జెండా పండుగ
చాలామంది దృష్టిలో ఈసారి స్వాతంత్య్ర దినం 'కలిసొచ్చింది'. ఆదివారానికి అటూ ఇటూగా పండుగలొస్తే రెండ్రోజులు వరసగా సెలవులొచ్చినట్లు అనిపిస్తుంది. నిజానికి స్వాతంత్య్ర దినం మామూలు పండుగల వంటిది కాదు. ఈ దేశంలో హిందువులకు ముసల్మానులకు క్రైస్తవులకు వేరువేరుగా పండుగలున్నాయి గాని- పంద్రాగష్టు, జనవరి ఇరవైఆరు భారతీయుల అందరి పండుగలు! అన్నింటికన్నా భిన్నంగాను, ఘనంగాను, సంబరంగాను జరుపుకోవాల్సినవి. బుల్లి బుల్లి మువ్వన్నెల జెండాలను గుండుసూదులతో చొక్కా జేబులకు గుచ్చిపెట్టగానే- చిన్నారుల గుండెలుప్పొంగి భారతమాతకు జేజేలు పలికే పండుగలివి. బాలభానుడి లేలేత కిరణాలు భూమిని తాకుతున్నవేళ 'త్రివేణి సంగమ పవిత్ర భూమి నాల్గు వేదములు పుట్టిన భూమి గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి' అంటూ యువజనులు నుదుటిని భక్తితో భూమికి తాకించి 'కరుణ జగమేలుగాత మా భరతమాత!' అనుకుని 'మాతృవందనం' చేయవలసిన పండుగలవి. 'సూత్ర యుగముల శుద్ధవాసన, క్షాత్ర యుగముల చండ శౌర్యము, చిత్రదాస్యముచే- చరిత్రల చెరిగిపోయెర సోదరా' అంటూ పెద్దతరం ప్రబోధ గీతాలాపనలతో నవచైతన్యానికి దిశానిర్దేశం చేయవలసిన రోజులవి. అలాంటిది ఇంతలో ఎంత మార్పు! జాతి నిర్వీర్యమై, బుద్ధి నిస్తేజమై, చేవజారి జావకారి, దేశభక్తి అన్నమాటే జనానికి చేదయిపోయింది. 'వీరగంధము తెచ్చినారము వీరులెవ్వరొ తెలుపుడీ పూసిపోతము; మెడనువైతుము పూలదండలు భక్తితో' అంటూ ఈ జాతి ఆశగా ఎదురుచూస్తుంటే- 'మేం ఉన్నాం' అనగలిగిన దమ్మున్న జాతినేతలు బొత్తిగా కరవైపోయారు. పేటవీరులు, కులనాయకులు, రాజకీయ నేతలే తప్ప సిసలైన జాతినేతలు (నేషనల్ లీడర్స్) కలికానికైనా కనిపించకుండా పోతున్నారు.
మీకు గుర్తుందో లేదో! స్వరాజ్యం సిద్ధించాక కూడా మనదేశంలో భాగమైన గోవాను స్వాధీనం చేసుకోవడానికి మనకు 14 ఏళ్లు పట్టింది. బ్రిటిష్ వలసవాదులను ఆయుధంతో పనిలేకుండా అహింసామార్గంలో తిప్పికొట్టి మొత్తం భారత భూభాగాన్ని చేజిక్కించుకున్నా- బుడతకీచుల చేతుల్లోంచి గోవాను రాబట్టడానికి అంత సమయం ఎందుకు పట్టింది? సైనికచర్య ఎందుకు అవసరమైంది? 70 మంది సైనిక యోధుల బలిదానంతో రక్తసిక్తమైన గోవాను ఎట్టకేలకు 1961 డిసెంబరు 19న మనం స్వాధీనం చేసుకున్నాం. పన్నెండో రాజ్యాంగ సవరణతో కేంద్రపాలిత ప్రాంతంగా గోవా భారతదేశంలో విలీనమైంది. పోర్చుగీస్ బలం బలగం ఏపాటివి? అఖండ భారతావనిని అహింసామార్గంలో సాధించుకున్నా- గోవా విషయంలో ఎందుకు రక్తం చిందింది? స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో సమీక్షించుకోవలసిన ఘట్టాలివి. రాయబారానికి వెళ్ళొచ్చిన సంజయుణ్ని గుడ్డిరాజు 'పాండవుల బలం ఏపాటిదయ్యా' అని ఆరాతీశాడు. కౌరవ బలం అపారమనీ, యోధులంతా తమవైపే ఉన్నారనీ ధృతరాష్ట్రుడి ధీమా. అది గ్రహించిన సంజయుడు మొదట కృష్ణుడి పేరు చెప్పి 'ఆయనతో సమానుణ్ని మనవారిలో చూపించు, తక్కినవారి సంగతి తరవాత ఆలోచిద్దాం' అన్నాడు. అటెవరు, ఇటెవరు- అటెంత, ఇటెంత... వంటివన్నీ కాకుల లెక్కలు. విజయాన్ని శాసించగల వాడు ఒకేఒక్కడు పాండవులవైపు ఉన్నాడు. అంతే తేడా! మిగిలినవన్నీ అప్రస్తుతాలు. 1947లో బ్రిటిష్‌వారిని జయించినప్పుడు గాంధీమహాత్ముడున్నాడు. 1961 నాటికి లేడు. ఇంతే తేడా! ఇద్దరిదీ ఆత్మబలమే కాని ఆయుధబలం కాదు. జాతినేతల లక్షణం అలా ఉంటుంది! కృష్ణుడు, గాంధీ... అనేవి వ్యక్తుల పేర్లు కావు- ధర్మానికి సంకేతపదాలు. ధార్మిక నేపథ్యం కలిగిన వ్యక్తుల ప్రమేయం విజయాన్ని శాసిస్తుంది, సాధిస్తుంది. ఇప్పుడు కావలసింది అలాంటి నాయకులు. ఇనుపకరాలు ఉక్కునరాలు జవం జీవమూ ఆత్మస్త్థెర్యం... అన్న వివేకానందుడి పలుకులు- ఆ నాయకుల సహజ లక్షణాలకు చెందిన విశేషణాలు.
ఒక్క మనిషి ప్రభావం అంత తీవ్రంగా ఉంటుందా! ఒక్కడి ఉనికితో అంత తేడా వస్తుందా... వంటి సందేహాలకు మహాభారతమే జవాబు చెప్పింది. శ్రీకృష్ణుడి అవతార పరిసమాప్తి తరవాత ద్వారక నుంచి స్త్రీజనాన్ని, గోసంపదను అర్జునుడి రక్షణలో తరలిస్తుంటే- వారిని దోపిడి దొంగలు దోచేశారు. భీష్మద్రోణ కృపాదిధన్వి నికరాభీలంబైన కురుమహాసైన్యాన్ని గడగడ వణికించిన గాండీవం- సాధారణ దొంగల ముందు పుచ్చుకర్రగా మిగిలింది. కారణం ఒక్కటే! అప్పటి విజయాలన్నింటి వెనకా కృష్ణుడున్నాడు. తరవాత లేడు! ఆ రోజుల్లో గాంధీజీ ఎప్పుడన్నా నిరాహార దీక్షకు కూర్చుంటే- దేశంలో సగం జనాభాకు అన్నం సయించేది కాదు. 'మహాత్మ' అనే పదాన్ని ఆ చైతన్యం లోంచి అర్థం చేసుకోవాలి. జాతినేత అనే మాటను ఈ నేపథ్యంలోంచి గ్రహించాలి. గాంధీజీని చూసి ఎందరో యోధులు అదే బాటలో నడిచారు. జీవితాంతం అవే విలువలకు కట్టుబడ్డారు. జాతినేతల ప్రభావం అంత గాఢంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. ప్రతిదానికీ జపాన్‌ను ఉదాహరిస్తూ ఉపన్యాసాలు చేసే మనం- బాంబు దాడుల తరవాత ఆ బూడిదలోంచి భూతలస్వర్గం ఎలా ఆవిర్భవించిందో ఆలోచించం. జపాన్ దేశీయుల కష్టించే తత్వాన్ని, క్రమశిక్షణను అనుసరించం. ఈ తరహా ఆత్మావలోకనంతో దివాలాకోరుతనాన్ని దూరం చేసుకోగలిగితే, బతుక్కి నిజాయతీ జతపడితే- మనలోంచీ గాంధీజీలు తయారవుతారు. వీరగంధంకోసం మెడ చాచగల దమ్ము మనకీ అలవడుతుంది. సిసలైన నేతలకు, ప్రస్తుతం మనం చూస్తున్న నాయకులకు మధ్య ఉన్నది- సూదికీ కత్తెరకూ ఉన్నంత తేడా. సూది కలపడానికి పుట్టింది. కత్తెర చీల్చడానికి పుట్టింది. కత్తెర బుద్ధుల్లోంచి సూది స్వభావం వైపు మనల్ని మరల్చేందుకే ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలూ, ఈ వైతాళిక గీతాలూ, ఈ స్వాగత తోరణాలూ!
(ఈనాడు, సంపాదకీయం, ౧౬:౦౮:౨౦౦౯)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి