1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

30, మే 2009, శనివారం

ఆనందంగా జీవించండి

ఎన్నో ఆందోళనలకు,మనశ్శాంతి కరువవడానికి,చేస్తున్న పనులు సరిగా చేయకపోవడానికి ప్రధాన కారణం "మనిషి వర్తమానంలో జీవించకుండా గతంలో జీవించడం,అలాగే భవిష్యత్తును ఎక్కువగా ఊహించుకుంటూ ప్రస్తుతాన్ని సరిగా జీవించలేకపోవడం".ఒక్క విషయం ఇక్కడ మనుషులు గమనించడం లేదు.మన ప్రస్తుత పరిస్థితి గతంలో మనం చేసిన పనుల యొక్క ఫలితం.అలాగే ఇప్పుడు మనం చేయబొయే పనులపైనే మన భవిష్యత్తు ఆధారపడిఉంటుంది.ఇది తెలుసుకోకుండా గతంలో జరిగిన బాధాకరమైన సంఘటనల గురించి అదేపనిగా బాధపడడం,మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అని బాధపడడం జరుగుతోంది.తద్వారా ఇప్పుడు అనగా వర్తమానంలో సరిగా పనులుచేయకపోవడం వలన గతకాలపు చేదు జ్ఞాపకాలనూ చెరిపివేయలేము,అలాగే అనుకున్న ఆశావహ భవిష్యత్తునూ జీవించలేరు.
"తప్పులు చేయడం మానవసహజం".కాబట్టి గతంలో జరిగిన తప్పుల గురించి బాధపడడం మానేసి ఆ తప్పులను మరోసారి చేయకుండా జాగ్రత్తపడాలి.

కాబట్టి జరిగిపోయిన మన చరిత్రను ఒక్కసారి కూలంకుషంగా విశ్లేషించి ఇక ఆ సంఘటనలను పట్టించుకోవడం మానివేసి ప్రస్తుతం చేయబోయే పనులపైన దృష్టి పెట్టాలి.అలాగే చేయబోయే ఏ పనినైనా ముందుగా ఆ పని వలన సంతోషం మిగులుతుందా లేక బాధ ఫలితమవుతుందా అని విశ్లేషించి మొదలుపెట్టాలి.ఇక్కడ ఇంకో విషయం మరిచిపోకూడదు."మన స్వేచ్చ ఇతరులను బాధపెట్టేదైతే మనం స్వేచ్ఛగా ఉండలేము" అన్న విషయం.కాబట్టి మన పనులు సమాజానికి మేలు చేయలేకపోయినా కనీసం హాని మాత్రం చేయరాదు.

అలాగే అనవసరంగా ఎవరినీ అనవసరంగా ద్వేషించకూడదు.మన ద్వేషం వలన ఆ ద్వేషింపబడేవారిలో ఏదైనా మంచి మార్పు వచ్చేటట్టైతే మన ద్వేషానికి అర్థం ఉంటుంది.ద్వేషం వలన మనసూ మనశ్శాంతి పొందలేదు.ఉదాహరణకు మనము మనకు ఇచ్చిన పని మనస్పూర్తిగా చేస్తున్నప్పుడు మన ద్వేషానికి కారణమైన మనిషికానీ,సంఘటన కానీ ఎదురైనా లేక గుర్తువచ్చినా మనకు తెలియకుండానే మన మనసు వికలమయ్యి మన పనికి ఆటంకం అవుతుంది.ఈ విషయాలన్నీ ఆదర్శపూరిత విషయాలని అనుకోవచ్చు.కాని ఏ ఆదర్శంలేని వ్యక్తి కన్నా ఏదో ఒక ఆదర్శం గల వ్యక్తి వలనే సమాజానికి ఉపయోగం ఉంటుందన్న విషయం మనం మరిచిపోరాదు. అప్పుడే మనము వర్తమానాన్నీ ఆనందంగా జీవించగలము మరియు సుందర భవిష్యత్తునూ జీవించగలము.

కామెంట్‌లు లేవు: