ని దేహాలలోనూ ఉండే ఆత్మకు చావు అనేది లేదు.
అంటే దీనిని బట్టి జీవుడు కూడా అనాది అనియే మనం చెప్పవచ్చు. కానీ తదుపరి 13 వ అధ్యాయంలో ప్రకృతి, పురుషులను గురించి గీతాకారుడు చెప్పినపుడు జీవుడిని ప్రత్యేకించి పేర్కొనకపోవడానికి కారణం: జీవుడు ప్రకృతి, పురుషులకన్నా వేరు కాకపోవడమే.
జీవస్వరూపం:
అనంతమైన పురుషుడు భగవంతుడైతే, అనంతమైన ప్రకృతి జగన్మాత అయితే అతి సూక్ష్మమైన ప్రకృతి మరియు అతి సూక్ష్మమైన పురుషపదార్ధం యొక్క వీడని కలయికే జీవుడు. ఇదే జీవస్వరూపం. అంటే జీవుడు ఇటు శుద్ధ ప్రకృతి కాదు, అటు శుద్ధ పురుషుడూ కాదు. రెండింటి యొక్క కలయిక. అది కూడా వీడని కలయిక. పరిమాణమేమో అతి సూక్ష్మం.
అనంతమైన శుద్ధ పురుషుడు 'భగవంతుడు'.
అనంతమైన శుద్ధ ప్రకృతి 'జగన్మాత'.
అతి సూక్ష్మమైన ప్రకృతి పురుషుల వీడని కలయిక 'జీవుడు'.
భగవంతుడిలో అంటే అనంత పురుషుడిలో అనంత ప్రకృతి లయిస్తుంది, మరలా తిరిగి వ్యక్తీకరింపబడుతుంది. కానీ జీవుని విషయంలో ఇలా జరగదు. ఎల్లప్పుడూ పురుషుడిలో ప్రకృతి లయించే ఉంటుంది. ఈ రెంటినీ ఉమ్మడిగా కలిపే 'జీవుడు' అంటాం. అయితే ఏ రెండు జీవులకు కూడా అలా లయించిన ప్రకృతి ఒకటిగా ఉండదు. ఏ జీవుడికి ఆ జీవుడే ప్రత్యేకం. అదే ఆ జీవుని యొక్క విశిష్టత. ఈ విశిష్టత మరియు ఈ ప్రత్యేకత అనాది సిద్ధం. ఇందుకెవ్వరికీ కర్తృత్వం లేదు. ఎవరూ ఇందుకు బాధ్యులు కారు.
భగవంతుడు తన ప్రకృతిని సృష్టి కార్యం ద్వారా వ్యక్తీకరించి దర్శిస్తాడు.
సర్వభూతాని కౌంతేయ! ఫ్రకృతిం యాంతి మామికాం |
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం || (అ.9-శ్లో.7)
కౌంతేయా! ఫ్రళయకాలంలో ప్రాణికోటులన్నీ నా ప్రకృతిలో ప్రవేశిస్తున్నాయి. సృష్టి కాలంలో వాటిని మళ్ళీ నేను సృజిస్తున్నాను.
ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః |
భూతగ్రామ మిమం కృత్స్నం అవశం ప్రకృతే ర్వశాత్ || (అ.9-శ్లో.8)
ప్రకృతికి అధీనమై, అస్వతంత్రమైన సకల భూతసంఘాన్నీ స్వాధీనంలో ఉంచుకున్న నా ప్రకృతితో మళ్ళీ మళ్ళీ సృష్టిస్తుంటాను.
స్వస్వరూప సందర్శనం:
మరి జీవుడికి తన ప్రకృతిని అలా వ్యక్తీకరించుకొనే అవకాశం లేదు. అందుకు జీవునికి ఉన్న మార్గం ఒక్కటే. ఆ భగవంతుడి సృష్టికార్యంలో కర్మ ద్వారా తన ప్రకృతిని దర్శించుకోవడం. కర్మ ద్వారా తన ప్రకృతిని ప్రకటించడం. ఈ సృష్టి కార్యంలో, ఈ అనంత ప్రకృతి యొక్క వ్యక్తీకరణలో తన యొక్క, తనదైన ప్రకృతి యొక్క ప్రతిబింబాన్ని మానవుడు (జీవుడు) కర్మ చేయడం ద్వారానే దర్శించుకుంటాడు. అలానే ఈ లోకంలోని మిగతావారికీ ప్రకటిస్తాడు. దీనినే 'స్వస్వరూప సందర్శనం' అంటారు.
జీవేచ్ఛ:
జీవుని యొక్క ఈ ప్రకృతే 'జీవేచ్ఛ' రూపంలో వ్యక్తమౌతుంది. ఈ జీవేచ్ఛనే స్వభావంగా కలిగి దానిని సంకల్పించినపుడు మాత్రమే కర్మ ద్వారా ఈ ప్రకృతి వ్యక్తీకరింపబడుతుంది. అంటే మానవుడు తన జీవేచ్ఛ-స్వభావము-సంకల్పము లను సమన్వయపరచాలి. ఈ మూడింటినీ ఒక దానితో ఒకటి విభేదించకుండా చూడాలి. (జీవుని యొక్క ప్రకృతే జీవేచ్ఛ గనుక అది ఎప్పుడూ మారదు. ఎవరికీ మారదు. జీవేచ్ఛ సత్యం. మారేవి స్వభావ సంకల్పాలే). ఈ మూడింటినీ సమన్వయపరచడమెలా అనేది జ్ఞానయోగం చివరన ప్రత్యేకంగా చర్చిద్దాం ...(మిగతా విషయం తరువాతి భాగాలలో)
వీరిచే పోస్ట్ చెయ్యబడింది Saraswathi Kumar వద్ద 6:07 ఉ 0 వ్యాఖ్యలు ఈ పోస్ట్కు లింక్ చేస్తుంది
లేబుళ్లు: జ్ఞానయోగం