"వరంగల్‌లో ఇద్దరు కాలేజి విద్యార్ధినుల మీద యాసిడ్ దాడికి పాల్పడ్డ వాళ్లని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపేసారు".
సమస్యకి ఇదే పరిష్కారమా? ఇదే అంతిమ తీర్పా?.
సమస్యకి ఇదే పరిష్కారమా? ఇదే అంతిమ తీర్పా?.
"నిందితులు నేరప్రవృత్తి కలిగినవారని, పథకం ప్రకారమే వారు అమ్మాయిలపై అమానుషంగా యాసిడ్ దాడి చేశారని వరంగల్ ఎస్పీ సజ్జనార్ అన్నారు". వారు నేరప్రవృత్తి కలిగినవారని ముందే తెలిసినప్పుడు మరియు స్వప్నిక తండ్రి నిందితుడి మీద రిపోర్టు ఇచ్చినప్పుడు ఎందుకు చర్య తీసుకోలేదు, అరెస్టు చేసినవాడిని ఎందుకు వదిలేసినట్లు, తను నేరప్రవృత్తి కలిగినవాడని తెలిసి కూడా వదిలేసాక తన మీద నిఘా ఎందుకు ఏర్పాటు చేయలేదు. ఎన్‌కౌంటరే ఇలాంటివాటికి పరిష్కారమా? నేరం జరిగాక చట్టం తన పని తాను చేయటం కాదు, ముందుగా ఆ నేరం జరగకుండా చేయటం చట్టం విధి. స్వప్నిక పరిస్థితి విషమంగా ఉంది మరి ఆ అమ్మాయికి ఏమైనా అయితే దానికి ఎవరు బాధ్యులు?
యాసిడ్‌తో దాడి అమానుషమే, ఇలాంటి వాటికి కఠిన శిక్షలు పడాల్సిందే. కాని తప్పంతా నిందితుడిదే లాగా కూడా కనిపించటం లేదు. నిందితుడు ఆ అమ్మాయి మీద 25,000 రూపాయల వరకు ఖర్చు చేసాడట, మరి ముందుగా ఆ అమ్మాయి ఇలాంటివి వద్దని ఎందుకు వారించలేదు, తనని ఎందుకు ప్రోత్సహించినట్లు? ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి నా మీద ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నాడా అని అమ్మాయిలు ఆలోచించాలి, తల్లిదండ్రులూ ఆలోచించాలి, ఆదిలోనే ఇలాంటి స్నేహాల్ని తెంపివేయాలి.
ఎవరూ పుట్టుకతో నేరస్థులుగా పుట్టరు. పెంపకం, పరిసరాలు, అనుభవాలు వారిని నేరస్థులుగా మారుస్తాయి. అలాంటి వారిని ఎన్‌కౌంటర్‌లో చంపటం మాత్రం సరైన పరిష్కారం కాదు. నేరం చేయటానికి ముందే భయపడేట్టు శిక్షలు ఉండాలి. ఎవరైనా అమ్మాయిల వెంట పడటం, వేధించటం లాంటివి చేస్తున్నప్పుడు హెచ్చరికలతో వదిలివేయకుండా కఠిన శిక్షలు పడేలా చూడాలి. వాళ్లు ఎలాంటి వారైనా, ఎంతటి వారైనా మొదటిసారే గదా అని హెచ్చరికలతో వదిలివేయకుండా ప్రారంభంలోనే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలి, వారికి సరైన కౌన్సిలింగు ఇప్పించి వారి ప్రవర్తన మార్చుకునేట్లు చేయాలి. అమ్మాయిల వంక కన్నెత్తి చూడటానికి కూడా భయపడే విధంగా చట్టాలు కఠినంగా అమలు చేయాలి, అవసరమైతే అందుకు అనుగుణంగా చట్టాల్ని మార్చాలి.
ఆడపిల్లలు కూడా తమ పరిధుల్లో తాము ఉండాలి. ఎవరితో పడితే వారితో సినిమాలు షికార్లు తిరగటం, కాలేజిలు ఎగ్గొట్టి తిరగటం లాంటివి ఎప్పటికైనా వారికే ప్రమాదం. స్నేహానికి, వ్యామోహానికి తేడా తెలుసుకుని మెలగాలి. ఇది ఇప్పటి సమస్య కాదు. ఇలాంటివి జరిగినప్పుడే మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు మేలుకుంటాయి తప్ప ఇలాంటివి జరగకుండా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరు ఎందుకని?. కాలేజిలలో ఇలాంటి వాటిపై చక్కటి సెమినార్లు, ఇతర కార్యక్రమాలు చేపట్టి పిల్లలలో అవగాహన, పరివర్తన తీసుకురావాలి. ప్రవర్తనా సమస్యలు ఉన్న పిల్లలకి వర్క్‌షాపులు పెట్టి వాళ్లలో మార్పు తిసుకురావటానికి ప్రయత్నించాలి అంతే కాని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రోడ్లెక్కి అరవటం కాదు మనకి కావల్సింది.
ఈ సమస్య ఏ ఒక్కరిదో కాదు. దీనికి పరిష్కారం కూడా ఏ ఒక్కరి చేతుల్లోనో లేదు. ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. ఎక్కడైనా ఎవరైనా ఏ ఆడపిల్లనైనా వేధిస్తున్నట్లు మీ దృష్టికి వస్తే చాతనైన సహాయం చేయండి, నాకెందుకులే అని పక్కకు తప్పుకు వెళ్లకండి, రేపు మన పిల్లలే ఆ పరిస్థితిలో వుండవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి