1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

21, జులై 2009, మంగళవారం

పేగుబంధం



వత్సం అంటే ఆవుదూడ. అది పుట్టినప్పుడు దాని ఒంటినిండా మావి అలముకుని జుగుప్సావహంగా ఉంటుంది. అప్పుడు వత్సల(గోమాత) బిడ్డ దేహంమీద మకిలి అంతటినీ స్వయంగా తన నాలుకతో శుభ్రం చేస్తుంది. ప్రేమగా, ఆత్మీయంగా, శ్రద్ధగా తల్లిగోవు ఆ పని చేస్తున్నప్పుడు వ్యక్తమయ్యే గొప్ప భావాన్నే వాత్సల్యం అంటారు. వాత్సల్యం తల్లుల సొత్తు. మాతృత్వం అనేది సృష్టిలోని ఒకానొక మహత్వపూర్ణమైన అనుభూతి. అది బిడ్డకు జన్మ, తల్లికి పునర్జన్మ! తల్లి అనిపించుకోవడానికి స్త్రీ ప్రాణాల్ని సైతం పణంగా పెడుతుంది. అమితమైన బాధను ఓర్చుకుంటుంది. ప్రసవ వేదన ఎంతటిదో అనుభవిస్తేనే తెలుస్తుంది. రైలు పట్టాలమీద పెట్టిన నాణెం చక్రాలకింద నలిగి వెడల్పవుతుంది చూశారా! కాన్పులో బాధను దానితో పోల్చి చెప్పిందొక కవయిత్రి. దుర్భరమైన నొప్పులను ఓర్చుకున్న అమ్మ నలుసును చూడగానే సంతోషంగా నవ్వుతుంది. అమ్మనొప్పులకు కారణమైన ఆ బిడ్డ మాత్రం ఏడుస్తాడు. అదే సృష్టిలోని చిత్రం! కన్నాక కూడా కొన్నాళ్ళపాటు తన నోటిని కట్టేసుకుని తల్లి పథ్యంచేస్తూ బిడ్డకు మాత్రం తియ్యని పాలిచ్చి పెంచుతుంది. సంతానాన్ని పెంచి పెద్దచేసే క్రమంలో ముఖ్యభూమిక వహిస్తుంది. తల్లి పెంపకంలో గొప్పగొప్ప యోధులైనవారు చరిత్రలో మనకు చాలామంది కనిపిస్తారు. పురాణ కాలంలో పాండవులు మొదలు, ఆధునిక యుగంలో శివాజీ దాకా మహాయోధులైన వారెందరిపైనో తల్లి ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. దాన్ని గుర్తించాడు కాబట్టే 'ప్రపంచంలో గొప్పవారంతా తమ తల్లుల లక్షణాలను అధికంగా పుణికిపుచ్చుకున్నవారే' అని నిర్ధారించాడొక తత్వవేత్త. 'ఒడిలో కూర్చొనియుండ, నీవు మమతాయోగమ్ము పాటించి ప్రేముడిమై దేహమునెల్ల తాకునపుడేమో గాఢసంరక్షలో గుడిలో దీపము వోలెనుంటి...' అన్న ఒక మహాసహస్రావధాని మాట- అమ్మ ఒడిలోని భద్రస్థితికి కవితాకర్పూర నీరాజనం.

అమ్మ జన్మదాత అనుకుంటే- నాన్న జీవదాత! దేహం తండ్రి ప్రసాదం అని వేదం స్పష్టంగా చెప్పింది. పురుషేహవా... అనే ఐతరేయమంత్రం- తండ్రి శుక్రం ద్వారా తల్లి గర్భంలో దేహాన్ని పొందడం జీవుడికి మొదటి జన్మగా చెప్పింది. శిశువు రూపంలో భూమిమీద పడటం రెండో జన్మ. అక్కడినుంచి తండ్రి సంరక్షణ మొదలవుతుంది. తల్లీతండ్రీ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అపురూపంగా పెంచుకుంటారు. వాళ్ళకోసం అవసరమైతే, తాము పస్తులుండటానికి సిద్ధపడతారు. తమ పిల్లలు తమకన్నా అన్నివిధాలా పెద్దస్థాయిలో జీవించాలని కోరుకుంటారు. తపనపడతారు. త్యాగాలు చేస్తారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించడం, పెద్దవాళ్ళను చెయ్యడం తమ బాధ్యతగా భావిస్తారు. ఇష్టంగా నిర్వహిస్తారు. ఊహ తెలియగానే పిల్లవాణ్ని 'నీ బతుకు నువ్వు చూసుకో' అనడానికి భారతీయ తల్లిదండ్రులకు మనసొప్పదు. 'భార్య భర్త అనే రెండు తాళ్ళు ముడివేస్తే- ఆ ముడి సంతానం' అన్నాడు భర్తృహరి. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఆ పేగుముడే- మనిషి అసలైన జీవ లక్షణం. చమురు ఆవిరైతే దీపం ఏమవుతుంది? బంధం శిథిలమైతే బతుకులో ఇక ఏముంటుంది? భార్యాభర్తలు విడిపోవచ్చు, చెడిపోవచ్చు గాని- తల్లిదండ్రులుగా మారాక బాధ్యతగా జీవించవలసిందేనని మన పెద్దల తీర్మానం. భార్యాభర్తల మధ్య ముందు ఏర్పడ్డ దూరం పిల్లలనే ముడితో తరిగిపోతుందంటారు వేటూరి ప్రభాకరశాస్త్రి. 'సంతానం కలగడంతో ఎన్నో సమస్యలు సమసిపోయి భార్యాభర్తలు దగ్గరకావడం మనం చూస్తున్నాం. అలాగే ప్రేమపెళ్ళిళ్లను ఆమోదించలేక విడిపోయిన కుటుంబాలు సైతం కొత్త జంటకు పిల్లలు కలిగేసరికి తిరిగి కలగలసిపోవడం మనం ఎరుగుదుం. అదే 'సుతాకారపు ముడి' అంటే! దాని ప్రభావం తియ్యనిదేకాదు, బలమైనది కూడా!

అనుబంధాలూ ఆత్మీయతలూ లేకుంటే జీవితానికి అర్థమే ఉండదు. తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమానురాగాలు పంచి ఇవ్వాలి. పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రుల్ని సాదరంగా, ఆత్మీయంగా చూసుకోవాలి. ఆ సంప్రదాయ పరంపర తరవాతి తరానికి ఆదర్శం కావాలి. గడపడానికీ, జీవించడానికీ మధ్య తేడా అదే! తన తల్లిదండ్రుల పాదపద్మాలను ప్రీతిగా 'ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూములకన్నను విమల తరము...' అని స్తుతించాడు పాండురంగడు. స్వతహాగా చదువూసంధ్యా అబ్బకపోయినా- కౌశికుడంతటివానికి జ్ఞానబోధ చేయగలిగే స్థాయి వివేకం తనకు దక్కడానికి కారణం తల్లిదండ్రులకు చేసిన సేవలే అన్నాడు- భారతంలో ధర్మవ్యాధుడు. ఆడపిల్లలు తండ్రిమీద, మగపిల్లలు తల్లిపైన ప్రేమ అధికంగా కలిగిఉంటారని చెబుతారు. మనమూ పిల్లల్ని 'నువ్వు అమ్మ పార్టీయా, నాన్న పార్టీయా' అని ఆరా తీస్తుంటాం. 'వాడు అమ్మ కూచి... ఆమె నాన్న కూచి' అంటూ ముద్రలు వేస్తుంటాం. ఏ రకంగా ముద్రలు వేసినా, ఎటువైపు మొగ్గుచూపినా పిల్లలందరూ తమ తల్లిదండ్రులు ఇద్దరూ కలిసిమెలిసి ఉండాలనే కోరుకుంటారు. అమ్మానాన్నా ఒకరినొకరు మనసారా ప్రేమించడం, గౌరవించడమే పిల్లలకు ఇష్టంగా ఉంటుంది. ఇటీవల హైకోర్టు ధర్మాసనం సైతం ఇదే విషయాన్ని ఒక జంటకు వివరించింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక కాపురంలో కలతలు మొదలై ఆ జంట విడిపోయింది. పిల్లలిద్దరూ చెరో చోటా ఉండిపోయారు. అయిదేళ్ళు గడిచాక విడాకుల కేసు కోర్టుకు వచ్చినప్పుడు చిన్నపాపను న్యాయమూర్తి పిలిచి 'నీకు అమ్మానాన్నల్లో ఎవరు కావాలి?' అని అడిగారు. ఆ పిల్ల చేతులు జోడించి 'నాకు అమ్మ, నాన్న, అక్క ముగ్గురూ కావాలి' అని దీనంగా అడిగింది. దాంతో న్యాయమూర్తి చలించిపోయారు. జనం కరిగిపోయారు. తల్లీతండ్రీ కన్నీటితో సతమతమయ్యారు. కరుణ రసాత్మకమైన ఆ ఘటనతో వారిద్దరూ పశ్చాత్తాపానికి లోనయ్యారు. తిరిగి ఒకటవుతామని కోర్టుకు విజ్ఞప్తిచేశారు. పేగుబంధం తన ప్రభావాన్ని చూపించింది. ఆ కుటుంబం ఆనందాశ్రువులతో ఒక్కటైంది. సమాజంలో వస్తున్న గొప్ప మార్పునకు సంకేతంగా నిలిచింది.

కామెంట్‌లు లేవు: