- నల్లా నరసింహమూర్తి
February 24th, 2010
మనస్సు చాలా సున్నితమైంది. మనస్సును స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించాలంటే, గట్టి సంకల్ప శక్తితోపాటు ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి. గీతలో శ్రీకృష్ణ్భగవానుడు మనిషి తన బలహీనతలను తానే అణచివేసుకుని, తనను తానే ఉద్ధరించుకోవాలని బోధించాడు. మనస్సును స్వాధీనం చేసుకోవాలనుకునేవారు ఇటువంటి బోధనను తప్పనిసరిగా అనుసరించి, అభ్యసించాలి. మనస్సును మనస్సుతోనే స్వాధీనం చేసుకోవాలి.
మనసును స్వాధీనం చేసుకోవడంలో ఎదురయ్యే సమస్యలు, అడ్డంకులు మన మనస్సు సృష్టించినవే. ప్రయత్నపూర్వకంగా, తెలివితేటలతో, క్రమశిక్షణతో కష్టపడి పనిచెయ్యడం ద్వారా, ప్రయోగపూర్వకంగా పరీక్షింపబడిన పద్ధతులను అనుసరించి, అభ్యసించడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. ఈ పనిని పూర్తిగా మనకు మనమే స్వీయ అనుభవంతో చేసుకోవాలి. ఈ పనిని చేయటానికి మనకు గొప్ప ఓరిమి కావాలి, శక్తికావాలి.
'మనస్సు' అనగా సర్వ విషయాలను గ్రహించు అంతరింద్రియము. మనస్సు ఒక ఇంద్రియము యొక్క వ్యాపారమున తోడ్పడు సమయమునందు మరియొక ఇంద్రియపు వ్యాపారమున తోడ్పడదు. అనగా ఒక్కమాటలో చెప్పాలంటే మనస్సు పనిచేయు సమయంలో ఏ ఇతర ఇంద్రియముల వాటి యొక్క వ్యాపారములను చేయవు. సంకల్పము, వాసన, ఉత్సాహము, కారుణ్యము, ప్రేమ, దయ, కామము, ఆనందం, లోభము, మదము, క్రోధము, లజ్జ, కృతజ్ఞత, శ్రద్ధ, ఇచ్ఛ మొదలైనవి అన్నీ మనసు యొక్క గుణములు. కావున మనస్సు ఎటువైపుకు మార్గం చూపుతుందో దానిని అనుసరించి మానవుడు ప్రవర్తించును. ఒక్కొక్క విషయాన్ని 'ఇట్లున్నది', 'అట్లున్నది' అంటూ బుద్ధియొక్క తీర్పును న్యాయవాదివలె చెప్పును. కాబట్టి మనస్సు సంకల్ప వికల్పాత్మకము మాత్రమేయని చెప్పక తప్పదు. ఆ తరువాత బుద్ధి మంచి చెడులను నిర్ణయించి, దానికి గ్రాహ్యముగా నుండు విషయాలను కర్మేంద్రియముల ద్వారా అమలుచేయు పనిని సహితమూ మనస్సు చేయును. అందుకే పెద్దలు 'మనసస్తు పరాబుద్ధిః' అని అన్నారు. అనగా మనస్సుకంటే బుద్ధిగొప్పదని, ముఖ్యమైనదని చెప్పబడింది.
''మనయేన మనుష్యాణాం కారణం బంధ మోక్షమోః' అనగా మానవుని యొక్క బంధ మోక్షములు రెండింటికిని 'మనస్సే' ముఖ్యకారణము. మనస్సు బహు చంచలమైనది. అటువంటి మనస్సును క్రమమైన సాధనతో బాహ్యేంద్రియముల వ్యాపారమున పడనీయక, ఆత్మజ్ఞానానే్వషణకు ఉపయోగించినచో మానవుడు మోక్షమార్గాన్ని సులువుగా తెలుసుకుంటాడు.
మన సంతోషం మంచిని చూడడంలో ఉండాలి. ఇతరుల మంచితనాన్ని, గొప్పతనాన్ని చూసి మనం ఎప్పుడు సంతోషాన్ని పొందుతామో అదే మంచితనం, ఇతర మంచి లక్షణాలు మనకు కూడా అలవడతాయి. మంచితనం మనస్సు యొక్క ప్రశాంతతకు దారితీస్తుంది. మనస్సులో సంకుచితత్వం ఒక ప్రత్యేకమైన అంతర్గత అశాంతిని రేపుతుంది. విశాల హృదయాన్ని అలవరచుకోవడం ద్వారానే దాన్ని తొలిగించుకోగలం.
భగవంతుని గురించి ధ్యానం చెయ్యడమే మనసును స్వాధీనం చేసుకోవడానికి అత్యంత సమర్థతమైన మార్గం. మనసును స్వాధీనం చేసుకోవడంలోని ఉత్తమ లక్ష్యం భగవంతునిమీద లేదా ఆత్మ మీద ధ్యానం చేయడమే. క్రమమైన అభ్యాసంతో మనస్సును భగవంతునిపై కేంద్రీకరించాలి. మనస్సులోకి ఎటువంటి చెడు ఆలోచనలు ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెడు ఆలోచనలు మనసులోనికిరావటానికి ప్రయత్నిస్తాయో అప్పుడు మన మనస్సును భగవంతునివైపుకు మరల్చి, ఆర్తితో ఆయనను ప్రార్థించాలి. ఈ విధంగా సాధన చేస్తే మనస్సును స్వాధీనం చేసుకోవచ్చును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి