నా బ్లాగర్లందరికీ అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో.
స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబర పడిపోతే సరిపోదోయి.... అన్నట్టుగా కాకుండా మనం వచ్చిన స్వాతంత్ర్యం కాపాడుకోవాలి... దురదృష్టవశాత్తు స్వాతంత్ర్యం మన దేశానికి వచ్చింది కానీ మన మనుషులకు, వారి మనషులకు రాలేదు... మనం ఇంకా కామ, లోభ,మద, మాత్స్చర్యాలకు బానిసలుగానే బ్రతుకుతున్నాము... వీటినుంచి మనకు స్వాతంత్ర్యం వచ్చిన నాడే..ప్రతి ఒక్కరు అందరిని ప్రేమించడం మొదలుపెట్టిన నాడే, అందరు మంచిగా జీవించిన నాడే... మనకు ఎందఱో మహాను భావులు వారి జీవితాలను త్యాగం చెయ్యడం ద్వార సంపాదించిన దేశ స్వాతంత్ర్యానికి అర్ధం మరియు మనము ఈ వేడుకలు జరుపుకోవడానికి అర్హత పొందగలము. దీనిని మనము తొందరలోనే పొందగలమని ఆశిస్తూ... ఈ రోజు గురించి నేను సేకరించిన కొన్ని వివరాలతో మీ...ఎస్.శ్రీనివాస ప్రసాద్ రావ్
నేడే ఈనాడే మనదేశం మనదైనది..
సత్యాహింసల బలమే,
త్యాగధనుల హృదయ బలమై, జనబలమై, ఘన ఫలమై... మనదేశం మనదైనది.
తలవంపులు తొలగిపోయి,
తెగతెంపులు జరిగిపోయి,
వెలిగుంపులు వెడలిపోయిన సుదినం నేడే..!
ఎందరో మహానుభావుల కలల పంటలు, మరెందరో అమరవీరుల త్యాగ ఫలాలకు రూపమైన భారతావని స్వాతంత్ర్య దినోత్సవం నేడే.
సకల మానవాళి సంబరాలు అంబరాన్ని తాకే మహోజ్వల దినం నేడే...!
ఎంత శుభదినమిది..! ఎంత సంతోష దినమిది..! ఎంత పుణ్య దినమిది..! ఎంత పర్వదినమిది..! ఎంతటి చరిత్రాత్మక దినమిది..!".. అంటూ స్వతంత్ర్య భారతావని విముక్తమయిన సందర్భంగా తెలుగువాణిని వినిపిస్తూ... తెలుగుజాతి మొత్తాన్ని చైతన్యవంతం చేసి, ఆలోచింపజేసిన అందరికి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరం జేజేలు చెబుదాం..!!
స్వాతంత్ర్య దినోత్సవ శుభదినాన... గగనంలో రివ్వు రివ్వున ఎగిరే ముచ్చటైన మువ్వన్నెల జెండాయే, భారతమాత చేతిలో ఆయుధమైన భారతీయులకు రక్షణనిస్తుంది.
ఈ జెండాలోని కాషాయం రంగు త్యాగానికి గుర్తు. ఇది మన నాయకులు స్వలాభాన్ని విడిచిపెట్టి, తమ కర్తవ్యానికి అంకితం కావాలని సూచిస్తుంది.
తెలుపురంగు మన ప్రవర్తనను నిర్దేశించే వెలుగుకు, సత్యానికి గుర్తుగా భాసిల్లుతోంది.(తెలుపురంగు మన ప్రవర్తనను నిర్దేశించే వెలుగుకు, సత్యానికి గుర్తుగా భాసిల్లుతోంది.)
ఇక మూడవదైన ఆకుపచ్చ రంగు మట్టితో మనకున్న అనుబంధానికి, ఇతర జీవులన్నీ ఏ వృక్ష సంపదమీద ఆధారపడి ఉన్నాయో... ఆ పచ్చటి చెట్లకు గుర్తు.
జెండాలోని అశోకచక్రం ధర్మపాలనకు గుర్తు. సత్యం, ధర్మం అనేవి ఈ పతాకం క్రింద పనిచేసే ప్రతిఒక్కరి నియమాలు కావాలి.
చక్రం చలనానికి, చైతన్యానికి గుర్తు. జీవముండే ప్రతిచోటా చైతన్యం ఉంటుంది. చైతన్యం లేనిది చావులోనే అనేది గుర్తుంచుకోవాలి. భారతదేశం ఇకమీదట మార్పును స్వాగతిస్తూ ముందుకు సాగిపోవాలనేదాన్ని సూచిస్తున్నట్లుగా ఉండే చక్రం... శాంతియుతమైన, చైతన్యవంతమైన ప్రగతికి చిహ్నం.
ఇదిలా ఉంటే... కాషాయం స్వచ్ఛతకు, ఆధ్యాత్మికతకు.. తెలుపు శాంతికి, సత్యానికి... ఆకుపచ్చ సాఫల్యతకు, సస్యసమృద్ధికి చిహ్నాలుగా భావిస్తారనే ఒక అనధికారిక అన్వయం కూడా బాగా ప్రచారంలో ఉంది.
"ఝండా ఊంఛా రహే హమారా..." అనే పాటను వినని వారుండరు. ఆ పాటను వింటుంటే భారతీయ హృదయాలు పొంగిపోతాయి. మువ్వన్నెల జెండా రెప రెపలాడుతుంటే చిన్న చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్ళ గుండెలూ సంతోషంతో నిండిపోతాయి. గర్వంగా తలఎత్తి సెల్యూట్ చేయాలనిపిస్తుంది.
భారతదేశంలోని ఏ మూలైనా 15 ఆగస్టు, 26 జనవరి నాడు -మువ్వన్నెల జెండా ఎగురవేసి పండుగ చేసుకుంటారు. సంబరాలు జరుపుకుంటారు. ఆ రెండు రోజులూ ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించుకొని, స్వతంత్ర సముపార్జనలో ప్రాణాలొడ్డిన మహనీయులను స్మరించుకుంటారు.
కాగా... ఆధునిక పోకడలో ఎందరో మన జాతీయ జెండా ప్రాముఖ్యాన్ని మరిచిపోతున్నారు. జాతీయ పతాకమే కాదు జాతీయ గీతాన్ని కూడా పాడటం లేదు. ఎవరయినా సరే జాతీయ జెండాను అవమానపరిస్తే కఠిన శిక్ష విధించబడుతుంది. మన రాజ్యాంగంలోని 42వ అధికరణం 4 (ఎ) సవరణ ప్రకారం విధిగా ప్రతిపౌరుడూ భారత జాతీయ జెండాను గౌరవించాలి.
మనం మన భవిష్యత్తరాలకు జాతీయ గీతం, జాతీయ పతాకం విశిష్టతను ప్రాముఖ్యతను చెప్పలేకపోతే, ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సముపార్జించిన స్వాతంత్య్రానికి విలువలేకుండా పోతుంది.
అందుకే మనం మన జెండా గురించి, జెండా పండుగ గురించి తెలుసుకోవాల్సి ఉంది. మరొకరికి తెలియచెప్పాల్సిన అవసరమూ ఉంది.
ప్రతిమనిషికి పేరు (గుర్తింపు) అన్నట్లే, దేశానికి గుర్తింపు ఉంటుంది. అదే దేశానికి తొలి ఆనవాలు (గుర్తు) అదే జాతీయ పతాకం అంటే ఆ దేశ సమస్త ప్రజల ఆత్మగౌరవం, గుండెచప్పుడు... వారి సార్వభౌమ అధికారం ఎవరికీ తలవంచని దేశాధ్యక్షుడైనా జాతీయ పతాకానికి తలవంచి నమస్కరించాల్సిందే...!
ఏది ఏమైనా నేడు చాలామంది జాతీయ పతాకానికి సంబంధించిన నిబంధనలు పాటించడం లేదన్నది నగ్నసత్యం. చాలామంది అధికారులు, రాజకీయ నాయకులు సైతం తమ కార్లకు పెట్టుకునే జాతీయ పతాకం దుమ్ముకొట్టుకుపోతున్నా పట్టించుకోరు. మరి కొంతమందయితే, జాతీయ జెండాను క్రింద వేసుకొని మరీ కూర్చుంటున్నారు.
ఇలా మన జాతీయ పతాకాన్ని అగౌరవ పరిచిన వారిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి శిక్ష పడేట్లు చేయాలి. మన జాతి గౌరవానికి జాతి ఐకమత్యానికి, సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలిచే జాతీయ పతాకాన్ని మనం విధిగా గౌరవించాలన్న విషయం మరువకూడదు.
ప్రభుత్వాధికారులు ఈ నిజాన్ని గ్రహించి, ఇప్పటికయినా జాతీయ జెండాను అవమానించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. అప్పుడే రేపటి పౌరులైన నేటి బాలలకు జాతీయ పతాకం విశిష్టతను తెలియజెప్పిన వారమౌతాం...!.
జాతీయ పతాకం నియమాలు
ఎందరో వీరుల త్యాగఫలంతో మన దేశానికి విముక్తి లభించిన రోజైన ఆగస్టు 15వ తేదీని "భారత స్వాతంత్ర్య దినోత్సవం"గా జరుపుకుంటున్నాం. జాతి, కులం, మతం, ప్రాంతం అనే తేడాలనేవి లేకుండా ప్రతిఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే వేడుక "పంద్రాగస్టు పండుగ".
ఈ రోజున పాఠశాలల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, కళాశాలల్లోనూ... ఇలా రకరకాల చోట్ల మన జాతీయ పతాకాన్ని ఎగురవేసి వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీ.
అయితే మన జాతీయ పతాకాన్ని ఎలాబడితే అలా ఎగురవేయకూడదు. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం సూచించిన కొన్ని ముఖ్యమైన నియమాలున్నాయి. ఆ నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటిస్తూ... "మువ్వన్నెల రెపరెపలు మురిపాలను చిందించేలా" జాతీయ పతాకాన్ని ఎగురవేయాల్సి ఉంటుంది. ఆ నియమాలేంటో ఇప్పుడు చూద్దాం...
జాతీయ పతాకాన్ని కొన్ని స్థలాలలో అన్నిరోజులూ, కొన్ని స్థలాలలో కొన్ని సందర్భాలలో ఎగురవేస్తారు. జాతీయ పతాకం ఎగురవేయడంలో సరియైన పద్దతులు, సంప్రదాయాలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు జారీ చేసినది. వీటిని "ఫ్లాగ్ కోడ్-ఇండియా"లో పొందు పరిచారు. దీనిలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
అధికార పూర్వకంగా ప్రదర్శన కొరకు ఉపయోగించే పతాకం అన్నిసందర్భాలలోనూ "ఇండియన్ స్టాండర్డ్ సంస్థ" నిర్దేశించిన నిర్ధిష్టమైన ఆదేశాలకు కట్టుబడి ఉండి, ఐ.యస్.ఐ మార్కుని కలిగి ఉండాలి. మిగిలిన అనధికార సంధర్భాలలో కూడా సరయిన కొలతలతో తయారైన పతకాలను ఉపయోగించడం సమంజసం.
జాతీయ జెండా కొలతలు : 21'x14'; 12'x8', 6'x4', 3'x2', 9'x6', సైజుల్లో మాత్రమే ఉండాలి. సందర్భాన్ని బట్టి జెండా ఏసైజులో ఉండాలో "ఫ్లాగ్ కోడ్"లో పేర్కొన్నారు. జెండా మధ్యభాగంలో ధర్మచక్రం నేవీ బ్లూ రంగులోనే ఉండాలి.
ధర్మచక్రంలో 24 గీతలు ఉండాలి. జాతీయజెండాని అలంకరణ కోసం వాడకూడదు. అలానే జెండా ఎగురవేసేటప్పుడు ఎట్టి పరిస్థితులలో నేలను తాకకూడదు. జెండాను ఎగురవేసేటప్పుడు వేగంగాను, అవనతం చేసేటప్పుడు మెల్లగానూ దించాలి.
జాతీయ పతాకంలో కాషాయ రంగు అగ్రభాగాన ఉండాలి. సూర్యోదయానంతరం మాత్రమే పతాకం ఎగురవేయాలి. అలాగే సూర్యాస్తమయం కాగానే జెండాను దించేయాలి. పతాకాన్ని ఏవిధమయిన ప్రకటనలకు ఉపయోగించరాదు. అంతేకాక పతాక స్థంభంపైన ప్రకటనలను అంటించరాదు, కట్టరాదు.
ప్రముఖనాయకులు, పెద్దలూ మరణించిన సందర్భాలలో సంతాప సూచికంగా జాతీయ పతాకాన్ని అవనతం చేయాలి. జాతీయ పతాకం వాడుకలో ఈ నియమాలన్నీ ప్రతి భారతీయుడూ విధిగా, బాధ్యతగా పాటించాలి. జైహింద్..!
స్వాతంత్ర్యోద్యమ వేడుకలను ఆగస్టు 15 నుండి మళ్లీ వచ్చే ఆగస్టు 15 వరకు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఈ ఏడాదిలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఒక్కరే విడిగా చేసుకోవచ్చు.
అందరూ కలసి ఒకేసారి చేసుకోవచ్చు. అందరూ కలసి ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఒకే రోజు చేసుకున్నవారు కూడా అదే రోజు మళ్ళీ చేసుకోవచ్చు. సాధారాణంగా ఆగస్టు 15 రోజున పాఠశాల విద్యార్ధులు ఎటువంటి ఉత్సాహాన్ని చూపుతారో అదే ఉత్సాహాన్ని ప్రతి ఒక్కరూ చూపాలి. అప్పుడే ఈ స్వాతంత్ర్య దినానికి నిండుదనం. అమరులకు అసలైన నీరాజనం.
జనని జన్మభూమిశ్చ,స్వర్గదపి గరియసి ........ అంటూ...... ఏ దేశము వేగినా ఎందు కాలడినా.....పొగడరా నీ తల్లి భూమి భారతిని...నిలపరా నీ జాతి నిండు గౌరవము....
జయ జయ జయ జయహే...
అందరిని సేవించు - అందరిని ప్రేమించు
ఎస్.శ్రీనివాస ప్రసాద్ రావ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి