ఏకాదశి అంటే పదకొండు. త్వక్ (చర్మము), చక్షు(కన్నులు), శ్రోత్ర(చెవులు), రసన(నాలుక), ఘ్రాణ(ముక్కు) అనే ఐదు ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు అనబడుతాయి. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ అనే ఐదు కర్మేంద్రియాలు అనబడతాయి. చర్మము ద్వారా తోలు మీది వ్యామోహంతో భ్రష్టు పట్టకుండా, కన్నులద్వారా చెడు చూడకుండా, శ్రోత్రము ద్వారా చెడు వినకుండా, నాలుక ద్వారా చెడు అనకుండా, ఘ్రాణము ద్వారా చెడును గ్రహించకుండా, వాసనకు అంటే విషయ వాసనలకు అంటే ప్రాపంచిక వ్యామోహాలకు లొంగకుండా, కర్మేంద్రియములైన ఐదు, అంటే, వాక్కు, పాణి(చేతులు)పాద (అంటే కాళ్ళు)పాయు(విసర్జకావయవం)ఉపస్థ(అంటే కామభోగానికి పనికి వచ్చేఇంద్రియం) వీటిద్వారా చెడు పలకకుండా, చెడుపనులు చేయకుండా, చెడు వైపు అడుగులు వేయకుండా, చెడును విసర్జించి, చెడుమార్గాలలో కామభోగాలకు లొంగకుండా, ఐదు జ్ఞానేన్ద్రియములను, ఐదు కర్మేన్ద్రియములను ఈ పదింటిని మనసు అనే అంతరింద్రియము ద్వారా నియంత్రించి ఈ పదకొండు ఇంద్రియములను పరిశుద్ధంగా పరమాత్ముడిపైన లగ్నం చేయడమే 'ఏకాదశి' రహస్యం!
శబ్ద, రూప, రస, స్పర్శ, ఘ్రాణములనే పంచ తన్మాత్రల ద్వారా అంటే పంచ ప్రాధమిక తత్త్వముల ద్వారా పరమాత్ముడు, లేదా పరాశక్తి, ఈ సృష్టిని చేసినట్లు భారతీయ ఆధ్యాత్మిక భావన! శబ్దము ద్వారా ఆకాశం(ఆకాశం శబ్ద లక్షణం కలిగిందని శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే తెలుసుకున్నది! రూపం ద్వారా తేజస్సు అంటే అగ్ని, రసం ద్వారా జలం అంటే నీరు, స్పర్శ ద్వారా వాయువు, ఘ్రాణము ద్వారా పృథ్వి ఉద్భవించాయి! ఇవే ప్రుధివ్యాపస్తేజోవాయురాకాశములనే పంచ మహా భూతాలు!
ఆ శబ్దాన్ని వినడానికి చెవులు, రూపాన్ని చూడడానికి కన్నులు, రసమును పీల్చడానికి నాలుక, స్పర్శను అనుభవించడానికి చర్మము, పృధ్వీతత్త్వమైన ఘ్రాణము కొరకు ముక్కు ఉద్భవించాయి ప్రథమపురుషునకు! వీటిని అనుభవించడం కొరకు కర్మేంద్రియాలు ఉద్భవించాయి. ఆ ప్రథమ పురుషుని అంశా స్వరూపాలైన మానవులకుకూడా ఆయా అవయవాలు పరమపురుషుని అవయవముల నుండే ఉద్భవించాయి! కనుక వీటిని పవిత్రములుగా ఉంచుకోవాలి! మనిషిని ప్రలోభపెట్టేది, వంచించేది, పెంచేది, తుంచేది, ఆడించేదీ, ఓడించేదీ, అన్నీ చేసేది మనసే! నిజానికి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అని నాలుగు అంతః కరణ చతుష్టయం అనబడతాయి. ఇదంతా భారతీయ వేదాంత సారం! వేరే ఏ ధర్మాలలోనూ ఇంత విశదమైన, గూఢమైన, గాఢమైన విశ్లేషణ లేదు. మనసును బుద్ధికి అప్పజెప్పి బుద్ధిని మనసుపెట్టి మార్చుకొని, చిత్తమును వశం జేసుకొని, అహంకారాన్ని, అసూయను జయించి అప్పుడు మనసు ద్వారా పంచకర్మేంద్రియములను,పంచ జ్ఞానేంద్రియములను వశపరచుకొని, నియంత్రించుకొని, ఈ పదకొండింటిని పరమాత్మకు అభిముఖంగా నడిపించడమే ఏకాదశి రహస్యం!
Coutesy : telughubhakthi.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి