కోరికల్ని ఎలా జయించాలి? తృప్తిపరిచా ? లేక అణచివేశా ?
ఒకసారి కొన్ని ప్రశ్నలు రాసి వున్న కాగితాన్ని ఒకతను భగవాన్ కు అందించారు.ప్రశ్న: ఎవరయినా చెప్పినదాన్ని వెంటనే నమ్మే అలవాటును ఎలా వదుల్చుకోవాలి? ఒకరు ఒక ఆదర్శాన్ని చెపితే తక్షణమే నమ్మేసి ఆచరిస్తూ, ఇంకెవరన్నా వచ్చి వేరే ఆదర్శాలను గురించి పొగిడితే వాటిని నమ్మి పాతవి వదిలి వేయడానికి తయారవుతానే!
భగవాన్ : అవునవును. మనకున్న బాధే ఇది. సత్యాన్ని తప్ప మిగతా అన్నిటినీ నమ్మేస్తాం. మనకున్న తప్పు నమ్మకాలను వదిలివేయాలి. ఇది మాత్రమే మనం చేయాల్సింది. అపుడు సత్యం స్వయంగా ప్రకాశిస్తుంది.
ప్రశ్న: ఎంతో ఉత్సాహంగా ఏదో ఒక ఆదర్శం కోసం ప్రయత్నాన్ని ప్రారంభిస్తాను. కానీ రాను రాను ఆ ఉత్సాహం కాస్తా తగ్గి పట్టుదల సడలిపోతుంది. అలా జరగడానికి కారణమేమి? అలా కాకుండా ఉండడానికి నేనేమి చేయాలి?
భగవాన్: ఆరంభంలో నీ ఉత్సాహానికి కారణం ఒకటి ఉన్నపుడు తరువాత నీ నిరుత్సాహానికి కూడా ఒక కారణం ఉండాలి కదా!
ప్రశ్న: ఎందరో గురువులు ఎన్నెన్నో మార్గాలు ఉపదేశిస్తారు. అందులో ఎవర్ని గురువుగా ఎన్నుకోవాలి?
భగవాన్: శాంతి ఎవ్వరి దగ్గర లభిస్తుందో అతనినే.
ప్రశ్న: కోరికలను వదల్చుకోవడానికి వాటితో ఏ విధంగా వ్యవహరించాలి? వాటిని తృప్తిపరిచా? లేక అణచివేశా?
భగవాన్ : తృప్తి పరచితే కోరిక నశించేటట్లయితే తృప్తిపడటంలో నష్టంలేదు. కానీ సామాన్యంగా కోరికలేవీ ఆ రకంగా నశించిపోవు. అలా చేయడం మంటలను ఆర్పడానికి పెట్రోలును మంటలమీద పోయడంలాంటిది. బలవంతంగా కోరికలను అణచడం సరియైన మార్గం కాదు. అణచిన కోరికలు అపుడు కాకపోయినా ఇంకొక్కప్పుడైనా విజృంభించి చెడు ఫలితాలకు కారణమవుతాయి.
కోరికలను వదల్చుకోవడనికి సరియైన మార్గం -
ఈ కోరిక లెవరికి? మూలమేమి ? అని తెలుసుకోవడమే.
అలా తెలుసుకున్న తరువాత ఆ కోరిక సమూలంగా నశించిపోతుంది. ఆ తరువాత అని మళ్ళీ తలెత్తడం, పెరగడం ఉండదు. కాలకృత్యాలు తీర్చుకోవడం, తినడం, తాగడం లాంటి చిన్న అవసరాలు తీర్చడంలో ఇబ్బందిలేదు. అవి నీ మనసులో వాసనలను నాటి ఇంకో జన్మకు కారణం కాదు. ఆ పనులన్నీ జీవితాన్ని గడపడానికి అవసరమౌతాయేగానీ వాసనలుగా మారే అవకాశం లేదు. తృప్తి పరచడం ద్వారా ఇంకా ఇంకా కోరికలు పెరిగి మనసులో కొత్త వాసనలను కల్పించనట్టి కోరికలను తృప్తిపరచడంలో నష్టంలేదు అని సామాన్యమైన సూత్రం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి