1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

20, జులై 2011, బుధవారం

తోటి మనిషికి సాయపడదాం

గత వారం తెలిసిన వాళ్ల ఇంటికెళ్లాను. దేవేంద్ర భవనం లాంటి ఇల్లు. కొడుకు కోడలు అమెరికాలో స్థిరపడ్డారు. మొగుడికి పెళ్లాం, పెళ్లానికి మొగుడు అన్నట్టు లంకంత ఇంటిలో ఇద్దరే ఇద్దరు. ఎటువంటి బాదరాబందీ లేదు. బాధ్యతలు అసలే లేవు. ఇంట్లో అడుగుపెట్టి కూర్చోగానే మా అమ్మాయి, అబ్బాయి అంటూ పిలిచారు. ఎవరా అని ఆత్రంగా ఎదురుచూసిన నేను ఒక్క క్షణం గుమ్మైపోయాను. నాలుగు కాళ్ల జంతువులు నాలుగు తోకాడించుకుంటూ వచ్చాయి లోపలి నుంచీ. తెల్లటి బొచ్చు గలది ఒకటి, సింహం లాగా భీకరంగా చూసేది ఇంకోటి, నున్నగా అడ్డంగా పెరిగింది ఇంకోటి, టీవీలో మధ్య కనిపించే హచ్ కుక్క లాంటిది ఇంకోటి బిరబిరమంటూ ఇల్లంతా తిరిగాయి. ఇదిగో అక్కయ్య వచ్చింది అని నన్ను వాటికి పరిచయం చేశారు. నా పక్కనే ఉన్న మా బామ్మను కూడా వరసపెట్టి పరిచయం చేయడంతో మా బామ్మ భలే ఇదై పోయింది పాపం. క్షణాన ఏమనాలో నాకు అర్థం కాలేదు. మనిషి తనతోటి వ్యక్తులతో కలిసి ఉండే స్థాయి నుంచీ జంతువులతో వరసలు కలుపుకునే స్థాయికి రావడాన్ని స్వాగతించాలో తిరస్కరించాలో అర్థం కాలేదు. వసుధైక కుటుంబంలో తెలియని కోణం ఇది అనిపించింది. కుక్కలు ఇప్పుడు పెంపుడు జంతువులు కాదు, కుటుంబ సభ్యులే అంటే అతిశయోక్తి కాదేమో. భద్రత పేరుతో మొదలైన బంధం మనకో తోడుగా మార్పు చెందడం ఆధునిక జీవన విధానంలో భాగమే.
ధనికులకే సొంతమైన శునకరాజులు ఇప్పుడు మధ్యతరగతి మానవుడి ఇళ్లల్లో కూడా కనిపిస్తున్నాయి. అమెరికా లాంటి ధనిక దేశాలలో వీటికి సంబంధించిన వస్తువుల పెద్దపెద్ద అంగళ్లు, కుక్కల ఫ్యాషన్ షోలు సర్వసాధారణం. 26 శాతం జనాభా దారిద్య్ర రేఖకు దిగువున మసలుతున్న మనలాంటి దేశంలో కూడా కుక్కల సంఖ్య 26 శాతం చొప్పున ప్రతి సంవత్సరం పెరుగుతుండటం చూస్తుంటే మానవుడి స్థానం తగ్గింది అని బాధపడాలో, జీవ కారుణ్యం పెరిగందని సంతోషించాలో తెలియడం లేదు.
విదేశాల నుంచీ దిగుమతి చేసుకుని వేలకు వేలు పోసి వీటిని కొనడం, వీటి కోసం అన్ని సౌకర్యాలు అమరిన గది, బాగోగులు చూసుకోవడం కోసం ప్రత్యేక మనిషి, ఆఖరికి ఇవి ఆడుకునేందుకు, అలంకరించేందుకు వస్తువులు కూడా సమకూర్చడం చూస్తే మానవుడి కన్నా ఇవి ఇంకో పైమెట్టు మీదే ఉన్నాయి అనిపిస్తుంది. పూర్వజన్మ సుకృతం అంటే ధనికుల ఇంట్లో కుక్కగా పెరగడమే అనిపిస్తుంది వీటి జీవన శైలి చూస్తూంటే.
పెంపుడు కుక్కల్లో రమారమి యాభై రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రెండు వేల నుంచీ పాతిక వేల వరకు ఉంటుంది. సగటు మనిషి రోజూ తినేంత ఆహారం ఇవీ తింటాయి. జీవిత కాలం 10 నుంచీ 13 సంవత్సరాల వరకు ఉంటుంది. వీటి కోసం ప్రత్యేక సెలూన్లు కూడా మహా నగరాలలో వెలుస్తున్నాయి. మన దేశంలోనే 350 కోట్ల ఆదాయం రాబడుతోంది కుక్కలకు వాడే ఉత్పత్తుల పరిశ్రమ. ఇందులో కుక్కల ఆహారపు రంగమే 250 కోట్లు పలుకుతూ 10-15 శాతం వృద్ధి రేటుతో ముందుకెళుతోంది. ముంబాయి డబ్బావాలాలు సైతం కుక్కల కేరియర్ల పంపిణీ రంగంలో అడుగుపెట్టారు అంటే రంగం భవితవ్యం అర్థమవుతుంది. నాణేనికి ఇంకోవైపు చూస్తే పెరుగుతున్న సింగిల్ పేరెంట్స్ సంఖ్య, విదేశాల్లో స్థిరపడిన సుపుత్రుల వల్ల ఒంటరిగా మిగిలిపోతున్న వృద్ధుల సంఖ్య, భార్య-్భర్త ఇద్దరూ సంపాదనాపరులైన చిన్న కుటుంబాల సంఖ్య పరిశ్రమ పెరుగుదలకు కారణం. సాటి మనిషి మీద నమ్మకం సన్నగిల్లి మనిషి మూగ జీవుల మీద ప్రేమను పెంచుకుంటున్నాడు. సాన్నిహిత్యానికి కారణాలు ముఖ్యంగా మనకు నచ్చిన విధంగా ఉండాలి అనుకోకుండా వాటిని పూర్తిగా అంగీకరించడం, ప్రతిఫలాన్ని ఆశించకపోవడం, కృతజ్ఞత కలిగి ఉండటం. ఇవే మనిషికి మనిషికి మధ్య కరువయ్యాయి. ఇవే గుణాలను పక్క మనిషి పట్ల కనబరిస్తే మానవ సంబంధాలు మెరుగుపడతాయి. కానీ మనిషి నైజం జంతువుల పట్ల ఒక రకంగానూ, వ్యక్తుల పట్ల ఒక రకంగానూ ఉంటుంది. ఆదిశంకరుడు కుక్కలోని ఈశ్వరునికి మోకరిల్లాడు, ప్రతి జీవిలో పరమాత్ముని దర్శించే స్థితి అది. మనోస్థితి మనమందరమూ పొందాలంటే ముందస్తుగా సాటి మనిషిని గౌరవించడంతో, వారి కష్టాలకు స్పందించడంతో సాధ్యమవుతుంది.
యునిసెఫ్ అంచనా ప్రకారం మన దేశంలో 25 మిలియన్ల అనాధలు ఉన్నారు. వీరంతా కనీసం ఒక్కపూట తిండి కూడా ప్రాప్తం కాని, చదువుకు నోచుకోని మాణిక్యాలే. మన దేశం వీరి సహాయానికై బ్రిటన్ లాంటి దేశాలను అర్థిస్తోంది. ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి పథకాలను చేపట్టినా మన దృక్పథంలో మార్పు రానిదే సంపూర్ణ విజయం సాధ్యం కాదు. వంద కుక్కలను పెంచినా రాని తృప్తి ఆకలిగొన్న వాడికి పట్టెడన్నం పెట్టినప్పుడు వస్తుంది. ఇంకొకరి జీవితానికి బాట చూపినప్పుడు వస్తుంది. నాలుగైదు కుక్కల మీద వెచ్చించే డబ్బును ఒక నిస్సహాయ విద్యార్థికి అందిస్తే చాలు, 63 శాతం ఉన్న మన నిరక్షరాస్యత మెరుగుపడుతుంది. ఒంటరితనంతో బాధపడే వృద్ధులు, ఆర్థికంగా స్థిరపడ్డ వారు ఇలాంటి కార్యఅకమం చేపట్టవచ్చు. సమయాన్ని, జీవితాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఇదో చక్కని మార్గం. ఒక మనిషికి జీవితం ఇవ్వడం అంటే దత్తత తీసుకుని ఆస్తులే రాసివ్వక్కర్లేదు. ఉన్నంతలో వారి అభివృద్ధికి రూపంలో చేయూతను అందించినా అది ఒక జీవితానికి నిండు రూపం ఇచ్చినట్టే.
మనది యోగ దేశం, భోగ దేశం కాదు. అనాదిగా మనది ప్రకృతిని ఆరాధించే సంస్కృతి. ప్రతి చెట్టునీ, పుట్టనీ కూడా దైవంతో సమానంగా పూజిస్తాం. ఆవుని కూడా అమ్మా అని పిలిచే నేల మనది. కానీ ఇవన్నీ 'మనిషి' స్థానాన్ని పణంగా పెట్టి మాత్రం కాదు, కాకూడదు. అన్ని జీవుల్లోకెల్లా మానవుడిదే ఉత్కృష్టమైన జన్మ. యోగం లభించి జన్మ తరించాలంటే ఉన్నంతలో తోటి మనుషులకు సహాయం చేయడం ఒక్కటే మార్గం.

Source: Andhra Jyothi- July 19th, 2011 by Lalitha Sravanthi

Love all-Serve all
AMMA Srinivas

సందేహిస్తుంటే అతిగా సంకల్పం నెరవేరదుగా-ఆలోచన కన్నా త్వరగా అడుగేద్దాం ఆరంభంగా...

కామెంట్‌లు లేవు: