అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా
నెక్కినఁ బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!
తాత్పర్యం: అవసరమునకు పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడిననూ కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధ సమయమున ఎక్కినప్పుడు ముందుకు పరిగెత్తని గుర్రమును వెంటనే విడిచిపెట్టవలయును.
ఈ పద్యం లో అవసరం లో మన వెంట రాని బంధువులను వదిలెయ్యడమే మంచిదని చెప్తున్నారు.
ఈ విషయం లో ప్రతి ఒక్కరి జీవితం లో ఏదో ఒక అనుభవం ఎదురయ్యే ఉంటుదని నా అభిప్రాయం.
చిన్నప్పటి నుంచి ప్రతీ ఇంట్లో బంధువులను గురించి వచ్చిన ఎన్నో సమస్యలు చూసేఉంటాము.
అసలు మనకి ఏదన్నా సమస్య వస్తే దాని పర్యవసానం గురించి బాధ పడటం కన్నా మన బంధువులు ఏమనుకుంటారు,
మన గురించి మన కుటుంబాలలో ఎలాంటి మాటలు వినాల్సివస్తుంది అన్న విషయాలే మనల్ని ఎక్కువ బాధ పెడుతుంటాయి. ఓకోసారి వాస్తవం లో జరిగే దాని కన్నా ముందుగానే ఎక్కువ ఊహించి భయపడి బాధపడే వాళ్ళను నేను, మీరు చాలా సార్లు చూసే ఉంటాము. ఏదయినా విషయం లో మనకి జరిగితే ఎలా స్పందిస్తామో ఎదుటి వాళ్ల గురించి కుడా అలాగే ఆలోచించగలిగితే మనిషిగా మన జీవితానికి కొంతైనా సార్ధకత్వం వస్తుందని నా అభిప్రాయం. ఎలాంటి మాటలకి మనం బాధపడతామో అలాంటి మాటలతో మనం ఎదుటి మనిషిని ఎప్పుడు బాధపెట్టకుండా చూడగలిగితే చాలు. ఎందుకంటే బాధపడే ఒక మాటని మర్చిపోడానికి ఒక జీవితకాలం కూడా సరిపోదు. అందుకే సాధ్యమయినంత వరకు మన మంచి మాటలతో తోటివారి మొహం మీద చిరునవ్వులను పూయించేందుకు ప్రయత్నిద్దాం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి