ఓడల బండ్లును వచ్చును
ఓడలు నాబండ్ల మీద నొప్పుగ వచ్చును
ఓడలు బండ్లును వలెనే
వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ!
తాత్పర్యం: నావలపై బళ్లు, బళ్లపై నావలు వచ్చునట్లే, భాగ్యవంతులకు దారిద్య్రం, దరిద్రులకు భాగ్యం పర్యాయంగా వస్తూంటాయి.
అందరూ అంగీకరించాల్సిన ఒక గొప్ప జీవన సత్యాన్ని చాలా సరళంగా చెప్పారు ఈ పద్యంలో.. ఈ సంగతి మనకి తెలిసినదిగానే అనిపించినా నిజానికి ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలామంది మర్చిపోతుంటారు. సిరిసంపదలు శాశ్వతం కాదని తెలిసినా సిరిననుసరించే గౌరవమర్యాదలు ఇవ్వడమనేది లోక రీతి అయిపోయింది. భాగ్యవంతుల అడుగులకు మడుగులొత్తడం ఒక ఎత్తయితే.. సంపద లేదన్న కారణంగా శక్తి సామర్ధ్యాలు ఉన్నవారిని చిన్న చూపు చూడడం మరింత బాధాకరమైన విషయం.
ఒక వ్యక్తికి ఎంత వరకు విలువని ఇవ్వాలి, ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలి అనే విషయాన్ని వాళ్ల కులగోత్రాలు, వంశ చరిత్ర, సిరిసంపదలు వగైరా.. లాంటి విషయాలని చూసి నిర్ధారణకి రాకుండా వాళ్ల వాస్తవీకమైన వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవ్వగలిగినట్టయితే మనకు చాలా సమస్యలు రాకుండా ఉంటాయి. ఉదాహరణకి ఒక అమ్మాయికి లేదా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారనుకోండి. అప్పుడు పరిగణింపబడే మొదటి విషయాలు ఎక్కువ శాతం వాళ్ల స్టేటస్ కి సంబంధించినవే ఉంటాయి. ఒకవేళ ఈ స్టేటస్ లు తక్కువైన మంచి అబ్బాయి లేదా అమ్మాయి మనకు తెలిసి ఉన్నా కూదా.. ఆ సంబంధానికి పెద్దగా మొగ్గు చూపరు చాలా మంది.
అసలు అమెరికా సంబంధాల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయనీ, దూరదేశం వెళ్ళిన ఆడపడుచులకు అన్యాయం జరుగుతోందనీ.. చాలా మంది ఆవేదన చెందుతూ ఉంటారు. ఇది కాదనలేని సత్యం. కానీ, దీనికి నిజమైన బాధ్యులెవరు?? ప్రతీ తల్లిదండ్రులు ఒక చోట చేరి మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడంటే , మా అల్లుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడని.. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇవే ముచ్చట్లు. కొంతమంది అయితే ఇండియా లోనే పిల్లలు ఉద్యోగం చేస్తున్నారని చెప్పుకోడానికి తెగ ఇబ్బంది పడిపోతుంటారు. మరి కొంతమంది బతిమాలి, బలవంతం చేసి మరీ, విదేశాలకి తోలేస్తూ ఉంటారు పిల్లల్ని స్టేటస్ కోసం... విదేశీ సంబంధాలంటే అదేదో.. గొప్ప భోగం అనుకుంటూ మిగతా విషయాలకి తక్కువ ప్రాముఖ్యతనిచ్చి ఆదరాబాదరాగా పెళ్ళిళ్ళు చేసెయ్యడం. చివరికి ఏదయినా సమస్య వస్తే అందరూ బాధపడడం. చాలా మంది అమ్మాయిల తల్లిదండ్రులు పెళ్లి జరిగేలోపు అబ్బాయి కుటుంబం నుంచి ఎన్ని రకాల డిమాండ్లు వచ్చినా గానీ, తొందరగా వదులుకోవడానికి ఇష్టపడరు. కట్నం అనీ, లాంఛనాలనీ వాళ్లు కోరికల లిస్టు పెంచుకుంటూ పోతున్నా గానీ, మంచి సంబంధం ఎలాగో ఆ మూడు ముళ్ళు పడిపోతే బాగుణ్ణు... మళ్ళీ ఇలాంటి గొప్ప సంబంధం దొరకదేమో.. అనుకుంటూ పాపం చాలా ఇబ్బందులు పడుతూ పెళ్ళిళ్ళు జరిపిస్తారు. కానీ, వీళ్ళిలా అడుగుతున్నారంటే, వీళ్ళ వ్యక్తిత్వం ఎంత నికృష్టంగా ఉన్నట్టు.. ఎందుకులే వదిలేద్దాం అని మాత్రం అనుకోరు.. ఎంతో చదువు, ఆస్తి ఉన్న మగ పెళ్ళివారు కూడా మంచి తరుణం మించిపోయిన రాదు.. అనుకుంటూ బోలెడు డిమాండ్స్ చేస్తూ ఉంటారు. అమ్మాయి అందంగా ఉండీ, నెలకి అయిదంకెల్లో సంపాదిస్తున్న గానీ, ఈ లిస్టులో మాత్రం ఏమీ మార్పులుండవు.
ఏమిటో.. ప్రపంచం ఎంతో పురోగమిస్తుందంటారు. కులాల మధ్య ద్వేషాలు, స్టేటస్ ల గొడవలు మాత్రం గత వందేళ్ళ నుంచీ అలాగే ఉన్నాయి. ఎప్పటికీ భద్రంగా ఉంచడానికి అనేకానేక వారసులు పుడుతూనే ఉన్నారు. ఇక ఇంతేనేమో మన సమాజం
ఏది ఏమైనప్పటికినీ..ఈ పద్యం లో చెప్పినట్టుగా.. సిరిసంపదలు శాశ్వతం కాదనీ, మనిషి నిజమైన వ్యక్తిత్వమే అన్నిటినీ మించిన పెద్ద ఆస్తి అనీ ప్రతీ ఒక్కరు తెలుసుకోవడమే కాకుండా.. నిజంగా పాటించగలిగితే ఎంత బావుంటుందో కదా..!! ఎవరిదాకానో ఎందుకు గానీ.. ప్రతీ ఒక్కరం మన దగ్గరి నుంచే ఆరంభిస్తే సరి..!! ఏమంటారూ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి