1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

30, నవంబర్ 2009, సోమవారం

ఎన్నో ప్రశ్నలు రేపే



ఎన్నో ప్రశ్నలు రేపే "సంస్కార"






సంస్కార అంటే ఇదేదో మనిషి మనసుకో, ప్రవర్తనకో సంబంధించిన సంస్కారం కాదు. ఒక మృతదేహం తాలూకు అంతిమ సంస్కారం! అవును, ఈ నవల అంతా ఒక శవం అంతిమ సంస్కారం చుట్టూనే తిరుగుతుంది.

కన్నడ నవలా సాహిత్యంలో ఒక సంచలనం రేపి గొప్ప అవార్డు సినిమా గా నిలిచిన ఒక గొప్ప నవల "సంస్కార"! .బ్రాహ్మల్లో తరతరాలుగా గూడు కట్టుకు నిలిచిపోయిన పలు ఛాందస భావాలను, మూఢాచారాలను నిశితంగా ప్రశ్నిస్తూనే తాను నమ్మినధర్మాలని  అన్నింటినీ పోగొట్టుకున్నానన్న భావనతో, చేసిన తప్పుని ఒప్పుకోనూలేకా,బ్రాహ్మణత్వానికి దూరమూ కాలేకా రెండు విరుద్ధ ధర్మాల మధ్య నలిగిపోయే ఒక బ్రాహ్మణుడి మానసిక సంఘర్షణకు అద్దంపట్టే నవల.




ఎన్నడో ఎవరో  పూర్వీకులు పెట్టిన ఆచారాలను పాటించడం వల్ల బ్రాహ్మణత్వం నిలుస్తుందా? అవి పాటించని నాడు అది లేకుండా పోతుందా? అన్న మీమాంస ఈ నవల్లో ప్రధానంగా కనపడుతుంది. చదివిన తర్వాత ఒక పట్టాన వదిలిపెట్టదు పాఠకుడిని! కొన్ని వందల ప్రశ్నలని రేపుతుంది.

ఈ నవలా రచయిత యు.ఆర్ అనంతమూర్తి కన్నడసాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ వేత్త,విమర్శకుడు కూడా!.జ్ఞానపీఠ,పద్మభూషణ్ అవార్డుల గ్రహీత. మైసూరు యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేశారు.

స్వయంగా బ్రాహ్మణుడైన అనంతమూర్తి సంస్కార నవల్లో బ్రాహ్మణ మూఢాచారాల్ని చీల్చి చెండాడటం చాలా మందికి   మింగుడుపడకపోయినా నవల మాత్రం అత్యంత ప్రజాదరణ పొందింది. గిరీష్ కర్నాడ్ ప్రధాన పాత్రధారిగా సినిమాగా కూడా రూపొందింది.(నిజానికి ఈ సినిమా చూస్తే మరింత సమగ్రంగా రాయవచ్చనే ఉద్దేశంతో డీవీడీ కోసం ప్రయత్నించాను గానీ బెంగుళూరులో కూడా దొరకలేదు)

                                                  రచయిత అనంతమూర్తి


కర్నాటకలోని తుంగభద్రా నదీ తీరంలోని ఒక మధ్వ బ్రాహ్మణ అగ్రహారం దూర్వాసపురంలో నారాయణప్ప అనే బ్రాహ్మణుడి చావుతో ప్రారంభమవుతుంది ఈ నవల. అతడు నవల ప్రారంభంలోనే శవంగా మనకు పరిచయం అయినా కథ మొత్తం అతని చుట్టూనే తిరుగుతుంది.

అగ్రహారంలో నివశించే బ్రాహ్మణులంతా యుగాలనాటి ఆచారాలను,పద్ధతులను నిక్కచ్చిగా పాటిస్తూ  బ్రాహ్మణ్యాన్ని నిలబెడుతున్నామని,తమ శాఖ కంటే ఇతర శాఖలు తక్కువ వారనే అహంకారంతో, ఇంకా చెప్పాలంటే అజ్ఞానంతో బతికేస్తూ ఉంటారు. తాము ఆ ఆచారాలను ఎందుకు పాటిస్తున్నారో వాళ్ళు ఆలోచించడానికి  కూడా ఆసక్తి చూపరు. పాటించకపోతే అది తమ సర్వనాశనానికి దారి తీస్తుందని భయం!

కాశీలో వేద వేదాంగాలు చదువుకుని మహాపండితుడైన ప్రాణేశాచార్యుల వారు ఆ అగ్రహారంలో నివశించడం వల్ల ఆ అగ్రహారానికి చుట్టుపక్కల ఎంతో గౌరవం. ఆయన ఇంద్రియాలను జయించి పుట్టుకతోనే రోగిష్టి అయిన ఒక స్త్రీని వివాహమాడి ఆమె సేవలో,వేదపఠనంలో కాలం గడిపే మహాపురుషుడు.

ఇతడికి పూర్తిగా వ్యతిరేకి భోగలాలసుడైన నారాయణప్ప. కుందాపురం నుంచి చంద్రి అనే వేశ్యను తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఆమె సేవలోనే కాలం గడుపుతుంటాడు.అంతేనా? జంధ్యం తెంపి అవతల పారేసి ఇంట్లోని సాలగ్రామాన్ని ఎత్తి తుంగభద్రలో పారేస్తాడు.సాయిబుల కుర్రాళ్లని ఇంటికి పిల్చి బాతాఖానీ వేస్తాడు.

దేవాలయ కోనేట్లో చేపలు పట్టినవాళ్ళు రక్తం కక్కుకు చస్తారని అగ్రహారీకుల నమ్మకం! ఆ కోనేట్లో సాక్షాత్తూ బ్రాహ్మణుడైన నారాయణప్ప ముస్లిము లతో కల్సి చేపలు పట్టి తెచ్చి చంద్రితో వండించి భోంచేస్తాడు. దైవ పూజకై అగ్రహారీకులు పూలమొక్కలు పెంచితే ఇతడు మత్తెక్కించే పరిమళంతో మతులు  పోగొట్టే నైట్ క్వీన్ ఇంటిముందు పెచుతాడు.  అగ్రహారపు ఇతర కుర్రాళ్లను కూడా తనమార్గంలోనే పయనించేలా ప్రభావితం చేస్తుంటాడు.

ఒకరోజు ఉదయాన్నే నారాయణప్ప ఇంట్లో ఉన్న వేశ్య చంద్రి ప్రాణేశాచార్యుల వద్దకు పరుగున వచ్చి నారాయణప్ప చనిపోయిన వార్త చెప్తుంది. శివమొగ్గ నుంచి చంక కింద పెద్ద గడ్డతో వచ్చాడని, తీవ్రమైన జ్వరంతో రాత్రంతా బాధపడి ఉదయాన్నే మరణించాడని చెపుతుంది.


అగ్రహారమంతా ఉలిక్కి పడుతుంది. కులభ్రష్టుడైన నారాయణప్ప దహన సంస్కారాలు , ఉత్తర క్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రారు. నిజానికి నారాయణప్ప తోడల్లుడు లక్ష్మణా చార్యులు, జ్ఞాతి గరుడాచార్యులు అగ్రహారీకులే! అయినా చంద్రి చేతి వంటనుకూడా తినే నీచుడైన  నారాయణప్ప దహన సంస్కారాలకు వారు ముందుకు రారు.

 బతికున్నపుడు నారాయణప్ప చేసిన అప్రాచ్యపు పనులన్నీ ఒక్కొక్కరూ ఏకరువు పెట్టి అతడిని కాలిస్తే తమకూ పాపం చుట్టుకుంటుందంటారు..!అసలు నారాయణప్ప ప్లేగుతో మరణించాడనీ, అది వేగంగా వ్యాపించే అంటువ్యాధనే తెలీనంత అజ్ఞానం అగ్రహారీకులది.

ఇంతలో చంద్రి వీరందరికీ మతిపోయేలా తన వంటిమీదున్న బంగారాన్నంతా తీసి ప్రాణేశాచార్యుల ముందు కుప్ప పెట్టి,దహన సంస్కారాల ఖర్చులకు వాడాల్సిందిగా కోరుతుంది. ఈ దెబ్బకు తట్టుకోలేని అగ్రహారీకులు తమ సహజ ప్రకృతిని నగ్నంగా  ఆవిష్కరిస్తూ "ఎంత కాదనుకున్నా బంధుత్వం తెగుతుందా? బ్రాహ్మణ్యాన్ని వాడు త్యజించాడు కానీ వాడిని బ్రాహ్మణ్యం వదిలేస్తుందా"అంటూ మాటలు మొదలెడతారు. గరుడా చార్యులు సంస్కారాలకు ఒప్పుకుంటాడేమోఅని లక్ష్మణా చార్యులు, ఇతడు వప్పుకుంటాడేమో అని గరుడా చార్యులు  ఖంగారు పడుతుంటారు.


కొంతమంది కొద్దిదూరంలో ఉన్న పారిజాతపురం అగ్రహారపు స్మార్తులు తమకంటే తక్కువ ఆచారాలు కలవాళ్ళు కాబట్టి వాళ్ళని ఈ సంస్కారాలు చేయమని అడిగి లేదనిపించుకుంటారు  ఇక ప్రాణేశాచార్యులు అడవిలో ఉన్న ఆంజనేయాలయంలో తాను దీక్షలో కూచుంటాననీ, ఆ స్వామి ఆదేశం ప్రకారం నడుచుకోవాల్సిందేననీ స్పష్టం  చేస్తాడు.అంతా అంగీకరిస్తారు. 

ఇక్కడే కథ అనుకోని మలుపు తిరుగుతుంది. దీక్షలో కూచున్న ఆచార్యుల వారికి స్వామినుంచి ఎటువంటి సందేశమూ లభించదు. ఈ లోపు ఆకలికి తాళలేని చంద్రి తుంగభద్రలో స్నానమాడి అరటితోటలో పళ్ళు కోసుకుని అడవికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది. అపరాహ్నవేళ మరోసారి స్నానం చేసేందుకు  వచ్చిన ప్రాణేశాచార్యుల కాళ్ళమీద పడుతుంది చంద్రి..!

చిత్రంగా, పరమనిష్టా గరిష్టుడు, కఠోర తపస్సంపన్నుడు  అయిన ప్రాణేశుడు జీవితంలో తొలిసారి కలిగిన స్త్రీ స్పర్శ కు లొంగిపోతాడు. చంద్రి పరిష్వంగంలో కరిగి,  ఆమె  అందించిన సౌఖ్యానికి దాసోహమంటాడు.

ప్రాణేశాచార్యుల వారికి స్వామి సందేశం దొరకలేదని తెలుసుకున్న అగ్రహారీకులు ధర్మస్థల లోని మధ్వ గురువుల మఠాన్ని ఈ విషయంలో సంప్రదించేందుకు వెళతారు. చంద్రి లో తప్పు చేశానన్న అపరాథ భావన లేదు. ఇక అక్కడినుంచి వెళ్లిపోవాలన్న అభిప్రాయంతో ఒక సాయిబుల బండివాడిని బతిమలాడి అర్థ రాత్రి నారాయణప్ప శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళి అతడిచేతే దహనం చేయించి మాయమవుతుంది.

 ఆ నిర్ణయం తీసుకునే సమయంలో ఒక్కక్షణం తొట్రుపడినా "ఇతడు ఇప్పుడు బ్రాహ్మడూ కాదు, శూద్రుడూ కాదు. ఇతడొక ప్రాణం లేని శవం" అని సర్ది చెప్పుకుంటుంది. శవం ఉన్న ఇంటికేసి ఎవరూ   పోకపోవడం వల్ల ఈ  విషయం ఎవరికీ తెలీదు.

ఈ లోపు ప్లేగు అగ్రహారంలో వేగంగా వ్యాపిస్తుంది. ప్రాణేశాచార్యుల భార్య మరణిస్తుంది. మఠానికి బయలుదేరిన అగ్రహారీకుల్లో కొందరు మరణిస్తారు.

భార్యను దహనం చేసిన ఆచార్యులు అపరాధ భావనతో,ఇక సర్వం త్యజించిన శూన్యమైన మనసుతో  ఊరు విడిచి గమ్యం తెలీని ప్రయాణం సాగిస్తాడు. దారిలో అతడితో కలిసి నడిచిన పుట్టన్న,మనసులో మళ్ళీ కలకలం రేపిన పద్మావతి,అన్న సంతర్పణలో నానా జాతులతో,(అందులోనూ తను సూతకంలో ఉండగా ) కల్సి భోజనం....ఎదురు చూడని పరిస్థితుల మధ్య ప్రాణేశాచార్యులు తన తప్పుకి  ప్రాయశ్చిత్తం చేసుకునే ఉద్దేశంతో అగ్రహారంలో అందరి ఎదుటా తప్పు ఒప్పుకుని పాప  ప్రక్షాళనం చేసుకోవాలనే నిశ్చయానికి వచ్చి, దూర్వాసపురం అగ్రహారం దారిపడతాడు.

 ఇదే కథ!


మరి తర్వాత ఏమవుతుంది? అగ్రహారీకులు ఆయన చేసిన తప్పుని అంగీకరిస్తారా? మధ్వ శాఖకే మణికిరీటమై భాసిల్లిన ఆయన పెద్దరికం ఈ దెబ్బతో కొట్టుకుపోయిందా? నిలిచే ఉందా?  ...ఎవరికీ తెలీదు. ఎందుకంటే  "ఆ తర్వాత...తర్వాత ఏమవుతుంది?"అన్న ప్రశ్నతోనే నవల ముగుస్తుంది.   

ఇది కన్నడ సాహిత్యంలో ఎంతో సంచలనం సృష్టించిన  నవల, సినిమా కూడా!  కన్నడ సినిమా గురించి చర్చ జరిగిన ప్రతి చోటా చోటు చేసుకునే సినిమా!



1970 లో దీన్ని తెలుగు నిర్మాత తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి(ఈయన తెలుగులో పెళ్ళినాటి ప్రమాణాలు, భాగ్య చక్రం వంటి సినిమాలు నిర్మించారు)దీన్ని సినిమాగా తీశారు. ప్రాణేశాచార్య పాత్రను గిరీష్ కర్నాడ్, చంద్రి పాత్రను స్నేహలతా రెడ్డి, నారాయణప్ప పాత్రను లంకేష్ పోషించారు. మొదట కుల విభేదాలను రేకెత్తించేదిగా ఉందన్న కారణంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాను నిషేధించినా తర్వాత విడుదలై జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెల్చుకున్న చిత్రం ఇది!    


నవల విషయానికొస్తే అద్భుతమైన అనువాదం ఊపిరి తిప్పుకోకుండా  చదివిస్తుంది. కథా కాలం ఇప్పటిది కాదు కాబట్టి ఆనాటి మూఢాచారాల్ని కొంత వరకూ అర్థం చేసుకోడానికి ప్రయత్నించవచ్చుగానీ వాటిని వారు  సమర్థించుకునే తీరు, ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. "మీ శాఖ  కంటే మా శాఖ గొప్పది"అని ఆ పేద బ్రాహ్మలు ఒకరినొకరు మోసం చేస్తున్నామని ఆత్మవంచన చేసుకోవడం జాలిని కల్గిస్తుంది.కానీ అది, ముఖ్యంగా ఆ అగ్రహారీకులకు struggle for existence! వారికి అంతకంటే మార్గం లేదు మరి!  జీవనోపాధే బ్రాహ్మణ్యమైనపుడు అది వారికి తప్పనిసరి!  

కుప్పలుగా చచ్చిపడే ఎలుకల్ని చూశాకైనా అది ప్లేగు అని గుర్తించకపోగా, వాటికోసం వచ్చే గద్దల్ని చూసి ఊరికేదో అరిష్టం వచ్చిపడిందంటూ శంఖాలు ఊదుతారు!

ఒకపక్క స్మార్తులు తమకంటే తక్కువ ఆచారాలు కలవారని నిరసిస్తూనే ఎవరికీ తెలీకుండా వారి ఇంట అటుకులు, ఉప్మా తినాలని ఉవ్విళ్ళూరతాడు దాసాచార్యుడు. అతడు తన ఇంట్లో తిని భ్రష్టుడైతే చూసి  ఆనందిద్దామనుకునే మంజయ్య!  

ఇలాంటి నగ్న చిత్రణ చాలామందికి మింగుడుపడక అనంతమూర్తిపై విమర్శల జల్లు కురిసింది.
ఇంతే కాక కర్ణాటక అగ్రహారీకుల జీవన శైలిని రచయిత బహిర్గతం చేసిన తీరు అనేక విమర్శలకు దారి తీసింది. 

రచయిత ప్రాణేశాచార్యుల అంతర్మధనాన్ని చిత్రించిన తీరు అబ్బురపడేలా చేస్తుంది.

చంద్రి సాంగత్యం ఏర్పడకముందు, ఏర్పడిన తర్వాత ఆ పండితాచార్యుడి ఆలోచనల్లో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తుంది. రస రమ్య కావ్యాలను పురాణ కాలక్షేపం పేరుతో తాను చదివి వినిపిస్తుంటే విన్న యువకుల మానసిక స్థితి ఇప్పుడు తనకు అవగతమైందని భావిస్తాడు. 

అయినా, వేద వేదాంగాలు చదివిన పండితుడిగా తన పేరు చుట్టు పక్కల గ్రామాల్లో పరిచితం కాబట్టి ఎక్కడికెళ్ళినా ఎవరైనా తనను పడతారేమో’ అన్న శంకతో దాగి దాగి తన  అస్తిత్వాన్ని మరుగు పరచుకుంటాడు.

"ఇంతటి భయం నాకెప్పుడూ కలగలేదు.రహస్యం బయటపడుతుందేమో అని భయం! ఒకవేళ పడకపోయినా అబద్ధాన్ని బొడ్లో దాచుకుని ఈ మొహంతో అగ్రహారంలో ఎలా ఉండగలను"అని ప్రశ్నించుకుంటాడు.

మరోపక్క చంద్రితో తాను గడిపిన ఆ క్షణాలు దైవనిర్ణయాలు, అందులో తన ప్రమేయం లేదని సర్దిచెప్పుకోడానికి ప్రయత్నిస్తాడు. ఆ స్థితిలో నారాయణప్పను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. 

అడవిలో ఒక కాపు తన కూతురు బతుకు బాగుపడటానికి మంత్రం చెప్పమని అడిగినపుడు గ్రహిస్తాడు "తను బ్రాహ్మణ్యానికి దూరంగా పోతున్నా , అది తనను అంటిపెట్టుకునే"  ఉందని.

గుడిలో భోజనాల పంక్తిలో కూచుని ఇలా తర్కించుకుంటాడు..."ఈ భయం పోవడానికొకటే మార్గం! నారాయణప్ప దహనానికి నేనే బాధ్యత వహించాలి.ఏ అగ్రహారంలో నేను పెద్దగా నిలబడ్డానో, అదే అగ్రహారంలో బ్రాహ్మణ సమాజంలో నేను ధైర్యంగా నిలబడాలి. అందరి ముందూ 'ఈ విధంగా జరిగింది, ఇప్పుడు ఫలానా నిశ్చయానికి వచ్చాను!

 మీరిచ్చిన గౌరవాలు వదులుకుంటున్నాను, ఈ ఘనతను ముక్కలు ముక్కలుగా చించివేస్తున్నాను ' అని చెప్పాలి. ఏమని చెప్పాలి?  రోగిష్ఠి భార్యతో విసుగుపుట్టింది, చంద్రితో కలిశాను.సంత హోటల్లో కాఫీ తాగాను.కోడిపందాలు చూశాను.పద్మావతిని చూసి మోహపడ్డాను.భార్య పోయిన మైలలోనే దేవాలయంలో భోజనం చేశాను. నాతోపాటు కూచోమని బోయవాడిని ఆహ్వానించాను!..

కానీ నేనో అమోఘమూ, అభేద్యమూ అయిన సంపూర్ణ నిర్ణయానికి రావలసిందే! సూటిగా  మనుష్యుల కళ్ళలోకి చూడగలిగి ఉండాలి. అగ్రహారానికి మాత్రం వెళ్లాల్సిందే"

 అని.. ."పరంధామా, ఆ రోజు అడవిలో నా ప్రమేయం లేకుండా ఏ విధంగా నా నిర్ణయాన్ని విధించావో, అదే విధంగా ఈ రోజూ విధించు. జరగవలసినదేదో ఒక్కసారిగా కళ్ళు మూసి తెరిచే లోగా జరగనీ"అని దేవుడిని వేడుకుంటాడు.

నవల చదువుతున్నంత సేపూ అనేక ప్రశ్నలు చుట్టుముట్టి గుక్క తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. చదివిన తర్వాత కూడా ఆ ప్రశ్నలు అనేక రూపాలు దాల్చి పాఠకుడి వెంటే తిరుగుతాయి. 


ప్రాణేశాచార్యుడితో పాటే మనమూ అడవిలో చెట్లూ పుట్టలూ దాటి ప్రయాణిస్తూ, అతడి అంతర్మధనంలో పాలు పంచుకుంటాం! జాలి పడతాం! బాధ పడతాం, పుట్టన్నతో మాట్లాడతాం, ఒకవైపు చంద్రి గురించి, మరో వైపు నారాయణప్ప మృతదేహం గురించి ఆలోచిస్తూ ఉంటాం! ఒక్కమాటలో చెప్పాలంటే పాఠకుడు ప్రాణేశుడిలో పరకాయ ప్రవేశం చేస్తాడు.

కన్నడ సాహిత్యంలోనే కాదు మరే ఇతర భాషా సాహిత్యంలోనూ ఈ ఇటువంటి మీమాంసా విశ్లేషణ ప్రధానమైన నవల రాలేదేమో!

కేంద్ర సాహిత్య అకాడమీ ముద్రించిన ఈ నవల ను తెలుగులోకి అత్యంత ప్రతిభావంతంగా అనువదించింది శ్రీ ఎస్.ఎల్ శాస్త్రి.ఈ పుస్తకం  ప్రస్తుతం ప్రతిచోటా అందుబాటులో లేదు. కానీ డిసెంబర్ లో జరిగే హైదరాబాదు బుక్ ఫేర్ లో దొరికే అవకాశం  ఉంది. నాకు 2006లో అక్కడే దొరికింది.

కామెంట్‌లు లేవు: