1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

4, జూన్ 2013, మంగళవారం

1. దీపారాధన ఎందుకు చేయాలి? 2. ప్రార్ధనా గదిని ఎందుకు కలిగి ఉండాలి? 3. 'నమస్తే' ఎందుకు చెప్పాలి?

చిన్మయారణ్యం పబ్లికేషన్స్ ట్రస్ట్ వారి సౌజన్యం తో ..........


ఓం నమో భగవతే వాసుదేవాయ 
సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు
కె.బి. నారాయణ శర్మ - నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.


1. దీపారాధన ఎందుకు చేయాలి?
ప్రతి భారతీయ గృహములోను దైవపీఠము వద్ద రొజూ దీపాన్ని వెలిగిస్తారు.  కొన్ని ఇళ్ళలొ ఈ దీపాన్ని ఉదయము, మరి కొందరు సాయంత్రం, ఇంకొందరు ఉభయ సంధ్యలలొ వెలిగిస్తారు.  అరుదుగా కొందరు (అఖండ దీపము) ప్రతి దినము రోజంతా ఉండేలాగ దీపాన్ని వెలిగిస్తారు.

శుభ సందర్భాలు, నిత్య పూజలు, ప్రార్ధనలు, పర్వ దినాలు మరియు సామాజిక ప్రారంభోత్సవాలు మొదలైనవి అన్నీ కూడా దీపము వెలిగించిన తర్వాతనే ప్రారంభిస్తారు.  ఒక్కొక్కసారి ఆయా సందర్భాలు పూర్తయ్యేవరకు ఆ దీపాన్ని అలాగే కొనసాగిస్తారు.

అట్లా ఎందుకు చెయ్యాలి?
కాంతి జ్ఞానానికి, చీకటి అజ్ఞానానికి చిహ్నములు.  భగవంతుడు జ్ఞానస్వరూపుడు.  అన్ని విధములైన జ్ఞానానికీ ఆయనే ఆధారము.  జ్ఞానాన్ని ఇచ్చేవాడు, పోషించే వాడు కనుక జ్యోతి రూపములో భగవంతుడిని ఆరాధిస్తాము.
కాంతి చీకటిని తొలగించినట్లుగా జ్ఞానము అజ్ఞానాన్ని తొలగిస్తుంది.  జ్ఞానమనేది ఎప్పటికీ తరగని అంతరంగ సంపద.  అన్ని సంపదలకన్నా గొప్ప సంపదగా జ్ఞానాన్ని భావించి దీపాన్ని వెలిగించి నమస్కరిస్తాము.  మనము చేసే పనులు మంచివైనా, చెడ్డవైనా జ్ఞానాన్ని ఆధారముగా చేసికొనే చేస్తాము.  అందువలననే అన్ని శుభ సందర్భాలలో మన ఆలోచనలకు సాక్షిగా దీపాన్ని వెలిగిస్తాము.
బల్బును కానీ ట్యూబ్ లైట్ను గానీ ఎందుకు వెలిగించరు? అది కూడా చీకట్లను తొలగిస్తుంది కదా!
కానీ సాంప్రదాయ దీప కాంతి మనకు ఆధ్యాత్మికమైన ప్రాముఖ్యతను కూడా సూచిస్తుంది.  దీపానికి వాడే నెయ్యి లేక తైలము మనలోని వాసనలు లేక స్వార్ధ పూరితమైన సంస్కారాలకు చిహ్నము. వత్తి అహంకారానికి ప్రతీక.  ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానముతో వెలిగిస్తామో అప్పుడు వాసనలు మెల్లగా కరిగి పోయి అహంకారం అంతరించిపోతుంది.  
జ్యోతి ఎప్పుడూ పై వైపుకు మాత్రమే చూస్తూ ఉంటుంది.  అదే విధముగా మనము ఆర్జించే జ్ఞానము మనల్ని ఎప్పుడూ ఉన్నత ఆశయాల వైపు మళ్ళిస్తుంది.
ఒక దీపము కొన్ని వందల దీపాలను వెలిగిస్తుంది.  అదే విధముగా ఒక జ్ఞాని తన జ్ఞానాన్ని ఎంతో మందికి అందిస్తాడు.  దీపాలను వెలిగించడము వలన వెలిగించే దీపము యొక్క కాంతి ఏమాత్రము తగ్గి పోదు.   అదే విధముగా జ్ఞాని జ్ఞానాన్ని ఇతరులకి పంచడము వలన తన జ్ఞానము తగ్గదు.  పైపెచ్చు జ్ఞానము గురించిన అవగాహన పెంపొందుతుంది.  ఇచ్చిన వాళ్లకు, తీసికొనే వాళ్లకు కూడా ఉపయోగ కారి అవుతుంది.

దీపం వెలిగించే టప్పుడు ఈ క్రింది ప్రార్ధన చేస్తాము.
దీపం జ్యోతీ పరబ్రహ్మ దీపం స్సర్వం తమోపహః
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమో2స్తుతే
అజ్ఞానాన్ని హరించి, జ్ఞానాన్ని ఇచ్చి అన్నింటిని సిద్ధింప చేసికొనే శక్తినిచ్చే సంధ్యా దీపానికి ప్రణామములు.

ఈ ఆచారము జ్ఞాన సంపద, ఆధ్యాత్మిక సంపదను సూచిస్తుంది. 


2. ప్రార్ధనా గదిని ఎందుకు కలిగి ఉండాలి?
భారతీయులందరూ పూజకై, ప్రార్ధనకై ఒక గదిని లేక కొంత స్థలాన్ని తమ గృహములలో కేటాయిస్తారు.  ప్రతి రోజూ దైవానికి ముందు ఒక  దీపాన్ని వెలిగిస్తారు.  జపము, ధ్యానము, పారాయణము, ప్రార్ధనలు, భజనలు మొదలగు ఆధ్యాత్మిక సాధనాలు కూడా ఈ ప్రార్ధనా స్థలమందు జరుపుతారు.  పుట్టిన రోజు, వివాహాది దినములు మరియు పండుగలు మొదలైన అన్ని శుభ సందర్భాలలో ప్రత్యేకమైన పూజలు చేస్తారు.  గృహములోని పెద్దలు, పిన్నలు అందరు కూడా దైవముతో సాన్నిధ్యము కలిగి పూజ చేసికొంటారు.
పూజాగది - ఎందుకు?
ఈ చరాచర సృష్టికి పరమాత్మ మాత్రమే సొంత దారుడు.  కావున మనము నివసించే గృహానికి కూడా నిజమైన హక్కుదారు పరమాత్మయే.  పూజా గది అనేది ఆ యజమాని ఐన పరమాత్మ గది.  మనము భగవంతుని సొత్తుకు నిజమైన సొంత దారులము కాము అనే భావన వలన మాత్రమె మన దురహంకారము, మనది అనే పెత్తందారి తనమును వదిలించుకోగలము.

మనము నివసించే గృహమునకు మరియు మనకు కూడా యజమాని భగవంతుడే.  మనము కేవలము ఆయన గృహానికి నియమించబడ్డ నిమిత్త మాత్రులమైన సేవకులము అన్న సరైన భావన కల్గి ఉండటము ఉత్తమము.  ఈ విధముగా భావించ వీలు కానిచో భగవంతుడిని మన గృహానికి విచ్చేసిన ముఖ్య అతిధిగా భావించి ఆయన సంతోషముగా ఉండడానికి పూజ గదిని కానీ, దైవ పీఠమును గాని వసతిగా కల్పించాలి.  అన్ని వేళలా ఆ ప్రదేశం శుభ్రముగా మరియు అలంకార యుక్తంగా ఉండేలా చూడాలి (ఉన్నతాధికారి మన ఇంటికి వస్తుంటే వారికి చేసే సౌకర్యాలకన్నా కొంత ఎక్కువగానే ఉండేలా చూడాలి).

పరమాత్మ సర్వ వ్యాపి .  ఈ విషయము గుర్తుంచు కోవడానికి ఆయన మన ఇంట్లో మనతో ఉండడానికి మనము పూజా గదులను కల్గి ఉండాలి.  భగవంతుని అనుగ్రహము లేనిదే మనము ఎ పనిని విజయవంతముగా చేయలేము, దేనిని సాధించ లేము.  పూజ గదిలో భగవంతుడిని ప్రతి రోజూ ప్రార్ధించటము వలన సన్నిహిత సంబంధము ఏర్పడి ఆయన అనుగ్రహాన్ని త్వరగా పొందగలము.

ఇంటిలోని ప్రతి గది ఒక ప్రత్యేకమైన పనికి నిర్దేశింపబడి ఉంటుంది.   ఆయా గదులు ఆయా నిర్దేశింపబడిన పనులకు అనుకూలము కల్గి ఉండేలాగా అమర్చి ఉంటాయి.  అదే విధముగా ధ్యానానికి, పూజకు, ప్రార్ధనకు కూడా అనుకూలమైన వాతావరణము కల్గినటువంటి పూజాగది మనకు అవసరము . పవిత్రమైన ఆలోచనలు, శబ్దతరంగాలు ఆ ప్రదేశములో వ్యాపించి అక్కడకు వచ్చినవారి మనస్సుల్ని ప్రభావితము చేస్తాయి .  మనము అలసిపోయినప్పుడు లేక కలత చెందినప్పుడు కేవలము ప్రార్ధనా గదిలో కొద్దిసేపు కళ్ళు మూసుకుని కూర్చుంటే కూడా చాలు ప్రశాంతత, ఉత్సాహము, ఆధ్యాత్మిక ఎదుగుదల పొందగలము.

(అంతే కాని చేసే కొన్ని విధాలైన పనులు భగవంతుని ముందర చేయటానికి Guilty గా ఉంటుంది కదండీ అందుకు కాస్త దూరంగా ప్రత్యేక గది కట్టి అందులో భగవంతుణ్ణి బంధించేశాము అని మాత్రము దయచేసి అనకండి.)


3. 'నమస్తే' ఎందుకు చెప్పాలి?
భారతీయులు ఒకరినొకరు 'నమస్తే' అని పలకరించు కుంటారు.  నమస్తే అన్నప్పుడు తల వంచి రెండు అరచేతులు హృదయం ముందర కలపడము జరుగుతుంది.  మనకన్నా చిన్నవారైనా, సమ వయస్కులైనా, పెద్దవారైనా స్నేహితులైనా మరియు కొత్తవారైనా కూడా ఇదే విధముగా నమస్తే అని పలకరించాలి.

శాస్త్రాలలో సంప్రదాయ బద్ధమైన ఐదు రకాల అభివందనములు ఉన్నాయి.  అందులో నమస్కారము ఒకటి.  నమస్కారము అంటే సాగిలపడుట అనే అర్ధము వస్తుంది.  కానీ నమస్తే అంటే ఈ రోజుల్లో మనము ఒకరిని ఒకరు కలిసినప్పుడు ఇచ్చి పుచ్చుకునే మర్యాదగా గ్రహించాలి.
నమస్తే ఎందుకు చేయాలి?
నమస్తే అనేటటువంటిది మామూలుగా అలవాటుగా చేసేటటువంటి వందనమో, సంప్రదాయబద్ధమైన ఆచారమో లేక భగవదారాధనో అయి ఉండవచ్చును.  ఏది ఏమైనప్పటికీ ఈ ఆచారములో మనకు తెలియని చాలా లోతైన అర్ధము ఉంది .  సంస్కృతములో నమః+తే = నమస్తే.  దీని అర్ధము - నేను నీకు నమస్కరిస్తున్నాను అని.   నమః అనే  పదాన్ని "న", "మః" గా విడదీయవచ్చు - నాది కాదు అనే అర్ధము వస్తుంది.  ఇతరుల సన్నిధిలో మన అహంకారాన్ని వదిలించుకొనే లేక తగ్గించుకొనే ఆధ్యాత్మిక సాధనను తెలియ జేసే ఆచారమిది.
వ్యక్తుల మధ్య నిజమైన కలయిక అంటే వారి మనస్సులు కలవడమే.  అందుకే మనము ఇతరులను కలిసినప్పుడు నమస్తే అంటాము.  అనగా 'మన మనసులు కలియుగాక' అని అర్ధము.  హృదయం ముందర రెండు అరచేతులు కలపడము ఈ అర్థాన్నే సూచిస్తుంది.  తల వంచడము అనేది ప్రేమతో వినయముగా మర్యాదని, స్నేహాన్ని అందించడాన్ని తెలియచేస్తుంది.
నమస్కారమనేది ఆధ్యాత్మ పరంగా ఇంకా లోతైన అర్ధాన్ని సూచిస్తుంది .  ప్రాణ శక్తి, దివ్యత్వము; ఆత్మ లేక పరమాత్మ అందరిలో ఒకేలాగా ఉన్నది.  ఈ ఏకత్వాన్ని గుర్తించి రెండు చేతులు కలిపి తల వంచి ఇతరులను కలిసినప్పుడు వారిలో ఉన్న దివ్యత్వానికి నమస్కరిస్తాము.  మహాత్ములకు, భగవంతుడికి నమస్కారము చేసేటప్పుడు అందుకనే ఒక్కోసారి మనలోనున్న దివ్యత్వాన్ని చూసుకోవడానికా అన్నట్లు కనులు మూసుకొంటాము.  దివ్యత్వాన్ని సూచించే విధముగా నమస్కారము ఒక్కోసారి  భగవన్నామములతో ద్వారా కూడా చేయ బడుతుంది.  ఈ ప్రాముఖ్యత తెలిసికొన్నప్పుడు నమస్కారము చేసేటప్పుడు పైపైకే నమస్తే అనడము గాక సరైనటువంటి స్నేహానికి దోహదము చేసే లాగున ప్రేమతోను గౌరవముతోను కూడిన వాతావరణాన్ని కలుగ చేయ గలము.

కామెంట్‌లు లేవు: