1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

28, అక్టోబర్ 2009, బుధవారం

అమ్మ



మదర్స్ డే రోజు తప్పితే అమ్మ విలువ ఇంకెప్పుడు గుర్తురాదు కాబోలు వీళ్ళకు. ఇదంతా మార్కెటింగ్ మహిమ. సృష్టిలో మానవుడికే కాదు ప్రతి ప్రాణికి అమ్మ వుంది. ఎవరికైనా అమ్మ అమ్మే. ప్రతి అమ్మ తన బిడ్డని ఒక వయసు వచ్చేవరకు కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అది ప్రకృతి సహజం కూడా! ఎవరి మన్ననల కోసమో, బిరుదుల కోసమో, మెప్పుల మేకతోళ్ళ కోసమో అమ్మ తన పిల్లలిని లాలించదు పాలించదు. అది తన ధర్మంగా చేస్తుంది. కాకి పిల్ల కాకికి ముద్దయినట్లు బిడ్డ అవిటిదైనా, కురూపి అయినా తల్లికి ముద్దే. ఎన్ని కష్టాలు పడి అయినా బిడ్డ బ్రతకదని తెలిసినా చివరి నిమిషం వరకు బిడ్డ గురించి తపించే తల్లులెందరో. ఏమి ఆశించి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు? అలాంటి అమ్మని ఈ ఒక్క రోజే గుర్తు చేసుకోవటం అంత ఆత్మవంచన ఇంకొకటి వుండదేమో.

అమ్మని ఏ అనాధాశ్రమంలోనో పడేసి ఏడాదికొకసారి ఒక గ్రీటింగ్ ముక్కో, ఓ కేకు ముక్కో పడేస్తే సరిపోతుందనుకునేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇదా మనకు మన చదువులు నేర్పిన సంస్కారం!! ఇదా మనకు మన సంపదలు తెచ్చిన వైభోగం!!!

అమ్మ కోరేది ఈ ఒక్క రోజు ఆర్భాటపు వేడుకలని, బహుమతులిని, ప్రశంసలిని కాదు. రోజూ ఆప్యాయంగా అమ్మా అన్న ఒక పిలుపుని, ముదిమిలో లాలనని పాలనని, నీకు నేనున్నాను నీ జీవితమంతా తోడుంటాను అన్న ఒక భరోసాని . అంతకన్న మననుండి ఆమె ఏ పట్టుపీతాంబరాలని, కాంచన మణిమాణిక్యాదులని ఆశించదు.

అమ్మ గురించి ఎప్పుడో ఎక్కడో చదివిన రెండు వ్యాక్యాలు....


అమ్మ.....

ఆకలివేళ అక్షయ పాత్ర
ఆపద వేళ ధైర్యం మాత్ర.

ఈ రోజుమదర్స్ డే ని ఘనంగా ఆర్భాటంగా జరుపుకోవాలి అని నొక్కి వక్కాణిస్తుంది. ఇలా వక్కాణించేవాళ్ళు ఎంతమంది తమ అమ్మలిని అత్తలిని ప్రేమగా చూసుకుంటున్నారంటారు?

కామెంట్‌లు లేవు: