1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

11, జూన్ 2013, మంగళవారం

6. కాగితాలను పుస్తకాలను, మనుషులను కాళ్ళతో తగలకూడదు ఎందుకు?

6. కాగితాలను పుస్తకాలను, మనుషులను కాళ్ళతో తగలకూడదు ఎందుకు?హిందువుల ఇళ్ళల్లో, చిన్నప్పటినుంచీ కాగితాలకి, పుస్తకాలకి మరియు మనుషులకి కాళ్ళను తగలనివ్వ  కూడదని నేర్పించబడుతుంది.  ఒకవేళ పొరబాటున కాగితాలకి, పుస్తకాలకి, సంగీత సాధనాలకి లేదా ఏ ఇతరమైన విద్యా సంబంధమైన వస్తువులకి కాలు తగిలితే క్షమాపణకి గుర్తుగా కాలు తగిలిన వస్తువుని గౌరవపూర్వకముగా చేతితో తాకి కళ్ళకద్దుకోవాలని పిల్లలకు నేర్పబడుతుంది.

కాగితాలకు, మనుషులకు కాళ్ళు ఎందుకు తగలరాదు?భారతీయులకు జ్ఞానము పవిత్రము, దివ్యము ఐనది.  అందువలననే దానికి ఎల్లవేళలా గౌరవమివ్వాలి.  ఈ రోజుల్లో పాఠ్యంశములను ఆధ్యాత్మికము ఐహికము అని విడదీస్తున్నాము.  కానీ ప్రాచీన భారతదేశములో ప్రతి విషయము శాస్త్ర సంబంధమైన లేక ఆధ్యాత్మ సంబంధమైనది అయినా సరే పవిత్రంగా పరిగణించి గురువుల చేత గురుకులాల్లో నేర్పించబడేది.

చదువుకి సంబంధించిన వస్తువులని తొక్క కూడదనే ఆచారము భారతీయ సంస్కృతి విద్యకు ఇచ్చే ఉన్నత స్థానాన్ని తరచూ గుర్తు చేస్తుంది.  చిన్న తనమునుంచే ఈ విధముగా నేర్పడము వలన మనలో పుస్తకాల పట్ల, విద్య పట్ల శ్రద్దాభక్తులు నాటుకు పోతాయి.   జ్ఞానాధి దేవతకు అర్పణగా సంవత్సరానికి ఒకసారి సరస్వతీ పూజ లేదా ఆయుధపూజ రోజున మనము పుస్తకాలని వాహనాలని మరియు పనిముట్లని పూజించడానికి కూడా ఇది ఒక కారణము.  మనము చదువుకునే ముందు ఈ క్రింది విధంగా ప్రార్థిస్తాము .......

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
వరాలనిచ్చి, కోరికలని తీర్చే ఓ సరస్వతీ దేవీ! నా చదువును ఆరంభించే ముందర నీకు నమస్కారము చేస్తున్నాను.  నీవు ఎల్లప్పుడూ నా కోరికలు తీర్చుదువు గాక!

పిల్లలు పొరపాటున ఎవరికయినా కాళ్ళు తగిలినప్పుడు చాల భయపడతారు.  ఒకవేళ పొరపాటున తగిలితే క్షమాపణకై మనము ఆ వ్యక్తిని చేతితో తాకి వేళ్ళను కళ్ళకు అద్దుకోవాలి.  పెద్దవాళ్ళయినా చిన్నవాళ్ళని అజాగ్రత్తతో కాళ్ళతో తగిలితే, వారు వెంటనే క్షమాపణ చెప్తారు.

ఇతరులకి కాళ్ళు తాకడము చెడునడవడిగా పరిగణింప బడుతుంది - ఎందుకు?మానవుడు ఈ భూమి మీద ప్రాణముతో, భగవంతుని యొక్క చక్కటి ఆలయముగా పరిగణింప  బడుతాడు.  అందువల్ల ఇతరులను పాదాలతో తాకడము అంటే వారిలో నున్న దివ్యత్వాన్ని అగౌరపరచడం వంటిదే.   అందుకే పొరపాటున తగిలినా కూడా వెంటనే భక్తీ, వినయములతో కూడిన క్షమాపణను చెప్పాలి.

పై విధముగా మన ఆచారములు చాల సరళమైనవి.  కానీ అవి చాలా శక్తివంతమైన పరిపూర్ణమైన ఆధ్యాత్మిక సత్యాలను గుర్తుకు తెస్తాయి.  ఇటువంటి ఆచారాలు శతాబ్దాలనుండి భారతీయ సంస్కృతిని సజీవముగా నిలబెట్టడానికి కారణమయ్యాయి.
(తరువాత శీర్షిక - విభూతిని ఎందుకు పెట్టుకొంటాము?)

కామెంట్‌లు లేవు: